రాజస్తాన్‌లో 25 ఏళ్లుగా ఏ పార్టీ వరసగా రెండోసారి అధికారాన్ని చేపట్టలేదు. తిరిగి అదే సంప్రదాయం పునరావృతమవుతుందనే విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను తీవ్రంగా ఎదుర్కొంటున్న వసుంధర రాజే సర్కార్ మళ్లీ అధికారం నిలబెట్టుకోవడం అంత సులభం కాదనే అంచనాలు కనబడుతున్నాయి. గత ఎన్నికల్లో అప్పటికే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించడంతో బాగా కలిసొచ్చింది. కేవలం మోదీ ఇమేజ్ మీదే బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సారి కూడా మోదీ అంటే ప్రజల్లో సానుకూలత ఉన్నప్పటికీ.. వసుంధరా రాజే పరిపాలనే బీజేపీ పుట్టి ముంచేలా కనిపిస్తోంది. ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో రాజే మళ్లీ సీఎం కావాలని కేవలం 24% మంది మాత్రమే కోరుకున్నారు. ఇక ఇండియాటుడే సర్వేలో 35% మంది రాజేకు జై కొట్టారు. ప్రజల్లో మాత్రమే కాదు పార్టీలో కూడా అంతర్గతంగా ఆమెపై అసమ్మతి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తామంటూ కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బహిరంగంగానే వెల్లడిస్తున్న పరిస్థితులు ఆశ్చర్యపరుస్తున్నాయి.
ప్రభావితం చూపే అంశాలు
రోజురోజుకి పెరిగిపోతున్న నిరుద్యోగంతో యువత తీవ్ర అసంతృప్తితో ఉండడం ఎన్నికల్లో బాగా ప్రభావం చూపిస్తుందనే విశ్లేషణలు ఉన్నాయి. ఎమ్మెస్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్లతో రైతన్నలు నిరసనలకు దిగుతూనే ఉన్నారు. రైతుల్లో అసంతృప్తిని గుర్తించిన రాజే ప్రభుత్వం ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వారిని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేసింది. రూ.50 వేల వరకు రుణాలను మాఫీ చేసింది. ఈ చర్యతో 30 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. ‘వసుంధరా సర్కార్ అన్ని రంగాల్లోనూ విఫలమైంది. అందుకే స్థానిక ఎన్నికల్లోనూ, ఉప ఎన్నికల్లోనూ ప్రజలు బీజేపీని ఓడించారు. కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుంది. నిజానికి బీజేపీ పరిపాలనలో వాస్తవంగా లబ్ధి పొందింది లలిత్ మోదీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్య మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఈ సారి అమలు కాని హామీలేవీ ఇవ్వలేదు. పాజిటివ్ డెవలప్‌మెంట్ అన్న అంశాన్నే తీసుకొని ముందుకు వెళుతోంది. అదే పార్టీని విజయతీరాలకు చేరుస్తుంది’ అని రాజస్తాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సచిన్ పైలట్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment