Prem Kumar Dhumal
-
ఆ కులాల ఓటే శాసనం
రెండు పార్టీలు, రెండు కుటుంబాలు, రెండు కులాలు.. హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు వీటి చుట్టూనే తిరుగుతుంటాయి. రాజ్పుట్లు, బ్రాహ్మణులు ఈ రెండు కులాలే హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్నాయి. రాజ్పుట్లు కింగ్‌లుగా అవతరిస్తే, బ్రాహ్మణులు కింగ్మేకర్లుగా తమ సత్తా చాటుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో ప్రాంతం, కులం అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. రాజ్పుట్లు, బ్రాహ్మణులు రాష్ట్రాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన 55 ఏళ్లలో ఐదుగురు ముఖ్యమంత్రులు రాజ్పుట్లైతే, ఒకే ఒక్క బ్రాహ్మిణ్ సీఎంగా శాంతకుమార్ రికార్డు సృష్టించారు. 1993–2017కాలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వీరభద్రసింగ్ , బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్ ధుమాల్ కుటుంబాలే రాజకీయాల్లో చట్రం తిప్పాయి. వీరు రాజ్పుట్ కుటుంబానికి చెందిన నాయకులే. బీజేపీకి చెందిన బ్రాహ్మణుడైన శాంతకుమార్ రెండు సార్లు రాష్ట్ర సీఎంగా సేవలందించడంతో ప్రధానంగా ఈ రెండు కులాలే రాజకీయాలపై ఆధిక్యత ప్రదర్శించాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్పుట్గా ఉంటే, పార్టీలో సంస్థాగత వ్యవహారాలు చూసే వ్యక్తి బ్రాహ్మిణ్‌గా ఉండడం ఇక్కడ రివాజుగా మారింది. 50% జనాభా ఆ రెండు కులాలే రాష్ట జనాభాలో రాజ్పుట్లు 32% ఉంటే, ఆ తర్వాత ఎస్సీలు 25% అధికంగా ఉన్నారు. ఇక బ్రాహ్మణులు 18%తో మూడో స్థానంలో ఉన్నారు. రాజ్పుట్లు, బ్రాహ్మణులు కలిపి జనాభాలో 50% వరకూ ఉండడంతో రాజకీయాలను వారే శాసిస్తున్నారు. రాజ్‌పుట్‌లో ఒక్కోసారి ఒక్కో పార్టీకి అండగా ఉంటూ ఉంటే బ్రాహ్మణులు ఎప్పుడూ బీజేపీవైపే నిలిచారు. ఇక ఎస్సీలలో ప్రజాకర్షణ కలిగిన నాయకుడు లేకపోవడంతో వారు బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఊగిసలాడుతూ ఉంటారని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో అయిదుగురు వైఎస్ పర్మార్, ఠాకూర్ రామ్ లాల్, వీరభద్ర సింగ్, ప్రేమ్‌కుమార్ ధుమాల్, ప్రస్తుత ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ రాజ్పుట్లు కాగా రెండు సార్లు సీఎంగా చేసిన శాంత కుమార్ ఒక్కరే బ్రాహ్మిణ్‌గా ఉన్నారు. తొలిసారిగా హిమాచల్ బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ దిగువ హిమాచల్ ప్రాంతంలో ఉండే పంజాబీ ఓట్లను కొల్లగొట్టడానికి చూస్తోంది. వీరంతా వ్యాపారంలోనే ఉన్నారు. బీసీ, ఎస్టీలపై బీజేపీ వల రాష్ట్రంలో అయిదేళ్లకొకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయానికి ఎదురొడ్డి వరసగా రెండోసారి నెగ్గాలని వ్యూహాలు పన్నుతున్న బీజేపీ ఎస్సీలు, ఓబీసీల ఓట్లు కొల్లగొట్టడానికి వ్యూహాలు పన్నుతోంది. రాష్ట్రంలోని హాతీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదాను కల్పించే బిల్లును కూడా ఆమోదించింది. గత 50 ఏళ్లుగా హాతీలు ఎస్టీ హోదాల కోసం డిమాండ్ చేస్తున్నారు. సిర్మార్ గిరి ప్రాంతంలోని హాతీలకు ఎస్టీ హోదాను కల్పిస్తూ సెప్టెంబర్ 14న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 1.6 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం రద్దు సమయంలో ఈ ప్రాంతంలోనే దళితులు అత్యధికులు నిరసనలు చేపట్టారు. వారిలో అసంతృప్తిని చల్లార్చడానికి హాతీలకు ఎస్టీ హోదా కల్పిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈ సారి బీజేపీ రాజ్‌పుట్‌లకు ఇచ్చే టికెట్లను కాస్త తగ్గించి ఇతర కులాల వైపు మొగ్గు చూపించింది. కాంగ్రెస్ పార్టీ నలుగురు ఓబీసీలకు టికెట్లు ఇస్తే, బీజేపీ ఆరుగురుని నిలబెట్టింది. అందులోనూ ఓబీసీల్లో ప్రాబల్యమున్న ఘిర్త్ వర్గానికి టికెట్లు ఇచ్చింది. ఇక ఎస్టీల నాన్ రిజర్వ్ నియోజకవర్గాల్లో కూడా ముగ్గురు ఎస్టీలకు టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ రాజ్పుట్లు, బ్రాహ్మణుల్ని నిలబెట్టిన నాలుగు నియోజకవర్గాల్లో ఓబీసీ నాయకులకు టికెట్లు ఇచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ధుమల్‌ను దారుణంగా దెబ్బ తీసిన అధిష్టానం
సాక్షి, న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్‌లో మూడింట రెండొంతులకు పైగా సీట్లు గెలుచుకుని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. అయితే అధికారం లభించినా.. ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్‌కుమార్ ధుమల్ అనూహ్యంగా ఓటమిపాలవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సుజన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, ఒకప్పటి తన అనుచరుడు రాజిందర్ రానా చేతిలోనే ధుమల్ దారుణంగా ఓటమిపాలయ్యారు. ఓడిపోతారని ముందే తెలుసా? ఆ ప్రాంతంలో అప్పటికే రానాకు మంచి పేరు ఉంది. ముఖ్యంగా ఆయన ఏర్పాటు చేసిన మినీ గ్రామ సచివాలయం ఆలోచన అద్భుతంగా పని చేసింది. వివాదరహితుడు కావటం, పైగా అభివృద్ధి పనులు చేయటంతో ప్రజలంతా ఆయనవైపే మొగ్గు చూపారు. ఈ పరిణామాలన్నింటిని గమనించిన ధుమల్ తన ఓటమిని ముందుగానే గమనించారు. అందుకే తొలుత హమిర్పూర్ నుంచి పోటీచేయాలని ధుమల్ భావించారు. కానీ, దీనికి అధిష్టానం మాత్రం ససేమిరా అంది. సుజన్పూర్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. అక్కడి నుంచే పోటీచేసి తీరాలని ధుమల్‌కు సూచించింది. దీంతో తాను ఓడిపోతానని ముందే తెలిసి కూడా ఆయన ధైర్యం చేయగా.. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న పార్టీ ధుమల్ రాజకీయ ప్రస్థానాన్నిగట్టిగానే దెబ్బతీసినట్లయ్యింది. గురు-శిష్యులు... రానా గతంలో బీజేపీలోనే ఉండేవారు. పైగా ధుమల్ ఆయనకు రాజకీయ గురువు కూడా. 1998లో ధుమల్ సీఎంగా ఉన్న సమయంలో.. పార్టీ మీడియా అధికార ప్రతినిధిగా రానా పని చేశారు కూడా. అయితే 2012 ఎన్నికల సమయంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. ఈ విషయం ధుమల్‌కు చెప్పగా.. ఆయన అంగీకరించాడు. కానీ, అధిష్టానం మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దీంతో పార్టీ నుంచి బయటకు వచ్చేసిన రానా.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.ఆపై ఆయన కాంగ్రెస్‌లో చేరిపోయారు. 2014లో హమిర్పూర్ లోక్ సభ స్థానం నుంచి అనురాగ్ ఠాకూర్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన గురువుపైనే పోటీ చేసిన గెలిచాడు. ఇక తన విజయంపై స్పందించిన రానా.. తనకు ధుమల్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని భావిస్తున్నానని చెప్పటం విశేషం. -
పార్టీ గెలిచింది.. ప్రముఖులు ఓడారు!
షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారాన్ని దక్కించుకుంది. కమలం పార్టీ విజయం సాధించినప్పటికీ ఊహించని విధంగా ఆ పార్టీ ప్రముఖులు ఓడిపోయారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్‌కుమార్ ధుమాల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సత్పాల్ సింగ్ సత్తి పరాజయం పాలయ్యారు. సుజాన్‌పూర్ నుంచి పోటీ చేసిన ధుమాల్ కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రాణా చేతిలో 3,500 ఓట్ల పైచిలుకు తేడాతో ఓటమి చవిచూశారు. ఎన్నికలకు రెండు వారాలు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరును బీజేపీ ప్రకటించింది. గతంలో రెండు పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే తన ఓటమికి ప్రాధాన్య లేదని, పార్టీ గెలుపే ముఖ్యమని ధుమాల్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపించేందుకు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన ఓటమిని ఊహించలేదని, పరాజయానికి గల కారణాలను విశ్లేషించుకుంటానని చెప్పారు. ఉనా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సత్పాల్ సింగ్ సత్తి కూడా ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి సత్పాల్ సింగ్ రైజడా చేతిలో 3,196 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2012 ఎన్నికల్లో ఇదే నియోజకర్గం నుంచి సత్పాల్ సింగ్ సత్తి 4,746 ఓట్ల మెజారిటీతో గెలిచారు.