centenary birth anniversary
-
రాజ్‌కపూర్ శతజయంతి : జీనా ఇసీకా నామ్ హై!
జన్మించి నూరేళ్లు. మరణించి ముప్పై ఆరేళ్లు. మొదటి సినిమా ‘ఆగ్’ వచ్చి 75 ఏళ్లు. ఇవాళ్టికీ రష్యా వెళితే వినిపించే పాట ‘ఆవారా హూ’... చైనాలో పలికే భారతీయ నటుడి పేరు రాజ్ కపూర్. ‘ది గ్రేటెస్ట్ షో మేన్ ఆఫ్ ఇండియా’. మేరా జూతా హై జపానీ పంట్లూన్ ఇంగ్లిస్తానీ... కాని మనసు? ‘ఫిర్ భి దిల్ హై హిందూస్తానీ’. ఉత్సవంలా బతికి ఉత్సవంలా మరణించినవాడు రాజ్ కపూర్. ‘జీనా యహా.. మర్నా యహా’ సినిమాను ప్రేమించి పులకించినవాడు. అతనికి నివాళి. ఘన స్మరణ.మే 2, 1988.న్యూదిల్లీ సిరిఫోర్ట్ ఆడిటోరియమ్... జాతీయ పురస్కారాల ప్రదానం. హాలు కిక్కిరిసి ఉంది. ప్రభుత్వ, సినీ రంగ పెద్దలు ఆసీనులై ఉన్నారు. వేదిక మీద రాష్ట్రపతి ఒక్కొక్కరి పేరు పిలిచి పురస్కారాలు అందిస్తున్నారు. ‘ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార బహూకరణ. గ్రహీత– రాజ్ కపూర్’. ఆ పేరు వినగానే ఆడిటోరియం చప్పట్లతో దద్దరిల్లింది. అందరూ వేదిక మీదకు రాబోతున్న రాజ్ కపూర్ కోసం చూస్తున్నారు. కాని ముందు వరుసలో ఉన్న రాజ్ కపూర్ కుర్చీలో నుంచి లేవలేకపోతున్నారు. కొన్ని నిముషాల ముందే ఆయనకు ఆస్తమా అటాక్ వచ్చింది. అలా రాకూడదని రెండు గంటల ముందు హోటల్లో ఇంజెక్షన్ చేసుకొని వచ్చారు. అయినా వచ్చింది. సభలో ఉన్నవారి ఎదురు చూపు. లేవలేని తన అశక్తత. మాట పెగలట్లేదు. కాని కళ్లు పని చేస్తున్నాయి. కళాకారుడి కళ్లు అవి. ‘నేను వేదిక మీదకు రాలేను రాష్ట్రపతి గారూ’... కళ్లతోనే మొర పెట్టుకున్నారు రాజ్ కపూర్. వేదిక మీద ఉన్న రాష్ట్రపతి కె.వెంకట్రామన్ ఆ కళ్లలోకి చూసి సంగతి గ్రహించారు. ప్రొటోకాల్ పట్టించుకోకుండా స్వయంగా తానే వేదిక దిగి రాజ్ కపూర్ వైపు కదిలారు. ఆయన వస్తుంటే శక్తినంతా కూడగట్టుకుని రాజ్‌కపూర్ లేచి నిలబడ్డారు. ‘దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం’ సగౌరవంగా ఆయనకు దక్కింది. రాష్ట్రపతిని స్జేజ్ మీద నుంచి కిందకు వచ్చేలా చేసిన సంఘటన మరొకటి లేదు. రాజ్ కపూర్ మాత్రం? అలాంటి వాడు మరొకడున్నాడా ఏమిటి?1955.జవహర్లాల్ నెహ్రూ ‘సోవియెట్ యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ రష్యా’ను ప్రధాని హోదాలో సందర్శించారు. ఇరు దేశాల మధ్య స్నేహం వెల్లివిరుస్తున్న సమయం. రష్యన్లను, స్థానిక భారతీయులను ఉద్దేశించి ఇరు దేశాల ప్రధానులు మాట్లాడే సభ. ముందు నెహ్రూ మాట్లాడి జనాన్ని ఉత్సాహ పరిచి కూచున్నారు. నెహ్రూ గొప్ప వక్త. రష్యా ప్రధాని నికొలాయ్ బల్గనిన్కు నెహ్రూని మించి సభను రక్తి కట్టించాలనిపించింది. తన మంత్రులకు సైగ చేశారు. వాళ్లంతా వచ్చి బల్గనిన్ ఇరు పక్కలా నిలుచున్నారు. నెహ్రూకు ఏం అర్థం కాలేదు. ఒక్కసారిగా రష్యా ప్రధాని, మంత్రులు పాట అందుకున్నారు.ఆవారా హూ... ఆవారా హూ..యా గర్దిష్ మే హూ ఆస్మాన్కా తారాహూ ఆవారాహూ...జనం కేరింతలు. నెహ్రూ ఉన్న సభ అది. మార్మోగుతున్నది రాజ్ కపూర్ పేరు. ‘ఉదయాన్నే తెల్లబట్టలు వేసుకొని వెళ్లాలి. సాయంత్రానికి దుమ్ము కొట్టుకుపోయి రావాలి’ అని చెప్పాడు పృథ్వీరాజ్ కపూర్ తన పెద్ద కొడుకు రాజ్ కపూర్‌ని రంజిత్ స్టూడియోలో పనిలో పెట్టి. మెట్రిక్యులేషన్ తర్వాత ‘ఇక చదవను సినిమాల్లో పని చేస్తా’ అని రాజ్ కపూర్ కోరడంతో సినిమా తీయాలంటే అన్ని పనులు తెలియాలి అని స్టూడియో పనిలో పెట్టి పృథ్వీరాజ్ కపూర్ అన్న మాట అది. అప్పటికే ప్రాభవంలో ఉన్న నటుడి కొడుకైనప్పటికీ రాజ్ కపూర్ ఒక ఆర్డినరీ క్లాప్ బాయ్‌లానే జీవితాన్ని మొదలుపెట్టాడు. రంజిత్ స్టూడియో, బాంబే టాకిస్, ఫిల్మ్స్థాన్... వీటన్నింటిలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి చివరకు తండ్రి దగ్గరే పృథ్వీ థియేటర్లో చేరితే పది రూపాయల జీతం, రెండు జతల బట్టలు, వానాకాలంలో ఉచితంగా వాడుకోవడానికి రైన్ కోట్, టోపీ దక్కాయి. రాజ్ కపూర్ అలా రాజ్ కపూర్ అయ్యాడు. తెల్లబట్టలు నల్లగా పీలికలయ్యేంతగా కష్టపడ్డాడు. కష్టం చేసేవాడిని అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. ఈ నీలికళ్ల అందగాడిలో ఏదో ఉంది అని దర్శకుడు కేదార్ శర్మ రాజ్ కపూర్‌తో హీరోగా అతని మొదటి సినిమా ‘నీల్ కమల్’ తీశాడు. హీరోయిన్ పదమూడేళ్ల మధుబాల. ఆడలేదు. అయితే సినిమాల్లో ఫస్ట్ టేక్ ఓకే కాకపోతే రీటేక్ చేయొచ్చు. రీటేక్ కోసం మరింత కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. తెచ్చుకోనివాడు పోతాడు. రాజ్ కపూర్ పడి లేవడం తెలిసినవాడు.రాజ్ కపూర్‌కు పెళ్లయ్యింది (1946). ఎవరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడకూడదని తానే ప్రొడ్యూసర్‌గా, డైరెక్టర్‌గా ‘ఆగ్’ (1947) తీశాడు. ఏంటి... మూతి మీద సరిగా మీసాలు కూడా రాని కుర్రాడు సినిమా తీయడమా.. ‘ఆగ్’ (మంట) అని టైటిలా? సీనియర్ డిస్ట్రిబ్యూటర్లకు ఒళ్లు మండింది. రాజ్ కపూర్ కనపడితే ‘ఏమయ్యా రాజ్. అన్నీ నువ్వే అయ్యి సినిమా తీస్తున్నావ్. సినిమా హాలు కూడా కట్టుకోరాదూ?’ అన్నారు. ‘హాలెందుకు?’ అనడిగాడు రాజ్ కపూర్. ‘ఎందుకేంటయ్యా. మంట అంటుకుంటే నీ హాలు బూడిదైతే చాలదా? మావన్నీ ఎందుకు?’ అన్నారు. హేళన అలా ఉంటుంది. ‘ఆగ్’ విడుదలైంది. ఓ మోస్తరుగా ఆడింది. నవ్వులు ఆగాయి. రాజ్‌కు తెలుసు... ఈ ప్రయత్నాలన్నీ అడ్డ పెడలు వేసి సైకిలు తొక్కడమేనని. సీటెక్కి తొక్కే సమయానికి తోటి కుర్రాళ్లు తోడవుతారని. అయ్యారు. కె.ఏ. అబ్బాస్ (రచయిత), శంకర్ జైకిషన్ (సంగీత దర్శకులు), ముకేష్ (గాయకుడు), శైలేంద్ర– హస్రత్ జైపూరి (గీత కర్తలు)... వీళ్ల తోడుగా రాజ్ కపూర్ మరో సినిమా తీశాడు. విడుదలైంది.బర్సాత్ (1949). భారీ హిట్. రాజ్ కపూర్ అట... నర్గిస్ అట... పదండి హాళ్లకు... కలుద్దాం వీళ్లను... థియేటర్లలో మంట అంటుకుంది... కలెక్షన్ల మంట... కాసుల మంట.... అగ్గితో కురిసే కుంభవృష్టి.రాజ్‌కపూర్ టీమ్‌కు ఇద్దరు ముఖ్యమైన స్త్రీలు తోడయ్యారు. నర్గిస్, లతా మంగేష్కర్. ‘బర్సాత్’ లో నర్గిస్, రాజ్ కపూర్. ఒక దాని వెంట ఒకటిగా సినిమాలు చేశారు. ఆవారా, ఆహ్, శ్రీ 420, చోరి చోరి.... కేవలం వినోదం రాజ్ కపూర్ ఉద్దేశం కాదు. కథ ఉంటుంది. జనం తమ కథే అనుకునే కథ. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆనాటి రోజుల్లో అగమ్యంగా ఉన్న పేదవాళ్లు, ఎవరికీ పట్టని బీదలకు ప్రతినిధిగా కథానాయకుణ్ణి పెట్టి ‘ఆవారా’ తీశాడు. పని దొరక్క ఉపాధి కోసం వలసకు బయలుదేరి గ్రామీణ నిష్కల్మషం నుంచి నగర పతనాలకు ప్రయాణిస్తూ నైతిక ఘర్షణను ఎదుర్కుంటున్న యువకులకు ప్రతినిధిగా హీరోని పెట్టి ‘శ్రీ420’ తీశాడు. చార్లి చాప్లిన్‌ను పోలిన ఆహార్యం, చలాకీతనం, అమాయకత్వం.. తోడుగా వ్యక్తిత్వం ఉన్న పాత్రల్లో నర్గిస్... ఆ జంట పండింది. క్లాసిక్స్ అందరూ తీస్తారు. కాని కొందరు వాటితో అందరినీ తాకుతారు. సాంస్కృతిక ఆదాన ప్రదానాలలో భాగంగా రష్యాలో సినిమాల విడుదలకు మన దేశం అనుమతించింది. వాటిలో ప్రధానమైనవి రెండు: ‘దో భిగా జమీన్’ (బిమల్ రాయ్ – 1953), ఆవారా (1951). మాస్కోలో మన ప్రభుత్వం పూనికతో ‘దో భిగా జమీన్’ పోస్టర్లు ఎక్కువ పడ్డాయి. ఎందుకంటే రష్యన్లు అలాంటి సినిమాలను మెచ్చుతారని. ఒక్కరోజు. రష్యన్లు దో భిగా జమీన్, ఆవారా రెండూ చూశారు. రాత్రికి రాత్రి అంతా మారిపోయింది. మాస్కో అంతా ఎక్కడ చూసినా ఆవారా పోస్టర్లే. 4 రోజుల్లో 15 లక్షల మంది మూడు నగరాల్లో చూశారు. అదీ రాజ్‌కపూర్. రాజ్ కపూర్ ఏది చేసినా పెద్దగా ఆలోచించి చేసేవాడు. అతడు సన్నివేశాన్ని ముందు సంగీతంతో ఊహిస్తాడని అంటారు. సంగీతం ఇలా ఉంటే సన్నివేశం అలా తీయొచ్చు అనుకుంటాడట. ‘ఆవారా’లో డ్రీమ్ సీక్వెన్సు, ‘శ్రీ 420’లో ‘΄్యార్ హువా ఇక్రార్ హువా’ పాటకు వేసిన సెట్.. సినిమా అంటే విజువల్స్... మ్యూజిక్.... ఇవి రెండు బెస్ట్‌గా ఉంటే సినిమా హిట్. ‘సంగం’కు ఇంకో ఆకర్షణ అమర్చాడు– లొకేషన్స్. విదేశీ లొకేషన్లలో తీసిన మొదటి హిందీ సినిమా అది. భారీ హిట్. ఆ తర్వాతి రోజుల్లో యశ్ చోప్రా ఫార్ములాను స్థిరపరిచాడు. రాజ్‌కపూర్ గొప్పగా కలగని... కాలం కంటే ముందుకెళ్లి రెండు ఇంటర్వెల్స్తో తీసిన ‘మేరా నామ్ జోకర్’ దెబ్బ కొట్టింది. ఇప్పుడు క్లాసిక్‌గా నిలిచింది. ఆ సినిమాలో మూడు ఎపిసోడ్స్ ఉంటాయి. కౌమార స్థితిలోని రిషి కపూర్, అతని టీచర్‌గా సిమి గెరెవాల్... వీరి ఎపిసోడ్ ఫ్రెంచ్ సినిమాకు తగ్గదని విమర్శకులు మెచ్చుకున్నారు. ఆ ఎపిసోడ్‌ను కొనసాగిస్తూ, ‘మేరా నామ్ జోకర్’ను ఫ్లాప్ చేసినందుకు ప్రేక్షకుల మీద ప్రతీకారం తీర్చుకుంటూ రాజ్ కపూర్ తీసిన సినిమాయే ‘బాబీ’. ఈ టీనేజ్ లవ్ స్టోరీ నేటికీ వందల భారతీయ సినిమాలకు కథను అందిస్తూనే ఉంది. రాజ్ కపూర్ ప్రకృతిలోని, మగాడిలోని, స్త్రీలోని స్త్రీత్వాన్ని గొప్పగా పట్టించుకున్న దర్శకుడు. స్త్రీ పురుషుల భావోద్వేగాలను, వీటిని ప్రేరేపించే లేదా నియంత్రించే సాంఘిక పరిమితులు, నియంత్రణలు... వీటినే అతడు ఎక్కువగా కథాంశాలు తీశాడు. అయితే మార్పు గురించి తన తాపత్రయం ఒదులుకోలేదు. ‘జాగ్తే రహో’, ‘బూట్ పాలిష్’, ‘జిస్ దేశ్ మే గంగా బెహతీ హై’, ‘దిల్లీ దూర్ నహీ’, ‘సత్యం శివమ్ సుందరం’, ‘ఈ దేశంలో బీదవాళ్లు ఎక్కువ. వారు బాగు పడితే దేశం బాగు పడినట్టే’ అని రాజ్ కపూర్ అంటారు.ఉజ్వలమైన కాలాన్ని చరిత్రలో నుంచి తుడిచి పెట్టడం అసాధ్యం. జనులు మెచ్చిన కళాకారుణ్ణి సాంస్కృతిక పుటల్లో నుంచి చెరిపివేయడం దుస్సాధ్యం. దేవ్ ఆనంద్, దిలీప్ కుమార్ అతని సరిజోడిగా గొప్ప ప్రతిభ చాటారు. కాని రాజ్ కపూర్ సినిమానే తన జీవితం చేసుకున్నాడు. సినిమా నుంచి పొందాడు. సినిమాకు ఇచ్చాడు. నటుడుగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, గొప్ప సంగీత సాహిత్యాలకు వారధిగా... దేదీప్యంగా నిలిచిన స్ఫూర్తిగా... ఇలా మరొకరు లేరు.అందుకే రాజ్ కపూర్ శత జయంతి ముగింపును దేశమంతా సగౌరవంగా జరుపుకుంటోంది. రాజ్ కపూర్‌ను గుర్తు చేసుకోవడం ద్వారా తన సినీ సౌందర్యాన్నీ, సినీ రసాత్మకతను గుర్తు చేసుకుంటోంది. ఒక పూట వెచ్చించి రాజ్ కపూర్ సినిమాలు చూసినా, పాటలు విన్నా జీవిత కాలం అంటిపెట్టుకొని పోయే ప్రియమైన కళాకారుడతడు. మళ్లీ మళ్లీ పుట్టడు. అతని కాలంలో మనం ఉన్నాం. అతని శత జయంతి ముగింపులోనూ ఉన్నాం. ఎంత సంతోషం. ఈ ఘనత కొనసాగాలి. ది షో మస్ట్ గో ఆన్.జీనా యహా మర్నా యహా ఇస్కే సివా జనా కహా. -
గ్రేటెస్ట్ షో మేన్‌కి గ్రాండ్ షో
భారతీయ సినీ పరిశ్రమ ఖ్యాతిని పెంచడంలో కృషి చేసిన ఎందరో సినీ ప్రముఖుల్లో నటుడు–దర్శక–నిర్మాత రాజ్‌కపూర్ ఒకరు. రాజ్ సాహెబ్, ది షో మేన్ ది గ్రేటెస్ట్ షో మేన్ ఆఫ్ ఇండియన్ సినిమా, చార్లీ చాప్లిన్ ఆఫ్ ఇండియన్ సినిమా... ఇలా రాజ్‌కుమార్‌ను ఆయన ఫ్యాన్స్, సన్నిహితులు, ప్రేక్షకులు పిలుచుకునేవారు. రాజ్ కపూర్ చేసిన ఎన్నో అద్భుత చిత్రాలు ఆయన్ను ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయేలా చేశాయి. కాగా ఈ నెల 14న రాజ్‌కపూర్ శత జయంతి. ఈ సందర్భంగా డిసెంబరు 13 నుంచి 15 వరకు రాజ్‌కుమార్ ఐకానిక్ సినిమాలను దేశంలోని 40 నగరాల్లో దాదాపు 150 థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ‘రాజ్‌కపూర్ – 100 సెలబ్రేటింగ్ ది సెంచరీ ఆఫ్ ది గ్రేటెస్ట్ షో మేన్’ పేరిట ‘ఆర్కే ఫిలిమ్స్, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా’ల నేతృత్వంలో ఈ సినిమాల ప్రదర్శన ఉంటుంది. రాజ్‌కపూర్ కెరీర్‌లోని ఐకానిక్ ఫిల్మ్స్ ‘ఆగ్ (1948), బర్సాత్ (1949), ఆవారా (1951), శ్రీ 420 (1955), జాగ్తే రహో (1956), జిష్ దేశ్ మే గంగా బహ్తీ హై (1960), సంగం (1964), మేరే నామ్ జోకర్ (1970), బాబీ (1973), రామ్ తేరీ గంగా మైలీ (1985)’ వంటి సినిమాలు ‘రాజ్‌కపూర్ – 100 సెలబ్రేటింగ్ ది సెంచరీ ఆఫ్ ది గ్రేటెస్ట్ షో మేన్’ వేడుకల్లో ప్రదర్శితం కానున్నాయి. పీవీఆర్ ఐనాక్స్, సినీ పోలీస్ సినిమాస్‌లో ఈ సినిమాల ప్రదర్శన ఉంటుందని బాలీవుడ్ సమాచారం. ఈ చిత్రాల టికెట్ ధర వంద రూపాయలుగా నిర్ణయించారు. భారతీయ సినిమా దార్శనికుడు‘‘రాజ్‌కపూర్ భారతీయ సినీ తెరకు భావోద్వేగాలు అద్దిన దార్శనికుడు. ఆయన విజన్‌కు ఈ ఫెస్టివల్ ఓ నివాళి’’ అన్నారు రణ్‌ధీర్ కపూర్ (రాజ్‌కపూర్ తనయుడు). ‘‘రాజ్ కపూర్ సినిమాలు మాలో స్ఫూర్తి నింపుతూనే ఉంటాయి’’ అన్నారు రణ్‌బీర్ కపూర్ (రాజ్‌కపూర్ మనవడు).అవిభక్త భారతదేశంలోని పెషావర్‌లో పృథ్వీ రాజ్‌కపూర్, రామ్ సర్నీదేవి దంపతులకు డిసెంబరు 14, 1924లో జన్మించారు రాజ్‌కపూర్ (అసలు పేరు సృష్టినాథ్ కపూర్). యాక్టర్‌గా పృథ్వీరాజ్ కపూర్ కెరీర్‌ను బిల్డ్ చేసుకునే క్రమంలో ఆయన పలు ప్రాంతాలకు మకాం మార్చాల్సి వచ్చింది. ఇలా రాజ్ కపూర్ చదువు వివిధ స్కూల్స్‌లో జరిగింది. ఇక తన తండ్రి ఓ లీడ్ రోల్లో నటించిన ‘ఇన్క్విలాబ్’ (1935) చిత్రంతో బాల నటుడిగా పదేళ్ల వయసులో తెరపైకి వచ్చారు రాజ్ కపూర్. ‘నీల్ కమల్’ (1947) మూవీతో లీడ్ యాక్టర్‌గా కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత హీరోగా ‘బర్సాత్’తో తొలి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమాతో రాజ్‌కపూర్ పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోయింది. ఇక 1951లో విడుదలైన ‘అవారా’ చిత్రం రాజ్ కపూర్ కేరీర్‌ను అమాంతం పెంచేసింది. ఈ సినిమాకు విదేశీ ప్రేక్షకుల ఆదరణ కూడా లభించిందంటే ఆయన కెరీర్ ఈ టైమ్‌లో ఎంతటి పీక్ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా నాటి తరంలో ఇండియన్ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన వారిలో రాజ్ కపూర్ ముందు వరుసలో ఉంటారు. ఆయన స్టార్డమ్ కొనసాగేలా ‘శ్రీ 420, సంగం’ వంటి సినిమాలు సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. ఇక రాజ్‌కపూర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మేరా నామ్ జోకర్’ చిత్రం ఆయన్ను నిరాశకు గురిచేసింది. ఈ సినిమాకు ఆశించిన ఫలితం దక్కలేదు. నాలుగు గంటల నిడివితో రెండు ఇంట్రవెల్స్తో రిలీజైన ఈ చిత్రం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఇదే సినిమాకు కాలక్రమేణా కల్ట్ మూవీ స్టేటస్ దక్కడం విశేషం. ఇక 1948లో ఆర్కే స్టూడియో సంస్థను స్థాపించి, సినిమాలు నిర్మించారు రాజ్ కపూర్. తన కుమారుడు రిషి కపూర్‌ను హీరోగా పరిచయం చేస్తూ రాజ్ కపూర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘బాబీ’ సినిమా 1973లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దర్శకుడిగానూ రాజ్ కపూర్ సూపర్‌హిట్. ‘బర్సాత్, ఆవారా, శ్రీ 420, సంగం, మేరా నామ్ జోకర్’ వంటి చిత్రాలు అందుకు ఓ నిదర్శనం. సినిమా రంగంలో ఆయన చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మ భూషణ్ పురస్కారాలతో సత్కరించింది. ఇంకా జాతీయ అవార్డులతో పాటు పలు అవార్డులు అందుకున్నారు రాజ్ కపూర్. ఈ గ్రేట్ షో మేన్ 1988 జూన్ 2న ఢిల్లీలో కన్నుమూశారు. -
క్రూరమైన ప్రపంచంలో విశ్వక్సేన్
విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా ‘వీఎస్ 11’(వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. దివంగత నటుడు ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా ‘వీఎస్ 11’ నుంచి విశ్వక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ‘నైతికత లేని సమాజంలో ఓ గ్రే మ్యాన్ ప్రయాణాన్ని వర్ణించే చిత్రం ఇది. చీకటి, క్రూరమైన ప్రపంచంలో అట్టడుగు నుంచి ధనవంతుడిగా ఎదిగిన వ్యక్తి కథను ఈ సినిమా వివరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
జూన్‌లో దర్శకులు మధుసూదనరావు శత జయంతి ఉత్సవాలు
ప్రముఖ దివంగత దర్శకులు వీరమాచనేని మధుసూదనరావు (జూన్ 14, 1923లో జన్మించారు) శతజయంతి ఉత్సవాలు జూన్ 11న హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన సమావేశంలో దర్శకుడు కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘మధుసూదనరావుగారు మన మధ్య లేకపోయినా దర్శకుడిగా ఆయన ప్రతిభ మరికొన్ని వందల ఏళ్లు బతికే ఉంటుంది. ఆయన దగ్గర శిష్యరికం చేయడం నా అదృష్టం’’ అన్నారు. ‘‘నాన్నగారి శత జయంతి ఉత్సవాలకు సినీ పరిశ్రమ నుంచి అందర్నీ ఆహ్వానిస్తున్నాం’’ అన్నారు మధుసూదనరావు కుమార్తె వాణీదేవి. ‘‘ఈ సంవత్సరం నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావుగారు, సూర్యకాంతంగారు, వి. మధుసూదనరావుగారి శత జయంతి కావడం తెలుగు పరిశ్రమ పులకించి పోయే సంవత్సరం. మన మధ్య లేకపోయినా వారు పరిశ్రమకు చూపించిన మంచి మార్గాన్ని ఎప్పటికీ అనుసరిస్తూనే ఉంటాం’’ అన్నారు శివాజీరాజా. ‘‘మావయ్య విలువలతో జీవించారు. అదే విలువలను తన చిత్రాల ద్వారా పది మందికి పంచటానికి ప్రయత్నించారు’’ అన్నారు నాని (మధుసూదనరావు మేనల్లుడు). ఈ కార్యక్రమంలో మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపాల్ డా. జి. కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ చేరుకున్న రజనీకాంత్‌కు ఘన స్వాగతం
సాక్షి, విజయవాడ: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ విజయవాడ చేరుకున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు ఆయన విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం.. గన్నవరం విమానాశ్రయంలో నందమూరి బాలకృష్ణ, టీడీ జనార్ధన్, సావనీర్ కమిటీ రజనీకాంత్‌కు ఘన స్వాగతం పలికారు. నేడు సాయంత్రం పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సభ జరగనుంది. ఈ వేదికపై ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్యపరుస్తూ వివిధ వేదికల మీద చేసిన ప్రసంగాలను ఈ పుస్తకాల్లో పొందుపరిచారు. చదవండి: ఫిలింఫేర్ అవార్డులు.. ఉత్తమ నటి, దర్శకుడు ఎవరంటే? -
నూరేళ్ల రావిశాస్త్రి
‘తెలుగు బాగా రాయాలంటే ఏం చేయాలి?’ అని శ్రీశ్రీని అడిగారట రావిశాస్త్రి. ‘ఇంగ్లిష్ బాగా చదవండి’ అని శ్రీశ్రీ జవాబు. ‘ఈ లోకంలో డబ్బూ యాపారం తప్ప మరేటి లేదు ప్లీడరు బాబూ’ అంటుందొక క్లయింటు ‘మాయ’ అనే కథలో. రావిశాస్త్రి బాగా రాయడం ఆమె నుంచి నేర్చుకున్నారేమో. ‘మనల్ని ఇలా ఉంచినవాడు దేవుడైతే వాడు దేవుడు కాడు. మనల్ని ఇలా ఉంచింది మనుషులైతే వాళ్లు మనుషులు కాదు’ అంటుంది మరో పాత్ర ‘బుద్బుదం’ అనే కథలో. రావిశాస్త్రి బాగా రాయడం ఆమె నుంచీ నేర్చుకుని ఉండొచ్చు. జనుల ఆవేదనకు చెవి వొగ్గితే బలమైన భాష పుడుతుందని తుదకు తెలుసుకున్నారు రావిశాస్త్రి. ‘పతితులార భ్రష్టులార బాధాసర్ప దష్టులార’ అని శ్రీశ్రీ అంటే పతితులు ఎందుకు పతితులయ్యారో, భ్రష్టులను ఎవరు భ్రష్టత్వం పట్టించారో, బాధాసర్ప దష్టులు తమను నులిమేస్తున్న పడగలను ఖండించాలంటే ఏ ఎరుకను కలిగించుకోవాలో చెప్పినవారు రావిశాస్త్రి. ‘అల్పజీవు’లను తెలుగు కథాపుటలలోకి నడిపించుకొనొచ్చి వారి కథలను, కన్నీటిని, పిరికి నవ్వును, చేతగాని ప్రతిఘటనను, ఒప్పుకోలేని అణచివేతను, గత్యంతరం లేని సర్దుబాటును లోకానికి తెలిపిన రచయిత రావిశాస్త్రి. ‘ఏ పాపం చేయనివారు జైళ్లలోను జైలు బయట మగ్గుతున్నారు’ అనుకుని మగ్గిపోతున్న ఈ బతుకుల్లో కాసింతైనా గాలి వీయించడానికి కలాన్ని వీవెనగా చేసుకున్న మహోపకారి రావిశాస్త్రి. గత కాలాన్ని ఊహించండి. తాత తండ్రులను నమిలేసిన కాలం. కుక్కి మంచాలలోనే కలలన్నీ కూలిపోయిన కాలం. అట్టి కాలంలో ఒక పదహారేళ్ల అమ్మాయి ‘జరీ అంచు తెల్లచీర’ కావాలనుకుంటే ఆ కనీస కోరికకై పడే శోకం చేసే రోదన రావిశాస్త్రి రాస్తే పాఠకులు ఈనాటికీ మర్చిపోలేదు. ఆ పిల్ల తండ్రి ఎలాగోలా పన్నెండు రూపాయలు తెచ్చి ‘అడుగుతున్నావు కదమ్మా... పదా కొందాం’ అని వెళితే చూడగానే పోల్చుకునే బీదతనం ఎదుట దుకాణదారు పరిహాసంగా చీర పరిచి ఇరవైకు ఏ మాత్రం తగ్గకపోతే... రావిశాస్త్రి ఎలా ముక్తాయిస్తారు? ‘కుక్కి మంచంలో కూలబడి కూర్చున్న ఈ పదహారేళ్ల ఆడపిల్ల ఏకధారగా వరద వరదగా ఏడుస్తోంది. ఇది మెరుపులేని మబ్బు. ఇది తెరిపి లేని ముసురు. ఇది ఎంతకీ తగ్గని ఎండ. ఇది ఎప్పటికీ తెల్లవారని చీకటి రాత్రి. ఇది గ్రీష్మం. ఇది శిశిరం. ఇది దగ్ధం చేసే దావానలం. ఇది రెక్కల్ని రాల్చేసే నైరాశ్యం. ఒక్కటి... ఒక్కటే సుమండీ... ఒక్క జరీ అంచు తెల్లచీర’. రావిశాస్త్రి కథల్లో కవిత్వం ఉందని వెతికి ఆ కవిత్వాన్ని పుస్తకంగా వెలువరించాడు త్రిపురనేని శ్రీనివాస్. పొయ్యి ముట్టించాలనుకుంటున్నప్పుడు వేగిరానికై కిరోసిన్‌ను కుమ్మరించొచ్చు అనుకున్న రావిశాస్త్రి తన కథల్లో అనూహ్యమైన ప్రతీకలను, ప్రయోగాలను, శ్లేషను, వ్యంగ్యాన్ని, నాటకీయతను, జనుల భాషను, బోధకుని కంఠధ్వనిని ప్రవేశపెట్టి పాఠకులను తనవైపుకు లాక్కున్నారు. తాను ప్లీడరుగా పని చేస్తూ ‘న్యాయం’ అనే కథలో కోర్టును ‘అబద్ధాలకి పాముల పుట్ట’ అనగలిగే ధీశాలి. ‘కార్నర్ సీటు’ల్లో కూచుని బాధేమిటో తెలుపక హఠాత్తుగా ఆత్మహత్య చేసుకునే దీనులను మనలో నశిస్తున్న మంచితనానికి ఆనవాలుగా ఆయన కదూ చూపించినది? ‘కండ గలవాడే మనిషోయ్’ అని గురజాడ అంటే శారీరక, మానసిక దౌర్బల్యంతో యువత ఏ పనికీ కొరగాకుండా ఉండటాన్ని సహించలేని రావిశాస్త్రి ‘వర్షం’ కథను రాసి కర్తవ్యోన్ముఖులను చేస్తారు. ‘పువ్వులు’ కథలోలాగా ఎంత తొక్కినా తెల్లారేసరికి పకపకలాడే బంతిపూల వంటి బీద జనా లదే ఆయన పక్షం. నిత్యం కోర్టుల్లో జూటా ముఖాలను చూసి విసిగిపోయిన రావిశాస్త్రి ‘డికెన్స్, గుర జాడల రచనలే మంచితనం మీద ఈ మాత్రం అభిమానం పెంచుకునేలా చేశాయి’ అని రాసుకున్నారు. గురజాడ దారిలోనే రావిశాస్త్రి కూడా ‘మంచి అన్నది పెంచడానికే’ తెలుగు కథను నడిపించారు. రావిశాస్త్రి అను రాచకొండ విశ్వనాథశాస్త్రి తెలుగులో స్టార్ స్టేటస్ పొందిన తొలితరం సీరియస్ రచయిత. జనం పక్షాన రాస్తూ కూడా పాఠకాకర్షణ పొందవచ్చు అని నిరూపించారు. కాళీపట్నం, బీనాదేవి, కె.ఎన్.వై. పతంజలి... ఎందరో రచయితలు ఆయన రచనల ప్రభావంతో తోవ తెలుసుకున్నారు. గొంతు వెతుక్కున్నారు. విరసం– రావిశాస్త్రి పరస్పరం వెలుతురు పంచుకోవడం మరో ముఖ్యఘట్టం. ‘వేతన శర్మ’, ‘షోకు పిల్లి’, ‘పిపీలికం’ కథలు అందుకు తార్కాణం. రాచకొండ విశ్వనాథశాస్త్రి ఉత్తరాంధ్రకో తెలుగు రాష్ట్రాలకో పరిమితమయ్యే రచయిత ఎంత మాత్రం కాదు. రోదన ఉన్న చోటుకంతా బడుగుజీవి బతుకుతున్న తావుకంతా ఆయన కథ చేరగలదు. అదే సమయంలో రావిశాస్త్రి ఎంత ‘స్థానికుడు’ అంటే ఆయన రచన అనువాదానికి పూర్తిగా లొంగదు. అయినా సరే ఎంత చేర్చగలమో అంత కనీసం భారతీయ పాఠకులకు చేర్చవలసిన ‘బాకీ’ మనకు ఉంది. జూలై 30– రావిశాస్త్రి శత జయంతి. తెలుగు సాహిత్యానికి సంబంధించి గొప్ప ఉత్సవ సందర్భం. పాఠకులు, అభిమానులు రెండు రాష్ట్రాలలో ఉత్సాహంగా కార్యక్రమాలు చేయనున్నారు. అయితే ఇంతటి గొప్ప రచయితను ఈ సందర్భంగానైనా స్కూళ్లకు, కాలేజీలకు చేర్చాల్సిన పని ప్రభుత్వాలది. ‘రచయిత ప్రతివాడూ తాను రాస్తున్నది ఏ మంచికి హాని చేస్తున్నదో ఏ చెడుకు ఉపకారం చేస్తున్నదో గమనించుకోవాలి’ అన్నాడాయన. ప్రభుత్వం, పాలనా వ్యవస్థ, మీడియా, పౌరులు మొత్తంగా మనుషులు ఏ మంచికి హాని చేయని, ఏ చెడుకు మేలు చేయని సంస్కారంలో సమాజాన్ని ఉంచడమే ఆ మహా రచయితకు నిజమైన నివాళి. ఛాత్రిబాబూ నువు గొప్పోడివోయ్. -
Sr.NTR Satha Jayanthi:శతదినోత్సవ రాముడికి శతజయంతి కానుక..
ఒక నటుడు కష్టపడితే హీరో కావచ్చు. ఒక హీరో సిన్సియర్‌గా శ్రమిస్తే జనాదరణ పొందవచ్చు, బాక్సాఫీస్ హిట్లు సాధించవచ్చు. బాక్సాఫీస్ హిట్లు వచ్చిన తారలు చాలామందే ఉండవచ్చు. కానీ, ఎదిగే తన ప్రయాణంలో తాను నమ్ముకొని వచ్చిన పరిశ్రమను కూడా శిఖరాయమాన స్థాయికి తీసుకెళ్లిన మహానటులు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమలో అలాంటి ధ్రువతారక- ఎన్టీఆర్‌గా జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు నందమూరి తారక రామారావు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో తెలుగు తెరకు దక్కిన కోహినూర్ – ఎన్టీఆర్. రావడం రావడమే ఆయన హీరోగా వచ్చారు, క్లిక్ అయ్యారు. అయిదారు సినిమాలకే స్టారయ్యారు. దాదాపు 33 ఏళ్ల సినిమా కెరీర్లో 298 సినిమాలు చేశారు. సినీరంగం వదిలేసి, రాజకీయాల్లోకి వెళ్లాక తన కళాతృష్ణను తీర్చుకొనేందుకు మరో 4 సినిమాలు చేశారు. మొత్తం 302 సినిమాల్లో ఆయన చేసినన్ని విభిన్న సినిమాలు, వేసినన్ని వైవిధ్యమైన పాత్రలు, నట –దర్శక– నిర్మాతగా పండించినన్ని ప్రయోగాలు న భూతో న భవిష్యతి. శ్రమతో... పరిశ్రమను పెంచిన శిఖరం ఎన్టీఆర్ సినీరంగానికి వచ్చేసరికి తెలుగు సినీపరిశ్రమ ఏటా సగటున 10 చిత్రాలు ఉత్పత్తి చేస్తోంది. ఆయన హీరోగా సినీరంగాన్ని వదిలే నాటికి అది సగటున 100 సినిమాల స్థాయికి వచ్చింది. తెలుగు సినీ సీమ ఆ స్థాయిలో పరిపుష్టం కావడంలో ఎన్టీఆర్‌ది కీలక పాత్ర. తక్కువ సినిమాలతో ఎక్కువ సంపాదన అనే నేటి సూత్రాలకు భిన్నంగా ఆయన ఒళ్లు దాచుకోకుండా కష్టపడ్డారు. వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేస్తూ, వేలాది మంది ఉపాధికీ, నిర్మాణ, పంపిణీ, ప్రదర్శక శాఖలన్నిటా పరిశ్రమ సర్వతోముఖ పురోగతికీ తోడ్పడ్డారు. మొదటి 20 ఏళ్ల కెరీర్లో ఆయన దాదాపు 200 సినిమాలు చేశారు. ఆ కాలంలో ప్రతి ఏటా తెలుగులో రిలీజైన సినిమాల్లో కనీసం సగం నుంచి సగం పైనే ఆయన సినిమాలున్న సంవత్సరాలే ఎక్కువ. మచ్చుకు 1964లో తెలుగు పరిశ్రమ 24 సినిమాలు తీస్తే, అందులో 16 సినిమాలు, అంటే మూడింట రెండొంతులు ఎన్టీఆర్వే. అలా రాజకీయాల్లోకి రాకముందే సినిమాల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించారు. 90 ఏళ్ల తెలుగు టాకీ చిత్రాల చరిత్రలో ఇలా ఒక ఏడాది మూడింట రెండొంతుల సినిమాలు ఒక హీరో చేయడం అప్పటికీ, ఇప్పటికీ రికార్డు. పొరుగున తమిళ సినీ స్టార్ల చరిత్రలోనూ ఇలాంటి హీరో మరొకరు కనిపించరు. తెలుగు సినిమా ఎదుగుదలలో ఆయన అవిస్మరణీయ కృషికి ఇది నిలువుటద్దం. అలాగే, 1962 నాటికే వంద సినిమాలు (గుండమ్మకథ), 1970కే రెండొందల సినిమాలు (కోడలు దిద్దిన కాపురం) చేశారు ఎన్టీఆర్. భారతదేశంలో ఈ రెండు మైలురాళ్లనూ చేరుకున్న మొదటి హీరో – ఎన్టీఆరే! జానర్ ఏదైనా... జనాదరణే! అన్ని తరహా చిత్రాల్లోనూ అద్వితీయ నటనతో అలరించడం హీరోగా ఎన్టీఆర్కే సాధ్యమైంది. ఒకే ఏడాది (1962) పరస్పర విరుద్ధమైన నాలుగు విభిన్న కోవల చిత్రాలు (పౌరాణికం – భీష్మ, జానపదం – గులేబకావళి కథ, చారిత్రకం – మహామంత్రి తిమ్మరసు, సాంఘికం – రక్తసంబంధం, ఆత్మబంధువు, వగైరా) ఆయన చేస్తే, ఆ నాలుగు కోవల చిత్రాలూ శతదినోత్సవ హిట్లే. ఒక నటుడిగా దటీజ్ నందమూరి. ఒకే ఏడాదిలో... ఒకే ఒక్కడు! ఒక ఏడాది చేసిన సినిమాలన్నీ సక్సెసై, జనాదరణతో జేజేలు కొట్టించుకోవడం ఎంతటి స్టార్‌కైనా అరుదు. కానీ, అదీ ఎన్టీఆర్ చేసి చూపెట్టారు. 1965లో ఈ సినీ తారకరాముడు 12 సినిమాలు చేస్తే, అందులో 8 సెంచరీ హిట్లు. తొమ్మిదో చిత్రం 92 రోజులాడింది. మిగిలిన మూడూ 9 – 10 వారాల వంతున ప్రదర్శితమైన సక్సెస్ఫుల్ సినిమాలు. అదీ ఎన్టీఆర్ ఇమేజ్ చేసిన మ్యాజిక్. ఒకే ఏడాది (1977)లో ఏకంగా 3 డబుల్ సెంచరీ హిట్లు (దానవీరశూర కర్ణ, అడవి రాముడు, యమగోల) సాధించడం ఎన్టీఆర్ స్టార్ స్టామినాకు మచ్చుతునక. అప్పటికి తెలుగులో మరి ఏ హీరోకూ ఏకంగా సినీజీవితం మొత్తంలోనే 3 డబుల్ సెంచరీ హిట్లు లేవు. అలా తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ ఓ చరిత్ర సృష్టించారు. విన్ అయినా... రిపీట్ రన్ అయినా... ఎన్టీఆర్ నటించిన త్రిశతాధిక చిత్రాల్లో అధిక భాగం బాక్సాఫీస్ హిట్లు. ఆయన చిత్రాల్లో శతదినోత్సవ హిట్లు 160. అందులో 115 నేరుగా సెంచరీ ఆడినవే! రజతోత్సవ హిట్లు 40. వాటిలో దాదాపు 20 డైరెక్ట్ సిల్వర్ జూబ్లీ. ఇక, 5 చిత్రాలు ఏడాది పాటు ఆడిన స్వర్ణోత్సవ హిట్లు. ఇలాంటి బాక్సాఫీస్ రికార్డుల్లోనూ అగ్రతాంబూలం ఎన్టీఆర్‌దే అన్నది జగమెరిగిన సత్యం. ప్రపంచ సినీ చరిత్రలో రెండోసారి, మూడోసారి విడుదలై కూడా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా ఆడడం తెలుగు, తమిళ సినీ రంగాల్లోనే ఎక్కువ. తర్వాత కొంత కన్నడంలో రిపీట్ రన్స్ కనిపిస్తాయి. మన తెలుగు సినీచరిత్ర మొత్తంలో రిపీట్ రన్స్‌లో శతదినోత్సవం చేసుకున్న చిత్రాలు 16. అందులో ఏకంగా 14 చిత్రాలు ఈ బాక్సాఫీస్ రాముడివే! ప్రేక్షకులకూ, ఎన్టీఆర్‌కూ ఉన్న అనుపమానమైన అనుబంధానికి ఇది ఓ మచ్చుతునక. చరిత మరువని ఘనత పౌరాణికం, జానపదం, చారిత్రకం, సాంఘికం.. ఇలా అన్ని కోవలలోనూ ఆయనకు ఆయనే సాటి. ఈ నందమూరి అందగాడు వేసినన్ని పాత్రలూ, చేసినన్ని రకాల పాత్రలూ మరే హీరో చేయలేదు. కనీసం ఆయన దరిదాపులో కూడా ఎవరూ లేరు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. 57 జానపదాలు, 48 పౌరాణికాలు, 18 చారిత్రకాలు – ఇలా మూడు కోవల్లోనూ హీరోగా ఆయనదే రికార్డు. ఈ మూడూ కలిపితే, మొత్తం 123 సాంఘికేతర చిత్రాల్లో (అంటే కాస్ట్యూమ్ చిత్రాల్లో) హీరోగా నటించింది ప్రపంచంలో ఎన్టీఆర్ ఒక్కరే! ముఖ్యంగా పౌరాణిక పాత్రలతో ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకొని, తెలుగువారి ఆరాధ్యదైవమయ్యారు ఎన్టీఆర్. ఆ సినిమాలు, ఆ పాత్రలే 23 ఏళ్ల పాటు మద్రాసులోని ఆయన నివాసాన్ని ఒక తీర్థయాత్రా స్థలిగా మార్చాయి. ఎన్టీఆర్‌లా కేవలం 9 నెలల్లో రాజకీయ పార్టీ స్థాపించి, ఎన్నికలలో ఘన విజయం సాధించిన మరొకరు ప్రపంచ రాజకీయ చరిత్రలో కనిపించరంటే అదే కారణం. అలా రాజకీయ సౌధానికి కూడా సినీ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా ఆయన చూపిన ప్రత్యేకత, సంపాదించుకున్న ప్రజాదరణే పునాది. ఇలాంటి చరిత మరువని ఘనతలెన్నో తెలుగు సినీరంగానికి కట్టబెట్టిన ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. ఈ ఆరాధ్యుడే ఆద్యుడు తెలుగు సినీరంగంలో అనేక తొలి ఘనతలు ఎన్టీఆర్ చిత్రాలే. ఆ ఘనకీర్తి జాబితా సుదీర్ఘమైనది. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన తొలి సినిమా (పాతాళ భైరవి), విదేశాల్లో ప్రదర్శించిన తొలి సినిమా (మల్లీశ్వరి), తొలి పూర్తి రంగుల చిత్రం (లవకుశ), విదేశాల్లో చిత్రీకరించిన తొలి చిత్రం (సాహసవంతుడు), తొలి సైన్స్ ఫిక్షన్ – అపరాధ పరిశోధక చిత్రం (దొరికితే దొంగలు), ఫస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ (లక్షాధికారి), ఫస్ట్ సోషియో– ఫ్యాంటసీ (దేవాంతకుడు), ఫస్ట్ మాస్ మసాలా మూవీ (అగ్గిరాముడు) – ఇలా అనేక కోవల చిత్రాలకు ఎన్టీఆర్ ఆద్యుడు. – కొమ్మినేని వెంకటేశ్వరరావు -
ఎన్టిఆర్ శతజయంతి: పదే పదే తలచు తెలుగుజాతి
ఒక్క బాణాన్ని సంధించి ఏడు తాటిచెట్లను కూల్చిన శ్రీరామచంద్రుణ్ణి విని ఉంది తెలుగుజాతి. నూరు తప్పులను కాచి సుదర్శనాన్ని విడిచి శిశుపాలుని వధించిన కృష్ణలీల తెలుసు తెలుగుజాతికి. ఉగ్రరూపం దాల్చి రుద్ర తాండవమాడిన శివుడి జటాజూటాలు ఎలా ఉంటాయో ఊహకే పరిమితమాయె. పది శిరస్సుల రావణుడి రుధిర నేత్రాల తీక్షణత– చూడతరమా! గాండీవం చేబూనిన పార్థుడు– గదాధారి భీముడు– పంచభర్తృకకు తొడను చూపి ఆసీనురాలు కమ్మని సైగ చేసిన సుయోధనుడు... వినీ వినీ ఉన్నారు. అప్సరసలు కూడా వివశులయ్యే అందాల రాకుమారుడు– రాకుమారిని తెగించి వరించే తోట రాముడు– అష్టదిగ్గజాలతో పదములల్లే దేవరాయడు– పల్నాట బ్రహ్మనాయుడు... పొరుగునే పాండురంగడు... విన్నారయ్యా విన్నారు.. చూసేదెప్పుడు? వారి ఎదురుచూపు ఫలించింది. తెలుగు తెర వరము పొంది మురిపాల నటుడిని ప్రసవించింది. ఇదిగో ఇతడే నందమూరి తారక రామారావు అని పోస్టర్లేసి ప్రకటించింది. తదాదిగా తెలుగుజాతికి వినే బాధ తప్పింది. వారు ప్రతి పురాణాన్ని చూశారు. ప్రతి వేల్పును తిలకించారు. ప్రతి కథకు పరవశించారు. మరో వెయ్యేళ్లు ఈ అపురూపాన్ని దర్శిస్తారు. తెలుగు తెరకే ఇది సొంతం. తెలుగు నేలదే ఈ భాగ్యం. నేడు ఎన్టిఆర్ శతజయంతి వేడుకల ప్రారంభం సందర్భంగా ప్రత్యేక కథనం. విజయా స్టూడియో అధినేత నాగిరెడ్డి దగ్గరకు ఆ స్టూడియోలో జీతానికి పని చేసే ఆర్టిస్టులు ధైర్యంగా వచ్చి మాట్లాడరు. కాని నెలకు 500 రూపాయల జీతం, సినిమాకు ఐదు వేల రూపాయల పారితోషికం కాంట్రాక్టు మీద కొలువుకు చేరిన కొత్త నటుడు ఎన్.టి. రామారావు ఆ రోజు ఆయన దగ్గరకు వచ్చి నిలుచున్నారు. ‘ఏంటి రామారావ్’ అన్నారు నాగిరెడ్డి. ‘సార్.. క్యాంటిన్లో మీరు నాకు ఇవ్వమని అలాట్ చేసిన టిఫిన్ సరిపోవడం లేదు. పెంచాలి’. నాగిరెడ్డి ఒక్క క్షణం సర్దుకున్నారు. సాధారణంగా ఆ స్టూడియోలో ఆర్టిస్టులకు ఇంత టిఫిన్, టెక్నిషియన్లకు ఇంత టిఫిన్ అని నిర్దేశించారు. ఎన్.టి. రామారావుకు కూడా అంతే ఇస్తున్నారు. ఒడ్డు పొడవు ఉండి, రోజూ కసరత్తు చేస్తూ, రాళ్లు తిని కూడా అరాయించుకునే ఆరోగ్యంతో ఉన్న రామారావు గురించి చిన్న ఏమరపాటు జరిగిందని ఆయనకు అర్థమైంది. వెంటనే క్యాంటిన్‌కు కొత్త ఆదేశాలు వెళ్లాయి. ఆ రోజు ఆకలి గురించి కొట్లాడిన ఎన్.టి. రామారావు ఆ తర్వాత తెలుగువారి తొలి సినిమా రంగ ముఖ్యమంత్రి అయ్యి ఆకలిగొన్న వారందరికీ కిలో రెండు రూపాయల బియ్యం ఇవ్వడం చరిత్ర. ‘మాయాబజార్’ తర్వాత ఎన్.టి. రామారావుతో ‘లవకుశ’ తీయాలని నిశ్చయించుకున్నారు నాగిరెడ్డి, చక్రపాణి. దర్శకుడు బి.ఎన్. రెడ్డి. అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చారు. బి.ఎన్. రెడ్డి అంటే ‘మల్లీశ్వరి’ తీసి సినిమాకు ‘కళాఖండం’ అని ఉపమానం ఇచ్చినవారు. బి.ఎన్. రెడ్డి, రచయిత పాలగుమ్మి పద్మరాజు బెంగళూరు వెళ్లి 20 రోజులు ఉండి ఒక వరుస కథ రాసుకొని వచ్చారు ‘లవకుశ’ కోసం. చక్రపాణిని కూచోబెట్టి బి.ఎన్. నెరేషన్ ఇస్తున్నారు. ‘సీత శోకంలో ఉంది. రాముడి వీపు మాత్రమే కనిపిస్తూ ఉంది. తనను అడవులపాలు చేసినందుకు సీత రాముణ్ణి నిందిస్తూ ఉంది. రెండో సీను... రాముడి వీపునే చూపిస్తూ సీత శోకం. మూడో సీను..’ చక్రపాణి లేచి నిలబడ్డారు. ‘అందమైన ఎన్.టి. రామారావును పెట్టుకుని వీపు చూపిస్తూ రెండు సీన్లా. ఈ సినిమా ఆడినట్టే’ స్క్రిప్ట్ మూల పడేశారు. ఎన్.టి. రామారావు సినిమాలో ఉంటే మొదటి సీను నుంచి చివరి సీను వరకూ చూసుకోవడమే ప్రేక్షకుల పని. ఆ తర్వాత కొన్నేళ్లకు సి. పుల్లయ్య దర్శకత్వంలో ‘లవకుశ’ వచ్చింది. సీత శోకం చూడాలా రాముడి ఆవేదన చూడాలా... పల్లె జనాలు ఎడ్లబండ్లు వేసుకొని వచ్చి చెట్ల కింద పడుకుని సినిమా చూసి వెళ్లేవారు. 500 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా అది. రాముడి గొప్పతనమో... తారక రాముని నటనావైదుష్యమో. ‘బేడకు సినిమా’ అనేవారు ఆ రోజుల్లో. అంటే రెండు అణాలకు సినిమా. ఆ రెండు అణాలు ఇచ్చి సినిమా చూడటానికి కూడా జనం దగ్గర డబ్బులు ఉండేవి కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్త. అప్పటికి పదేళ్లకు కాస్త అటు ఇటుగా తెలుగు సినిమాలు మొదలయ్యాయి. మద్రాసుకు కళాకారులు చేరుకున్నారు. ‘ఆర్టిస్టు’ను గుర్తు పట్టి సినిమాలు చూడటం అనేది సీనియర్ శ్రీరంజని (జూ. శ్రీరంజని అక్క)తో మొదలయ్యింది. నాటకాల్లో మాదిరే ‘పాడి నటించేవారికి’ డిమాండ్ కనుక చిత్తూరు నాగయ్య, బళ్లారి రాఘవ, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు సింగింగ్ స్టార్స్ అయ్యారు. బెరుకు లేకుండా స్లీవ్‌లెస్ జాకెట్ వేసిన కాంచన మాల, భానుమతి క్యాలెండర్ స్టార్లుగా వెలిగారు. సీహెచ్ నారాయణరావు సుకుమార సౌందర్యం గల తొలి తెలుగు హీరో. అప్పుడు అక్కినేని రంగప్రవేశం చేసి ‘బాలరాజు’తో జాక్‌పాట్ కొట్టారు. కాని భారతీయ ఆత్మను, ఇతిహాసాన్ని, పౌరాణిక ఘనతను, చారిత్రక ఘటనలను, భక్తి ఉద్యమాలను, జానపద సంపదను, సాంఘిక జీవనాన్ని, కార్మిక కర్షకుల ప్రాతినిధ్యాన్ని, కుటుంబ భావోద్వేగాలను చూపే ఒక నాయకుడు, ఆ నాయకుడి చరిష్మా అవసరమయ్యింది. అది ఎన్.టి. రామారావు రూపంలో సంభవించింది. ఎంటైర్ సౌత్‌లో ఎం.జి.ఆర్, శివాజీ గణేశన్, రాజ్ కుమార్, ప్రేమ్ నజీర్... వీరందరూ గొప్ప జనాకర్షణ కలిగిన సినీ నాయకులే అయినా ఎన్.టి.ఆర్ చేసినవన్నీ చేయలేదు. ఎన్.టి.ఆర్ చేసినంత చేయలేదు. ఉత్తరాదిన ముగ్గురు సూపర్స్టార్లలో రాజ్‌కపూర్, దేవ్ ఆనంద్ ప్రధానంగా మెట్రో మనుషుల రిప్రెజెంటేటివ్స్. దిలీప్ కుమార్ మాత్రమే ఫోక్లోర్, హిస్టారికల్ (మొఘల్ ఏ ఆజమ్) చేశాడు. కాని మైథాలజీ వీరి ముగ్గురి పరిధిలో లేదు. రాజ్ కపూర్ దర్శకుడుగా గొప్పవాడు. సుదీర్ఘమైన సినిమా ‘మేరా నామ్ జోకర్’ (4 గంటల 13 నిమిషాలు) తీశాడు. దాని ఫలితం నిరాశ కలిగించింది. ఎన్.టి.ఆర్ కూడా దర్శకుడిగా సుదీర్ఘమైన సినిమా ‘దాన వీర శూర కర్ణ’ (4 గంటల 8 నిమిషాలు) తీశారు. 43 రోజుల్లో తీసిన ఈ సినిమా కలెక్షన్లలో వీర సినిమా. రికార్డులలో శూర సినిమా. పిల్లలకు నచ్చాలి ఫస్ట్. జేమ్స్‌బాండ్ సినిమాలు ఎందుకు నిలుస్తాయంటే, సూపర్‌మేన్, స్పైడర్‌మేన్ వంటి సూపర్ హీరోలు ఇన్నేళ్లయినా ఎందుకు ఉన్నారంటే వాళ్లు పిల్లలకు నచ్చుతారు. తమకు నచ్చినవారిని పిల్లలు పెద్దయినా వృద్ధులైపోయినా అభిమానిస్తూనే ఉంటారు. ‘పాతాళభైరవి’ అక్కినేనితో తీయాలా, ఎన్.టి.ఆర్తో తీయాలా అనే సందేహం వచ్చింది విజయా వారికి. కె.వి. రెడ్డి మనసు అక్కినేని మీద ఉంది. నాగిరెడ్డి–చక్రపాణి ఎంపిక ఎన్.టి.ఆర్ మీద ఉంది. నీ మాట వద్దు నా మాట వద్దు అని మరో నటుణ్ణి వెతుకుదాం అని కూడా అనుకున్నారు (తుపాకుల రాజారెడ్డి అనే నటుడితో రెండు రీళ్లు తీశారని ఒక కథనం). చివరకు ఒకరోజు అక్కినేని, ఎన్.టి.ఆర్ స్టూడియో కోర్టులో టెన్నిస్ ఆడుతూ ఉంటే ఎన్.టి.ఆర్ బంతిని బాదుతున్న స్టయిల్, క్రీడాగ్రహం చూసి ‘ఇతనే కరెక్ట్’ అనుకున్నారు కె.వి. రెడ్డి. అలా తోట రాముడుగా ఎన్.టి.ఆర్ సాహసం చేశారు. ప్రేమ కోసం వలలో పడ్డారు. నేపాళ మాంత్రికుడి తల నరికి పాతాళ భైరవి కరుణతో పాటు ప్రేక్షకుల కాసులు పొందారు. ఇది పెద్దలతో పాటు పిల్లలకు నచ్చింది. వారికి ఒక హీరో దొరికాడు. ఆ తర్వాత ఈ పిల్లలే ‘మాయాబజార్’ చూశారు. ఊరికే అలా చేతిని గాలిలో కదిపి అందరినీ తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్న కృష్ణుడు. మహా బలసంపన్నుడైన ఘటోత్కచుడే ముసలి వేషంలో ఉన్న కృష్ణుడి రెక్క పట్టుకు లేపలేకపోతాడు. ఆ కృష్ణబలం ఎన్.టి.ఆర్‌దే. ఇక ఆ పిల్లలు ఎన్.టి.ఆర్ని వదల్లేదు. ఎన్.టి.ఆర్ కూడా చందమామ పత్రికలో కనిపించే జానపదాలు, భట్టి విక్రమార్క కథలు, భక్తుల కథలు, వ్రత కథలు, అరేబియన్ నైట్స్ చేస్తూనే వెళ్లారు. గులే బకావళి కథ, ఆలీబాబా నలభై దొంగలు, బాగ్దాద్ గజదొంగ... అరేబియన్ నైట్స్ ఆధారితాలే. తెలుగు పిల్లల బ్రూస్లీ ఎన్టీఆరే (యుగ పురుషుడు). సూపర్‌మేన్ ఆయనే (సూపర్ మేన్). టార్జాన్ ఆయనే (రాజపుత్ర రహస్యం). ఎల్విస్ ప్రెస్లీ ఆయనే (ఆటగాడు). ఒక కళాకారుడికి ఎంతో నిర్మలత్వం, అమాయకత్వం ఉంటే తప్ప ఇలాంటి పాత్రలు చేయడు. ఎన్.టి.ఆర్ చేశారు. ఆ నిర్మలత్వమే పిల్లలకు నచ్చుతుంది. అందుకే పిల్లల వినోద సామ్రాజ్యానికి అధిపతి ఎన్.టి.ఆర్. ఎన్.టి.ఆర్కు ద్రవిడ స్పృహ ఉంది. ప్రాంతీయ చైతన్యం ఉంది. ‘టెక్ట్స్’ను పరుల కంటితో కాక స్వీయ దృష్టితో అర్థం చేసుకునే జ్ఞానం ఉంది. జనంకు ఏదైనా చెప్పడానికే ఆయన ‘నేషనల్ ఆర్ట్స్ థియేటర్’ అనే నాటక సంస్థను బెజవాడలో స్థాపించారు. నిర్మాతగా మారాక కూడా ‘తోడు దొంగలు’ వంటి సందేశాత్మక సినిమాయే తీశారు. ‘పాతాళ భైరవి’, ‘మల్లీశ్వరి’ వంటి సూపర్‌హిట్స్ ఇచ్చిన హీరో ఆ వెంటనే ‘రాజూ పేద’లో కన్న కొడుకును అడుక్కు రమ్మని పంపే పోలిగాడి పాత్రను చేస్తాడా? ‘డ్రైవర్ రాముడు’ వంటి మాస్ హిట్ ఇచ్చి ఆ వెంటనే భార్య లేచిపోయిన భర్తగా ‘మావారి మంచితనం’లో నటిస్తాడా? ఆయన ప్రయోగశీలి. అందుకే ‘హీరోగా చేయడానికి’ ఏమీ లేకపోయినా తెలుగువారి రెండు విశిష్ట నాటకాలు ‘కన్యాశుల్కం’, ‘చింతామణి’లో ఆయన నటించాడు. తన పేరు మీద టైటిల్ లేకపోయినా ‘తెనాలి రామకృష్ణ’, ‘మహామంత్రి తిమ్మరుసు’ లో శ్రీ కృష్ణ దేవరాయలుగా నటించాడు. అలాగే ఆయనకు పురాణాలను దర్శించే పద్ధతి వేరేగా ఉండేది. ‘రావణుని పాత్రను చేస్తాను... డైరెక్ట్ చేయండి’ అని కె.వి. రెడ్డి దగ్గరకు వెళితే ‘కృష్ణుడిగా చూపించిన నేను రావణుడిగా చూపించలేను. జనం చూడరు’ అన్నారు. కాని ఎన్.టి.ఆర్ ‘సీతారామ కల్యాణం’ లో రావణుడి పాత్ర వేసి మెప్పించి, ఘన విజయం సాధించారు. తెలుగువారు ‘దుష్ట చతుష్టయం’గా చెప్పుకునే వారిలో ఇద్దరు గూర్చిన దృష్టిని సమూలంగా మార్చాడాయన. భారతంలో దుర్యోధనుడి పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంది అని పదేపదే చెప్పారు. ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన రావి కొండలరావుతో ఎన్.టి.ఆర్ ‘బ్రదర్... దుర్యోధనుడికి డ్యూయెట్ పెడతారా ఎవరైనా’ అని అడిగారు. రావి కొండలరావుకు ఈ ప్రశ్న నేపథ్యం ఏ మాత్రం తెలియదు. ఆయన రామారావును మెప్పిద్దామని ‘ఎవడు పెడతాడు సార్ బుద్ధి లేకపోతే గాని’ అన్నాడు. ‘మేం పెడుతున్నాం బ్రదర్ దాన వీర శూర కర్ణలో’ అన్నారు ఎన్.టి.ఆర్ ఆ తర్వాత కొన్ని రోజుల పాటు రావి కొండలరావు ఎన్టీఆర్ ఎదుట పడితే ఒట్టు. ఎన్.టి.ఆర్ దుర్యోధనునికి డ్యూయెట్ పెట్టి ‘చిత్రం... భళారే విచిత్రం’ అనిపించారు. ఇక ఎన్.టి.ఆర్కు కర్ణుడి మీద సానుభూతి దృష్టి రావడానికి తమిళ ‘కర్ణన్’ కారణం. శివాజీ తమిళంలో చేసిన ‘కర్ణన్’ కర్ణుడు ఎంత గొప్పవాడో వర్ణదృష్టితో చెబుతుంది. ఆ సినిమాలో కృష్ణుడిగా నటించిన ఎన్టీఆర్‌కు ఇది నచ్చింది. ఆ సినిమాకు మాటలు రాసింది శక్తి కృష్ణసామి. ఈ రచయితే ‘వీరపాండ్య కట్టబొమ్మన్’కు మాటలు రాసి తమిళంలో ఉధృత డైలాగ్ ఒరవడిని సృష్టించాడు. ఆ స్థాయిలో డైలాగ్స్ ఉండాలని కొండవీటి వెంకటకవిని ఒప్పించి రాయించారు ఎన్.టి.ఆర్. అసలు దానవీర శూర కర్ణ ఒక రకంగా శబ్ద చిత్రం. కేవలం మాటలు విన్నా చాలు. ఆ మాటలు ఒక్క ఎన్.టి.ఆరే చెప్పగలరు. హితుడా... ఆగాగు ఏమంటివి ఏమంటివి... నటుడికి ధారణశక్తి, ఉచ్ఛారణ శక్తి, వాచక ఔన్నత్యం ఉండాలి. ఏ కాలంలో అయినా నటుడు అనే వాడికి ఎన్.టి.ఆర్ వదిలి వెళ్లిన సిలబస్, పరీక్ష పేపర్ ఈ డైలాగ్. ప్రదర్శించడం మాత్రమే కళ కాదు. కొనసాగడమే కళ. అంటే కొనసాగేందుకు ఎప్పటికప్పుడు సృజన సామర్థ్యాలను కల్పించుకోవడమే కళ. తెలుగు నాట ఎన్.టి.ఆర్, అక్కినేని... ఇద్దరూ సుదీర్ఘంగా కొనసాగేందుకు కంకణబద్ధులై ఎప్పటికప్పుడు తమను తాము తీర్చిదిద్దుకుంటూ వెళ్లారు. ఎన్.టి.ఆర్కు ‘పాతాళభైరవి’లాగా అక్కినేనికి ‘దేవదాసు’ ఒక పెద్ద మైలురాయిగా మారింది. మిడిల్ క్లాస్, ఎలైట్ సెక్షన్స్‌తో పాటు మహిళా ప్రేక్షకుల బలంతో అక్కినేని కొనసాగితే ఆబాల గోపాలాన్ని మెస్మరైజ్ చేస్తూ ఎన్.టి.ఆర్ కొనసాగారు. తమాషా ఏమిటంటే ‘దొంగ రాముడు’, ‘భలే రాముడు’, ‘అందాల రాముడు’ అక్కినేని చేసినా ‘రాముడు’ టైటిల్‌కు పేటెంట్ ఎన్.టి.ఆర్ పరమే అయ్యింది. అక్కినేని ‘అనార్కలి’ చేస్తే ఎన్.టి.ఆర్ ‘అక్బర్ సలీంఅనార్కలి’ చేశారు. అక్కినేని క్షేత్రయ్య చేస్తే ఎన్.టి.ఆర్ వేములవాడ భీమకవి చేశారు. అక్కినేని మహాకవి కాళిదాసు. ఎన్.టి.ఆర్ శ్రీనాథ కవిసార్వభౌమ. ఈ సన్నిహితాలకు సామీప్యాలకు అంతే లేదు. కాని వీరిరువురూ కలిసి నటించిన సినిమాలలో ‘మిస్సమ్మ, మాయాబజార్’ చిన్న రసాలు.. పెద్ద రసాలు. నిజం చెప్పాలంటే ఎన్.టి.ఆర్కు కె.వి. రెడ్డి తర్వాత గట్టి దర్శకుల బలం లేదు. అక్కినేనికి ముందు నుంచి భరణి రామకృష్ణ, ఆదుర్తి సుబ్బారావు, విక్టరీ మధుసూదనరావు, వి.బి. రాజేంద్ర ప్రసాద్ తదితరులు కొనసాగారు. తర్వాతి తరం కృష్ణ, శోభన్‌బాబు వచ్చాక కొత్త దర్శకులు వీరితో సినిమాలు చేయసాగారు. అయినా సరే ఎన్.టి.ఆర్ తన దారిన తాను ప్రయోగాలు చేస్తూనే వెళ్లారు. బాలీవుడ్లో స్టార్ల సినిమాలకు తెలుగులో ఎన్.టి.ఆరే సూట్ అయ్యారు. అమితాబ్ ‘జంజీర్’– ‘నిప్పులాంటి మనిషి’గా, ‘డాన్’ – ‘యుగంధర్’గా, రాజేష్ ఖన్నా ‘రోటి’– ‘నేరం నాది కాదు ఆకలిది’గా, ధర్మేంద్ర ‘యాదోంకి బారాత్’– ‘అన్నదమ్ముల అనుబంధం’గా ఆయన నటించారు. 39 ఏట ‘భీష్మ’లో, 49 ఏట ‘బడి పంతులు’ లో పూర్తి వృద్ధ పాత్రల్లో చేయడం ఆయనకే చెల్లింది. కృష్ణ, రజనీకాంత్, చిరంజీవిలతో మల్టీస్టారర్స్ చేశారు. కాని దాసరి రావడంతో అక్కినేనికి బలం దొరికినట్టు కె. రాఘవేంద్రరావు రావడంతో ఎన్.టి.ఆర్కు బలం దొరికింది. కె. రాఘవేంద్రరావు ఎన్.టి.ఆర్‌ను ఒక దర్శకుడిగా కాక ఒక అభిమానిగా డైరెక్ట్ చేశారు. అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపిస్తూ తీసిన ‘అడవి రాముడు’ సినిమా సగటు ప్రేక్షకుడికి ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండాలో చూపింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ‘వేటగాడు’, ‘గజదొంగ’, ‘డ్రైవర్ రాముడు’, ‘కొండవీటి సింహం’, ‘జస్టిస్ చౌదరి’ వంటి భారీ హిట్స్ ఇవ్వడం ఎన్.టి.ఆర్‌ను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్‌కు చేర్చింది. అదే సమయంలో దాసరి ‘సర్దార్ పాపారాయుడు’, ‘బొబ్బిలిపులి’ తీసి ఎన్.టి.ఆర్ కెరీర్‌ని పతాక స్థితికి తీసుకెళ్లారు. ఇక సినిమాల్లో చేయాల్సింది ఏమీ మిగల్లేదు అని అనిపించే స్థితి. ఎన్.టి.ఆర్ జనం గురించి ఆలోచించిన సమయం. ఆయన రాజకీయ ప్రవేశంతో తెలుగు తెర పగటి తీక్షణతను, రాత్రి వెన్నెలను ఒక మేరకు కోల్పోయింది. కాని మహా నటులకు కూడా పరాజయాలు ఉంటాయి. వాటిని దాటి రావడమే కళాకారులు చేయవలసిన పని అని ఎన్.టి.ఆర్ కెరీర్ చూసినా అర్థమవుతుంది. ఎన్.టి.ఆర్ నటించిన ‘చంద్రహారం’, ‘కాడెద్దులు – ఎకరం నేల’, ‘చిన్ననాటి స్నేహితులు’, ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’, ‘పల్లెటూరి చిన్నోడు’, ‘అమ్మాయి పెళ్లి’, ‘అక్బర్ సలీం అనార్కలి’, ‘సతీ సావిత్రి’, ‘శ్రీరామ పట్టాభిషేకం’, ‘రాజపుత్ర రహస్యం’, ‘సామ్రాట్ అశోక’, ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ వంటి భారీ అపజయాలు ఉన్నాయి. కాని ఈ అపజయాలు చూసిన ఎన్.టి.ఆర్ సినిమా కథ గ్రామర్‌లో ఇమడని ‘బ్రహ్మంగారి చరిత్ర’ను సినిమాగా తీసి సూపర్‌హిట్ సాధించడం మరచిపోరాదు. ‘నర్తనశాల’ లో బృహన్నలగా వేసి మెప్పించడమూ సామాన్యం కాదు. అయితే ఎన్.టి.ఆర్‌లోని నిజమైన ఆర్టిస్టును పట్టుకున్న సినిమాలు ఆయనకు దొరికినట్టేనా? ఆయన తనలోని నటుడిని పరిపూర్ణంగా ప్రదర్శించగలిగాడా? చెప్పలేము. కమర్షియల్ సినిమా ఆయన ప్రతిభకు పరిమితులు విధించిందనే చెప్పాలి. ఎన్.టి.ఆర్ చూడగానే సంతోషం వేసే నటుడు. ఆయన రిక్షా వెనుక బొమ్మగా ఉన్నాడు. పూజగదిలో దేవుని క్యాలెండర్‌గా కూడా ఉన్నాడు. దశాబ్దాల పాటు కోట్లాది మంది కష్టాలను కొన్ని గంటల పాటు మరిపించగలిగాడాయన. ఆయన పేరును తెలుగుజాతి పదే పదే తలుస్తుంది. గౌరవంతో కొలుస్తుంది. ఎన్.టి.ఆర్ అమరుడు. -
రారాకి నూరేళ్లు
తెలుగువాక్యం గుడిపాటి వెంకట చలం చేతిలో ఎంత సౌందర్యాన్ని సంతరించుకుందో, భాష, భావ వ్యక్తీ కరణ ఎంత జీవకళతో నిలిచి మెలి గాయో, ౠ–రాచమల్లు రామ చంద్రా రెడ్డి చేతిలో తెలుగు సాహిత్య విమర్శ కూడా పదునుదేలి, అంత శక్తి మంతమైన మారణాయుధమై కవులూ, రచయితల గుండెల్ని చీల్చి వేసింది. రారా ఒక్కమాట అన్నాడూ అంటే అది గుచ్చుకుని తీరుతుంది. కొరడా లాంటి విమర్శతో కొట్టిన దెబ్బ కొన్ని దశా బ్దాలు గుర్తుండి పోతుంది. ఆయన కటువైన మాట, తట్టుతేలు తుంది కొట్టినచోట ! ‘ఈ సమాజం ఎంత పాడయిపోయినా, దిగంబరులు రాసిందాన్ని కవిత్వం అనేంతగా దిగజారి పోయిందా?’ అంటాడు. అంతేనా? ‘అన్ని బూతులు రాసిన చేతుల్తో ఆ దిగంబరులు అన్నం ఎలా తింటారో?’ అనీ అన్నాడు. దాంతో దిగంబర కవిత్వం కొత్త విప్లవదారులు వేస్తోందని ఎగిరెగిరిపడుతున్న వాళ్ళ నోళ్లు పడిపోయాయి. సాహిత్యంలో తేడా వస్తే కత్తి దూసి నరుకుతాడు రారా. నిలు వెల్లా నిజాయతీ నిండిన మనిషి. గొప్ప స్నేహితుడు. దయా ళువు. ఆప్యాయంగా పలకరించి ఆదరించే వాడాయన. అది 1977 జూలై నెల. ‘ఈనాడు’లో ట్రైనీ సబ్ ఎడిటర్‌గా జాయిన్ అయ్యాను. నాలాంటి 30 మందికి అనువాదం నేర్పించే గురువు రారా. తెల్లచొక్కా, ప్యాంటూ, మెరిసే బట్ట తల, నల్లగా బక్కపల్చగా, సాధారణమైన మధ్యతరగతి మనిషి. ఆయన ఎంత ప్రజ్ఞావంతుడో మాలో ముగ్గురికి మాత్రమే తెలుసు. మాస్కో ‘ప్రగతి ప్రచురణాలయం’లో ఆరేళ్ళు అనువాదకుడిగా ఉండి 1976లోనే ఆయన ఇండియా వచ్చారు. రారా విమర్శ వ్యాసాల సంపుటి ‘సారస్వత వివేచన’ తెలుగు సాహితీ లోకాన్ని నివ్వెర పరిచింది. దానికి ఆర్టిస్ట్ మోహన్ కవర్ పేజీ వేయడం వల్ల ఆ పుస్తకాన్ని అప్పటికే చదివి ఉన్నాను. కెరటాల్లాంటి వాక్యాలు. ఊపిరి సలపనివ్వని శైలి. గురజాడ, చలం, శ్రీశ్రీ, తిలక్, మహీధర లాంటి వాళ్ళ రచనలపై రారా పొగడ్త, విమర్శ మనల్ని కట్టిపడేస్తాయి. ‘‘మహాను భావుడు చలం’’ అంటూనే ఆయన లోపాల్ని ఎండ గడతాడు. శ్రీశ్రీ కవిత్వానికి వక్రభాష్యాలు చెప్పాడంటూ అద్దేపల్లి రామ్మోహనరావుని తిడుతూ, ‘‘ఆయన అజ్ఞానాంధ కారాన్ని ఛేదించే ఆయుధం నా దగ్గర లేదు. ఇది చదివి ఒకవేళ ఆయన ఆత్మహత్యాయత్నం చేస్తే దానికి నేను బాధ్యుణ్ణి కాను’’ అన్నారు రారా. ‘ఈనాడు’లో అనువాదం కోసం మాకందరికీ ‘హిందూ’ పేపర్లు ఇచ్చేవాళ్ళు. బేనర్ ఐటం ఎక్కువగా ప్రఖ్యాత జర్నలిస్టు జి.కె. రెడ్డిది ఉండేది. ఆయన హైఫ్లోన్ ఇంగ్లీష్‌లో ఢిల్లీ రాజకీయాలు రాసేవాడు. ‘‘ఆ జీకె రెడ్డి పాండిత్య ప్రకర్ష మన కొద్దు గానీ, దాని తర్వాత ఉన్న ఐటం ట్రాన్స్‌లేట్ చేయండి ’’ అనేవారు రారా. వార్తంటే సూటిగా, స్పష్టంగా ఉండాలనీ, పాండిత్య ప్రదర్శన అవసరం లేదనీ చెప్పినట్టేగా! ఒకరోజు ‘ఈనాడు’ ఎడిటోరియల్ సెక్షన్లో షిఫ్ట్ ఇన్‌ఛార్జి సీట్లో కూర్చుని ఉన్నారు రారా. ఆ రోజు పేపర్ ఆయనే తీసుకు రావాలి. ‘హిందుస్తాన్ టైమ్స్’ ఇంగ్లీషు పేపర్లో ఒక అరపేజీ వ్యాసం నాకు ఇస్తూ, ‘‘చదివి కుదించి రాయి’’ అన్నారు. కోకా కోలా కంపెనీ ఇండియాలో చేస్తున్న అక్రమాల గురించిన వ్యాసం అది. రాశాను. రారా నా ఐటం చదివి, కరెక్ట్ చేశారు. ‘‘కోకాకోలా మాయాజాలం’’ అని చివరి పేరాకి నేను పెట్టిన చిన్న సబ్హెడ్డింగ్ని గ్రీన్‌ఇంక్ పెన్‌తో కొట్టేశారు. నా ప్రాణం చివుక్కుమంది. అందులో తప్పులేదు. చిన్న రిథం కూడా ఉంది కదా! తర్వాత రారా మరో కాగితం తీసుకుని దాన్నే పెద్ద హెడ్డింగ్‌గా పెట్టారు. నా ఆనందం ఇక చెప్పేది కాదు. మర్నాడు ‘ఈనాడు’లో అది పెద్ద వార్తగా వచ్చింది. మా అందరినీ అనువాదం చేయమని, రారా నెమ్మదిగా సిగరెట్ తీసి వెలిగించేవారు. యాష్‌ట్రేలో వేసిన అగ్గిపుల్ల పూర్తిగా కాలి పోయేదాకా తదే కంగా చూస్తూ ఉండేవారు. తక్కువ మాటలు... చాలా ప్రశాంతంగా ఉండే మనిషి. ఏమైనా చెప్పాలంటే హాయిగా, నవ్వుతూ వివరించేవారు. చలాన్నీ, తిలక్‌నీ ఉతికి ఆరేసింది ఈయనేనా అని ఆశ్చర్యం నాకు ! ఒకరోజు రారాని అడిగాను. ‘సోవియట్‌లో చాలా ఏళ్ళు ఉన్నారుగా, ఆ సమాజం ఎలా ఉంది?’ అని. ‘‘అదే గనక మనం కోరుకునే సోషలిజం అయితే ఆ సోషలిజం నాకొద్దు’’ అన్నారాయన. ‘అంటే?’ అన్నాను. ‘‘నాలుగు బ్రెడ్డు ముక్కలకీ, బంగాళా దుంపలకీ అంతంత క్యూలేమిటో నాకెప్పటికీ అర్థం కాదు ’’ అన్నారు. ఆ ఆరేడు నెలల్లో రారా మాలో ఎవర్నీ విసుకున్నదీ, కోప్పడిందీ లేనే లేదు. బిడ్డల తెలీనితనాన్ని మన్నించే తండ్రి లాగే ఉండేవాడు. రావిశాస్త్రి షష్టిపూర్తి సంచిక (జూలై 30)కి రారా రాసిన వ్యాసానికి, ‘గ్యాలరీ కోసం రాస్తున్నారా?’ అని శీర్షిక పెట్టారు. ‘అదేమిటి... రారా మిమ్మల్ని అంతమాట అన్నాడు’ అని మిత్రులు రావిశాస్త్రితో అంటే, ‘డోన్ట్ ప్లే టు ద గ్యాలరీ అన్నాడు. అందులో తప్పేముంది?’ అన్నారు శాస్త్రిగారు. రారాకి బాగా పేరు తెచ్చిన మరో పుస్తకం ‘అనువాద సమస్యలు’. 1988లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందింది. అందులో అనేకమంది స్రముఖుల తప్పుల్ని ఎతి ్తచూపుతూ రారా చేసిన కామెంట్లు చదివి తీరాలి. తెలుగులో అనువాదం మీద వచ్చిన సాధికారికమైన పుస్తకం అది. ‘ట్రాన్స్ లేషన్ ఈజ్ లైక్ ఎ మిస్ట్రెస్ – ఇఫ్ ఫెయిత్ఫుల్, ఇటీజ్ నాట్ బ్యూటిఫుల్. ఇఫ్ బ్యూటిఫుల్, ఇటీజ్ నాట్ ఫెయిత్ఫుల్ – అనే ఒక ఫ్రెంచి నానుడిలో మొదలవుతుందా పుస్తకం. ఓ ఇంగ్లీషు వాక్యాన్ని అనువదించడంలో వీరేశలింగం పంతులుగారు చేసిన తప్పును కూడా రారా పట్టుకున్నాడు. ఎంతటివాళ్లు చేసిన తప్పునైనా రారా క్షమించడు. అదే ఆయన ప్రత్యేకత. ఆయన ఔన్నత్యం. ∙ కడప జిల్లా, సింహాద్రిపురం మండలం, పైడిపాలెంలో రా.రా. 1922 ఫిబ్రవరి 28న జన్మించారు. ఈ రోజు ఆ మహాను భావుడి శతజయంతి. ఇంటర్ తర్వాత రారా మద్రాసులోని గిండీ ఇంజనీరింగ్ కాలేజీలో చేరారు. అక్కడ 1941లో గాంధీజీ నిరాహార దీక్షకు మద్దతుగా ఇంజనీరింగ్ విద్యార్థులు సమ్మె చేశారు. తర్వాత క్షమాపణ చెప్పుకున్నవాళ్ళని తిరిగి చేర్చు కున్నారు. ‘క్షమాపణ చెప్పం’ అన్న రారానీ, చండ్ర పుల్లారెడ్డినీ కాలేజీ నుంచి బహిష్కరించారు. అదే తెలుగు సాహిత్యానికి గొప్ప మేలు చేసింది. 1955లో నాటి కమ్యూనిస్టు నాయకుడు గజ్జెల మల్లారెడ్డికి పులివెందుల నియోజక వర్గంలో రారా ఎలక్షన్ ఏజెంట్‌గా ఉన్నారు. 1960లో రారా కథా సంకలనం ‘అలసిన గుండెలు’ అచ్చయింది. గొప్ప కథకుడిగా రారాకి గుర్తింపు రాలేదు. అయితే కొడవటిగంటి కుటుంబ రావు ఆ కథల్ని మెచ్చుకున్నారు. నిరంతర అధ్యయనంలో రారా మార్క్సిస్టు విమర్శకు నిగా రాటుదేలారు. ఇంగ్లీషు భాష మీద గట్టి పట్టు ఉన్న రారా యూరోపియన్ సాహిత్యాన్ని బాగా చదివేవారు. సన్నిహిత మిత్రులైన మల్లారెడ్డి, వై.సి.వి. రెడ్డి కవిత్వాన్నీ ఆయన విమ ర్శించేవారు. ఎక్కడన్నా రారా గానీ, సాహిత్యం మాటొస్తే ఎంతటి వాణ్ణయినా పోరా అనేవాడు! అందుకే రారాని శ్రీశ్రీ ‘హార్ట్లెస్ క్రిటిక్’ అన్నాడు. ‘విశా లాంధ్ర’లో సబ్ ఎడిటర్‌గా కొంత కాలమే ఉండగలిగారు. రారా సంపాదకత్వంలో 1968 ఏప్రిల్‌లో ‘సంవేదన’ మొద లైంది. ఆ త్రైమాసిక తెలుగు సాహిత్య రంగాన్ని ఒక కుదుపు కుదిపింది. కడపలో జరిగిన ‘సంవేదన’ ఆవిష్కరణ సభకు శ్రీశ్రీ, కొ.కు. హాజరయ్యారు. అయితే ‘సంవేదన’ ఏడు సంచికలే వచ్చాయి. 1970లో రారా మాస్కో వెళ్లిపోవడంతో పత్రిక ఆగిపోయింది. ‘సంవేదన’ తర్వాత అలాంటి ప్రామా ణికమైన సాహిత్య పత్రికని ఎవరూ తీసుకురాలేక పోయారు. మాస్కో నుంచి వచ్చాక , ‘ఈనాడు’లో చేరిన రారా సంపాద కీయాలు రాశారు. ఊపిరి తిత్తుల వ్యాధి వల్ల ఆరోగ్యం క్షీణించింది. 1988లో నవంబరు 24న ఆయన తుదిశ్వాస విడిచారు. రారా అంతటి ప్రతిభా సంపన్నుణ్ణి పట్టించుకునే దిక్కు లేకపోయింది. కమ్యూనిస్టు పార్టీ, విశ్వవిద్యాలయాలూ తమకేమీ పట్టనట్టే ఉండిపోయాయి. సన్మానాలూ, శాలువలూ, పూలదండలూ అంటే ఎంత హేళనో ఆయనకి! ఎంత కటువైన విమర్శ చేసినా, గొప్ప హాస్య దృష్టితోనే చాచికొట్టేవాడు. మార్క్స్, ఎంగెల్స్ రచనలు, సోవియెట్ సాహిత్యాన్ని ఏళ్ళ తరబడి అనువాదం చేశాడు. శతజయంతి సందర్భంగా రారాని తలుచుకోవడం అంటే తెలుగు సాహిత్య విమర్శని ఆకాశ మార్గాన నడిపించిన పురుషోత ్తమునికి ఒక నమస్కారం పెట్టుకోవడమే! నిక్కచ్చిగా, నిజాయితీగా చేసిన నిఖార్సయిన విమర్శకి తలవొగ్గి వినమ్రంగా ప్రణమిల్లడమే! చివరిమాట... ‘భారతీయ సాహిత్య నిర్మాతలు’ సిరీస్‌లో కేంద్ర సాహిత్య అకాడెమీ రారా జీవితచరిత్రను 2006లో ప్రచురించింది. రచయిత తక్కొలు మాచిరెడ్డి. బాగుంటుంది. వీలైతే, 1988 నవంబర్ 25, 26 తేదీల్లో రారాకి నివాళిగా ‘ఉదయం’ దినపత్రికలో కె.ఎన్.వై. పతంజలి సంపాదకీయం రాశారు. గొప్పగా ఉంటుంది. వీలైతే చదవండి. వ్యాసకర్త: తాడి ప్రకాష్ సీనియర్ జర్నలిస్ట్ ‘ 9704541559 -
తెలంగాణ వైతాళికులు: నూకల నరోత్తమ్‌రెడ్డి
తెలంగాణ సమాజ చైతన్యానికి, వికాసానికి కృషి చేసిన మహానుభావుల్లో నూకల నరోత్తమ్‌రెడ్డి ముఖ్యులు. అరుదైన బహుముఖ ప్రజ్ఞ ఆయన సొంతం. నిరాడంబరంగా ఉండే నిశ్చల, నిశ్శబ్ద కార్యదక్షుడాయన. జనహితంలో చిన్న పనిచేసినా పెద్దగా ప్రచారం పొందడానికి ఎన్నో పాట్లు పడే మన వ్యవస్థలో.. ఏమాత్రం ప్రచారయావ లేకుండా , ప్రతిఫలాపేక్ష చూపకనే వివిధ రంగాలు, వర్గాల ప్రజలకు అపార సేవలు అందించిన మహనీయుడు. జర్నలిజం, సాహిత్యం, సాంస్కృతికం, క్రీడలు, విద్య, పరిపాలన, రాజకీయం... ఇలా ఎన్ని రంగాలో? కాలూనిన ప్రతిచోటా తనదైన ముద్రవేసిన ఆయన సామర్థ్యం గురించి వింటే ఎవరికైనా విస్మయమే! ఓ మనిషి, ఒక జీవిత కాలంలో ఇన్ని పనులు, ఇంత సమర్థంగా చేయడం అరుదు. అదీ మచ్చలేని రీతిలో పలువురు ప్రశంసించేలా నిర్వహించడం అసాధారణం. కానీ, నరోత్తమ్‌రెడ్డి తెలుగువారు మరచిపోని విధంగా ఆ కృషి చేసి చూపించారు. మహబూబాబాద్‌కు చెందిన ఆయన తెలంగాణ వైతాళికుల్లో ఒకరు. జర్నలిజం చదివి, దేశ స్వాతంత్య్రపు రోజుల్లో ముంబాయిలో నాటి ‘బొంబాయి క్రానికల్’కు పనిచేస్తున్నారు. సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక సంపాదకత్వం నుంచి తప్పుకున్నపుడు, కొత్వాల్ రాజ బహుదూర్ వెంకట్రామారెడ్డి సూచన మేరకు నరోత్తమ్‌రెడ్డి హైదరాబాద్ వచ్చి సదరు బాధ్యత చేపట్టారు. అలా.. గోల్కొండ సంపాదకులుగా (20 ఏళ్లు), రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా (10), ఆంధ్ర సారస్వత పరిషత్తు (నేటి తెలంగాణ సారస్వత పరిషత్తు) కోశాధికారిగా, చైర్మన్‌గా (30), లలిత కళా అకాడమీ చైర్మన్‌గా (25), రాజా కృష్ణదేవరావ్ పేరిట ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ సంస్థ విద్యాకమిటీ నేతృత్వంలో (15), బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ చైర్మన్‌గా (10), ఉస్మానియా విశ్వవిద్యాలయం సిండికేట్ సభ్యుడిగా, ఉప కులపతిగా కలిపి (20 ఏళ్లు) ఇలా, కొన్నిమార్లు ఏక కాలంలో వేర్వేరు బాధ్యతలూ నిర్వహించి నాయ కత్వానికి తానొక ప్రతీకగా నిలిచారు. ఇంకోరకంగా చెప్పాలంటే... బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం అన్నీ కలగలిపిన 63 ఏళ్ల పరిపూర్ణ జీవితంలో అంతకు రెట్టింపు కంటే ఎక్కువ సంవత్సరాలు, సుమారు 130 ఏళ్ల (వేటికవిగా లెక్కిస్తే!) క్రియాశీల జీవితం గడిపిన ధన్యజీవి! పార్లమెంటు సెషన్ నడుస్తున్నా.. విధిగా హైదరాబాద్ వచ్చి సమావేశాలకు హాజరయ్యే ఉస్మానియా విశ్వవిద్యాలయం, సారస్వత పరిషత్తులు ఆయన జీవితంలో అవిభాజ్య అంగాల య్యాయి. ఆయన చొరవవల్లే ఉస్మానియాలో జర్నలిజం విభాగం ఏర్పడింది. ఉద్యోగాల్లో ఉన్నవారు తీరిగ్గా ఉండే సాయం వేళల్లో చేసుకోవడానికి వీలుగా ఎంబీఏ, లా కోర్సులు తీసుకురావడంలోనూ ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమాలతో, స్పర్థలతో ఓయూ ప్రాంగణం మూడేళ్లు కల్లోలితమై 300 మందికి పైగా అసువులు బాశారు. విద్య–విద్యార్థులు చెల్లా చెదురైనపుడు ‘సాంత్వనకు ఓ కులపతి‘ అని సమాజమే కోరి తెచ్చుకున్న ఘనాపాటి! నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తెలుగునాట చేసిన ప్రసంగాలకు వేదికలపై అనువాదకుడిగా ఉండేవారాయన. ముఖ్యమంత్రులు సంజీవయ్య, పీవీ నర్సింహారావు, ప్రధానమంత్రులు నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి అత్యున్నత వ్యక్తులతో సాన్నిహిత్యం ఉన్నా, పెరట్లో పనిచేసే తోటమాలికి కూడా సముచిత గౌరవం ఇచ్చే సమున్నత వ్యక్తిత్వం ఆయనది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన నూకల నరోత్తమ్‌రెడ్డిని, ఆయన శతజయంత్యుత్సవాలు జరుపుకుంటూ స్మరించు కోవడమంటే, మనని మనం గౌరవించుకోవడం. ఆయన బహుముఖ ప్రజ్ఙను భావితరాలకు వారసత్వ సంపదగా పదిలపరిచి, పంపిణీ చేయడం. తెలుగు నాట తరాలతరబడి చైతన్యం రగిలించే స్ఫూర్తిని మరింత పరివ్యాప్తం చేయడం. ఆయన విశేష ప్రతిభ చూపిన సాహిత్యం, జర్నలిజం, లలితకళలు, క్రీడలు, విద్య, పాలన, రాజకీయాలకు సంబంధించి కనీసం ఒక్కోటి చొప్పున ఏడాది పొడుగునా కార్యక్రమాలు నిర్వహించాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఇదొక గొప్ప సందర్భం. – సవ్యసాచి (మార్చి 27న నూకల నరోత్తమరెడ్డి శతజయంత్యుత్సవాలు ప్రారంభం) -
ఇస్రో హీరో..
భారత అంతరిక్ష ప్రయోగాలంటే టక్కున గుర్తుకు వచ్చేది విక్రమ్ సారాభాయ్.. ఆ తర్వాత ప్రొఫెసర్ సతీష్ ధవన్. వీరు ఆనాడు వేసిన పునాదులే నేడు మన దేశాన్ని అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో అంతర్జాతీయంగా ఎంతో ఎత్తున నిలిపాయి. సౌండింగ్ రాకెట్ల నుంచి భారీ రాకెట్లను నింగిలోకి పంపడమే కాకుండా మంగళయాన్, చంద్రయాన్ లాంటి భారీ ప్రయోగాలు చేసి అగ్రదేశాల సరసన భారత్ నిలవడంలో సతీష్ ధవన్ చేసిన కృషి ఎంతో ఉంది. ఆయన శకం ఇస్రోకు మార్గదర్శకం.. ఆదర్శనీయం. నేడు ధవన్ శత జయంతి సందర్భంగా జ్ఞాపకాలు స్మరిద్దాం. సాక్షి, శ్రీహరికోట(సూళ్లూరుపేట): అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే కాదు.. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ నెలకు కేవలం ఒక్క రూపాయి జీతం తీసుకుని అందరికీ ఆదర్శవంతంగా నిలిచారు సతీష్ ధవన్. ఇస్రో తొలినాళ్లలో చిన్న తరహా రాకెట్ ప్రయోగాలకు పరిమితమైంది. భవిష్యత్‌లో పెద్ద పెద్ద ఉపగ్రహాలను రోదసీలోకి పంపి దేశ ప్రజలకు అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని సతీష్ అనుక్షణం పరితపించారు. ఆయన ఆనాడు చేసిన ఆలోచనల్లో నుంచి పుట్టినవే పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ రాకెట్లు. ఇవి తయారు చేయడానికి ఆయన ఆధ్యర్యంలో ఎన్నో ప్రయోగాత్మక పరీక్షలు చేసి విజయం సాధించారు. వాజ్‌పేయితో (ఫైల్) ♦1920 సెప్టెంబర్ 25న శ్రీనగర్‌లో ధవన్ జన్మించారు. విద్యార్థిగా అత్యంత ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించారు. ♦మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రులై, ఉన్నత విద్య నిమిత్తం అమెరికాకు వెళ్లారు. అలాగే ఈయన ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్ చేశారు. ♦1951లో స్వదేశానికి వచ్చిన వెంటనే బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో అధ్యాపకుడిగా చేరిన అనతికాలంలోనే పదోన్నతి పొందారు. ♦1962లో ఆ సంస్థకు డైరెక్టర్ అయ్యారు. ♦1972లో అంతరిక్ష పితామహులు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ మరణానంతరం ఇస్రోను ముందుకు నడపగలిగిన వ్యక్తిగా ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆ బాధ్యతలను ధవన్‌కు అప్పగించారు. ♦బెంగళూరు ఐఐటీకి డైరెక్టర్‌గా కొనసాగుతూనే ఇస్రో చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తూ నెలకు ఒక్క రూపాయి జీతంగా తీసుకున్న గొప్పవ్యక్తిగా ఆయన గురించి ఈ నాటికి చెప్పుకోవడం విశేషం. ఇందిరాగాందీతో సతీష్ ధవన్ (ఫైల్) ♦సమాచార వ్యవస్థ, వాతావరణ పరిశోధన, భూమిలో దాగి ఉన్న ఖనిజసంపద ఉనికిని తెలుసుకోవడం కోసం బహుళ ప్రయోజనాలకై సొంతంగా ఉపగ్రహాలను తయారుచేసి ప్రయోగించాలనే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ కన్నకలలను ధవన్ నిజం చేశారు. ♦ఇస్రో చైర్మన్ అయిన అనతికాలంలోనే మన తొలి ఉపగ్రహం ఆర్యభట్ట, భాస్కర, యాపిల్ ఉపగ్రహాలను నిర్మించి ఎస్ఎల్వీ ఉపగ్రహవాహకనౌక ద్వారా ప్రయోగించగలిగారు. ఇన్శాట్, ఐఆర్ఎస్, తరహా ఉపగ్రహాల నిర్మాణ ప్రణాళికలు తయారు చేశారు.. ♦భారత అంతరిక్ష పరిశోధనాయాత్రలో ఆయన శకం ముఖ్యమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. ♦పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఆయన దేశ అంతరిక్ష రంగానికి విశేష సేవలు అందించారు. 2002 సంవత్సరంలో జనవరి 3వ తేదీన తుదిశ్వాస విడిచారు. ♦ఆయన పేరును మరిచిపోకుండా శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి 2002 సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌గా నామకరణం చేసి ఇస్రో ఘనమైన నివాళిని అర్పించింది. ♦షార్‌లోని రెండోగేట్కు అవతల వైపున సతీష్ ధవన్ విగ్రహాన్ని ఏర్పాటుచేసి దానికి సతీష్ ధవన్ మెమోరియల్‌గా నామకరణం చేసి ఆయన పట్ల భక్తిభావాన్ని చాటుకుంది ఇస్రో. ఐకే గుజ్రాల్‌తో (ఫైల్) అవార్డులు ♦1981లో పద్మవిభూషణ్ అవార్డు, ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అవార్డు, కాలిఫోరి్నయా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు ఇచ్చిన పురస్కారాలను స్వీకరించారు. ఆయన హయాంలో పలువురు ప్రధానమంత్రులు షార్కు విచ్చేసి ప్రయోగాలను వీక్షించారు. ముఖ్య ఘట్టాలు ♦నేడు పీఎస్ఎల్వీ రాకెట్ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి చెందిందంటే అది ఆనాడు సతీష్ ధవన్ చేసిన కృషి ఫలితమే. ♦భారత తొలి అంతరిక్ష పితామహుడిగా విక్రమ్ సారాభాయ్ పేరుగాంచారు. ఆయన కన్న కలలను సాకారం చేసిన వ్యక్తిగా ప్రొఫెసర్ సతీష ధవన్ నిలిచారు. ♦ధవన్ భారీ రాకెట్లు, ఉపగ్రహాలు తయారు చేసి గ్రహాంతర ప్రయోగాలే చేసే స్థాయికి ఇస్రోని తీసుకువెళ్లారు. ♦ఇస్రో ప్రయోగించిన సమాచార ఉపగ్రహాలతో అనేక గ్రామాల్లో టెలివిజన్ ద్వారా దూరవిద్య సదుపాయాన్ని (టెలీ ఎడ్యుకేషన్) కల్పించారు. ఈ అనుభవం భారత జాతీయ సమాచార ఉపగ్రహ వ్యవస్థకు ఎంతో దోహదపడి సమాచార రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ♦ఆనాడు ఆయన వేసిన పునాదులతో నేడు సమాచార రంగంలో కొత్త ఒరఒడిని సృష్టిస్తున్నాం. -
నేడు ప్రతిభాశాస్త్రి శతజయంతి
తెలుగు సినిమాల నిర్మాణ కార్యక్రమానికి ఒక క్రమబద్ధమైన రూపునిచ్చిన వ్యక్తిగా ఖ్యాతిగడించిన టి.వి.యస్.శాస్త్రి శత జయంతి నేడు. జూన్ 8, 1920న కృష్ణాజిల్లా గొడవర్రులో జన్మించిన ఆయన 1940లో కొందరు మిత్రులతో కలసి కె.యస్.ప్రకాశరావు, జి.వరలక్ష్మి హీరోహీరోయిన్లుగా సినిమా తీద్దామని ముంబాయి Ðð ళ్లారు. ఒక పాట రికార్డింగ్‌తో ఆ సినిమా ఆగిపోవడంతో అక్కడే నాటి హిందీ నటుడు మజర్‌ఖాన్ సినిమా కంపెనీలో జనరల్ మేనేజర్‌గా చేరారు. కె.యస్.ప్రకాశరావు కోరిక మేరకు ‘ద్రోహి’ చిత్రనిర్మాణ వ్యవహారాలు చూడటానికి చెన్నై వచ్చారు శాస్త్రి. ఆ తర్వాత ఘంటసాల బలరామయ్యగారి ప్రతిభా సంస్థలో చేరారు. దాంతో ఆయన ‘ప్రతిభా’శాస్త్రిగా పాపులర్ అయ్యారు. అక్కడ ఉన్నప్పుడే ఆయనకు అక్కినేని నాగేశ్వరరావు సన్నిహిత మిత్రులయ్యారు. 1959లో వాసిరెడ్డి నారాయణరావుతో కలసి శాస్త్రి ‘జయభేరి’ చిత్రం నిర్మించారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన హిందీ చిత్రాలకు అసోసియేట్ ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించారాయన. 2007 డిసెంబరు 20న ప్రతిభా శాస్త్రి మృతి చెందారు. -
స్వతంత్ర మేధావి హృదయ సంస్కర్త
(పొట్లపల్లి శతజయంతి ఉత్సవాల ప్రారంభం. నేడు 10 గంటలకు ఓ.యూ.లోని ప్రొ‘‘ జి.రాంరెడ్డి దూరవిద్యా కేంద్రం ఆడిటోరియంలో జాతీయ సదస్సు జరగనుంది.) పొట్లపల్లి రామారావు స్వభావ రీత్యా రాజకీయ జీవి కాదు. రాజకీయ ప్రమేయం వున్న అనుబంధ సాహిత్య సంస్థల్లో ఆయనకి ప్రత్యక్ష భాగస్వామ్యం లేదు. అయితే ప్రజోపయోగకరమైన రాజకీయాల గురించీ, సంక్షేమ రాజ్యం గురించీ పొట్లపల్లికి స్పష్టమైన వైఖరి వుందని చెప్పడానికి ఆయన జీవించిన జీవితం, సృజించిన సాహిత్యమే ప్రబలమైన సాక్ష్యాలు. ‘కీర్తి ప్రతిష్ఠలు, దానం, యిలాంటి క్షుద్రత్వాలను, అల్పత్వాలను అన్నీ తొలగించివేయి. రచన కోసరం సర్వస్వం త్యాగం చేయనిదే రచనలు సృష్టి కావు’ (నాలో నేను) అని నమ్మిన పొట్లపల్లి రామారావు ప్రధానంగా సాహిత్య జీవి. స్వేచ్ఛా లాలసుడు. ఆదర్శ భావుకుడు. హృదయ సంస్కర్త. ఆత్మ విమర్శకుడు. రామారావు వ్యక్తిత్వం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వొదగదు. రాజకీయ ప్రమేయం వున్న అనుబంధ సాహిత్య సంస్థల్లో ఆయనకి ప్రత్యక్ష భాగస్వామ్యం లేదు. అందువల్ల యే సంస్థా ఆయన్ని భుజానికెత్తుకోలేదు. ప్రజోపయోగకరమైన రాజకీయాల గురించీ, సంక్షేమ రాజ్యం గురించీ పొట్లపల్లికి స్పష్టమైన వైఖరి వుందని చెప్పడానికి ఆయన జీవించిన జీవితం, సృజించిన సాహిత్యమే ప్రబలమైన సాక్ష్యాలు. కవిత్వంలో కాళోజీకీ, కథారచనలో వట్టికోటకీ సమవుజ్జీ పొట్లపల్లి. ముగ్గురూ రెండో తరానికి చెందిన తెలంగాణ సాహిత్య వైతాళికుల్లో ఆకాశమంత యెత్తు నిలిచిన త్రినగాలు. ముగ్గురూ సమవయస్కులే కాదు; సమస్కంధులు కూడా. ఒకరి ఆత్మని మరొకరు పట్టుకున్నవారు. ఒకే గంగ త్రిపథగ అయినట్టు ముగ్గురూ తమ తమ ప్రత్యేకతల్తో తెలంగాణ ప్రజా జీవన క్షేత్రాల్లోకి ప్రవహించారు. ‘పొట్లపల్లి రామారావు ప్రపంచ పౌరుడు. అతడు విశ్వకుటుంబి. రంగు రూపు దేశం వేషం భాష సంస్కృతి మొదలగువాటి పేర పాటించబడే విభేదాలేవి పాటించేవాడు కాడు. మానవునిలోని ఆత్మీయతను పెంపొందించి విశ్వమానవ సౌభ్రాతృత్వం నెలకొల్పితేనే కానీ ప్రపంచశాంతి చేకూరదని అతని దృఢ విశ్వాసం’ అని (ఆత్మ నివేదనం ముందుమాటలో) కాళోజీ చెప్పిన మాటలు అక్షర సత్యాలు. తొలినాళ్ళలో పొట్లపల్లి రాసిన ‘ఆత్మ నివేదన’ కవిత్వం అభ్యుదయ భావాలతో నిండి వుంది. కష్టజీవుల శ్రమ లేకుంటే ప్రభువుల భోగాలు లేవని మార్క్సిస్టు తత్త్వశాస్త్ర సారాన్ని తేలిక మాటల్లో సూత్రీకరించాడు. సంపన్న భూస్వామ్య కుటుంబంలో పుట్టి ఫ్యూడల్ దోపిడిని పెదాలపై అమలయ్యే హింసని దగ్గరగా చూసి చలించిన రామారావు శ్రమ విలువనీ శ్రమజీవుల హక్కుల్నీ స్వయంగా అర్థం చేసుకొని తన కవిత్వం కథలు నాటికల ద్వారా పాఠకులకీ ప్రేక్షకులకీ బోధపరిచాడు. ‘మనం పండించె పంటతోనె గద నరలోకం జీవి నిలబడుతున్నది. లేకుంటే వీళ్ళు పెద్ద పెద్ద బంగ్లాలల్ల కూసోని, కాగితాల మీద సిరా గీతాలు గీయంగనే పంటలు పండుతాయి?’ ‘సర్ బరాహి’ (1945) నాటికలో వెట్టి మాదిగ గొంతు రామారావుదే. ఆళ్వారు స్వామి జైలులోపల కథలకంటే చాలా ముందే రామారావు జైలు కథలు వెలికి వచ్చాయి. వట్టికోటకి జైలు అనుభవాలు రికార్డు చేయడానికి రామారావే స్ఫూర్తి కావొచ్చు. ఇద్దరి అనుభవాలు వేరుగా వుండ వచ్చునేమో గానీ క్షణికావేశంలో తెలియక తప్పులు చేసి, అసలు యే నేరం చేయక పోయినా క్రూరమైన శిక్షలు అనుభవించే అభాగ్యులైన ఖైదీల పట్ల వారి మానవీయ స్పందనలు మాత్రం వొకటే. రాజ్య స్వభావం పట్ల దాని శకార న్యాయం పట్ల పొట్లపల్లికి స్పష్టమైన అవగాహన వుందని చెప్పడానికి యెన్నో వుదాహరణలు ‘జైలు’ కథల్లో వున్నాయి. అయితే ‘చుక్కలు’ (1965) రాసేనాటికి పొట్లపల్లి ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఆ మార్పు ఆ తర్వాతి కాలపు కవిత్వంలో (అక్షరదీప్తి, 1993) సైతం కొనసాగింది. అంతర్ముఖుడై బాహ్య సంఘర్షణని పట్టించుకోకుండా తనలోకి చూసుకోవడం మొదలెట్టాకా తన తొలినాళ్ళ రాజకీయ అభిప్రాయాల నుంచి రామారావు దూరమయ్యాడని కేవీయార్ లాంటి వాళ్ళు భావించడంలో కొంత నిజం వున్నప్పటికీ కవిగా రామారావు సమాజం పట్ల తన బాధ్యతని మర్చిపోలేదు. మనిషి లోపలి బలహీనతల మీద యెక్కువ దృష్టి సారించాడు. ‘నేను చదివిన చదువులు, అధ్యయనం చేసిన శాస్త్రాలు, గడించిన అనుభవాలు ఏమీ లేవు. బడికి రాని కారణంగా పేరు తొలగింపబడి, బయటికి గెంటివేయబడ్డ విఫల విద్యార్థిని నేను. బడి నుండి గెంటివేయబడ్డ విద్యార్థులకు చెట్లు, చేమలు, కొండలు వాగులే సైదోడులుగా మిగులుతాయి. ప్రకృతితో ఏర్పడ్డ ఆ సాన్నిహిత్యం క్రమక్రమంగా ఒక విధమైన ఏకాంతంలోకి మారింది. ఏకాంతంలో తోడుగా ఉండేవి ఆలోచనలు’ అని తాను అంతర్ముఖుడు కావడానికి కారణాలు సైతం ‘చుక్కలు’లో పేర్కొన్నాడు. యీ లోచూపు పొట్లపల్లిని శుద్ధ ఆత్మవాదిగా మార్చిందని చెప్పడం తప్పే అవుతుంది. అప్పుడు కూడా మనిషిని కేంద్రంగా చేసుకొని సమాజ శ్రేయస్సునే కాంక్షించాడు. సమత్వ భావన సాధించడం కోసం మనిషి పెంపొందించుకోవాల్సిన ‘హృదయ పరిపక్వత’ గురించీ, ‘ఆత్మ వికాసం’ గురించీ ఆలోచించాడు. ఇతరుల్ని నియంత్రించే చట్టాలు కాకుండా తనను తాను నియంత్రించుకొనే చట్టాల గురించి చింతన చేశాడు. ఆ కాలంలో వొక విధంగా వర్గ సామరస్యాన్ని కోరుకున్నాడు. పీడకుల్లో పరివర్తన ఆశించాడు. ప్రజాస్వామ్య సిద్ధాంతం సఫలమవ్వాలంటే ఆత్మ నిగ్రహం ఆత్మ విమర్శల అవసరాన్ని గుర్తించాడు. ‘అట్టడుగు జనం యొక్క సంతుష్టి మీదనే దేశ క్షేమం ఆధారపడి ఉంది – పునాదులు కదిలిన ఇల్లు కలకాలం నిలవజాలదు’ అన్న నిర్ధారణ చేశాడు. ఈ ప్రజాస్వామిక భావననే పొట్లపల్లి చివరిదాకా విశ్వసించాడు. 1947లో పొట్లపల్లి రాసిన ‘సైనికుని జాబులు’ ఆయన రాజకీయ దృక్పథాన్ని తెలుసుకోడానికి నిలువెత్తు సాక్ష్యాలు. దేశాధినేతల యుద్ధోన్మాదంలో సైనికుల దైన్యాన్నీ పరాధీనతనీ నిస్సహాయతనీ గొప్ప ఆర్తితో చిత్రించాడు. సాధారణంగా అభ్యుదయ రచయితల రచనల్లో కనిపించే యుద్ధ వ్యతిరేకత శాంతి కాముకతతో పాటు పొట్లపల్లి సైనిక జాబుల్లో వుదాత్తమైన మానవీయమైన జీవన తాత్త్విక కోణాలు ఆవిష్కారమయ్యాయి. అంతేకాదు పాశ్చాత్య దేశాల భౌతిక తృష్ణ యితర దేశాల్ని సరుకుల మార్కెట్లుగా మార్చిందనీ, ప్రకృతి విధ్వంసానికి సైతం ఆ తృష్ణ కారణమౌతుందనీ 70 సంవత్సరాల పూర్వమే గుర్తించిన క్రాంతదర్శి పొట్లపల్లి. అయితే చాలామంది భావించినట్లు భారతీయ సంప్రదాయమో తాత్వికతతో ప్రపంచ శాంతికి మార్గదర్శనం చేస్తుందన్న భ్రమలు ఆయనకీ లేవు. ‘మన హిందూ వేదాంత సూక్తులతో ప్రపంచ శాంతి అనేది కల్ల. మన వేదాంతముతో మన దేశములోనే శాంతి స్థాపించుకోలేనప్పుడు ప్రపంచశాంతి అనడం కూడా సిగ్గే... భౌతిక కాంక్షా ప్రవాహములో పుడకలుగా కొట్టుకుపోవడానికి బదులు నావలమై నావికులమై మన దేశాన్ని విపదాబ్ధి నుంచి కాపాడడమే’ కర్తవ్యమని సమన్వయ దృష్టిని ప్రబోధించాడు. జాతీయోద్యమంలోని పరిమితుల్ని లోపాల్ని సైతం రామారావు గుర్తించాడనటానికి ‘పాదధూళి’ (1948) నాటిక నిదర్శనంగా నిలుస్తుంది. గాంధీని జాతీయ బూర్జువా సమాజం తమ స్వార్థానికి వాడుకున్న వైనాన్ని యీ నాటికలో యెత్తి చూపాడు. ప్రభుత్వాల అవార్డులు తీసుకొనేవారి విషయంలో తటస్థంగా వున్నా కొన్ని సార్లు ఆయనకి తెలియకుండానే వాటి పట్ల వ్యతిరేకత అసంకల్పితంగా వెలికి వచ్చేది. కాళోజీకి పద్మవిభూషణ్ ఇచ్చినప్పుడు ఇచ్చేవాడు ఎందుకిచ్చాడనేది కాదు ప్రశ్న, తీసుకొనేవాడు ఎందుకు తీసుకున్నాడు అనేదే ప్రశ్న (ఏ సవాల్ నయ్యే దేనేవాలా కైకు దియా హై , ఏ సవాల్ హై లేనేవాలా కైకు లియా హై) అని తీవ్రంగానే విమర్శించాడు. అది ఉర్దూలో అనడంవల్ల అంతగా ప్రచారంలోకి రాలేదు. రాత్రికి రాత్రి విప్లవాలు రావనీ వ్యవస్థలో మార్పులు అకస్మాత్తుగా సంభవించవనీ రామారావు నమ్మకం. తుపాకి గొట్టంలో నుండి అధికారం ఉద్భవిస్తుంది అన్న నినాదాన్ని కూడా అంగీకరించలేదు. ‘తుపాకిగొట్టంలో ఆవేశం పాలు తప్ప ఆలోచన భాగం శూన్యంగా కనిపిస్తుంది’ అని నిర్ధారిస్తాడు. ‘తుపాకి వాడి చేతిలో వుంటుందో తుపాకి చేతిలో వాడుంటాడో తెలియదు’ అన్నప్పుడు ఆయుధధారి విచక్షణాశీలి అయివుండాలన్న తాత్త్వికతని బోధించాడు. అదే సమయంలో ‘తలబరువుగా పరిణమించిన ఏ వ్యవస్థకు గాని ఏదో ఒక దశలో ప్రజలు చరమగీతం పాడక తప్పదు’ అని తీర్మానిస్తాడు. ‘ఎన్ని ప్రాణులు ఎండలో కమిలి, వానలో నాని, చలికి బిగిసి, నిద్రలు కాచి, కడుపు అంటగట్టుకొని శ్రమిస్తే ఈ అపార సంపద కూడింది ?... ఎంతమంది నిసుగులు తాగడానికి పాలులేక, సరియైన పోషణ లేక తల్లి ఒళ్లో ప్రాణాలు వదులుతున్నారో!... కళ్ళలో మెరుపు, హృదయంలో తృష్ణగల వక్తలు, తాత్వికులు, వైజ్ఞానికులు, శిల్పులు; ఎంతమంది అనామకులై పోతున్నారో! ఈ ప్రభుత్వాలు ఎన్నడైనా ఆలోచించాయా ?’( నా డైరీలో కొన్ని పేజీలు, 1945) యిదీ పొట్లపల్లి రామారావు హృదయం. అదే ఆయన రాజకీయ దృక్పథం. ఆయన సాహిత్య – జీవిత ప్రస్థానాల పొడవునా అది ఆచరణాత్మకంగా ప్రతిఫలించింది. దానికి అభ్యుదయవాదమనో సంస్కరణవాదమనో మానవతావాదమనో ప్రజాతంత్రవాదమనో యే పేరు పెడతామో, అది యే యిజాల్లోకి పదాల్లోకి యిముడుతుందో వొదుగుతుందో నిర్ణయించాల్సింది సహృదయులే. - ఎ.కె.ప్రభాకర్ 040–27761510 -
దేవులపల్లి రామానుజరావు శతజయంతి ప్రత్యేక సంచిక
(పరిచయం) తెలుగు భాషా సాహిత్యాల పరిరక్షణకు, పరివ్యాప్తికి అవిరళ కృషి జరిపిన అగ్రేసర సంస్థగా తెలంగాణ సారస్వత పరిషత్తు కీర్తినొందింది. ప్రస్తుతం తెలంగాణ సారస్వత పరిషత్తుగా పేరు మారిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు స్థల సేకరణ నుంచి, భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నుండి గ్రాంట్లు రాబట్టడం నుంచి ‘ఏకవ్యక్తి సైన్యం’గా దేవులపల్లి రామానుజరావు పనిచేశారు. 1943 నుంచి 93లో మరణించేంత వరకు అందులో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర సాహిత్య అకాడమీలో వివిధ హోదాల్లోనూ, రాజ్యసభ సభ్యునిగానూ ఆయన సేవలందించారు. కవి, వ్యాసకర్త, సంపాదకుడు అయిన దేవులపల్లి 1917లో వరంగల్ జిల్లాలో జన్మించారు. ఆయన శతజయంతి సందర్భంగా పరిషత్తు ప్రత్యేక సంచిక వెలువరించింది. ఇందులో రామానుజరావు వ్యక్తిత్వాన్నీ, సాహిత్యాన్నీ పట్టించే 35 వ్యాసాలున్నాయి. ‘పత్రికా రంగానికి ‘శోభ’ తెచ్చిన దేవులపల్లి రామానుజరావు’ పేరిట రాసిన వ్యాసంలో శోభ పత్రిక ప్రత్యేకతను సంగిశెట్టి శ్రీనివాస్ వివరించారు. ‘నేడు తెలంగాణమునకున్న ముఖ్యమైన కొఱతలలో మాసపత్రిక యొకటి’ అన్న మాడపాటి హనుమంతరావు ప్రసంగమే ప్రేరణగా రామానుజరావు 1947 ఉగాది రోజున శోభ ప్రారంభించారు. అదీ యుద్ధం వలన న్యూస్‌ప్రింట్ కొరత ఉన్న కాలంలో. మూడేళ్లు నడిపారు. ‘అప్పటివరకూ ఎక్కువగా పత్రికలూ సాహిత్యమూ హైదరాబాద్ చుట్టూతా తిరిగేది. శోభ పత్రిక ప్రధానంగా జిల్లాల నుంచి వచ్చిన రచయితలు, కవులకు అధిక ప్రాధాన్యత నిచ్చింది’. 1948లో పోలీసు చర్య అనంతరం అప్పటి వైస్ చాన్స్‌లర్ అలియావర్ జంగ్ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ‘తెలుగువాళ్లకు దక్కకుండా చేయాలనే దుర్బుద్ధితో దక్షిణాదిలో హిందీ విశ్వవిద్యాల యంగా’ మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నది రామానుజరావేనని అమ్మంగి వేణుగోపాల్ రాశారు. శృంగార కవి అంటే శ్రీనాథుడు అన్న కీర్తిని పక్కన పెట్టి, పోతన్నను శృంగారకవిగా రామానుజరావు నిరూపించిన సంగతిని మల్లెగోడ గంగాప్రసాద్ ప్రస్తావించారు. ఇంట్లో మాటల సందర్భంలో సమయానుకూలంగా ఎన్నో కొటేషన్స్ ఎన్నో గ్రంథాల నుండి ‘బాపు’ ఉటంకించేవాడని రామానుజరావు కూతురు ఎం.విమల గుర్తు చేసుకున్నారు. భూస్వామిక కుటుంబం నుంచి వచ్చినా ప్రజాస్వామికవాదిగా వ్యవహరించాడని సుంకిరెడ్డి నారాయణరెడ్డి తన అనుభవాలు పంచుకున్నారు. - సాహిత్యం డెస్క్ తెలంగాణ వైతాళికుడు డాక్టర్ దేవులపల్లి రామానుజరావు శతజయంతి ప్రత్యేక సంచిక; సంపాదకులు: ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, డాక్టర్ జె.చెన్నయ్య; వెల: 200; ప్రతులకు: తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్–1. ఫోన్: 040–24753724