రాజస్తానీ కౌన్‌ | Lok Sabha Election 2019 Rajasthani Politics | Sakshi
Sakshi News home page

రాజస్తానీ కౌన్‌

Published Wed, Apr 24 2019 8:22 AM | Last Updated on Wed, Apr 24 2019 8:22 AM

Lok Sabha Election 2019 Rajasthani Politics - Sakshi

రాజస్తాన్‌లో రెండు దశాబ్దాలుగా లోక్‌సభ ఎన్నికల కంటే ఆరు నెలల ముందు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీయే లోక్‌సభ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు దక్కించుకోవడం ఒక సెంటిమెంట్‌. ఈసారి అదే సంప్రదాయం కొనసాగుతుందా? లేదా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఎజెండాలే వేర్వేరు అనే అవగాహన ఓటర్లలో పెరిగిందా?  ఎడారి రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం ఎవరి ఓటుబ్యాంకును దెబ్బ తీస్తుంది? కుల సమీకరణలు ఎవరికి సానుకూలంగా ఉన్నాయి? మోదీ ఇమేజ్‌ ఎంతవరకు పని చేస్తుంది? ఓటరు మదిలో ఏముంది..?! గత లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా మోదీ హవాతో రాజస్తాన్‌లో బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. మొత్తం 25 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది.

నాలుగున్నరేళ్లు గడిచిపోయాయి. 2018 చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి వసుంధరా రాజె వ్యవహార శైలిపై నెలకొన్న అసమ్మతి బీజేపీ పుట్టి ముంచింది. 200 అసెంబ్లీ స్థానాలకు 73 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక, కాంగ్రెస్‌.. మ్యాజిక్‌ ఫిగర్‌కి ఒక్క సీటు దూరంలో ఆగిపోయి వంద సీట్లు మాత్రమే దక్కించుకుంది. సాధారణంగా రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావమే లోక్‌సభ ఎన్నికల్లోనూ చూపిస్తుంటుంది. కానీ ఈసారి అలాంటి ఫలితాలు వచ్చే అవకాశాలు లేవు. అలాగని గత లోక్‌సభ ఎన్నికల మాదిరిగా బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేసే పరిస్థితీ లేదు. మొత్తమ్మీద చూస్తే బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నప్పటికీ కమలనాథులు పై చేయి సాధించే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

కాంగ్రెస్‌ ప్రాణం మీదికి ‘రుణమాఫీ’
రాజస్తాన్‌ ఎన్నికల్లో వ్యవసాయ రంగం కీలకాంశం. 70 శాతం జనాభా గ్రామాల్లోనే ఉన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఇప్పటి వరకు చేసిందేమీ లేదు. స్వామినాథన్‌ కమిటీ సిఫారసుల మేరకు పెట్టుబడికయ్యే ఖర్చు కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువగా మద్దతు ధర ప్రకటిస్తామన్న హామీ కూడా జాడ లేదు. దీంతో ఈశాన్య రాజస్తాన్‌లోని షెకావతీ ప్రాంతంలో రైతులు అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ‘కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదు. లోక్‌సభ ఎన్నికల్లో దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది’ అని ఆల్‌ ఇండియా కిసాన్‌ సభకు చెందిన ఆమ్రా రామ్‌ హెచ్చరిస్తున్నారు. అంతేకాదు గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఎందరో రాజెను ఇంటికి పంపించినా, ఈ ఎన్నికల్లో మోదీకే తమ ఓటు అంటున్నారు.

కుల సమీకరణలు–ఎవరికి సానుకూలం?

  •  రాజస్తాన్‌ ఓటర్లలో గుజ్జర్లు తొమ్మిది శాతం ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గుజ్జర్లకు చెందిన సచిన్‌ పైలెట్‌కి బదులుగా మాలీ సామాజిక వర్గానికి చెందిన అశోక్‌ గహ్లోత్‌ను సీఎంను చేయడంతో వారంతా ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే ఎస్టీ హోదా కోసం వారు పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ఈసారి గుజ్జర్లు బీజేపీ వైపే నడిచే అవకాశాలున్నాయి.
  •  రాష్ట్రంలోని మరో ప్రధానమైన సామాజిక వర్గం రాజపుత్రులు. వీరు జనాభాలో పది శాతం వరకు ఉన్నారు. వసుంధరా రాజెపై వ్యతిరేకతతో అసెంబ్లీ ఎన్నికల్లో వీరంతా కాంగ్రెస్‌కే ఓటేశారు. ‘రాజె పదవి దిగిపోయారు. అదే మాకు కావల్సింది. మోదీపై మాకు ఎలాంటి ఆగ్రహం లేదు‘ అని రాజపుత్రులు అంటున్నారు.
  •  దక్షిణ రాజస్తాన్‌లో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన భిల్‌లు పెద్దసంఖ్యలో ఉన్నారు. ఈ సామాజిక వర్గం ఓట్లపై ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దగా దృష్టి సారించలేదు. గత ఎన్నికల్లో గుజరాత్‌ ఎమ్మెల్యే చోటూ వాసవ భారతీయ ట్రైబల్‌ పార్టీ (బీటీపీ) పేరుతో పార్టీ పెట్టి రెండు అసెంబ్లీ సీట్లను సాధించారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ పార్టీ ప్రభావం కొంత ఉంటుందని అంచనా. మొత్తమ్మీద కుల సమీకరణలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టే కనిపిస్తోంది.

రెండు పార్టీలకూ తలనొప్పి..
బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు అంతర్గత కుమ్ములాటలు తలనొప్పిగా మారాయి. మాజీ సీఎం వసుంధరా రాజెకి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలి పదవి కట్టబెట్టి ఆమె స్థానాన్ని పరిమితం చేశారు. ప్రధానమంత్రి మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో సత్సంబంధాలు లేని వసుంధర రాష్ట్ర స్థాయిలో బీజేపీ బలోపేతానికి, ఎన్నికల ప్రచారానికి ఒక ఊపు తీసుకురావడానికి ఏమీ చేయడం లేదని ఆమె సన్నిహితులే విమర్శిస్తున్నారు.  ఈ అంశంలో కాంగ్రెస్‌ కాస్త నయంగానే ఉంది. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్, ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలెట్‌ కలసికట్టుగా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే స్థానిక నాయకుల్లో సమన్వయం కొరవడడం కాంగ్రెస్‌కు సమస్యగా మారింది. ఉదాహరణకు చురూ లోక్‌సభ నియోజకవర్గం టికెట్‌ను పార్టీ మాజీ ఎంపీ రఫీక్‌ మండేలియాకు ఇచ్చారు. ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే శాసనసభ్యులు, ఈ ప్రాంతం నుంచి అసెంబ్లీలో కేబినెట్‌ పదవి దక్కించుకున్న మంత్రి కూడా రఫీక్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్నట్టు సమాచారం. ఇలాంటి వర్గపోరు బీజేపీలోనూ ఉంది. మీనాల ప్రాబల్యం అధికంగా ఉన్న ఎస్టీ నియోజకవర్గం దౌసాలో బీజేపీ రాజ్యసభ ఎంపీ కిరోడి లాల్‌ మీనా తన భార్య గోల్మాదేవికి  టికెట్‌ ఆశించారు. మాజీ ఎంపీ ఓపీ హుడ్లా కూడా టికెట్‌ కోసం లాబీయింగ్‌ చేశారు. చివరగా బీజేపీ మాజీ ఎంపీ జస్‌కౌర్‌ మీనాకు టికెట్‌ ఇచ్చింది. దీంతో కిరోడిలాల్, హుడ్లా వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. తాము కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతామని ఈ వర్గాలు అంటున్నాయి.

బేనీవాల్‌కు బీజేపీ మద్దతు!
ప్రతిష్టాత్మక నాగూర్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అ«భ్యర్థిని నిలబెట్టకుండా బేనీవాల్‌కు మద్దతునిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీ పెట్టి మూడు స్థానాలను దక్కించుకున్న ఈ యువనేత సభలకు జనం వెల్లువెత్తుతున్నారు. అయితే బీజేపీ బేనీవాల్‌కు మద్దతునివ్వదని, త్రిముఖ పోటీ నెలకొంటే బేనీవాల్‌ లాభపడతాడనే  అభ్యర్థిని నిలబెట్టలేదన్న ప్రచారం జరుగుతోంది. బేనీవాల్‌ వంటి నేతలు పక్కలో బల్లెంలా మారతారని బీజేపీ భావిస్తోందన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి. అంతర్గత కుమ్ములాటల మాటెలా ఉన్నా టికెట్‌ కేటాయింపులో కాంగ్రెస్‌ పార్టీ సరిగా వ్యవహరించలేదన్న విమర్శలున్నాయి. ‘కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల్ని సరిగా ఎంపిక చేయలేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలకు లోక్‌సభ టికెట్లు ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలవలేని వారు, ఎంపీగానూ గెలిచే అవకాశాలైతే లేవు’ అని జైపూర్‌కు చెందిన రాజకీయ విశ్లేషకుడు అనిల్‌ శర్మ అభిప్రాయపడ్డారు.

అటూ ఇటూ అంచనాలు
రాజస్తాన్‌ అంటేనే ఎన్నికల బెట్టింగ్‌లకు మారు పేరు. ఇక్కడ సట్టా మార్కెట్‌లో గెలుపు గుర్రాలపై పందేలు జోరుగా సాగుతుంటాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి 18 స్థానాలు, కాంగ్రెస్‌కి ఏడు స్థానాలు వస్తాయని సట్టా మార్కెట్‌ అంచనా వేస్తోంది. ఇక కొంతమంది రాజకీయ విశ్లేషకులు, స్థానిక జర్నలిస్టులు కాంగ్రెస్‌ 8–9 స్థానాలు గెలుచుకోవచ్చునంటూ లెక్కలు వేస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ అంతర్గతంగా చేయించుకున్న సర్వేల్లో కూడా పది స్థానాలకు మించి గెలవలేరని తేలినట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద చూస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ పై చేయి సాధించవచ్చు కానీ, గత ఎన్నికలతో పోలిస్తే చాలా సీట్లు కోల్పోవాల్సి వస్తుంది. ఆ నష్టాన్ని ఇతర రాష్ట్రాల్లో బీజేపీ భర్తీ చేసుకోవాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ సీట్లు చాలా హాట్‌
జోధ్‌పూర్‌ : కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ కుమారుడు వైభవ్‌ గహ్లోత్‌ బరిలో ఉన్నారు. ఇక బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ గజేంద్ర సింగ్‌ షెకావత్‌నే పోటీకి నిలిపింది. గత ఎన్నికల్లో నాలుగు లక్షల ఓట్ల తేడాతో షెకావత్‌ గెలుపొందారు. సీఎం కుమారుడే పోటీకి నిలవడంతో ఇది హాట్‌ సీటుగా మారింది
బాఢ్‌మేర్‌ : బీజేపీని వీడిన జస్వంత్‌ సింగ్‌ కుమారుడు మానవేంద్ర సింగ్‌ కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉన్నారు. బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ కైలాస్‌ చౌధరీకి, మానవేంద్ర సింగ్‌కు మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.
జైపూర్‌ రూరల్‌ : కేంద్ర యువజన క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ బీజేపీ తరఫున బరిలో ఉంటే, కామన్వెల్త్‌లో స్వర్ణపతక విజేత, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కృష్ణ పూనియా గట్టి పోటీయే ఇస్తున్నారు. జాట్‌ సామాజిక వర్గానికి చెందిన కృష్ణ పూనియాకు కుల సమీకరణలు అనుకూలంగా ఉన్నాయి. రాజపుత్రుడైన రాథోడ్‌కి కులాలకు అతీతంగా వ్యక్తిగత ఛరిష్మా ఉంది. దీంతో ఇక్కడ కూడా టఫ్‌ ఫైట్‌ నెలకొంది.
అల్వార్‌ : బీజేపీకి చెందిన బాబా బాలక్‌నాథ్, కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ సహాయ మంత్రి భన్వర్‌ జితేంద్ర మధ్య గట్టి పోటీ నెలకొంది. గోవధకు పాల్పడ్డారన్న ఆరోపణలతో రాజపుత్రులు, దళితులు, మెవ్‌ ముస్లింలపై అత్యధికంగా మూకదాడులు జరిగాయి. యాదవ్‌ సామాజిక వర్గానికి చెందిన బాలక్‌నాథ్‌కు వ్యతిరేకంగా వీరు ఓటు వేసే అవకాశాలున్నాయి. అదే ఈ నియోజకవర్గంలో హోరాహోరీ పోరుకు దారి తీసింది.
టోంక్‌–సవాయ్‌ మధోపూర్‌ : ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున మాజీ డీజీపీ నమో నారాయణ్‌ మీనా బరిలో ఉంటే, బీజేపీ నుంచి సుఖ్‌బీర్‌ సింగ్‌ ఝనాపూరియా పోటీ పడుతున్నారు. రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి సచిన్‌ పైలెట్‌ ప్రాతి నిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానం ఈ లోక్‌సభ పరిధిలో ఉన్నందున కాంగ్రెస్‌కి ఈ స్థానంలో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది.
నాగూర్‌ : జాట్‌ రాజకీయాలకు కేంద్ర బిందువుగా చెప్పుకునే నాగూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ, జాట్‌ల యోధుడిగా చెప్పుకునే నాథూరాం మీర్ధా మనవరాలు జ్యోతి మీర్ధాను ఎన్నికల బరిలో దింపింది. ఇదే స్థానం నుంచి యువ జాట్‌ నాయకుడు, రాష్ట్రీయ లోక్‌ తాంత్రిక్‌ పార్టీ అధ్యక్షుడు హనుమాన్‌ బేనీవాల్‌ పోటీకి దిగారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement