రెండు పార్టీలు, రెండు కుటుంబాలు, రెండు కులాలు.. హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు వీటి చుట్టూనే తిరుగుతుంటాయి. రాజ్‌పుట్‌లు, బ్రాహ్మణులు ఈ రెండు కులాలే హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్నాయి. రాజ్‌పుట్‌లు కింగ్‌లుగా అవతరిస్తే, బ్రాహ్మణులు కింగ్‌మేకర్లుగా తమ సత్తా చాటుతున్నారు.
హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో ప్రాంతం, కులం అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. రాజ్‌పుట్‌లు, బ్రాహ్మణులు రాష్ట్రాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన 55 ఏళ్లలో ఐదుగురు ముఖ్యమంత్రులు రాజ్‌పుట్‌లైతే, ఒకే ఒక్క బ్రాహ్మిణ్ సీఎంగా శాంతకుమార్ రికార్డు సృష్టించారు. 1993–2017కాలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వీరభద్రసింగ్ , బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్ ధుమాల్ కుటుంబాలే రాజకీయాల్లో చట్రం తిప్పాయి. వీరు రాజ్‌పుట్ కుటుంబానికి చెందిన నాయకులే. బీజేపీకి చెందిన బ్రాహ్మణుడైన శాంతకుమార్ రెండు సార్లు రాష్ట్ర సీఎంగా సేవలందించడంతో ప్రధానంగా ఈ రెండు కులాలే రాజకీయాలపై ఆధిక్యత ప్రదర్శించాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్‌పుట్‌గా ఉంటే, పార్టీలో సంస్థాగత వ్యవహారాలు చూసే వ్యక్తి బ్రాహ్మిణ్‌గా ఉండడం ఇక్కడ రివాజుగా మారింది.
50% జనాభా ఆ రెండు కులాలే
రాష్ట జనాభాలో రాజ్‌పుట్‌లు 32% ఉంటే, ఆ తర్వాత ఎస్‌సీలు 25% అధికంగా ఉన్నారు. ఇక బ్రాహ్మణులు 18%తో మూడో స్థానంలో ఉన్నారు. రాజ్‌పుట్‌లు, బ్రాహ్మణులు కలిపి జనాభాలో 50% వరకూ ఉండడంతో రాజకీయాలను వారే శాసిస్తున్నారు. రాజ్‌పుట్‌లో ఒక్కోసారి ఒక్కో పార్టీకి అండగా ఉంటూ ఉంటే బ్రాహ్మణులు ఎప్పుడూ బీజేపీవైపే నిలిచారు. ఇక ఎస్‌సీలలో ప్రజాకర్షణ కలిగిన నాయకుడు లేకపోవడంతో వారు బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఊగిసలాడుతూ ఉంటారని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో అయిదుగురు వైఎస్ పర్మార్, ఠాకూర్ రామ్ లాల్, వీరభద్ర సింగ్, ప్రేమ్‌కుమార్ ధుమాల్, ప్రస్తుత ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ రాజ్‌పుట్‌లు కాగా రెండు సార్లు సీఎంగా చేసిన శాంత కుమార్ ఒక్కరే బ్రాహ్మిణ్‌గా ఉన్నారు. తొలిసారిగా హిమాచల్ బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ దిగువ హిమాచల్ ప్రాంతంలో ఉండే పంజాబీ ఓట్లను కొల్లగొట్టడానికి చూస్తోంది. వీరంతా వ్యాపారంలోనే ఉన్నారు.
బీసీ, ఎస్టీలపై బీజేపీ వల
రాష్ట్రంలో అయిదేళ్లకొకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయానికి ఎదురొడ్డి వరసగా రెండోసారి నెగ్గాలని వ్యూహాలు పన్నుతున్న బీజేపీ ఎస్‌సీలు, ఓబీసీల ఓట్లు కొల్లగొట్టడానికి వ్యూహాలు పన్నుతోంది. రాష్ట్రంలోని హాతీ సామాజిక వర్గానికి ఎస్‌టీ హోదాను కల్పించే బిల్లును కూడా ఆమోదించింది. గత 50 ఏళ్లుగా హాతీలు ఎస్టీ హోదాల కోసం డిమాండ్ చేస్తున్నారు. సిర్మార్ గిరి ప్రాంతంలోని హాతీలకు ఎస్టీ హోదాను కల్పిస్తూ సెప్టెంబర్ 14న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 1.6 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఎస్‌సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం రద్దు సమయంలో ఈ ప్రాంతంలోనే దళితులు అత్యధికులు నిరసనలు చేపట్టారు. వారిలో అసంతృప్తిని చల్లార్చడానికి హాతీలకు ఎస్‌టీ హోదా కల్పిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈ సారి బీజేపీ రాజ్‌పుట్‌లకు ఇచ్చే టికెట్లను కాస్త తగ్గించి ఇతర కులాల వైపు మొగ్గు చూపించింది. కాంగ్రెస్ పార్టీ నలుగురు ఓబీసీలకు టికెట్లు ఇస్తే, బీజేపీ ఆరుగురుని నిలబెట్టింది. అందులోనూ ఓబీసీల్లో ప్రాబల్యమున్న ఘిర్త్ వర్గానికి టికెట్లు ఇచ్చింది. ఇక ఎస్టీల నాన్ రిజర్వ్ నియోజకవర్గాల్లో కూడా ముగ్గురు ఎస్టీలకు టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ రాజ్‌పుట్‌లు, బ్రాహ్మణుల్ని నిలబెట్టిన నాలుగు నియోజకవర్గాల్లో ఓబీసీ నాయకులకు టికెట్లు ఇచ్చింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
ఆ కులాల ఓటే శాసనం
Published Fri, Nov 11 2022 5:54 AM | Last Updated on Fri, Nov 11 2022 5:54 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment