బీజేపీకి తిరుగు‘పోట్లు’.. కాంగ్రెస్‌కు ‘చేరిక’ కష్టాలు | BJP Would Face Many Difficulties To Retain Power In Rajasthan | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 30 2018 11:19 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

BJP Would Face Many Difficulties To Retain Power In Rajasthan - Sakshi

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజస్థాన్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. పోలింగ్‌ దగ్గరపడుతున్న నేపథ్యంలో వివిధ పార్టీల ఓటు బ్యాంకులు తారుమారవుతున్నాయి. గత  ఎన్నికల్లో అధికారం కట్టబెట్టిన వివిధ వర్గాల ఓటర్లు ఇప్పుడాపార్టీకి దూరమవుతోంటే, మరోవైపు సొంత నేతల నుంచి తిరుగుబాట్లను ఎదుర్కొంటోంది బీజేపీ. వీటన్నిటి ఫలితంగా విపక్ష కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తున్నట్టు ఎన్నికల సర్వేలు చెబుతున్నాయి. అయితే, కొత్త చేరికలు కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందులు కలిగిస్తుండటం విశేషం. మరోవైపు మాజీ ప్రధాని దేవెగౌడ నాయకత్వంలో ఏర్పాటయిన ఏడు పార్టీల కూటమి –లోక్‌తాంత్రిక్‌ మోర్చా– ఈ ఎన్నికల్లో 200 స్థానాల్లో పోటీ చేస్తామని తాజాగా ప్రకటించింది. ఈ కూటమి గెలుపోటములు ఎలా ఉన్నా విజయావకాశాలున్న అభ్యర్థుల ఓట్లను గణనీయంగా చీల్చుతుందని విశ్లేషకులు అంటున్నారు.

ఆయన రాకతో పార్టీకి ఇబ్బందులా..?
ఏదేమైనా రాజస్థాన్‌లో అధికారం నిలుపుకోవడం బీజేపీకి అంత సులభం కాదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకత బలంగా కనిపిస్తోంటే మరోవైపు కీలక నేతలు పార్టీకి దూరమవుతున్నారు. ఘనశ్యాం తివారి, హనుమాన్‌ బెనివాల్, కిరోరి సింగ్‌ బైంస్లా వంటి నేతలు మొదలుకుని తాజాగా జస్వంత్‌ సింగ్‌ కుమారుడు మానవేంద్ర సింగ్‌ వరకు బీజేపీకి రాంరాం చెప్పారు. రాష్ట్రంలో రాజ్‌పుత్, జాట్‌ వంటి కులాలకు చెందిన ఈ నేతలు తమ వర్గీయులపై గణనీయమైన పట్టు ఉన్నవారు. పది పదిహేను నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల శక్తిమంతులు. వీరి తిరుగుబాటు బీజేపీకి పెద్ద దెబ్బేనని చెప్పాలి. ఇదిలా ఉంటే, ఈ సారి ఎన్నికల్లో సగానికిపైగా బీజేపీ సిట్టింగులకు టికెట్లు రావన్న ప్రచారం జరుగుతోంది. టికెట్లు రానివారిలో కొందరైనా తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచే అవకాశం ఉంది. ఇంకోవైపు ముఖ్యమంత్రి వసుంధర రాజే తీరుపై పార్టీలో పలువురు అసంతప్తితో ఉన్నారు. ఇవన్నీ బీజేపీ విజయావకాశాలపై ప్రభావం చూపుతాయని పరిశీలకులు అంటున్నారు.

కాంగ్రెస్‌కు కొత్త సమస్య
అధికార పార్టీ పరిస్థితి ఇలా ఉంటే, విపక్ష కాంగ్రెస్‌ మరో సమస్యతో సతమతమవుతోంది. మానవేంద్ర సింగ్‌ బీజేపీ నుంచి వచ్చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన చేరిక పార్టీకి రాజకీయంగా మేలు కలిగించాలి. అయితే, పార్టీలో జాట్‌ నేతలు రాజ్‌పుత్‌ వర్గానికి చెందిన మానవేంద్ర సింగ్‌ రాకను వ్యతిరేకిస్తున్నారు. ఆయన రాక వల్ల తమకు ప్రాధాన్యం తగ్గిపోతుందని హరీశ్‌చౌదరి వంటి సీనియర్‌కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. ఆయన తన అసంతప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. హరీశ్‌వర్గీయుల (జాట్‌లు) అసంతప్తి బర్మార్, జైసల్మేర్‌ జిల్లాల్లో కనీసం 9 నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతుందని కాంగ్రెస్‌ పరిశీలకులు ఆందోళన చెందుతున్నారు. 

తెరపైకి లోక్‌ తాంత్రిక్‌ మోర్చా
సిపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, ఎంసీపీఐ, సమాజ్‌వాది పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్, జనతాదళ్‌లతో కూడిన ఫ్రంట్‌ ‘లోక్‌ తాంత్రిక్‌ మోర్చా’ ఈ ఎన్నికల్లో 200 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. తమ కూటమి అధికారంలోకి వస్తే అమ్రా రామ్‌ ముఖ్యమంత్రి అవుతారని కూడా ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా తాము రంగంలోకి దిగుతున్నట్టు తెలిపింది.

దూరమవుతున్న రాజ్‌పుత్‌లు
జన్‌సంఘ్‌ కాలం నుంచి బీజేపీకి సంప్రదాయక మద్దతు దారులుగా ఉన్న రాజ్‌పుత్‌లు 25కుపైగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేయగలరు. ప్రస్తుత ప్రభుత్వంలో ముగ్గురు కేబినెట్, ఒక జూనియర్‌ మంత్రి రాజ్‌పుత్‌లకు చెందినవారు. వసుంధర తీరుపై రాజ్‌పుత్‌లకు  ఏర్పడిన అసంతప్తి రాణి పద్మావతి సినిమా వివాదంతో తీవ్రమయింది. మానవేంద్ర సింగ్‌ పార్టీని వీడటంతో రాజ్‌పుత్‌లు బీజేపీకి దూరమయ్యారన్నది వాస్తమమని తేలిపోయింది. 

రాజ్‌పుత్‌లు తమ నాయకుడిగా గౌరవించే జస్వంత్‌సింగ్‌కు 2014లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ టికెట్‌ నిరాకరించడం, స్వతంత్రంగా నిలబడ్డ ఆయన తరపున ప్రచారం చేసిన మానవేంద్ర సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడంతో బీజేపీ–రాజ్‌పుత్‌ల బంధం ఒడిదుడుకుల్లో పడింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజ్‌పుత్‌నేత గజేంద్ర షెకావత్‌ను కాదని ఓబిసీ నేత మదన్‌లాల్‌ను వసుంధర నియమించడం, పద్మావతి సినిమా విడుదలకు వసుంధర అనుమతించడం, రాజ్‌పుత్‌ వర్గానికి చెందిన అనందపాల్‌ సింగ్‌ అనే గూండాను ప్రభుత్వం ఎన్‌కౌంటర్‌లో హతమార్చడం వంటి పరిణామాలు రాజ్‌పుత్‌లకు బీజేపీ మధ్య దూరాన్ని పెంచాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 2016లో జైపూర్‌లోని రాజమహల్‌ ప్రవేశద్వారాన్ని మూసివేసింది. ఇది కూడా రాజవంశీయులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఈ పరిణామలతో రాజ్‌పుత్‌లు వసుంధర ప్రభుత్వానికి దూరమవుతూ వచ్చారు.

రాష్ట్ర జనాభాలో89 శాతం హిందువులు, 9శాతం ముస్లింలు, 2 శాతం ఇతరులు ఉన్నారు. వీరిలో ఎస్సీలు 18 శాతం, ఎస్టీలు 13 శాతం, జాట్‌లు 12 శాతం, గుజ్జార్‌లు,రాజ్‌పుత్‌లు 9 శాతం ఉంటే, బ్రాహ్మణులు, మినాలు ఏడు శాతం చొప్పున ఉన్నారు. జైపూర్‌ సంస్థానం భారత్‌లో విలీనమైనప్పటి నుంచీ రాజ్‌పుత్‌లు, జాట్లు ప్రత్యర్థులుగా ఉంటున్నారు. 1952 అసెంబ్లీ ఎన్నికల్లో 160 సీట్లకుగాను 54 సీట్లను రాజ్‌పుత్‌లు గెలుచుకుంటే 12 సీట్లు జాట్‌లకు, ఎస్సీలు పది సీట్లు గెలుచుకున్నారు. తర్వాత కాలంలో జాట్‌లు, బిష్ణోయిలు బలపడ్డారు. ఫలితంగా తర్వాతి అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్‌పుత్‌ల సీట్లు 26కు పడిపోతే, జాట్లు 23 సీట్లు దక్కించుకున్నారు. దాంతో ఈ రెండు వర్గాలను ఆకట్టుకోవడం ద్వారా 60 సీట్లు గెలుచుకోవడానికి కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న గుజ్జార్లు కూడా ఓబీసి జాబితా విషయమై ప్రభత్వం పట్ల అసంతప్తితో ఉన్నారు. రాజకీయంగా తమకు తగిన ప్రాతినిధ్యం లేదని వారు భావిస్తున్నారు.

ఐటీ బందాల ఏర్పాటు
రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారానికి ఫేస్‌బుక్, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నాయి. 2004 ఎన్నికల్లో బీజేపీ విజయంలో సామాజిక మాధ్యమాలు కీలక భూమిక పోషించడంతో అన్ని పార్టీలు అటే దష్టి పెట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా 51వేల పోలింగ్‌ బూత్‌లకు ఒక ఐటీ కార్యకర్త చొప్పున నియమించినట్టు బీజేపీ సోషల్‌ మీడియా సెల్‌ ఇన్‌చార్జి హీరేంద్ర కౌశిక్‌ తెలిపారు. డివిజన్‌ స్థాయిలో 10 మందితో ఐటీ బందాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌ల ద్వారా ప్రచారం సాగిస్తామని ఆయన చెప్పారు. తమ పార్టీ తరఫున కూడా సామాజిక మాధ్యమాల బందాలను ఏర్పాటు చేస్తున్నట్టు కాంగ్రెస్‌ మీడియా సెల్‌ ఇన్‌చార్జి అర్చన శర్మ చెప్పారు.ఈ ఎన్నికల్లో మొదటి సారి పోటీ చేస్తున్న ఆప్‌ పార్టీ కూడా తమ అభ్యర్థుల తరఫున సామాజిక మీడియా మేనేజర్లను నియమించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement