అమ్మా.. ఎండెప్పుడొస్తుందమ్మా? | Enda Story Written By Rachakonda Viswanatha Sastry | Sakshi
Sakshi News home page

ఎండ

Published Sun, Mar 1 2020 10:19 AM | Last Updated on Sun, Mar 1 2020 10:19 AM

Enda Story Written By Rachakonda Viswanatha Sastry - Sakshi

మన ఊరిచివర (కిందటేడు వ్యాపారం గురించి కలకత్తాకి వెళ్తూ వెళ్తూ దార్లో అకస్మాత్తుగా చచ్చిపోయిన) మనూరి పాత మొఖాసాదార్‌గారి తోటలో ట్రంకురోడ్డుకి పక్కగా. చీకటిమర్రి చెట్టుకింద ఒంటిగా నిల్చున్న పాడుపడ్డ గదిలో కాపరం ఉంటూ, ఊళ్ళో ఇంటింటికి తిరిగి తిరిగి అప్పడాలు ఒడియాలు అమ్ముకు బతికే శారదమ్మగారి ఆరేళ్ళ కూతురు–సుందరం–ఓ రోజు సాయంకాలం వాళ్ళమ్మని...
‘‘అమ్మా, అమ్మా! ఎండెప్పుడొస్తుందమ్మా?’’ అని అడిగింది.
సాయంకాలం చాలా చీకటిగా, చాలా భయంగా, మరో ఘడియలోనో క్షణంలోనో మనింటికి రాబోయే చావులా ఉంది. మూడ్రోజుల పాటు మన్నూ మిన్నూ  ఏకమైపోయినట్టనిపించి ఇవాళ నాలుగోరోజు ఉదయానికి కాస్త తెరపిచ్చిందే కాని  ఆకాశం మాత్రం రవ్వంత మేరయినా విడవకుండా మబ్బుతో దట్టంగా మూసుకుపోయే ఉంది. వర్షంతో పాటు ఈ మూడ్రోజులు చలిగాలి కూడా ప్రచండంగా వీచివీచి నానా భీభత్సం చేసింది. ఈరోజు మాత్రం గాలి బాగా సద్దుమణిగింది. శారదమ్మ గది వెనక నున్న పాతతోటలో చెట్లన్నీ కూడా పగవాడు తెరిపివ్వకుండా తీసిన పిడుగు దెబ్బకి తట్టుకోలేక చెల్లాచెదురైపోయి అలిసిపోయిన మరింక కదల్లేక శవాల్లా ఉండిపోయిన బీదవాళ్ళ కోటలోని పేదజనంలా ఉన్నాయి.

‘‘అమ్మా! ఎండెప్పుడొస్తుందమ్మా?’’ అని అడిగింది సుందరం.
కూతురు వేసిన ప్రశ్న శారదమ్మ వినిపించుకోలేదు. ఆవిడ, ఆ కిటికీల్లేని చీకటిగది గుమ్మం ముందున్న సన్నపాటి నడవలో కూర్చొని పాత హరికెన్‌లాంతరు చిమ్నీ బీటలు విడిపోకుండా నెమ్మదిగా భద్రంగా తుడుస్తోంది.
సుందరం తన ఆరేళ్ళ జీవితంలోనూ కూడా ఇంత గాలీవర్షం ఎన్నడూ ఎరగదు. మొదటిరోజున సరదా పడ్డది కాని రెండో రోజు రాత్రికల్లా ఆ పిల్లకి భయం పట్టుకుంది. మూడోరోజల్లా ఈ వర్షం మరింక తగ్గదు కాబోలు. ఎండ మరింక రాదు కాబోలు అనుకొని బెంగ పెట్టేసుకొని ఏడుస్తూ కూర్చుంది. ఈరోజు పొద్దున్నించీ కూడా వర్షం లేకపోవడంతో ఆమెక్కొంచెం ధైర్యం వచ్చింది. కాని, ఎండ తప్పక రేపొస్తుందని అమ్మ కూడా చెప్తే కాని ఆ పిల్లకి పూర్తిగా నమ్మకం కదురదు.
‘‘అమ్మా! ఎండమ్మా ఎండ! ఎండ ఎప్పుడొస్తుందమ్మా?’’ అని మళ్ళీ అడిగింది సుందరం.
సుందరానికి ఎండంటే ఎంతో ఇష్టం.
వాళ్ళ నాన్న పైనింకా ఉన్నప్పుడు, రెండేళ్ళ కిందట, కార్తీక మాసంలో వాళ్ళ నాన్నతోనూ అందరితోనూ కలిసి సుందరం వనసంతర్పణకి వెళ్ళింది. నాన్నతో మిల్లులో పన్చేసే మిగతా పనివాళ్ళూ, వాళ్ళ ఆడవాళ్ళూ, పిల్లలు అంతా కూడా వచ్చేరారోజున. బంగారంలాంటి ఎండని ఆ ఒక్కరోజే చూసింది. అక్కడ కొండవార రాజుగారి పువ్వులతోటలో అంతా చీకటిలోనే వెళ్ళి దిగి అక్కడ వండుకొని తినుకొని, ఆడుకొని, పాడుకొని రోజు రోజుల్లా హాయిగా గడిపేరు.

ఆవేళ పొద్దున్నే కొండ మీంచి నెమ్మదిగా కిందికి జారిన ఎండ నీలపు పొగమంచుతో కలిసిపోయి నెమ్మదిగా పురివిప్పగా మెరిసే నెమలిపింఛంలా మెరిసింది. పదిగంటలకి ఎండ వెచ్చగా వెచ్చగా ఉంటూ కమ్మగా వండిన వంటవాసనల్తో కలిసిపోయి అన్నం తినిపించే అమ్మచూపులా హాయిగా ఉంది. ఒంటిగంటకి బాగా తళుకెక్కిన ఎండ కొత్త వెండిగిన్నెలా తళతళ మెరిసింది. ఎండంటే సుందరానికి ఎంతో ఇష్టం. కాని, ఎండని సరిగ్గా చూడ్డానికి ఆ పిల్లకి ఎప్పుడో కాని అవకాశం ఉండదు. శారదమ్మ ఊళ్ళోకి పోకపోతే ఆవిడకి దినం గడవదు. అంచేత, సుందరం ఇంటిపట్టునే ఉండితీరాలి. ఇంటి కాపలా ఉండి, చెల్లెల్ని చూసుకోవాలి. అన్నయ్య ఎక్కడికీ పారిపోకుండా చూసుకోవాలి. వాళ్ళుండే గది వెనక కొండదాకా కొండదాకా ఉన్న పాతమామిడితోట ఎప్పుడూ చీకటిగా ఉంటుంది. నాలుగైదేళ్ళయి ఆ తోట పూతా లేదు. కాపూ లేదు.
ఎదరగా ఉన్న రోడ్డెక్కూడా రెండు వైపుల్నించీ ఎత్తుగా దట్టంగా కుమ్ముకున్న చెట్లతో అదో పొడవాటి గుహలా ఉంటుంది.

సుందరం ఉండే పాతగదికి వీధి వైపుకి ఒక్క గుమ్మం తప్ప కిటికీల్లేవు. గదంతా చాలా చీకటిగా ఉంటుంది. గదికి ఎదురుగా కొంచెం పక్కగా ఉన్న పాతమర్రిచెట్టు. కదల్లేని ముసలిరాక్షసిలా చీకటిగా భయంకరంగా ఉంటుంది. కిందనున్న గదిలోకి ఒక్కచుక్కయినా రానీకుండా  ఎండను అదే మింగేస్తుంది. ఇంట్లో  ఎంతగా రాదో అంతగా రావాలి సుందరానికి.
చుట్టుపక్కల మైలు దూరంలో ఎక్కడా ఇళ్ళులేవు. రోడ్డు మీద జనసంచారం కూడా అట్టే ఉండదు. అమ్మ లేనప్పుడు వీధి గుమ్మంలో చెల్లెల్ని పక్కన కూర్చోబెట్టుకొని బితుకూ బితుకూ కూర్చుంటుంది సుందరం. ఆ పిల్ల ముఖంలో స్పష్టంగా కనిపించేవి కళ్ళే. మర్రిచెట్టుకి చాలా అవతల మిగిలిపోయిన ఎండ ఆ కళ్ళలో బలహీనంగా మెరుస్తుంది.
ఆ పిల్లనోరు, చలిగాలికి ముడుచుకుపోయిన గులాబి మొగ్గలా చాలా చిన్నదిగా ఉంటుంది. గట్టిగా గెంతినా నవ్వినా ఆమెకు దగ్గొస్తుంటుంది. ప్రాణంతో ఉన్న సుందరానికి నీడగా పడిన సుందరంలా ఉంటుంది సుందరం. అందుకే ఆ పిల్లని చూస్తూ చూస్తూ ‘ఈ నీడ ఎప్పుడు మాయమైపోతుందో’నని శారదమ్మ అప్పుడప్పుడు భయపడుతూ ఉంటుంది.

వర్షం పడిన మూడ్రోజులూ ఎక్కడికీ పోకుండా శారదమ్మ ఇంటిపట్టునే ఉండిపోయింది. సుందరానికి అది కొంచెం నయం అనిపించింది. ఇవాళ వర్షం పళ్ళేదు. రేపు ఎండ రాదా అనుకొంది సుందరం. ఆకాశంలోని మబ్బులు కొత్త బలాన్ని తెచ్చుకొంటున్నాయని ఆ పిల్ల గ్రహించుకోలేదు. కాని, ఆకాశం వైపు చూస్తే మాత్రం ఆమెకి బెంగ తగ్గడం లేదు.
‘‘అమ్మా! అమ్మా! ఎప్పుడొస్తుందమ్మా ఎండా?’’ అంటూ తల్లి భుజం పట్టుకు ఊపుతూ మళ్ళీ అడిగింది సుందరం.
‘‘రేపు రావచ్చు తల్లీ!’’ అంది శారదమ్మ చిమ్నీ నెమ్మదిగా తుడుస్తూనే.
‘‘ఎండొస్తుందమ్మా?’’
‘‘ఎందుకు రాత్తల్లీ?’’
శారదమ్మ అలా అనగానే సుందరం ఎగిరి గంతేసి, తల్లి పక్కనే కూర్చున్న నాలుగేళ్ళ చెల్లెలు సరూతో, ‘‘చెల్లీ! చెల్లీ! రేపు ఎండొస్తుందిటే. ఎండ!! మరంచేత దేవుడికి దండం పెట్టమ్మా!’’ అంది.
సరూ, అక్కమాట వినగానే ఆ పిల్ల వీధి వైపు తిరిగి ముద్దుగా ఓ దండం పెట్టింది. సుందరం చెల్లెల్ని ముద్దాడి, అక్కణ్నుంచి గదిలోకి పరిగెట్టింది. ఆ చీకట్లో గోడవార కర్రపెట్టె మీద కూర్చున్న అన్న దగ్గరికి వెళ్ళి, ‘‘అన్నా! ఒరే! ఎండరా ఎండ! ఎండ రేపొస్తుందిట!’’ అంటూ సంతోషంతో కేకలు వేసింది. అన్న–అంజిగాడు సుందరం కంటే రెండేళ్లు పెద్ద. వాడికి కాళ్లూ చేతులూ పెద్దవిగా ఉంటాయి. తల మాత్రం చెంబులా చిన్నదిగా ఉంటుంది. వాడు ఎండా, నీడా అంటే తెలుసుకోలేడు. అన్నం కలుపుకు తినలేడు. వాడికి మాటలు రావు. వాడు వెర్రివాడు. వాడెప్పుడూ ఆ కర్ర పెట్టె మీదే కూర్చుంటాడు. లేపోతే దాని మీదే పడుకుంటాడు. ఎప్పుడూ నోట్లో వేలు పెట్టుకు కనిపిస్తాడు.

సుందరం గెంతుకుంటూ తడిపరికిణీ పరపరలాడించుకుంటూ సరూ దగ్గిర కొచ్చి, ‘‘లేవే సరూ! రేపు ఎండొచ్చేదాకా ఆటకుందాం రావే’’ అంటూ చెల్లెల్ని చెయ్యిపట్టుకు లేవదీసింది. ఇద్దరూ రంయిమంటూ నడవ మీంచి వాకిట్లోకి గెంతి, అక్కడ నిలవనీళ్లలో  చప్పట్లు కొడుతూ ఆడ్డం మొదలుపెట్టేరు.
‘‘ఎండొస్తుందీ. రేపు ఎండొస్తుందీ! నెమిలికన్నులా. వెండిగిన్నెలా ఎండొస్తుందీ! ఎంతోచక్కని ఎండోస్తుందీ!’’ అంటూ సుందరం  పాడే పాట శారదమ్మ చెవిలో పడుతోందేకాని, ఆవిడ అదేదీ సరిగా వినడం లేదు. శారదమ్మకి దేవుడి యెడల భక్తెక్కువ. ఎన్ని విషయాల్లో భగవంతున్ని  ఎంత ఎడం పెట్టినా, ఆవిడ మాత్రం ఆయన ముగింట కదలకుండా  మొండిగా కూర్చుంది. ఏడాది కిందట, ఆవిడ పెనిమిటి తను పనిచేసే మిల్లు తాలుకు లేబర్‌ వ్యవహారాల్లో  కూలివాళ్ల తరపున తగువుల్లో ఇరుక్కొని దెబ్బలాటల్లో చిక్కుకొని, ఖూనీ కేసుల్లో అక్రమంగా ఈడవబడ్డ, యావజ్జీవ కారాగారవాసశిక్ష అనుభవించడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఆమెకు దేవుడంటే కొంచెం–అతి కొంచెం చిరుకోపం వచ్చింది.

‘‘మీ అల్లుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. పిల్లలకి తిండి పెట్టాలంటే ఇంట్లో చీకటి తప్ప ఇంకేంలేదు. మాయందు దయ ఉంచి ఒక్కసారి రా నాన్నా!’’ అంటూ ఎందరి చేత ఎన్ని కబుర్లు పంపినా, ఎన్ని అర్జంటు టెలిగ్రాములు కొట్టినా ఎంతకీ రానట్టి డబ్బుగల తండ్రి  మీద పేదింటి కోడలైన ఆడకూతురికి కోపం వచ్చి అలిగినట్టు ఆమె  ఆ రాత్రి భగవంతుడి మీద కోపం తెచ్చుకుని అలిగింది. కాని ఆ కోపంలో కాఠిన్యం లేదు. మర్నాటికల్లా ఆమె సర్దుకుంది.
∙∙ 
ఆవిడ రాత్రికి దీపం సంపాదించడంలో గొడవలో మునిపోయింది. లాంతరు వెలిగిద్దామంటే అగ్గిపెట్టి బాగా నానిపోయింది. పుల్లలు చూస్తే మూడే ఉన్నాయి. అందులో రెండప్పుడు వెలక్కుండా ఒట్టిపోయి విరిగిపోయేయి. మూడోది–దేవుడి దయుంటే వెలుగుతుంది. లేకపోతే లేదు. ఈరోజుకి దేవుడికి శారదమ్మ యెడల దయలేదు. ఈ రాత్రికి ఈ ఇల్లంతా చీకట్లో ఉండవలసిందనే అతని అభిప్రాయం. అంచేత, చీకటి మరీ ఎక్కువ కాకుండా పిల్లలకి అన్నాలు పెట్టేస్తే అందరూ వేగిరం కళ్లు మూసుకొని పడుకోవచ్చు. తెలివున్నంతసేపే కాని తెలివి తప్పిపోయేక దీపం ఉన్నా ఒకటే, లేపోయినా ఒకటే.
పాత మొఖాసాదార్‌గారి భార్యకి తమ యెడల భగవంతుడి దయవల్ల–కరుణ కలగబట్టి ఇందులో ఈపాటి తలదాచుకోనిచ్చింది. వారానికి వంద అప్పడాలు  పుచ్చుకోవడం తప్ప, అద్దిచ్చినా పుచ్చుకొంది కాదు.

రెండుపూట్ల వంట చేసి పిల్లలకి కాస్త వేడన్నం రెండు పూట్లా పెడదామంటే ఈ వర్షం వల్ల  ఎక్కడా ఓ కాణీ అయినా పుట్టకుండా ఉంది. వర్షాల వల్ల కూరా నార దొరకని ఈరోజుల్లో అప్పడాలూ, వడియాలూ పేరయ్య కొట్టు మీద వేడివేడి పకోడిల్లాగ జోరుజోరుగా చెల్లిపోను. కాని ఏంచేస్తాం? ఇంట్లో పిండి లేదు. ఎండ లేదు.
‘‘అమ్మ! కంచాలేసుకున్నాం అన్నం పెట్టమ్మా!’’ అంది సుందరం.
మధ్నాహ్నం భోజనాలవగా మిగిలిన అన్నం వీధి వరండాలోకి గిన్నెతో పట్టుకొచ్చింది శారదమ్మ. 
‘‘అటు చూడమ్మా! ఎంత చీకటిగా ఉందో!’’ అంది సుందరం. 
ఆకాశంకేసి చూసేసరికి శారదమ్మకి నిజంగా చాలా భయం వేసింది.
‘‘అమ్మా! అలా చూస్తున్నావేంటమ్మా? ఎండ రేపు రాదా?’’ అని అడిగింది సుందరం.
‘‘ఏమోనమ్మా? ముందు మీరంతా భోంచేసి వేగిరం పడుకోండి!’’

‘‘ఎండరాదేంటమ్మా?’’ అని మళ్ళీ అడిగిన సుందరం కళ్ళలో నీళ్ళు తిరిగేయి. అమ్మ ముఖంలో ఎండ రేపోచ్చే సూచన్లు కనిపించలేదాపిల్లకి.
‘‘ఎందుకమ్మా నీకా బెంగ? ఎండ తప్పక రేపొస్తుంది. ముందు భోంచెయ్యి. బెంగపెట్టుకోక!’’ అంది శారదమ్మ. 
‘‘నేను భోంచేయనమ్మా!’’ 
‘‘అల్లరి చేయకమ్మా. సుందరం!’’
‘‘రేపు ఎండొస్తుందా?’’  
‘‘ఒస్తుంది. భోంచెయ్యి’’
‘‘నాన్నొస్తాడన్నావు. రానేలేదు. నువ్విలాగే ఉత్తుత్తి మాటల్చెప్తావమ్మా’’
‘‘మన చేతుల్లో ఏవుందమ్మా? దేవుడి దయకలగాలి. నాన్న రావాలి’’
‘‘దేవుడికి దయెప్పుడు కలుగుతుందమ్మా?’’
 ‘‘కలుగుతుంది తల్లీ! బెంగపడక భోంచెయ్యి!’’ అంది శారదమ్మ. 

అంతలో సరూ, ‘‘అమ్మా అగ్గి! ఆమ్మ! అగ్గి!’’ అని కేకలు వేసింది. చూస్తే అవి చీమలు. శారదమ్మకి ఏంచేయాలో పాలుపోక అలా చూస్తూ నిల్చుంది. వీధిలో సుమారు రెండువందల మంది ముష్టివాళ్ళు గోనెలూ, జోలెలూ, డొక్కులూ, కుండలు, కంపలు పట్టుకొని మోసుకొని తొందర తొందరగా ఊరి వైపు నడుచుకుంటూపోతున్నారు. వాళ్ళంతా శారదమ్మ కాపురం ఉండే గదికి కొంతదూరంలో ఉండే సాధూమఠంలో ఉంటూంటారు. ఇవాళ పొద్దున కాబోలు, మఠం గోడొకటి వర్షానికి నానిపోయి కూలి పోయిందన్నారు. రాత్రికి వర్షం తిరిగి వచ్చే సూచన్లు చూసి వాళ్ళంతా మరెక్కడైనా తలదాచుకొందికి పోతున్నట్టున్నారు.
వాళ్ళనలా చూస్తూ శాదమ్మ మౌనంగా నిల్చుండి పోయింది. 
‘‘అమ్మా! వాళ్ళెందుకు అలా పారిపోతున్నారు?’’ అని అడిగింది సుందరం.
‘‘భయం చేత అలా పారిపోతున్నారమ్మా’’
‘‘ఎందుకమా వాళ్ళకి భయం?’’
‘‘వాళ్ళ బతుకులకి ఎండ లేదమ్మా! అందుకు భయం!’’
‘‘మరి, మనకి ఎండ ఉంటుందా అమ్మా!’’
‘‘దేవుడికి దయుంటే అందరికీ ఉంటుంది తల్లీ!’’
‘‘దేవుడికి మనందరి మీద కోపమా అమ్మా?’’
‘‘లేత్తల్లీ!’’ అంది శారదమ్మ.

శారదమ్మ మూడు కంచాల్లోనూ ఉన్న అన్నం మళ్ళీ గిన్నెలోకి ఎత్తి, మూడుసార్లు నీళ్ళతో కడగ్గా చీమలన్నీ తేలిపోయాయి. పిల్లలకి అన్నం పెట్టడం కోసం చీమల కడుపులు కొట్టవలసొచ్చిందనేసరికి ఆమెకెందుకో కాని కడుపులో దేవేసినట్టయింది. తడి అన్నంలో మజ్జిగనీళ్ళు వేసి ముగ్గురు పిల్లల చేతా శారదమ్మ భోజనాలు చేయిస్తుండగా వర్షం యథాప్రకారం నిన్నా మొన్నా అటు మొన్నట్లాగే పట్టుకొంది.
పిల్లల భోజనాలయాక, శారదమ్మ గిన్నె కంచాలు కడిగేసి గదిలోకి వెళ్ళిపోయిన పిల్లల్ని బుద్దిగా పడుకోమన్చెప్పి కేక వేసింది. వర్షం జోరుగా తెగ జోరుగా పడుతోంది. వర్షం చేసేచప్పుడికి, కేకలు వేస్తేగాని నడవలో మాట గదిలోకి వినిపించడం లేదు.
వెర్రిపిల్లడు నోట్లో వేలు పెట్టుకుని గోడవార కర్రపెట్టె మీద ముణుచుకు పడుక్కున్నాడు. ఆ పిల్లాడి మీద తడి పూర్తిగా ఆరని పాతచీరె మడతలు పెట్టి కప్పింది శారదమ్మ. మరోవార పొట్టి మడతమంచం మీద సరూ, సుందరాలు తడారని పాతబొంత కప్పుకు పడుకున్నారు. గదంతా యథాప్రకారం కురవడం ప్రారంభించింది.
బాగా చీకటిపడి గంటే అయిందో, రెండు గంటలే అయిందో, నడవ పక్క వీధి గుమ్మానికి చేర్లబడి ఏదో ఆలోచిస్తూ కూర్చుంది శారదమ్మ. ఆమెకు నిద్ర రావడం లేదు. వర్షంలోకి అలా రెప్ప వెయ్యలేకుండా అదేపనిగా చూస్తూ ఆలోచిస్తోంది.
చీకట్లో వర్షధారలు చాలా అస్పష్టంగా కనిపించడంచేత  ఆకాశానికి, భూమికి మధ్య నీరు తప్ప మరేం ఉన్నట్టు అనిపించడం లేదు. శారదమ్మ కళ్ళంట నీరు తిరగడం ఆ చీకట్లో కనిపించడం లేదు.

తన మట్టుకు తనకి, శారదమ్మకి, తనెక్కడో ఏదో లోతు దొరకని సముద్రం లోపల గులకరాళ్ళు గుహలో తేలలేక కూలబడి కూర్చున్న రీతిగానే తోస్తోంది. ఎంతటి ప్రకాశవంతమైన సూర్యరశ్మయినా ఇంత లోతు నీటిలోకి ఇంత లోతుకి దిగదు. దిగజాలదు. ఈ మహాసముద్రపు విషపు నీటి అట్టడుక్కి ఏ యెండా, ఏ వెలుగు ఎన్నటికీ రాదు. రాజాలదు. ఈ వాదమ్మ మరింక భూమ్మిదికి తేలడానికి ఏ అవకాశం అయినా సరే ఎక్కడా లేదు. ఉండదు. ఉండబోదు.
ఆ సమయంలో శాదమ్మకి–ఎండ లేని తన బాల్యం, చలి కాలపు సాయంకాలపు ఎండలాంటి తన యవ్వనం, నీరెండయినా చోరని రాతిగోడల మధ్య ఇరుక్కున్న  తన పెనిమిటి రూపం, మెదడంతా చీకటితో నిండిన తన వెర్రికొడుకు జీవితం, ఎండ కోసం పాకులాడుతూ తనతో పాటు ఈ సముద్రపు అట్టడుగున, సముద్రమంత బరువు కిందా, ఈ చీకటి నీట్లో ఈదలేక, తేలలేక, చావలేక ఉక్కిరి బిక్కిరయి కొట్టుమిట్టాడే తన అతిచిన్న ఆడపిల్లల ఘోర పరితాపం అన్నీ గుర్తుకొచ్చి ఆమెని కుంగతీసి కలచివేయగా ఆమె కళ్ళంట జారిన కన్నీళ్ళు నడవలో రాతిగచ్చు మీద పడి, అక్కడ కురుస్తున్న నీటితో కలిసి వాకిట్లోకి కుంటుకొంటూ పోయి, అక్కణ్ణుంచి రోడ్డు మీదికి తేలి, అక్కణ్నించి కాలవలోకి దూకి ఆ రాత్రి ఆ చీకట్లో ఆ వర్షంలో ఎక్కడో ఏ చీకటి సముద్రంలోకో కాని కొట్టుకుపోయి కలిసిపోయేయి.

వెర్రిపిల్లడు కర్రపెట్టె మీద వింత జంతువులా పడుకున్నాడు.
‘‘ఎండంతా చచ్చిపోయిందంటే అక్కా? నిజం చెప్పవే!’’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సరూ చివరికి నిద్దరనే చీకట్లో మెల్లి మెల్లిగా కలిసిపోయింది. పిల్లల ఏడుపు వినిపిస్తే రాక్షసులొచ్చి పిల్లల్ని ఎత్తుకుపోతారని సుందరాన్ని ఎప్పుడో ఎవరో జడిపించేరు. ఆ జడుపు ఇప్పటికీ ఆమెని వదల్లేదు. అందుచేత, రాక్షసులెవరికీ వినిపించకుండా, బెంగతో, బాధతో చెప్పజాలని ఆవేదనతో ఆ రాత్రి అతి రహస్యంగా ఏడ్చి ఏడ్చి అలిసలిసిపోయిన సుందరాన్ని చూసిచూసి మరింక చూడలేక దయదాల్చిన చావులాంటి నిద్ర, ఆ పిల్ల కప్పుకున్న తడిబొంతలా. ఆఖరి కెలాగైతేనేం ఆమెని అతిచల్లగా కప్పింది.
చీకట్లో తెరిపి లేకుండా పడే వర్షం, కళ్ళు లేని గుండెలేని కారు నల్లని గీతల గీతల భూతంలా ఉంది.
- రాచకొండ విశ్వనాథశాస్త్రి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement