‘తెలుగు బాగా రాయాలంటే ఏం చేయాలి?’ అని శ్రీశ్రీని అడిగారట రావిశాస్త్రి. ‘ఇంగ్లిష్ బాగా చదవండి’ అని శ్రీశ్రీ జవాబు. ‘ఈ లోకంలో డబ్బూ యాపారం తప్ప మరేటి లేదు ప్లీడరు బాబూ’ అంటుందొక క్లయింటు ‘మాయ’ అనే కథలో. రావిశాస్త్రి బాగా రాయడం ఆమె నుంచి నేర్చుకున్నారేమో. ‘మనల్ని ఇలా ఉంచినవాడు దేవుడైతే వాడు దేవుడు కాడు. మనల్ని ఇలా ఉంచింది మనుషులైతే వాళ్లు మనుషులు కాదు’ అంటుంది మరో పాత్ర ‘బుద్బుదం’ అనే కథలో. రావిశాస్త్రి బాగా రాయడం ఆమె నుంచీ నేర్చుకుని ఉండొచ్చు. జనుల ఆవేదనకు చెవి వొగ్గితే బలమైన భాష పుడుతుందని తుదకు తెలుసుకున్నారు రావిశాస్త్రి.
‘పతితులార భ్రష్టులార బాధాసర్ప దష్టులార’ అని శ్రీశ్రీ అంటే పతితులు ఎందుకు పతితులయ్యారో, భ్రష్టులను ఎవరు భ్రష్టత్వం పట్టించారో, బాధాసర్ప దష్టులు తమను నులిమేస్తున్న పడగలను ఖండించాలంటే ఏ ఎరుకను కలిగించుకోవాలో చెప్పినవారు రావిశాస్త్రి. ‘అల్పజీవు’లను తెలుగు కథాపుటలలోకి నడిపించుకొనొచ్చి వారి కథలను, కన్నీటిని, పిరికి నవ్వును, చేతగాని ప్రతిఘటనను, ఒప్పుకోలేని అణచివేతను, గత్యంతరం లేని సర్దుబాటును లోకానికి తెలిపిన రచయిత రావిశాస్త్రి. ‘ఏ పాపం చేయనివారు జైళ్లలోను జైలు బయట మగ్గుతున్నారు’ అనుకుని మగ్గిపోతున్న ఈ బతుకుల్లో కాసింతైనా గాలి వీయించడానికి కలాన్ని వీవెనగా చేసుకున్న మహోపకారి రావిశాస్త్రి.
గత కాలాన్ని ఊహించండి. తాత తండ్రులను నమిలేసిన కాలం. కుక్కి మంచాలలోనే కలలన్నీ కూలిపోయిన కాలం. అట్టి కాలంలో ఒక పదహారేళ్ల అమ్మాయి ‘జరీ అంచు తెల్లచీర’ కావాలనుకుంటే ఆ కనీస కోరికకై పడే శోకం చేసే రోదన రావిశాస్త్రి రాస్తే పాఠకులు ఈనాటికీ మర్చిపోలేదు. ఆ పిల్ల తండ్రి ఎలాగోలా పన్నెండు రూపాయలు తెచ్చి ‘అడుగుతున్నావు కదమ్మా... పదా కొందాం’ అని వెళితే చూడగానే పోల్చుకునే బీదతనం ఎదుట దుకాణదారు పరిహాసంగా చీర పరిచి ఇరవైకు ఏ మాత్రం తగ్గకపోతే... రావిశాస్త్రి ఎలా ముక్తాయిస్తారు? ‘కుక్కి మంచంలో కూలబడి కూర్చున్న ఈ పదహారేళ్ల ఆడపిల్ల ఏకధారగా వరద వరదగా ఏడుస్తోంది. ఇది మెరుపులేని మబ్బు. ఇది తెరిపి లేని ముసురు. ఇది ఎంతకీ తగ్గని ఎండ. ఇది ఎప్పటికీ తెల్లవారని చీకటి రాత్రి. ఇది గ్రీష్మం. ఇది శిశిరం. ఇది దగ్ధం చేసే దావానలం. ఇది రెక్కల్ని రాల్చేసే నైరాశ్యం. ఒక్కటి... ఒక్కటే సుమండీ... ఒక్క జరీ అంచు తెల్లచీర’.
రావిశాస్త్రి కథల్లో కవిత్వం ఉందని వెతికి ఆ కవిత్వాన్ని పుస్తకంగా వెలువరించాడు త్రిపురనేని శ్రీనివాస్. పొయ్యి ముట్టించాలనుకుంటున్నప్పుడు వేగిరానికై కిరోసిన్‌ను కుమ్మరించొచ్చు అనుకున్న రావిశాస్త్రి తన కథల్లో అనూహ్యమైన ప్రతీకలను, ప్రయోగాలను, శ్లేషను, వ్యంగ్యాన్ని, నాటకీయతను, జనుల భాషను, బోధకుని కంఠధ్వనిని ప్రవేశపెట్టి పాఠకులను తనవైపుకు లాక్కున్నారు. తాను ప్లీడరుగా పని చేస్తూ ‘న్యాయం’ అనే కథలో కోర్టును ‘అబద్ధాలకి పాముల పుట్ట’ అనగలిగే ధీశాలి. ‘కార్నర్ సీటు’ల్లో కూచుని బాధేమిటో తెలుపక హఠాత్తుగా ఆత్మహత్య చేసుకునే దీనులను మనలో నశిస్తున్న మంచితనానికి ఆనవాలుగా ఆయన కదూ చూపించినది?
‘కండ గలవాడే మనిషోయ్’ అని గురజాడ అంటే శారీరక, మానసిక దౌర్బల్యంతో యువత ఏ పనికీ కొరగాకుండా ఉండటాన్ని సహించలేని రావిశాస్త్రి ‘వర్షం’ కథను రాసి కర్తవ్యోన్ముఖులను చేస్తారు. ‘పువ్వులు’ కథలోలాగా ఎంత తొక్కినా తెల్లారేసరికి పకపకలాడే బంతిపూల వంటి బీద జనా లదే ఆయన పక్షం. నిత్యం కోర్టుల్లో జూటా ముఖాలను చూసి విసిగిపోయిన రావిశాస్త్రి ‘డికెన్స్, గుర జాడల రచనలే మంచితనం మీద ఈ మాత్రం అభిమానం పెంచుకునేలా చేశాయి’ అని రాసుకున్నారు. గురజాడ దారిలోనే రావిశాస్త్రి కూడా ‘మంచి అన్నది పెంచడానికే’ తెలుగు కథను నడిపించారు.
రావిశాస్త్రి అను రాచకొండ విశ్వనాథశాస్త్రి తెలుగులో స్టార్ స్టేటస్ పొందిన తొలితరం సీరియస్ రచయిత. జనం పక్షాన రాస్తూ కూడా పాఠకాకర్షణ పొందవచ్చు అని నిరూపించారు. కాళీపట్నం, బీనాదేవి, కె.ఎన్.వై. పతంజలి... ఎందరో రచయితలు ఆయన రచనల ప్రభావంతో తోవ తెలుసుకున్నారు. గొంతు వెతుక్కున్నారు. విరసం– రావిశాస్త్రి పరస్పరం వెలుతురు పంచుకోవడం మరో ముఖ్యఘట్టం. ‘వేతన శర్మ’, ‘షోకు పిల్లి’, ‘పిపీలికం’ కథలు అందుకు తార్కాణం.
రాచకొండ విశ్వనాథశాస్త్రి ఉత్తరాంధ్రకో తెలుగు రాష్ట్రాలకో పరిమితమయ్యే రచయిత ఎంత మాత్రం కాదు. రోదన ఉన్న చోటుకంతా బడుగుజీవి బతుకుతున్న తావుకంతా ఆయన కథ చేరగలదు. అదే సమయంలో రావిశాస్త్రి ఎంత ‘స్థానికుడు’ అంటే ఆయన రచన అనువాదానికి పూర్తిగా లొంగదు. అయినా సరే ఎంత చేర్చగలమో అంత కనీసం భారతీయ పాఠకులకు చేర్చవలసిన ‘బాకీ’ మనకు ఉంది.
జూలై 30– రావిశాస్త్రి శత జయంతి. తెలుగు సాహిత్యానికి సంబంధించి గొప్ప ఉత్సవ సందర్భం. పాఠకులు, అభిమానులు రెండు రాష్ట్రాలలో ఉత్సాహంగా కార్యక్రమాలు చేయనున్నారు. అయితే ఇంతటి గొప్ప రచయితను ఈ సందర్భంగానైనా స్కూళ్లకు, కాలేజీలకు చేర్చాల్సిన పని ప్రభుత్వాలది.
‘రచయిత ప్రతివాడూ తాను రాస్తున్నది ఏ మంచికి హాని చేస్తున్నదో ఏ చెడుకు ఉపకారం చేస్తున్నదో గమనించుకోవాలి’ అన్నాడాయన. ప్రభుత్వం, పాలనా వ్యవస్థ, మీడియా, పౌరులు మొత్తంగా మనుషులు ఏ మంచికి హాని చేయని, ఏ చెడుకు మేలు చేయని సంస్కారంలో సమాజాన్ని ఉంచడమే ఆ మహా రచయితకు నిజమైన నివాళి.
ఛాత్రిబాబూ నువు గొప్పోడివోయ్.
Comments
Please login to add a commentAdd a comment