rachakonda viswanadha sastry
-
ప్రశంసనీయమైన ప్రయత్నం
‘అక్కడ అనాథల ఆక్రందన. అక్కడ అసహాయుల ఆర్తనాదం. అక్కడ పేదల కన్నీటి జాలు. అదే సుమా కోర్టు....’ సుప్రసిద్ధ రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి అరవై రెండేళ్లనాటి ‘న్యాయం’ కథలో గుండెల్ని పిండే వాక్యాలివి. ఈ అనాథల్లో, ఈ అసహాయుల్లో, ఈ నిరుపేదల్లో మహిళలకు మరిన్ని కష్టాలు! ఆలస్యంగానైనా మన సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయంలో ప్రశంసనీయమైన పని చేసింది. న్యాయస్థానాల్లో సాగే వాదప్రతివాదాల్లో, విచారణల్లో, తీర్పుల్లో మహిళలకు సంబంధించి దశాబ్దాలుగా ఎంతో అలవోకగా వాడుతున్న పదాలను ఇకపై ఉపయోగించడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఆ పదాలకు ప్రత్యామ్నాయంగా ఏయే పదాలను ఉపయోగించాలో వివరిస్తూ బుధవారం ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. వ్యవస్థలన్నీ ఎక్కడినుంచో ఊడిపడవు. సమాజంలో ఉండే అసమానతలు, వివక్ష, ఆధిపత్య ధోరణులు వంటి సమస్త అవలక్షణాలూ వ్యవస్థల్లో కూడా ప్రతిఫలిస్తుంటాయి. న్యాయస్థానాల్లో ఈ పెడధోరణులు ఉండరాదని విశ్వసించి, అందుకోసం కృషి చేసిన న్యాయమూర్తులు లేకపోలేదు. కానీ వ్యక్తులుగా కృషి చేయటం వేరు, వ్యవస్థే తనంత తాను సరిదిద్దుకునేందుకు పూనుకోవడం వేరు. వృత్తి ఉద్యోగాలరీత్యా సరేగానీ... పౌరుల్లో అత్యధికులు కేసుల్లో ఇరుక్కొని కోర్టు మెట్లెక్కాలనీ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలనీ కోరుకోరు. మహిళల్లో ఈ విముఖత మరింత ఎక్కువ. ఇతరచోట్ల కంటే అక్కడ లింగ వివక్ష అధికం కావటమే ఇందుకు కారణం. మరీ ముఖ్యంగా కింది కోర్టుల్లో మహిళల పట్ల ఉపయోగించే భాష, సంబోధనలు అమాన వీయంగా ఉంటాయి. పర్యవసానంగా న్యాయం కోసం వెళ్లేవారికి అవమానాలే మిగులుతున్నాయి. మన రాజ్యాంగం అన్ని అంశాల్లో సమానత్వాన్ని ప్రబోధించింది. లింగ, వర్ణ, జాతి, కుల, మతాలను ఆధారం చేసుకుని వివక్ష ప్రదర్శించరాదని నిర్దేశించింది. ఇందుకు రాజ్యాంగ పీఠిక మాత్రమే కాదు... 14, 15, 16 అధికరణలతోపాటు 325 అధికరణం కూడా సాక్ష్యాలు. ఆదేశిక సూత్రాల్లో సైతం లింగ సమానతను సాధించటానికి ప్రభుత్వాలు పాటుపడాలన్న ఆకాంక్ష వ్యక్తమైంది. లింగ వివక్షకు తావులేకుండా పౌరులందరికీ పనిచేసే హక్కు కల్పించడంతోపాటు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 39(డి), 41 అధికరణలు నిర్దేశించాయి. కానీ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా ఇవి విరగడ కాలేదు. మహిళల విషయంలో ఎలాంటి దురాచారాలు, పెడ ధోరణులు అలుముకుని ఉన్నాయో మన రాజ్యాంగ నిర్మాతలకు సంపూర్ణ అవగాహన ఉంది. అందుకే వాటిని రూపుమాపటానికి పూనుకొన్నారు. దానికి అనుగుణంగా కాలక్రమంలో ప్రభు త్వాలు చాలా చట్టాలు తీసుకొచ్చాయి. కానీ దురదృష్టమేమంటే అమలు చేసే వ్యవస్థలు సైతం పితృస్వామిక భావజాలంలో కూరుకుపోవటంతో సమానత్వం అసాధ్యమవుతోంది. తమ ముందున్న కేసులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తీర్పు చెప్పవలసిన న్యాయమూర్తులు సైతం విచారణ క్రమంలో కావొచ్చు, తీర్పుల్లో కావొచ్చు... మహిళలకు సంబంధించి సమాజంలో ఉన్న పెడ ధోర ణులను ప్రతిబింబించే పదాలను వాడుతుంటారు. ఒక్కోసారి వాంఛనీయం కాని వైఖరిని ప్రదర్శి స్తుంటారు. ఉద్దేశపూర్వకం అయినా కాకపోయినా, వాటివల్ల మౌలికంగా న్యాయం తారుమారు కాకపోయినా... మన రాజ్యాంగం నిర్దేశించిన విలువలకు, విధానాలకు ఆ వైఖరి, ఆ పదాల వాడకం విరుద్ధమైనవి. ఈ విషయంలో రెండో మాటకు తావులేదు. వ్యభిచారం కేసుల్లో, వివాహేతర సంబంధంలో ఉన్న పురుషులకు ప్రత్యేక పదాలు లేవు. కానీ స్త్రీ విషయంలో అలా కాదు... వేశ్య, వ్యభిచారిణి, ఉంపుడు కత్తె, కాముకి అనే అర్థాలు వచ్చే రకరకాల పదాలు ఇంగ్లిష్‌లో ఉన్నాయి. కేసుల విచారణ సమయంలో న్యాయవాదులు, న్యాయమూర్తులు వీటిని యధేచ్ఛగా ఉపయోగిస్తున్నారు. అంతేకాదు... రెచ్చగొట్టే దుస్తులు, పెళ్లికాకుండానే తల్లయిన యువతి వంటివి వాడుతున్నారు. 2012 డిసెంబర్లో దేశ రాజధాని నగరంలో కదిలే బస్సులో ఒక యువతిపై మూకుమ్మడి అత్యాచారం జరిగాక కఠినమైన నిర్భయ చట్టం అమల్లోకి వచ్చింది. అత్యంత అమానవీయమైన, దుర్మార్గమైన ఆ ఉదంతం తర్వాత సమాజపు ఆలోచనల్లో పూర్తి మార్పు వస్తుందనీ, మహిళల పట్ల చిన్నచూపు చూసే ధోరణులు తగ్గుతాయనీ అనేకులు ఆశించారు. కానీ సమాజం మాట అటుంచి న్యాయస్థానాల ఆలోచనా ధోరణే పెద్దగా మారలేదు. ఒక అత్యాచారం కేసులో నేరగాడిని నిర్దోషిగా పరిగణిస్తూ యువతులు శారీరక సుఖాలను ఆశించి తమంత తాము పురుషులతో వెళ్లడానికి సిద్ధపడి ఆ తర్వాత నిందపడుతుందన్న భయంతో కిడ్నాప్, అత్యాచారం కథలల్లుతున్నారని ఒక న్యాయమూర్తి 2013లో వ్యాఖ్యానించారు. సమాజంలో ఇలాంటి ధోరణి పెరుగుతున్నదని ఆయన ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి 2020లో కర్ణాటక హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది! అత్యాచారానికి గురైన యువతి ఆ వెంటనే నిద్రపోయి, మరునాడు కేసు పెట్టిందనీ, కనుక ఆమె ఫిర్యాదులో నిజాయితీ లేదనీ తేల్చారు. నిరంతర చలనశీలత సమాజ మౌలిక లక్షణం. మారుతున్న కాలానికి అనుగుణంగా భాష మారాలి. ప్రవర్తన, వైఖరి సంస్కారవంతం కావాలి. అది న్యాయస్థానాల నుంచే ప్రారంభం కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ భావించటం ప్రశంసనీయం. 19వ శతాబ్దం నాటి చట్టాలను మారుస్తూ ఈమధ్యే మూడు కొత్త బిల్లుల్ని ప్రవేశపెట్టిన కేంద్రం కూడా ఈ కోణంలో వాటిని పునఃసమీక్షించుకుని లింగ వివక్ష ధోరణులున్న నిబంధనలను సవరించుకుంటే మంచిది. -
నూరేళ్ల రావిశాస్త్రి
‘తెలుగు బాగా రాయాలంటే ఏం చేయాలి?’ అని శ్రీశ్రీని అడిగారట రావిశాస్త్రి. ‘ఇంగ్లిష్ బాగా చదవండి’ అని శ్రీశ్రీ జవాబు. ‘ఈ లోకంలో డబ్బూ యాపారం తప్ప మరేటి లేదు ప్లీడరు బాబూ’ అంటుందొక క్లయింటు ‘మాయ’ అనే కథలో. రావిశాస్త్రి బాగా రాయడం ఆమె నుంచి నేర్చుకున్నారేమో. ‘మనల్ని ఇలా ఉంచినవాడు దేవుడైతే వాడు దేవుడు కాడు. మనల్ని ఇలా ఉంచింది మనుషులైతే వాళ్లు మనుషులు కాదు’ అంటుంది మరో పాత్ర ‘బుద్బుదం’ అనే కథలో. రావిశాస్త్రి బాగా రాయడం ఆమె నుంచీ నేర్చుకుని ఉండొచ్చు. జనుల ఆవేదనకు చెవి వొగ్గితే బలమైన భాష పుడుతుందని తుదకు తెలుసుకున్నారు రావిశాస్త్రి. ‘పతితులార భ్రష్టులార బాధాసర్ప దష్టులార’ అని శ్రీశ్రీ అంటే పతితులు ఎందుకు పతితులయ్యారో, భ్రష్టులను ఎవరు భ్రష్టత్వం పట్టించారో, బాధాసర్ప దష్టులు తమను నులిమేస్తున్న పడగలను ఖండించాలంటే ఏ ఎరుకను కలిగించుకోవాలో చెప్పినవారు రావిశాస్త్రి. ‘అల్పజీవు’లను తెలుగు కథాపుటలలోకి నడిపించుకొనొచ్చి వారి కథలను, కన్నీటిని, పిరికి నవ్వును, చేతగాని ప్రతిఘటనను, ఒప్పుకోలేని అణచివేతను, గత్యంతరం లేని సర్దుబాటును లోకానికి తెలిపిన రచయిత రావిశాస్త్రి. ‘ఏ పాపం చేయనివారు జైళ్లలోను జైలు బయట మగ్గుతున్నారు’ అనుకుని మగ్గిపోతున్న ఈ బతుకుల్లో కాసింతైనా గాలి వీయించడానికి కలాన్ని వీవెనగా చేసుకున్న మహోపకారి రావిశాస్త్రి. గత కాలాన్ని ఊహించండి. తాత తండ్రులను నమిలేసిన కాలం. కుక్కి మంచాలలోనే కలలన్నీ కూలిపోయిన కాలం. అట్టి కాలంలో ఒక పదహారేళ్ల అమ్మాయి ‘జరీ అంచు తెల్లచీర’ కావాలనుకుంటే ఆ కనీస కోరికకై పడే శోకం చేసే రోదన రావిశాస్త్రి రాస్తే పాఠకులు ఈనాటికీ మర్చిపోలేదు. ఆ పిల్ల తండ్రి ఎలాగోలా పన్నెండు రూపాయలు తెచ్చి ‘అడుగుతున్నావు కదమ్మా... పదా కొందాం’ అని వెళితే చూడగానే పోల్చుకునే బీదతనం ఎదుట దుకాణదారు పరిహాసంగా చీర పరిచి ఇరవైకు ఏ మాత్రం తగ్గకపోతే... రావిశాస్త్రి ఎలా ముక్తాయిస్తారు? ‘కుక్కి మంచంలో కూలబడి కూర్చున్న ఈ పదహారేళ్ల ఆడపిల్ల ఏకధారగా వరద వరదగా ఏడుస్తోంది. ఇది మెరుపులేని మబ్బు. ఇది తెరిపి లేని ముసురు. ఇది ఎంతకీ తగ్గని ఎండ. ఇది ఎప్పటికీ తెల్లవారని చీకటి రాత్రి. ఇది గ్రీష్మం. ఇది శిశిరం. ఇది దగ్ధం చేసే దావానలం. ఇది రెక్కల్ని రాల్చేసే నైరాశ్యం. ఒక్కటి... ఒక్కటే సుమండీ... ఒక్క జరీ అంచు తెల్లచీర’. రావిశాస్త్రి కథల్లో కవిత్వం ఉందని వెతికి ఆ కవిత్వాన్ని పుస్తకంగా వెలువరించాడు త్రిపురనేని శ్రీనివాస్. పొయ్యి ముట్టించాలనుకుంటున్నప్పుడు వేగిరానికై కిరోసిన్‌ను కుమ్మరించొచ్చు అనుకున్న రావిశాస్త్రి తన కథల్లో అనూహ్యమైన ప్రతీకలను, ప్రయోగాలను, శ్లేషను, వ్యంగ్యాన్ని, నాటకీయతను, జనుల భాషను, బోధకుని కంఠధ్వనిని ప్రవేశపెట్టి పాఠకులను తనవైపుకు లాక్కున్నారు. తాను ప్లీడరుగా పని చేస్తూ ‘న్యాయం’ అనే కథలో కోర్టును ‘అబద్ధాలకి పాముల పుట్ట’ అనగలిగే ధీశాలి. ‘కార్నర్ సీటు’ల్లో కూచుని బాధేమిటో తెలుపక హఠాత్తుగా ఆత్మహత్య చేసుకునే దీనులను మనలో నశిస్తున్న మంచితనానికి ఆనవాలుగా ఆయన కదూ చూపించినది? ‘కండ గలవాడే మనిషోయ్’ అని గురజాడ అంటే శారీరక, మానసిక దౌర్బల్యంతో యువత ఏ పనికీ కొరగాకుండా ఉండటాన్ని సహించలేని రావిశాస్త్రి ‘వర్షం’ కథను రాసి కర్తవ్యోన్ముఖులను చేస్తారు. ‘పువ్వులు’ కథలోలాగా ఎంత తొక్కినా తెల్లారేసరికి పకపకలాడే బంతిపూల వంటి బీద జనా లదే ఆయన పక్షం. నిత్యం కోర్టుల్లో జూటా ముఖాలను చూసి విసిగిపోయిన రావిశాస్త్రి ‘డికెన్స్, గుర జాడల రచనలే మంచితనం మీద ఈ మాత్రం అభిమానం పెంచుకునేలా చేశాయి’ అని రాసుకున్నారు. గురజాడ దారిలోనే రావిశాస్త్రి కూడా ‘మంచి అన్నది పెంచడానికే’ తెలుగు కథను నడిపించారు. రావిశాస్త్రి అను రాచకొండ విశ్వనాథశాస్త్రి తెలుగులో స్టార్ స్టేటస్ పొందిన తొలితరం సీరియస్ రచయిత. జనం పక్షాన రాస్తూ కూడా పాఠకాకర్షణ పొందవచ్చు అని నిరూపించారు. కాళీపట్నం, బీనాదేవి, కె.ఎన్.వై. పతంజలి... ఎందరో రచయితలు ఆయన రచనల ప్రభావంతో తోవ తెలుసుకున్నారు. గొంతు వెతుక్కున్నారు. విరసం– రావిశాస్త్రి పరస్పరం వెలుతురు పంచుకోవడం మరో ముఖ్యఘట్టం. ‘వేతన శర్మ’, ‘షోకు పిల్లి’, ‘పిపీలికం’ కథలు అందుకు తార్కాణం. రాచకొండ విశ్వనాథశాస్త్రి ఉత్తరాంధ్రకో తెలుగు రాష్ట్రాలకో పరిమితమయ్యే రచయిత ఎంత మాత్రం కాదు. రోదన ఉన్న చోటుకంతా బడుగుజీవి బతుకుతున్న తావుకంతా ఆయన కథ చేరగలదు. అదే సమయంలో రావిశాస్త్రి ఎంత ‘స్థానికుడు’ అంటే ఆయన రచన అనువాదానికి పూర్తిగా లొంగదు. అయినా సరే ఎంత చేర్చగలమో అంత కనీసం భారతీయ పాఠకులకు చేర్చవలసిన ‘బాకీ’ మనకు ఉంది. జూలై 30– రావిశాస్త్రి శత జయంతి. తెలుగు సాహిత్యానికి సంబంధించి గొప్ప ఉత్సవ సందర్భం. పాఠకులు, అభిమానులు రెండు రాష్ట్రాలలో ఉత్సాహంగా కార్యక్రమాలు చేయనున్నారు. అయితే ఇంతటి గొప్ప రచయితను ఈ సందర్భంగానైనా స్కూళ్లకు, కాలేజీలకు చేర్చాల్సిన పని ప్రభుత్వాలది. ‘రచయిత ప్రతివాడూ తాను రాస్తున్నది ఏ మంచికి హాని చేస్తున్నదో ఏ చెడుకు ఉపకారం చేస్తున్నదో గమనించుకోవాలి’ అన్నాడాయన. ప్రభుత్వం, పాలనా వ్యవస్థ, మీడియా, పౌరులు మొత్తంగా మనుషులు ఏ మంచికి హాని చేయని, ఏ చెడుకు మేలు చేయని సంస్కారంలో సమాజాన్ని ఉంచడమే ఆ మహా రచయితకు నిజమైన నివాళి. ఛాత్రిబాబూ నువు గొప్పోడివోయ్. -
అవ్యవస్థ ఉన్నన్నాళ్లూ రావిశాస్త్రి సజీవం
తన అపారమైన కృషి ద్వారా ఇరవయ్యో శతాబ్ది రెండో అర్ధ భాగపు తెలుగు సామాజిక, సాహిత్య జీవితం మీద అసాధా రణమైన ప్రభావం వేసిన రాచ కొండ విశ్వనాథశాస్త్రి (30 జూలై 1922–10 నవంబర్ 1993) శత జయంతి సంవత్సరం ఇవాళ మొదలవుతున్నది. ఆయన జీవితం గురించీ రచన గురించీ తలుచు కోగానే గుర్తుకొచ్చే అంశాలు–ధైర్యమైన వస్తువుల ఎంపిక, అపురూపమైన శిల్పం, సునిశితమైన విమర్శా దృక్పథం, సువిశాలమైన, లోతైన దూరదృష్టి, చురుక్కుమనిపించే వ్యంగ్యం, కవితాత్మకమైన వచనం, తీగలు తీగలుగా సాగే వర్ణనా చాతుర్యం, ఎప్పటికీ గుర్తుండిపోయే, కోటబుల్ కోట్స్‌గా పనికొచ్చే పదునైన వ్యాఖ్యలు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి సమీపంలోని తుమ్మ పాల గ్రామానికి చెందిన రావిశాస్త్రి తండ్రి న్యాయవాద వృత్తి వదిలి వ్యవసాయంలోకి దిగారు. ‘‘మా నాన్న ప్లీడరుగా పదేళ్లే ప్రాక్టీసు చేసేరు. ఆ వృత్తిలో ఉండలేక వ్యవసాయం చేసేరాయన. వ్యవసాయం చెయ్యలేక, ఇష్టం ఉన్నా లేకపోయినా ప్లీడరీ వృత్తిలోనే ఉండిపోయేన్నేను’’ అని తానే రాసుకున్నట్టు రావిశాస్త్రి ఇరవై ఏడో ఏట న్యాయవాద జీవితం ప్రారంభించి చివరిదాకా అందులోనే ఉన్నారు. సమాంతరంగా అంతకు అంత సాహిత్య కృషీ చేశారు. 1942లో బీఏ ఆనర్స్ పూర్తి చేసి, మిలిటరీ అకౌంట్స్ శాఖలో పూనా, హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నంలలో పనిచేసి, 1946–48ల్లో మద్రాసులో లా చదివి, 1949లో విశాఖపట్నంలో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. పేదలకు న్యాయం అందించడానికి చేసే కృషిలో ఆయనకు సహజంగానే న్యాయవ్యవస్థ కోరలలో చిక్కుకున్న అమాయకులు, వేశ్యలు, అక్రమ సారావ్యాపార సామ్రాజ్యాలలో అట్టడుగు అంచుల అభాగ్యులు, పెరుగు తున్న నగరంలో విస్తరిస్తున్న నేరమయ అధోజగత్ వాసులు పరిచితులూ, క్లయింట్లూ అయ్యారు. పదమూడో ఏటనుంచే రచనమీద ప్రారంభమైన ఆసక్తి, పదిహేనో ఏట అచ్చయిన తొలి కథ, విస్తారమైన అధ్యయనం వల్ల 1949కి ముందే మొదలైన సాహిత్య జీవితానికి అటు మిలిటరీ అకౌంట్స్ ఉద్యోగంలో దేశ మంతా తిరిగి సంపాదించిన జీవితానుభవం, ఇటు న్యాయవాద వృత్తిలో అట్టడుగు ప్రజల జీవితాలతో సన్ని హిత పరిచయం, మార్క్సిస్టు దృక్పథం, రాజకీయ విశ్వా సాలు పదును పెట్టాయి. సాహిత్య సృజన సాధనలో భాగమైన అంతకు ముందరి కథలు పక్కనపెట్టినా, అల్ప జీవి నవల (1953) నుంచి ఇల్లు నవల (1993) వరకూ నిండా నాలుగు దశాబ్దాలు తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రబలంగా ప్రచండంగా వీచిన గాలి ఆయన. ఈ రెండు నవలల మధ్యలో మరొక ఐదు నవలలు (రాజు–మహిషి 1965, గోవులొస్తున్నాయి జాగ్రత్త 1966, రత్తాలు– రాంబాబు 1976, సొమ్మలు పోనాయండి 1980, మూడు కథల బంగారం 1982), డెబ్బైకి పైగా కథలు, మూడు నాటకాలు, దాదాపు రెండు వందల వ్యాసాలు, వచన రచ నలు, నేరుగా రాసిన కొన్ని కవితలు, అనేక ఉపన్యా సాలు... కనీసం మూడు వేల పేజీల సృజన. పోలీసు వ్యవస్థ అక్రమాలు, న్యాయవ్యవస్థ అన్యా యాలు–ఆయన రాసిన ఐదారు దశాబ్దాల తర్వాత కూడా ఈ సమాజంలో కొన్ని యథాతథంగా ఉన్నాయి. ఆ మాటకొస్తే రూపం మార్చుకున్నట్టు కనబడుతున్నప్పటికీ ఇంకా దుర్మార్గంగా తయారయ్యాయి. అందువల్లనే ఆయన ఇవాళ్టికీ సజీవంగా ఉంటారు. ‘‘...రచయిత ప్రతివాడు తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకి ఉపకారం చేస్తుందో అని ఆలోచించవల్సిన అవసరం ఉందని నేను తలుస్తాను. మంచికి హానీ, చెడ్డకి సహాయమూ చెయ్యగూడదని నేను భావిస్తాను’’ అని ఆయన అలవోకగా చెప్పిన మాటలు రచయితల దృక్పథ ప్రాధాన్యతను, పాఠకుల సాహిత్యా భిరుచినీ నిర్దేశిస్తాయి. రావిశాస్త్రి రచనల్లో ఆరు సారా కథలు మాత్రమే చది వినా ఆయన అద్భుతత్వం పాఠకుల కళ్లకు కడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో తొలి మద్యనిషేధం అమలైన కాలంలో ఆ నిషేధాన్ని అమలు చేయవలసిన వ్యవస్థల పూర్తి సహకారంతో అక్రమ సారావ్యాపారం ఎట్లా సాగిందో, ఆ వ్యాపారంలో చిన్న చేపలను పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఎట్లా పీడించాయో, ఆ వ్యథార్థ జీవన యథార్థ దృశ్యంలో ఎంత కరుణ, బీభత్సం, విషాదం, వ్యంగ్యం, వంచన దాగి ఉన్నాయో ఆ కథలు పాఠకులకు చూపు తాయి. అందుకే ఈ కథలు 1962లో పుస్తకంగా వెలువ డినప్పుడు రాసిన ముందుమాటలో ‘‘ఏకకాలంలో అనేక రసాలను ఉప్పొంగింపజేసే కళాఖండాలను మాత్రమే నేను ఉత్కృష్ట రచనలుగా అంగీకరిస్తాను’’ అంటూ, ఆ రసాను భూతికి ‘రసన’ అనే కొత్త పేరు పెట్టి, అది తాను చార్లీ చాప్లిన్ చిత్రాలలో, పికాసో గుయెర్నికాలో, డికెన్స్ నవ లల్లో, గురజాడ రచనల్లో గుర్తించాననీ, అది రావిశాస్త్రి రచనల్లో కూడా ఉందనీ శ్రీశ్రీ అన్నాడు. ఈ రసన సృష్టికి రావిశాస్త్రికి పునాదిగా నిలిచినది అవ్యవస్థ మీద ఆగ్రహం. ‘‘విప్లవాలూ యుద్ధాలూ లేకుండా లోకంలో న్యాయం జరిగిపోతే, దేముడికి కానీ మనకి కానీ అంతకంటే కావలసిందేముంది?!... నా గుండెల మీద కూర్చున్న పెద్దపులి మనసు మార్చుకొని సన్యాసం పుచ్చుకొని, కమండలం పట్టుకొని తావళం తిప్పుకొని వాయుభక్షణ చేసుకొంటూ హరినామ సంకీ ర్తనలో కాలం గడుపుకుంటే దానికీ నాకూ పేచీనే లేదు. దిక్కపోతేనే పేచీ. ఇది చదివిన నా స్నేహితులు ఒకాయన చిరునవ్వు నవ్వి, మీ గుండెల మీద కూర్చున్నది పెద్దపులి కాబట్టి మారదు; కానీ ఆ కూర్చున్నది మనిషైతే మారొచ్చు కదా అన్నారు. అప్పుడు నావంతు ప్రకారం నేను చిరునవ్వు నవ్వి, వాడే మనిషైతే అలా కూర్చోనే కూర్చోడు కదా అన్నాను’’ (రాముడు, 1970) అని రాసినప్పుడు రావిశాస్త్రి వ్యక్తీకరించినది ఆ ఆగ్రహాన్నే. తన అనుభవంలోకి వచ్చిన అవ్యవస్థకు సాహిత్యంలో అద్దం పట్టిన, దాని మీద తన ఆగ్రహాన్ని వ్యక్తీకరించిన రావిశాస్త్రి ఆ అవ్యవస్థ కొనసాగి నంతకాలమూ సజీవంగానే ఉంటారు, శతజయంతి ఒకా నొక మైలురాయి మాత్రమే. -ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త వీక్షణం సంపాదకుడు మొబైల్ : 98485 77028 (రావిశాస్త్రి శతజయంతి సంవత్సరం ప్రారంభం) -
అమ్మా.. ఎండెప్పుడొస్తుందమ్మా?
మన ఊరిచివర (కిందటేడు వ్యాపారం గురించి కలకత్తాకి వెళ్తూ వెళ్తూ దార్లో అకస్మాత్తుగా చచ్చిపోయిన) మనూరి పాత మొఖాసాదార్గారి తోటలో ట్రంకురోడ్డుకి పక్కగా. చీకటిమర్రి చెట్టుకింద ఒంటిగా నిల్చున్న పాడుపడ్డ గదిలో కాపరం ఉంటూ, ఊళ్ళో ఇంటింటికి తిరిగి తిరిగి అప్పడాలు ఒడియాలు అమ్ముకు బతికే శారదమ్మగారి ఆరేళ్ళ కూతురు–సుందరం–ఓ రోజు సాయంకాలం వాళ్ళమ్మని... ‘‘అమ్మా, అమ్మా! ఎండెప్పుడొస్తుందమ్మా?’’ అని అడిగింది. సాయంకాలం చాలా చీకటిగా, చాలా భయంగా, మరో ఘడియలోనో క్షణంలోనో మనింటికి రాబోయే చావులా ఉంది. మూడ్రోజుల పాటు మన్నూ మిన్నూ ఏకమైపోయినట్టనిపించి ఇవాళ నాలుగోరోజు ఉదయానికి కాస్త తెరపిచ్చిందే కాని ఆకాశం మాత్రం రవ్వంత మేరయినా విడవకుండా మబ్బుతో దట్టంగా మూసుకుపోయే ఉంది. వర్షంతో పాటు ఈ మూడ్రోజులు చలిగాలి కూడా ప్రచండంగా వీచివీచి నానా భీభత్సం చేసింది. ఈరోజు మాత్రం గాలి బాగా సద్దుమణిగింది. శారదమ్మ గది వెనక నున్న పాతతోటలో చెట్లన్నీ కూడా పగవాడు తెరిపివ్వకుండా తీసిన పిడుగు దెబ్బకి తట్టుకోలేక చెల్లాచెదురైపోయి అలిసిపోయిన మరింక కదల్లేక శవాల్లా ఉండిపోయిన బీదవాళ్ళ కోటలోని పేదజనంలా ఉన్నాయి. ‘‘అమ్మా! ఎండెప్పుడొస్తుందమ్మా?’’ అని అడిగింది సుందరం. కూతురు వేసిన ప్రశ్న శారదమ్మ వినిపించుకోలేదు. ఆవిడ, ఆ కిటికీల్లేని చీకటిగది గుమ్మం ముందున్న సన్నపాటి నడవలో కూర్చొని పాత హరికెన్లాంతరు చిమ్నీ బీటలు విడిపోకుండా నెమ్మదిగా భద్రంగా తుడుస్తోంది. సుందరం తన ఆరేళ్ళ జీవితంలోనూ కూడా ఇంత గాలీవర్షం ఎన్నడూ ఎరగదు. మొదటిరోజున సరదా పడ్డది కాని రెండో రోజు రాత్రికల్లా ఆ పిల్లకి భయం పట్టుకుంది. మూడోరోజల్లా ఈ వర్షం మరింక తగ్గదు కాబోలు. ఎండ మరింక రాదు కాబోలు అనుకొని బెంగ పెట్టేసుకొని ఏడుస్తూ కూర్చుంది. ఈరోజు పొద్దున్నించీ కూడా వర్షం లేకపోవడంతో ఆమెక్కొంచెం ధైర్యం వచ్చింది. కాని, ఎండ తప్పక రేపొస్తుందని అమ్మ కూడా చెప్తే కాని ఆ పిల్లకి పూర్తిగా నమ్మకం కదురదు. ‘‘అమ్మా! ఎండమ్మా ఎండ! ఎండ ఎప్పుడొస్తుందమ్మా?’’ అని మళ్ళీ అడిగింది సుందరం. సుందరానికి ఎండంటే ఎంతో ఇష్టం. వాళ్ళ నాన్న పైనింకా ఉన్నప్పుడు, రెండేళ్ళ కిందట, కార్తీక మాసంలో వాళ్ళ నాన్నతోనూ అందరితోనూ కలిసి సుందరం వనసంతర్పణకి వెళ్ళింది. నాన్నతో మిల్లులో పన్చేసే మిగతా పనివాళ్ళూ, వాళ్ళ ఆడవాళ్ళూ, పిల్లలు అంతా కూడా వచ్చేరారోజున. బంగారంలాంటి ఎండని ఆ ఒక్కరోజే చూసింది. అక్కడ కొండవార రాజుగారి పువ్వులతోటలో అంతా చీకటిలోనే వెళ్ళి దిగి అక్కడ వండుకొని తినుకొని, ఆడుకొని, పాడుకొని రోజు రోజుల్లా హాయిగా గడిపేరు. ఆవేళ పొద్దున్నే కొండ మీంచి నెమ్మదిగా కిందికి జారిన ఎండ నీలపు పొగమంచుతో కలిసిపోయి నెమ్మదిగా పురివిప్పగా మెరిసే నెమలిపింఛంలా మెరిసింది. పదిగంటలకి ఎండ వెచ్చగా వెచ్చగా ఉంటూ కమ్మగా వండిన వంటవాసనల్తో కలిసిపోయి అన్నం తినిపించే అమ్మచూపులా హాయిగా ఉంది. ఒంటిగంటకి బాగా తళుకెక్కిన ఎండ కొత్త వెండిగిన్నెలా తళతళ మెరిసింది. ఎండంటే సుందరానికి ఎంతో ఇష్టం. కాని, ఎండని సరిగ్గా చూడ్డానికి ఆ పిల్లకి ఎప్పుడో కాని అవకాశం ఉండదు. శారదమ్మ ఊళ్ళోకి పోకపోతే ఆవిడకి దినం గడవదు. అంచేత, సుందరం ఇంటిపట్టునే ఉండితీరాలి. ఇంటి కాపలా ఉండి, చెల్లెల్ని చూసుకోవాలి. అన్నయ్య ఎక్కడికీ పారిపోకుండా చూసుకోవాలి. వాళ్ళుండే గది వెనక కొండదాకా కొండదాకా ఉన్న పాతమామిడితోట ఎప్పుడూ చీకటిగా ఉంటుంది. నాలుగైదేళ్ళయి ఆ తోట పూతా లేదు. కాపూ లేదు. ఎదరగా ఉన్న రోడ్డెక్కూడా రెండు వైపుల్నించీ ఎత్తుగా దట్టంగా కుమ్ముకున్న చెట్లతో అదో పొడవాటి గుహలా ఉంటుంది. సుందరం ఉండే పాతగదికి వీధి వైపుకి ఒక్క గుమ్మం తప్ప కిటికీల్లేవు. గదంతా చాలా చీకటిగా ఉంటుంది. గదికి ఎదురుగా కొంచెం పక్కగా ఉన్న పాతమర్రిచెట్టు. కదల్లేని ముసలిరాక్షసిలా చీకటిగా భయంకరంగా ఉంటుంది. కిందనున్న గదిలోకి ఒక్కచుక్కయినా రానీకుండా ఎండను అదే మింగేస్తుంది. ఇంట్లో ఎంతగా రాదో అంతగా రావాలి సుందరానికి. చుట్టుపక్కల మైలు దూరంలో ఎక్కడా ఇళ్ళులేవు. రోడ్డు మీద జనసంచారం కూడా అట్టే ఉండదు. అమ్మ లేనప్పుడు వీధి గుమ్మంలో చెల్లెల్ని పక్కన కూర్చోబెట్టుకొని బితుకూ బితుకూ కూర్చుంటుంది సుందరం. ఆ పిల్ల ముఖంలో స్పష్టంగా కనిపించేవి కళ్ళే. మర్రిచెట్టుకి చాలా అవతల మిగిలిపోయిన ఎండ ఆ కళ్ళలో బలహీనంగా మెరుస్తుంది. ఆ పిల్లనోరు, చలిగాలికి ముడుచుకుపోయిన గులాబి మొగ్గలా చాలా చిన్నదిగా ఉంటుంది. గట్టిగా గెంతినా నవ్వినా ఆమెకు దగ్గొస్తుంటుంది. ప్రాణంతో ఉన్న సుందరానికి నీడగా పడిన సుందరంలా ఉంటుంది సుందరం. అందుకే ఆ పిల్లని చూస్తూ చూస్తూ ‘ఈ నీడ ఎప్పుడు మాయమైపోతుందో’నని శారదమ్మ అప్పుడప్పుడు భయపడుతూ ఉంటుంది. వర్షం పడిన మూడ్రోజులూ ఎక్కడికీ పోకుండా శారదమ్మ ఇంటిపట్టునే ఉండిపోయింది. సుందరానికి అది కొంచెం నయం అనిపించింది. ఇవాళ వర్షం పళ్ళేదు. రేపు ఎండ రాదా అనుకొంది సుందరం. ఆకాశంలోని మబ్బులు కొత్త బలాన్ని తెచ్చుకొంటున్నాయని ఆ పిల్ల గ్రహించుకోలేదు. కాని, ఆకాశం వైపు చూస్తే మాత్రం ఆమెకి బెంగ తగ్గడం లేదు. ‘‘అమ్మా! అమ్మా! ఎప్పుడొస్తుందమ్మా ఎండా?’’ అంటూ తల్లి భుజం పట్టుకు ఊపుతూ మళ్ళీ అడిగింది సుందరం. ‘‘రేపు రావచ్చు తల్లీ!’’ అంది శారదమ్మ చిమ్నీ నెమ్మదిగా తుడుస్తూనే. ‘‘ఎండొస్తుందమ్మా?’’ ‘‘ఎందుకు రాత్తల్లీ?’’ శారదమ్మ అలా అనగానే సుందరం ఎగిరి గంతేసి, తల్లి పక్కనే కూర్చున్న నాలుగేళ్ళ చెల్లెలు సరూతో, ‘‘చెల్లీ! చెల్లీ! రేపు ఎండొస్తుందిటే. ఎండ!! మరంచేత దేవుడికి దండం పెట్టమ్మా!’’ అంది. సరూ, అక్కమాట వినగానే ఆ పిల్ల వీధి వైపు తిరిగి ముద్దుగా ఓ దండం పెట్టింది. సుందరం చెల్లెల్ని ముద్దాడి, అక్కణ్నుంచి గదిలోకి పరిగెట్టింది. ఆ చీకట్లో గోడవార కర్రపెట్టె మీద కూర్చున్న అన్న దగ్గరికి వెళ్ళి, ‘‘అన్నా! ఒరే! ఎండరా ఎండ! ఎండ రేపొస్తుందిట!’’ అంటూ సంతోషంతో కేకలు వేసింది. అన్న–అంజిగాడు సుందరం కంటే రెండేళ్లు పెద్ద. వాడికి కాళ్లూ చేతులూ పెద్దవిగా ఉంటాయి. తల మాత్రం చెంబులా చిన్నదిగా ఉంటుంది. వాడు ఎండా, నీడా అంటే తెలుసుకోలేడు. అన్నం కలుపుకు తినలేడు. వాడికి మాటలు రావు. వాడు వెర్రివాడు. వాడెప్పుడూ ఆ కర్ర పెట్టె మీదే కూర్చుంటాడు. లేపోతే దాని మీదే పడుకుంటాడు. ఎప్పుడూ నోట్లో వేలు పెట్టుకు కనిపిస్తాడు. సుందరం గెంతుకుంటూ తడిపరికిణీ పరపరలాడించుకుంటూ సరూ దగ్గిర కొచ్చి, ‘‘లేవే సరూ! రేపు ఎండొచ్చేదాకా ఆటకుందాం రావే’’ అంటూ చెల్లెల్ని చెయ్యిపట్టుకు లేవదీసింది. ఇద్దరూ రంయిమంటూ నడవ మీంచి వాకిట్లోకి గెంతి, అక్కడ నిలవనీళ్లలో చప్పట్లు కొడుతూ ఆడ్డం మొదలుపెట్టేరు. ‘‘ఎండొస్తుందీ. రేపు ఎండొస్తుందీ! నెమిలికన్నులా. వెండిగిన్నెలా ఎండొస్తుందీ! ఎంతోచక్కని ఎండోస్తుందీ!’’ అంటూ సుందరం పాడే పాట శారదమ్మ చెవిలో పడుతోందేకాని, ఆవిడ అదేదీ సరిగా వినడం లేదు. శారదమ్మకి దేవుడి యెడల భక్తెక్కువ. ఎన్ని విషయాల్లో భగవంతున్ని ఎంత ఎడం పెట్టినా, ఆవిడ మాత్రం ఆయన ముగింట కదలకుండా మొండిగా కూర్చుంది. ఏడాది కిందట, ఆవిడ పెనిమిటి తను పనిచేసే మిల్లు తాలుకు లేబర్ వ్యవహారాల్లో కూలివాళ్ల తరపున తగువుల్లో ఇరుక్కొని దెబ్బలాటల్లో చిక్కుకొని, ఖూనీ కేసుల్లో అక్రమంగా ఈడవబడ్డ, యావజ్జీవ కారాగారవాసశిక్ష అనుభవించడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఆమెకు దేవుడంటే కొంచెం–అతి కొంచెం చిరుకోపం వచ్చింది. ‘‘మీ అల్లుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. పిల్లలకి తిండి పెట్టాలంటే ఇంట్లో చీకటి తప్ప ఇంకేంలేదు. మాయందు దయ ఉంచి ఒక్కసారి రా నాన్నా!’’ అంటూ ఎందరి చేత ఎన్ని కబుర్లు పంపినా, ఎన్ని అర్జంటు టెలిగ్రాములు కొట్టినా ఎంతకీ రానట్టి డబ్బుగల తండ్రి మీద పేదింటి కోడలైన ఆడకూతురికి కోపం వచ్చి అలిగినట్టు ఆమె ఆ రాత్రి భగవంతుడి మీద కోపం తెచ్చుకుని అలిగింది. కాని ఆ కోపంలో కాఠిన్యం లేదు. మర్నాటికల్లా ఆమె సర్దుకుంది. ∙∙ ఆవిడ రాత్రికి దీపం సంపాదించడంలో గొడవలో మునిపోయింది. లాంతరు వెలిగిద్దామంటే అగ్గిపెట్టి బాగా నానిపోయింది. పుల్లలు చూస్తే మూడే ఉన్నాయి. అందులో రెండప్పుడు వెలక్కుండా ఒట్టిపోయి విరిగిపోయేయి. మూడోది–దేవుడి దయుంటే వెలుగుతుంది. లేకపోతే లేదు. ఈరోజుకి దేవుడికి శారదమ్మ యెడల దయలేదు. ఈ రాత్రికి ఈ ఇల్లంతా చీకట్లో ఉండవలసిందనే అతని అభిప్రాయం. అంచేత, చీకటి మరీ ఎక్కువ కాకుండా పిల్లలకి అన్నాలు పెట్టేస్తే అందరూ వేగిరం కళ్లు మూసుకొని పడుకోవచ్చు. తెలివున్నంతసేపే కాని తెలివి తప్పిపోయేక దీపం ఉన్నా ఒకటే, లేపోయినా ఒకటే. పాత మొఖాసాదార్గారి భార్యకి తమ యెడల భగవంతుడి దయవల్ల–కరుణ కలగబట్టి ఇందులో ఈపాటి తలదాచుకోనిచ్చింది. వారానికి వంద అప్పడాలు పుచ్చుకోవడం తప్ప, అద్దిచ్చినా పుచ్చుకొంది కాదు. రెండుపూట్ల వంట చేసి పిల్లలకి కాస్త వేడన్నం రెండు పూట్లా పెడదామంటే ఈ వర్షం వల్ల ఎక్కడా ఓ కాణీ అయినా పుట్టకుండా ఉంది. వర్షాల వల్ల కూరా నార దొరకని ఈరోజుల్లో అప్పడాలూ, వడియాలూ పేరయ్య కొట్టు మీద వేడివేడి పకోడిల్లాగ జోరుజోరుగా చెల్లిపోను. కాని ఏంచేస్తాం? ఇంట్లో పిండి లేదు. ఎండ లేదు. ‘‘అమ్మ! కంచాలేసుకున్నాం అన్నం పెట్టమ్మా!’’ అంది సుందరం. మధ్నాహ్నం భోజనాలవగా మిగిలిన అన్నం వీధి వరండాలోకి గిన్నెతో పట్టుకొచ్చింది శారదమ్మ. ‘‘అటు చూడమ్మా! ఎంత చీకటిగా ఉందో!’’ అంది సుందరం. ఆకాశంకేసి చూసేసరికి శారదమ్మకి నిజంగా చాలా భయం వేసింది. ‘‘అమ్మా! అలా చూస్తున్నావేంటమ్మా? ఎండ రేపు రాదా?’’ అని అడిగింది సుందరం. ‘‘ఏమోనమ్మా? ముందు మీరంతా భోంచేసి వేగిరం పడుకోండి!’’ ‘‘ఎండరాదేంటమ్మా?’’ అని మళ్ళీ అడిగిన సుందరం కళ్ళలో నీళ్ళు తిరిగేయి. అమ్మ ముఖంలో ఎండ రేపోచ్చే సూచన్లు కనిపించలేదాపిల్లకి. ‘‘ఎందుకమ్మా నీకా బెంగ? ఎండ తప్పక రేపొస్తుంది. ముందు భోంచెయ్యి. బెంగపెట్టుకోక!’’ అంది శారదమ్మ. ‘‘నేను భోంచేయనమ్మా!’’ ‘‘అల్లరి చేయకమ్మా. సుందరం!’’ ‘‘రేపు ఎండొస్తుందా?’’ ‘‘ఒస్తుంది. భోంచెయ్యి’’ ‘‘నాన్నొస్తాడన్నావు. రానేలేదు. నువ్విలాగే ఉత్తుత్తి మాటల్చెప్తావమ్మా’’ ‘‘మన చేతుల్లో ఏవుందమ్మా? దేవుడి దయకలగాలి. నాన్న రావాలి’’ ‘‘దేవుడికి దయెప్పుడు కలుగుతుందమ్మా?’’ ‘‘కలుగుతుంది తల్లీ! బెంగపడక భోంచెయ్యి!’’ అంది శారదమ్మ. అంతలో సరూ, ‘‘అమ్మా అగ్గి! ఆమ్మ! అగ్గి!’’ అని కేకలు వేసింది. చూస్తే అవి చీమలు. శారదమ్మకి ఏంచేయాలో పాలుపోక అలా చూస్తూ నిల్చుంది. వీధిలో సుమారు రెండువందల మంది ముష్టివాళ్ళు గోనెలూ, జోలెలూ, డొక్కులూ, కుండలు, కంపలు పట్టుకొని మోసుకొని తొందర తొందరగా ఊరి వైపు నడుచుకుంటూపోతున్నారు. వాళ్ళంతా శారదమ్మ కాపురం ఉండే గదికి కొంతదూరంలో ఉండే సాధూమఠంలో ఉంటూంటారు. ఇవాళ పొద్దున కాబోలు, మఠం గోడొకటి వర్షానికి నానిపోయి కూలి పోయిందన్నారు. రాత్రికి వర్షం తిరిగి వచ్చే సూచన్లు చూసి వాళ్ళంతా మరెక్కడైనా తలదాచుకొందికి పోతున్నట్టున్నారు. వాళ్ళనలా చూస్తూ శాదమ్మ మౌనంగా నిల్చుండి పోయింది. ‘‘అమ్మా! వాళ్ళెందుకు అలా పారిపోతున్నారు?’’ అని అడిగింది సుందరం. ‘‘భయం చేత అలా పారిపోతున్నారమ్మా’’ ‘‘ఎందుకమా వాళ్ళకి భయం?’’ ‘‘వాళ్ళ బతుకులకి ఎండ లేదమ్మా! అందుకు భయం!’’ ‘‘మరి, మనకి ఎండ ఉంటుందా అమ్మా!’’ ‘‘దేవుడికి దయుంటే అందరికీ ఉంటుంది తల్లీ!’’ ‘‘దేవుడికి మనందరి మీద కోపమా అమ్మా?’’ ‘‘లేత్తల్లీ!’’ అంది శారదమ్మ. శారదమ్మ మూడు కంచాల్లోనూ ఉన్న అన్నం మళ్ళీ గిన్నెలోకి ఎత్తి, మూడుసార్లు నీళ్ళతో కడగ్గా చీమలన్నీ తేలిపోయాయి. పిల్లలకి అన్నం పెట్టడం కోసం చీమల కడుపులు కొట్టవలసొచ్చిందనేసరికి ఆమెకెందుకో కాని కడుపులో దేవేసినట్టయింది. తడి అన్నంలో మజ్జిగనీళ్ళు వేసి ముగ్గురు పిల్లల చేతా శారదమ్మ భోజనాలు చేయిస్తుండగా వర్షం యథాప్రకారం నిన్నా మొన్నా అటు మొన్నట్లాగే పట్టుకొంది. పిల్లల భోజనాలయాక, శారదమ్మ గిన్నె కంచాలు కడిగేసి గదిలోకి వెళ్ళిపోయిన పిల్లల్ని బుద్దిగా పడుకోమన్చెప్పి కేక వేసింది. వర్షం జోరుగా తెగ జోరుగా పడుతోంది. వర్షం చేసేచప్పుడికి, కేకలు వేస్తేగాని నడవలో మాట గదిలోకి వినిపించడం లేదు. వెర్రిపిల్లడు నోట్లో వేలు పెట్టుకుని గోడవార కర్రపెట్టె మీద ముణుచుకు పడుక్కున్నాడు. ఆ పిల్లాడి మీద తడి పూర్తిగా ఆరని పాతచీరె మడతలు పెట్టి కప్పింది శారదమ్మ. మరోవార పొట్టి మడతమంచం మీద సరూ, సుందరాలు తడారని పాతబొంత కప్పుకు పడుకున్నారు. గదంతా యథాప్రకారం కురవడం ప్రారంభించింది. బాగా చీకటిపడి గంటే అయిందో, రెండు గంటలే అయిందో, నడవ పక్క వీధి గుమ్మానికి చేర్లబడి ఏదో ఆలోచిస్తూ కూర్చుంది శారదమ్మ. ఆమెకు నిద్ర రావడం లేదు. వర్షంలోకి అలా రెప్ప వెయ్యలేకుండా అదేపనిగా చూస్తూ ఆలోచిస్తోంది. చీకట్లో వర్షధారలు చాలా అస్పష్టంగా కనిపించడంచేత ఆకాశానికి, భూమికి మధ్య నీరు తప్ప మరేం ఉన్నట్టు అనిపించడం లేదు. శారదమ్మ కళ్ళంట నీరు తిరగడం ఆ చీకట్లో కనిపించడం లేదు. తన మట్టుకు తనకి, శారదమ్మకి, తనెక్కడో ఏదో లోతు దొరకని సముద్రం లోపల గులకరాళ్ళు గుహలో తేలలేక కూలబడి కూర్చున్న రీతిగానే తోస్తోంది. ఎంతటి ప్రకాశవంతమైన సూర్యరశ్మయినా ఇంత లోతు నీటిలోకి ఇంత లోతుకి దిగదు. దిగజాలదు. ఈ మహాసముద్రపు విషపు నీటి అట్టడుక్కి ఏ యెండా, ఏ వెలుగు ఎన్నటికీ రాదు. రాజాలదు. ఈ వాదమ్మ మరింక భూమ్మిదికి తేలడానికి ఏ అవకాశం అయినా సరే ఎక్కడా లేదు. ఉండదు. ఉండబోదు. ఆ సమయంలో శాదమ్మకి–ఎండ లేని తన బాల్యం, చలి కాలపు సాయంకాలపు ఎండలాంటి తన యవ్వనం, నీరెండయినా చోరని రాతిగోడల మధ్య ఇరుక్కున్న తన పెనిమిటి రూపం, మెదడంతా చీకటితో నిండిన తన వెర్రికొడుకు జీవితం, ఎండ కోసం పాకులాడుతూ తనతో పాటు ఈ సముద్రపు అట్టడుగున, సముద్రమంత బరువు కిందా, ఈ చీకటి నీట్లో ఈదలేక, తేలలేక, చావలేక ఉక్కిరి బిక్కిరయి కొట్టుమిట్టాడే తన అతిచిన్న ఆడపిల్లల ఘోర పరితాపం అన్నీ గుర్తుకొచ్చి ఆమెని కుంగతీసి కలచివేయగా ఆమె కళ్ళంట జారిన కన్నీళ్ళు నడవలో రాతిగచ్చు మీద పడి, అక్కడ కురుస్తున్న నీటితో కలిసి వాకిట్లోకి కుంటుకొంటూ పోయి, అక్కణ్ణుంచి రోడ్డు మీదికి తేలి, అక్కణ్నించి కాలవలోకి దూకి ఆ రాత్రి ఆ చీకట్లో ఆ వర్షంలో ఎక్కడో ఏ చీకటి సముద్రంలోకో కాని కొట్టుకుపోయి కలిసిపోయేయి. వెర్రిపిల్లడు కర్రపెట్టె మీద వింత జంతువులా పడుకున్నాడు. ‘‘ఎండంతా చచ్చిపోయిందంటే అక్కా? నిజం చెప్పవే!’’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సరూ చివరికి నిద్దరనే చీకట్లో మెల్లి మెల్లిగా కలిసిపోయింది. పిల్లల ఏడుపు వినిపిస్తే రాక్షసులొచ్చి పిల్లల్ని ఎత్తుకుపోతారని సుందరాన్ని ఎప్పుడో ఎవరో జడిపించేరు. ఆ జడుపు ఇప్పటికీ ఆమెని వదల్లేదు. అందుచేత, రాక్షసులెవరికీ వినిపించకుండా, బెంగతో, బాధతో చెప్పజాలని ఆవేదనతో ఆ రాత్రి అతి రహస్యంగా ఏడ్చి ఏడ్చి అలిసలిసిపోయిన సుందరాన్ని చూసిచూసి మరింక చూడలేక దయదాల్చిన చావులాంటి నిద్ర, ఆ పిల్ల కప్పుకున్న తడిబొంతలా. ఆఖరి కెలాగైతేనేం ఆమెని అతిచల్లగా కప్పింది. చీకట్లో తెరిపి లేకుండా పడే వర్షం, కళ్ళు లేని గుండెలేని కారు నల్లని గీతల గీతల భూతంలా ఉంది. - రాచకొండ విశ్వనాథశాస్త్రి -
ఇద్దరు చంద్రులు.. ఒకే గ్రహణం
చట్టసభల వేదికలలో సంఖ్యాబలాన్ని పెంచుకుని అధికారాన్ని నిలబెట్టుకునే తాపత్రయంలో, రంధిలో ప్రతిపక్ష శాసనకర్తలను ప్రలోభాలతో ‘ఆకర్షించి’ తమ బలాన్ని పెంచుకోవడానికి అధికార పక్షాలు ‘సిగ్గు’ పడడం లేదు. ఒకవైపు అధికార పక్షానిది వైస్రాయ్ హోటల్ కృత్రిమ ప్రయోగ చరిత్ర కాగా, మరొకరిది ఫామ్ హౌస్ కుతంత్రం. రెండువైపులవారి ధోరణి కళ్లు మూసుకుని పాలుతాగుతూ తననెవరూ గమనించడం లేదనుకునే పిల్లి ధోరణే. ‘పెద్దలు తమ మనుగడకే ముప్పు వచ్చినప్పుడు వారి వారి విభేదాలు మరచి రాజీపడతారు. పెద్ద యుద్ధాలుగా మారవలసిన తగవులు రాజీలవు తాయి. కానీ అట్టడుగు వర్గం వారిని తొక్కేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది’. (‘రాజు-మహిషి’లో రాచకొండ విశ్వనాథశాస్త్రి) ఏ సమస్యనూ పరిష్కరించకుండా విభజనానంతర తెలంగాణ-ఆంధ్ర ప్రదే శ్ రాష్ట్రాలను నాన్పుడు బేరానికి దిగజార్చారు పాలకులు. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి పాలనా వ్యవస్థలు ఏర్పడినాయో, అవి ఎలా పని చేస్తున్నాయో తెలుగువారికి ఇప్పటికే పూర్తిగా అవగాహనకు వచ్చి ఉం డాలి. దీని గురించి ఏ నిపుణుడూ వివరించి చెప్పనక్కరలేదు కూడా. నీటి తగాదాలు, ఏటి తగాదాల పరిష్కారం, సాగునీటి పథకాలు, జలవనరుల విని యోగం, ఉద్యోగుల పంపిణీ, విద్యా సంస్థల సక్రమ నిర్వహణ, పరీక్షల నిర్వ హణ, ఐటీ సంస్థలకు భరోసా- ఏదీలేదు. ఇప్పటి వరకు తమకు అన్నిం టా ప్రాప్తమైనది ‘ఉభయ భ్రష్టత్వం, ఉపరి సన్యాసం’ మాత్రమేనని తెలుగు వారికి అర్థమయింది. పైగా ప్రతి అంశాన్నీ నేతలు అక్కరకురాని ప్రకటన లతో వివాదాస్పదం చేయడం మరొక అంశం. పరిష్కారం కాని ప్రజా సమ స్యల నుంచి దృష్టి మళ్లించడానికి మరో కొత్త వ్యూహం కూడా పాలకులు పన్నారు. ఈ సమస్యలతో సంబంధం లేని వివాదాలను పేనుకుంటూ కాల క్షేపం చేయడమే ఆ వ్యూహం. పరస్పరం విమర్శించుకుంటూ నేతలు ప్రజ లను మభ్య పెడుతున్నారు. తమకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి సంబం ధంలేని అంశాల గురించే ప్రజలు చర్చించుకోక తప్పని పరిస్థితిని కల్పిం చారు. ఇలాంటి మస్కా ద్వారా మళ్లీ ఎన్నికలు వచ్చే దాకా ఈ శిక్ష అనుభవిం చవలసిందే,తమ పాలన ఎలా ఉన్నా- అన్నట్టు వాతావరణాన్ని తయారు చేశారు. ‘ప్రజాస్వామ్యం పేరుతో ఐదేళ్లకొకసారి ధనికవర్గ వ్యవస్థలు నిర్వహించే ఎన్నికల జాతర లక్ష్యం- ఆ ఐదేళ్లపాటు ప్రజా బాహుళ్యం మీద ఎలా ఎక్కి తొక్కాలా అని మాత్రమే!’ అంటాడు కార్ల్‌మార్క్స్. ప్రపంచ సామాజిక వేత్తలలో అగ్రగణ్యునిగా, గత దశాబ్దకాలంలో ఏటా బీబీసీ రేటింగ్‌లో మేధా వుల నీరాజనాలు అందుకుంటున్న తత్వవేత్త మార్క్స్ 167 ఏళ్ల క్రితం చెప్పిన ప్పటికీ ఆ మాట నేటికీ తుప్పు పట్టలేదు. ప్రజాస్వామ్యం ప్రభువుల కోసం ఉద్దేశించినది కాదు. అది ప్రజల కోసమే. అశేష త్యాగాలు చేసి ప్రజా బాహు ళ్యం నిర్మించుకున్న రిపబ్లిక్ రాజ్యాంగాలూ, వాటి నిబంధన లూ ఉన్నది ప్రజా స్వామిక విలువలనూ, ప్రజల హక్కులనూ రక్షించేందుకే. అంతేగానీ, పాల కుల దారి మళ్లింపు హక్కులను కాపాడడానికి మాత్రం కాదు. ఈ ధోరణి సర్వాంతర్యామి ఇప్పుడు ‘మార్గం’ మారిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలలో పాలన అడ్డదా రులు, పెడమార్గాలు తొక్కుతోంది. కేంద్రంలో ఏర్పడిన ఎన్డీయే కూడా గత యూపీఏ భ్రష్ట మార్గాన్నే ఎంచుకుంది. అవినీతి, ఆశ్రీత పక్షపాతం, అరా చకానికి దారి తీసే నియంతృత్వం ఢిల్లీ నుంచి రాష్ట్రాల వరకు శరవేగాన పాకి పోవడం దాని ఫలితమే. తమ ప్రభుత్వాలను ఏదో విధంగా నిలబెట్టుకోవడా నికి అన్ని రకాల అడ్డదారులను వెతుక్కోవడం ప్రభువులకు రివాజుగా మారి పోయింది. 545 మంది లోక్‌సభ సభ్యులలో 300 మంది వరకు అవినీతి పరులుగా, నేరగాళ్లుగా, బేరగాళ్లుగా ఆరోపణలలో కూరుకుపోయిన వారేనని వింటున్నాం. మన రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న భాగోతం కూడా దానికి కొనసాగింపేనని గమనించాలి. చట్టసభల వేదికలలో సంఖ్యాబలాన్ని పెంచుకుని అధికారాన్ని నిలబెట్టుకునే తాపత్రయంలో, రంధిలో ప్రతిపక్ష శాసనకర్తలను ప్రలోభాలతో ‘ఆకర్షించి’ తమ బలాన్ని పెంచుకోవడానికి అధికార పక్షాలు ‘సిగ్గు’ పడడం లేదు. ఒకవైపు అధికార పక్షానిది వైస్రాయ్ హోటల్ కృత్రిమ ప్రయోగ చరిత్ర కాగా, మరొకరిది ఫామ్ హౌస్ కుతంత్రం. రెండువైపుల వారి ధోరణి కళ్లు మూసుకుని పాలుతాగుతూ తననెవరూ గమ నించడం లేదనుకునే పిల్లి ధోరణే. పార్లమెంట్లో ప్రభుత్వం మీద ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే, ఆ తీర్మానాన్ని ఓడించి అధికారంలో కొనసా గడానికి ముగ్గురు విపక్ష సభ్యులను కొనుగోలు చేయడానికి నాటి ప్రధాని ఏమాత్రం వెరవలేదు. ఇప్పుడు అదే దుష్ట సంప్రదాయం, అదే ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో, తు.చ. తప్పకుండా రెండు తెలుగు రాష్ట్రాలలోను పునరా వృతమయింది. ఈ ఉదంతంలో శాసనసభ/శాసనమండలి సభ్యులను కొంద రిని కొనుగోలు చేయడానికి సంబంధించి తెలంగాణ ప్రాంత పాత్రికేయ సంఘం నాయకుడొకరూ, టీఆర్ఎస్ వారూ పడిన శ్రమ విలువ ఎంతటిదో టీడీపీ, మావోయిస్టులు చేసిన వర్ణనలలో బయటపడిపోయింది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ మంత్రం ఫలిస్తోంది. ఈ చేర్పుల కార్యక్రమాన్ని అధికార పార్టీ (టీఆర్ఎస్) వేగి రం చేయడంతో విపక్షాలకు (కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ పార్టీ, ఇండి పెండెంట్లు) పాలుపోని పరిస్థితి దాపురించింది. కాంగ్రెస్, టీడీపీ సభ్యులలో నైరాశ్యం నెలకొంది. ఐదు నెలల వ్యవధిలోనే 9 మంది ఎమ్మె ల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార పార్టీ టీఆర్ఎస్లో చేరిపోయారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు సాగుతున్న దశలో టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీలకు చెందిన ముఖ్యులు విడతల వారీగా గులాబీ గూటికి చేరుతున్నారు. ఆయా పార్టీలు వారి వారి ప్రతినిధులను కాపాడుకోలేక నానా అగచాట్లు పడుతున్నాయి. విపక్షాల ఎమ్మెల్యేలను.. ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులను తెరాస తన వైపు తిప్పుకుంటూ భవిష్యత్తుకు గట్టి పునాదులు వేసుకుంటున్నది (‘తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ నాయకులలో ఒకరు రాసిన పుస్తకం ఆధారంగా). అంటే ఈ చర్య (టీఆర్ఎస్ చేపట్టిన ఆకర్ష్ ఫలితంగా జరిగిన చేర్పులు) ఏ ప్రతి చర్యకు దారి తీసింది? ‘ప్రతి ఒక్క చర్యకూ ప్రతి చర్య కూడా ఉంటుంది’ అని భౌతిక శాస్త్రంలో ఒక సూత్రం గురించి న్యూటన్ చెప్పింది, రాజకీ యాలలో కూడా వర్తిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ నాయకుడి పరంగా దాని నామినేటెడ్ సభ్యుడిని ‘దేశం’ నాయకత్వం తన వైపు తిప్పుకోవడానికి ప్రలోభ పెట్టిందన్న ఆరోపణకు పునాది అయింది. ఫోన్ ట్యాపింగ్లతో ఇరుపక్షాలు నడవడానికి ఆస్కారం ఏర్పడింది. ఈ పరిణామం సందర్భంగా టీడీపీ వారు ఎదురు ప్రశ్నతో ముందుకు దూసుకువచ్చారు. ‘అసలు తెలంగాణ శాసనసభలో ఉన్న 85 ఓట్లలో 63 మాత్రమే టీఆర్ఎస్కు చెందినవి కాగా ఐదు ఎంఎల్సీ సీట్లకు (ఒక సీటు అదనంగా) ఎందుకు అర్రులు చాచింది? టీడీపీ ఎమ్మెల్యేలని ప్రలోభపెట్టి టీఆర్ఎస్ వైపు గుంజుకున్నప్పుడు టీఆర్ఎస్కు నైతిక విలు వలు గుర్తుకు రాలేదా?’ ఇదంతా ఇసుక తక్కెడ పేడ తక్కెడ వ్యవహారం. అందరిదీ ఒక్కటే దారి ఇక్కడ మరుగున పడుతున్న మరో వాస్తవం - తమ పార్టీ తరఫున ఎన్నికైన ఇద్దరు పార్లమెంట్ సభ్యులను ప్రలోభంతో టీడీపీలోకి లాక్కొన్నవేళ ఈ నీతి ఆ పార్టీకి గుర్తుకు రాలేదా అంటూ సరిగ్గా ఇదే ప్రశ్నను వైఎస్ఆర్సీపీ కూడా సంధించవలసివచ్చింది. ఈ గొలుసుకట్టు పరిణామాలు ఒక విషయాన్ని నగ్నంగా నిరూపిస్తున్నాయి- ప్రజాస్వామ్యం పేరిట దాదాపుగా అన్ని రాజకీ యపక్షాలు అదే ప్రజాస్వామ్యం వినాశనానికి సమిధలు పేర్చుతూ వచ్చాయి. ఒక పార్టీ నుంచి వేరే పార్టీలోకి దూకే శాసనకర్త ముందుగా పార్టీకి రాజీనామా ఇవ్వకుండానే ఈ ఫిరాయింపునకు పాల్పడడం, దీనిని న్యాయ వ్యవస్థ కూడా అడ్డుకోలేకపోవడం సరైన పంథా కాదని గుర్తించాలి. ఇందువల్ల ప్రజాస్వా మ్యం వర్ధిల్లడానికి దోహదపడే పరిస్థితులకు రక్షణ ఉండదని కూడా తెలుసుకోవాలి. మావోయిస్టులు విడుదల చేసిన ఒక ప్రకటనలో - రెండు రాష్ట్రాలలో ఓటుకు నోటు కేసుతో ప్రమేయం ఉన్న పాలకులపైన, సంపన్న కార్పొరేట్ కంపెనీల నుంచి మామూళ్లు వసూలు చేసుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల పాలకులపైన చర్య తీసుకోవాలని కోరడం కొస మెరుపు. ఇక్కడ జరుగుతున్న రాజకీయ అవినీతి ప్రవహసనాలకు ముగింపుగా, విరుగుడుగా ఈ చర్యలు తీసుకోవాలని ఆ ప్రకటనలో అభిప్రాయపడ్డారు. ఇంత జరిగినా తేలని విష యం ఒకటి ఉంది. ఏ చంద్రుడు ఏ చంద్రుణ్ణి అమావాస్య చీకట్లోకి నెడుతు న్నాడు? అవసరమైతే శాసనసభనే రద్దు చేసేస్తానని చెప్పిన చంద్రుణ్ణి ఏ రాహుకేతువులు మింగబోతున్నాయి? నిజానికి గురుశిష్యులైన ఇద్దరు చంద్రుల మధ్య ఇప్పట్లో సయోధ్య సాధ్యమేనా? విభజనతో దేశవ్యాప్తంగా అభాసు పాలైనా, అభివృద్ధి పథంలో అయినా తెలుగువారందరినీ ఏకతా టిపైకి తీసుకురాగల శక్తి నిరంకుశ పాలకులకు ఉందా? పైన చెప్పుకున్న రావిశాస్త్రి మాటే చివరికి నిజమవుతుందా? చూడాలి! (వ్యాసకర్త మొబైల్: 9848318414) - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు