‘అక్కడ అనాథల ఆక్రందన. అక్కడ అసహాయుల ఆర్తనాదం. అక్కడ పేదల కన్నీటి జాలు. అదే సుమా కోర్టు....’ సుప్రసిద్ధ రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి అరవై రెండేళ్లనాటి ‘న్యాయం’ కథలో గుండెల్ని పిండే వాక్యాలివి. ఈ అనాథల్లో, ఈ అసహాయుల్లో, ఈ నిరుపేదల్లో మహిళలకు మరిన్ని కష్టాలు! ఆలస్యంగానైనా మన సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయంలో ప్రశంసనీయమైన పని చేసింది. న్యాయస్థానాల్లో సాగే వాదప్రతివాదాల్లో, విచారణల్లో, తీర్పుల్లో మహిళలకు సంబంధించి దశాబ్దాలుగా ఎంతో అలవోకగా వాడుతున్న పదాలను ఇకపై ఉపయోగించడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు నిర్దేశించింది.
ఆ పదాలకు ప్రత్యామ్నాయంగా ఏయే పదాలను ఉపయోగించాలో వివరిస్తూ బుధవారం ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. వ్యవస్థలన్నీ ఎక్కడినుంచో ఊడిపడవు. సమాజంలో ఉండే అసమానతలు, వివక్ష, ఆధిపత్య ధోరణులు వంటి సమస్త అవలక్షణాలూ వ్యవస్థల్లో కూడా ప్రతిఫలిస్తుంటాయి. న్యాయస్థానాల్లో ఈ పెడధోరణులు ఉండరాదని విశ్వసించి, అందుకోసం కృషి చేసిన న్యాయమూర్తులు లేకపోలేదు. కానీ వ్యక్తులుగా కృషి చేయటం వేరు, వ్యవస్థే తనంత తాను సరిదిద్దుకునేందుకు పూనుకోవడం వేరు.
వృత్తి ఉద్యోగాలరీత్యా సరేగానీ... పౌరుల్లో అత్యధికులు కేసుల్లో ఇరుక్కొని కోర్టు మెట్లెక్కాలనీ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలనీ కోరుకోరు. మహిళల్లో ఈ విముఖత మరింత ఎక్కువ. ఇతరచోట్ల కంటే అక్కడ లింగ వివక్ష అధికం కావటమే ఇందుకు కారణం. మరీ ముఖ్యంగా కింది కోర్టుల్లో మహిళల పట్ల ఉపయోగించే భాష, సంబోధనలు అమాన వీయంగా ఉంటాయి. పర్యవసానంగా న్యాయం కోసం వెళ్లేవారికి అవమానాలే మిగులుతున్నాయి.
మన రాజ్యాంగం అన్ని అంశాల్లో సమానత్వాన్ని ప్రబోధించింది. లింగ, వర్ణ, జాతి, కుల, మతాలను ఆధారం చేసుకుని వివక్ష ప్రదర్శించరాదని నిర్దేశించింది. ఇందుకు రాజ్యాంగ పీఠిక మాత్రమే కాదు... 14, 15, 16 అధికరణలతోపాటు 325 అధికరణం కూడా సాక్ష్యాలు. ఆదేశిక సూత్రాల్లో సైతం లింగ సమానతను సాధించటానికి ప్రభుత్వాలు పాటుపడాలన్న ఆకాంక్ష వ్యక్తమైంది.
లింగ వివక్షకు తావులేకుండా పౌరులందరికీ పనిచేసే హక్కు కల్పించడంతోపాటు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 39(డి), 41 అధికరణలు నిర్దేశించాయి. కానీ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా ఇవి విరగడ కాలేదు. మహిళల విషయంలో ఎలాంటి దురాచారాలు, పెడ ధోరణులు అలుముకుని ఉన్నాయో మన రాజ్యాంగ నిర్మాతలకు సంపూర్ణ అవగాహన ఉంది.
అందుకే వాటిని రూపుమాపటానికి పూనుకొన్నారు. దానికి అనుగుణంగా కాలక్రమంలో ప్రభు త్వాలు చాలా చట్టాలు తీసుకొచ్చాయి. కానీ దురదృష్టమేమంటే అమలు చేసే వ్యవస్థలు సైతం పితృస్వామిక భావజాలంలో కూరుకుపోవటంతో సమానత్వం అసాధ్యమవుతోంది. తమ ముందున్న కేసులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తీర్పు చెప్పవలసిన న్యాయమూర్తులు సైతం విచారణ క్రమంలో కావొచ్చు, తీర్పుల్లో కావొచ్చు... మహిళలకు సంబంధించి సమాజంలో ఉన్న పెడ ధోర ణులను ప్రతిబింబించే పదాలను వాడుతుంటారు.
ఒక్కోసారి వాంఛనీయం కాని వైఖరిని ప్రదర్శి స్తుంటారు. ఉద్దేశపూర్వకం అయినా కాకపోయినా, వాటివల్ల మౌలికంగా న్యాయం తారుమారు కాకపోయినా... మన రాజ్యాంగం నిర్దేశించిన విలువలకు, విధానాలకు ఆ వైఖరి, ఆ పదాల వాడకం విరుద్ధమైనవి. ఈ విషయంలో రెండో మాటకు తావులేదు. వ్యభిచారం కేసుల్లో, వివాహేతర సంబంధంలో ఉన్న పురుషులకు ప్రత్యేక పదాలు లేవు.
కానీ స్త్రీ విషయంలో అలా కాదు... వేశ్య, వ్యభిచారిణి, ఉంపుడు కత్తె, కాముకి అనే అర్థాలు వచ్చే రకరకాల పదాలు ఇంగ్లిష్‌లో ఉన్నాయి. కేసుల విచారణ సమయంలో న్యాయవాదులు, న్యాయమూర్తులు వీటిని యధేచ్ఛగా ఉపయోగిస్తున్నారు. అంతేకాదు... రెచ్చగొట్టే దుస్తులు, పెళ్లికాకుండానే తల్లయిన యువతి వంటివి వాడుతున్నారు.
2012 డిసెంబర్‌లో దేశ రాజధాని నగరంలో కదిలే బస్సులో ఒక యువతిపై మూకుమ్మడి అత్యాచారం జరిగాక కఠినమైన నిర్భయ చట్టం అమల్లోకి వచ్చింది. అత్యంత అమానవీయమైన, దుర్మార్గమైన ఆ ఉదంతం తర్వాత సమాజపు ఆలోచనల్లో పూర్తి మార్పు వస్తుందనీ, మహిళల పట్ల చిన్నచూపు చూసే ధోరణులు తగ్గుతాయనీ అనేకులు ఆశించారు.
కానీ సమాజం మాట అటుంచి న్యాయస్థానాల ఆలోచనా ధోరణే పెద్దగా మారలేదు. ఒక అత్యాచారం కేసులో నేరగాడిని నిర్దోషిగా పరిగణిస్తూ యువతులు శారీరక సుఖాలను ఆశించి తమంత తాము పురుషులతో వెళ్లడానికి సిద్ధపడి ఆ తర్వాత నిందపడుతుందన్న భయంతో కిడ్నాప్, అత్యాచారం కథలల్లుతున్నారని ఒక న్యాయమూర్తి 2013లో వ్యాఖ్యానించారు. సమాజంలో ఇలాంటి ధోరణి పెరుగుతున్నదని ఆయన ఆందోళన కూడా వ్యక్తం చేశారు.
అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి 2020లో కర్ణాటక హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది! అత్యాచారానికి గురైన యువతి ఆ వెంటనే నిద్రపోయి, మరునాడు కేసు పెట్టిందనీ, కనుక ఆమె ఫిర్యాదులో నిజాయితీ లేదనీ తేల్చారు. నిరంతర చలనశీలత సమాజ మౌలిక లక్షణం. మారుతున్న కాలానికి అనుగుణంగా భాష మారాలి.
ప్రవర్తన, వైఖరి సంస్కారవంతం కావాలి. అది న్యాయస్థానాల నుంచే ప్రారంభం కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ భావించటం ప్రశంసనీయం. 19వ శతాబ్దం నాటి చట్టాలను మారుస్తూ ఈమధ్యే మూడు కొత్త బిల్లుల్ని ప్రవేశపెట్టిన కేంద్రం కూడా ఈ కోణంలో వాటిని పునఃసమీక్షించుకుని లింగ వివక్ష ధోరణులున్న నిబంధనలను సవరించుకుంటే మంచిది.
ప్రశంసనీయమైన ప్రయత్నం
Published Sat, Aug 19 2023 12:23 AM | Last Updated on Sat, Aug 19 2023 4:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment