ఒక నటుడు కష్టపడితే హీరో కావచ్చు. ఒక హీరో సిన్సియర్‌గా శ్రమిస్తే జనాదరణ పొందవచ్చు, బాక్సాఫీస్ హిట్లు సాధించవచ్చు. బాక్సాఫీస్ హిట్లు వచ్చిన తారలు చాలామందే ఉండవచ్చు. కానీ, ఎదిగే తన ప్రయాణంలో తాను నమ్ముకొని వచ్చిన పరిశ్రమను కూడా శిఖరాయమాన స్థాయికి తీసుకెళ్లిన మహానటులు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమలో అలాంటి ధ్రువతారక- ఎన్టీఆర్‌గా జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు నందమూరి తారక రామారావు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో తెలుగు తెరకు దక్కిన కోహినూర్ – ఎన్టీఆర్. రావడం రావడమే ఆయన హీరోగా వచ్చారు, క్లిక్ అయ్యారు. అయిదారు సినిమాలకే స్టారయ్యారు. దాదాపు 33 ఏళ్ల సినిమా కెరీర్‌లో 298 సినిమాలు చేశారు. సినీరంగం వదిలేసి, రాజకీయాల్లోకి వెళ్లాక తన కళాతృష్ణను తీర్చుకొనేందుకు మరో 4 సినిమాలు చేశారు. మొత్తం 302 సినిమాల్లో ఆయన చేసినన్ని విభిన్న సినిమాలు, వేసినన్ని వైవిధ్యమైన పాత్రలు, నట –దర్శక– నిర్మాతగా పండించినన్ని ప్రయోగాలు న భూతో న భవిష్యతి.
శ్రమతో... పరిశ్రమను పెంచిన శిఖరం
ఎన్టీఆర్ సినీరంగానికి వచ్చేసరికి తెలుగు సినీపరిశ్రమ ఏటా సగటున 10 చిత్రాలు ఉత్పత్తి చేస్తోంది. ఆయన హీరోగా సినీరంగాన్ని వదిలే నాటికి అది సగటున 100 సినిమాల స్థాయికి వచ్చింది. తెలుగు సినీ సీమ ఆ స్థాయిలో పరిపుష్టం కావడంలో ఎన్టీఆర్‌ది కీలక పాత్ర. తక్కువ సినిమాలతో ఎక్కువ సంపాదన అనే నేటి సూత్రాలకు భిన్నంగా ఆయన ఒళ్లు దాచుకోకుండా కష్టపడ్డారు. వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేస్తూ, వేలాది మంది ఉపాధికీ, నిర్మాణ, పంపిణీ, ప్రదర్శక శాఖలన్నిటా పరిశ్రమ సర్వతోముఖ పురోగతికీ తోడ్పడ్డారు. మొదటి 20 ఏళ్ల కెరీర్‌లో ఆయన దాదాపు 200 సినిమాలు చేశారు. ఆ కాలంలో ప్రతి ఏటా తెలుగులో రిలీజైన సినిమాల్లో కనీసం సగం నుంచి సగం పైనే ఆయన సినిమాలున్న సంవత్సరాలే ఎక్కువ.
మచ్చుకు 1964లో తెలుగు పరిశ్రమ 24 సినిమాలు తీస్తే, అందులో 16 సినిమాలు, అంటే మూడింట రెండొంతులు ఎన్టీఆర్‌వే. అలా రాజకీయాల్లోకి రాకముందే సినిమాల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించారు. 90 ఏళ్ల తెలుగు టాకీ చిత్రాల చరిత్రలో ఇలా ఒక ఏడాది మూడింట రెండొంతుల సినిమాలు ఒక హీరో చేయడం అప్పటికీ, ఇప్పటికీ రికార్డు. పొరుగున తమిళ సినీ స్టార్ల చరిత్రలోనూ ఇలాంటి హీరో మరొకరు కనిపించరు. తెలుగు సినిమా ఎదుగుదలలో ఆయన అవిస్మరణీయ కృషికి ఇది నిలువుటద్దం. అలాగే, 1962 నాటికే వంద సినిమాలు (గుండమ్మకథ), 1970కే రెండొందల సినిమాలు (కోడలు దిద్దిన కాపురం) చేశారు ఎన్టీఆర్. భారతదేశంలో ఈ రెండు మైలురాళ్లనూ చేరుకున్న మొదటి హీరో – ఎన్టీఆరే!
జానర్ ఏదైనా... జనాదరణే!
అన్ని తరహా చిత్రాల్లోనూ అద్వితీయ నటనతో అలరించడం హీరోగా ఎన్టీఆర్‌కే సాధ్యమైంది. ఒకే ఏడాది (1962) పరస్పర విరుద్ధమైన నాలుగు విభిన్న కోవల చిత్రాలు (పౌరాణికం – భీష్మ, జానపదం – గులేబకావళి కథ, చారిత్రకం – మహామంత్రి తిమ్మరసు, సాంఘికం – రక్తసంబంధం, ఆత్మబంధువు, వగైరా) ఆయన చేస్తే, ఆ నాలుగు కోవల చిత్రాలూ శతదినోత్సవ హిట్లే. ఒక నటుడిగా దటీజ్ నందమూరి.
ఒకే ఏడాదిలో... ఒకే ఒక్కడు!
ఒక ఏడాది చేసిన సినిమాలన్నీ సక్సెసై, జనాదరణతో జేజేలు కొట్టించుకోవడం ఎంతటి స్టార్‌కైనా అరుదు. కానీ, అదీ ఎన్టీఆర్ చేసి చూపెట్టారు. 1965లో ఈ సినీ తారకరాముడు 12 సినిమాలు చేస్తే, అందులో 8 సెంచరీ హిట్లు. తొమ్మిదో చిత్రం 92 రోజులాడింది. మిగిలిన మూడూ 9 – 10 వారాల వంతున ప్రదర్శితమైన సక్సెస్‌ఫుల్ సినిమాలు. అదీ ఎన్టీఆర్ ఇమేజ్ చేసిన మ్యాజిక్. ఒకే ఏడాది (1977)లో ఏకంగా 3 డబుల్ సెంచరీ హిట్లు (దానవీరశూర కర్ణ, అడవి రాముడు, యమగోల) సాధించడం ఎన్టీఆర్ స్టార్ స్టామినాకు మచ్చుతునక. అప్పటికి తెలుగులో మరి ఏ హీరోకూ ఏకంగా సినీజీవితం మొత్తంలోనే 3 డబుల్ సెంచరీ హిట్లు లేవు. అలా తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ ఓ చరిత్ర సృష్టించారు.
విన్ అయినా... రిపీట్ రన్ అయినా...
ఎన్టీఆర్ నటించిన త్రిశతాధిక చిత్రాల్లో అధిక భాగం బాక్సాఫీస్ హిట్లు. ఆయన చిత్రాల్లో శతదినోత్సవ హిట్లు 160. అందులో 115 నేరుగా సెంచరీ ఆడినవే! రజతోత్సవ హిట్లు 40. వాటిలో దాదాపు 20 డైరెక్ట్ సిల్వర్ జూబ్లీ. ఇక, 5 చిత్రాలు ఏడాది పాటు ఆడిన స్వర్ణోత్సవ హిట్లు. ఇలాంటి బాక్సాఫీస్ రికార్డుల్లోనూ అగ్రతాంబూలం ఎన్టీఆర్‌దే అన్నది జగమెరిగిన సత్యం. ప్రపంచ సినీ చరిత్రలో రెండోసారి, మూడోసారి విడుదలై కూడా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా ఆడడం తెలుగు, తమిళ సినీ రంగాల్లోనే ఎక్కువ. తర్వాత కొంత కన్నడంలో రిపీట్ రన్స్ కనిపిస్తాయి. మన తెలుగు సినీచరిత్ర మొత్తంలో రిపీట్ రన్స్‌లో శతదినోత్సవం చేసుకున్న చిత్రాలు 16. అందులో ఏకంగా 14 చిత్రాలు ఈ బాక్సాఫీస్ రాముడివే! ప్రేక్షకులకూ, ఎన్టీఆర్‌కూ ఉన్న అనుపమానమైన అనుబంధానికి ఇది ఓ మచ్చుతునక.
చరిత మరువని ఘనత
పౌరాణికం, జానపదం, చారిత్రకం, సాంఘికం.. ఇలా అన్ని కోవలలోనూ ఆయనకు ఆయనే సాటి. ఈ నందమూరి అందగాడు వేసినన్ని పాత్రలూ, చేసినన్ని రకాల పాత్రలూ మరే హీరో చేయలేదు. కనీసం ఆయన దరిదాపులో కూడా ఎవరూ లేరు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. 57 జానపదాలు, 48 పౌరాణికాలు, 18 చారిత్రకాలు – ఇలా మూడు కోవల్లోనూ హీరోగా ఆయనదే రికార్డు. ఈ మూడూ కలిపితే, మొత్తం 123 సాంఘికేతర చిత్రాల్లో (అంటే కాస్ట్యూమ్ చిత్రాల్లో) హీరోగా నటించింది ప్రపంచంలో ఎన్టీఆర్ ఒక్కరే!
ముఖ్యంగా పౌరాణిక పాత్రలతో ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకొని, తెలుగువారి ఆరాధ్యదైవమయ్యారు ఎన్టీఆర్. ఆ సినిమాలు, ఆ పాత్రలే 23 ఏళ్ల పాటు మద్రాసులోని ఆయన నివాసాన్ని ఒక తీర్థయాత్రా స్థలిగా మార్చాయి. ఎన్టీఆర్‌లా కేవలం 9 నెలల్లో రాజకీయ పార్టీ స్థాపించి, ఎన్నికలలో ఘన విజయం సాధించిన మరొకరు ప్రపంచ రాజకీయ చరిత్రలో కనిపించరంటే అదే కారణం. అలా రాజకీయ సౌధానికి కూడా సినీ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా ఆయన చూపిన ప్రత్యేకత, సంపాదించుకున్న ప్రజాదరణే పునాది. ఇలాంటి చరిత మరువని ఘనతలెన్నో తెలుగు సినీరంగానికి కట్టబెట్టిన ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది.
ఈ ఆరాధ్యుడే ఆద్యుడు
తెలుగు సినీరంగంలో అనేక తొలి ఘనతలు ఎన్టీఆర్ చిత్రాలే. ఆ ఘనకీర్తి జాబితా సుదీర్ఘమైనది. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన తొలి సినిమా (పాతాళ భైరవి), విదేశాల్లో ప్రదర్శించిన తొలి సినిమా (మల్లీశ్వరి), తొలి పూర్తి రంగుల చిత్రం (లవకుశ), విదేశాల్లో చిత్రీకరించిన తొలి చిత్రం (సాహసవంతుడు), తొలి సైన్స్ ఫిక్షన్ – అపరాధ పరిశోధక చిత్రం (దొరికితే దొంగలు), ఫస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ (లక్షాధికారి), ఫస్ట్ సోషియో– ఫ్యాంటసీ (దేవాంతకుడు), ఫస్ట్ మాస్ మసాలా మూవీ (అగ్గిరాముడు) – ఇలా అనేక కోవల చిత్రాలకు ఎన్టీఆర్ ఆద్యుడు.
– కొమ్మినేని వెంకటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment