తన అపారమైన కృషి ద్వారా ఇరవయ్యో శతాబ్ది రెండో అర్ధ భాగపు తెలుగు సామాజిక, సాహిత్య జీవితం మీద అసాధా రణమైన ప్రభావం వేసిన రాచ కొండ విశ్వనాథశాస్త్రి (30 జూలై 1922–10 నవంబర్ 1993) శత జయంతి సంవత్సరం ఇవాళ మొదలవుతున్నది. ఆయన జీవితం గురించీ రచన గురించీ తలుచు కోగానే గుర్తుకొచ్చే అంశాలు–ధైర్యమైన వస్తువుల ఎంపిక, అపురూపమైన శిల్పం, సునిశితమైన విమర్శా దృక్పథం, సువిశాలమైన, లోతైన దూరదృష్టి, చురుక్కుమనిపించే వ్యంగ్యం, కవితాత్మకమైన వచనం, తీగలు తీగలుగా సాగే వర్ణనా చాతుర్యం, ఎప్పటికీ గుర్తుండిపోయే, కోటబుల్ కోట్స్‌గా పనికొచ్చే పదునైన వ్యాఖ్యలు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి సమీపంలోని తుమ్మ పాల గ్రామానికి చెందిన రావిశాస్త్రి తండ్రి న్యాయవాద వృత్తి వదిలి వ్యవసాయంలోకి దిగారు.
‘‘మా నాన్న ప్లీడరుగా పదేళ్లే ప్రాక్టీసు చేసేరు. ఆ వృత్తిలో ఉండలేక వ్యవసాయం చేసేరాయన. వ్యవసాయం చెయ్యలేక, ఇష్టం ఉన్నా లేకపోయినా ప్లీడరీ వృత్తిలోనే ఉండిపోయేన్నేను’’ అని తానే రాసుకున్నట్టు రావిశాస్త్రి ఇరవై ఏడో ఏట న్యాయవాద జీవితం ప్రారంభించి చివరిదాకా అందులోనే ఉన్నారు. సమాంతరంగా అంతకు అంత సాహిత్య కృషీ చేశారు. 1942లో బీఏ ఆనర్స్ పూర్తి చేసి, మిలిటరీ అకౌంట్స్ శాఖలో పూనా, హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నంలలో పనిచేసి, 1946–48ల్లో మద్రాసులో లా చదివి, 1949లో విశాఖపట్నంలో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. పేదలకు న్యాయం అందించడానికి చేసే కృషిలో ఆయనకు సహజంగానే న్యాయవ్యవస్థ కోరలలో చిక్కుకున్న అమాయకులు, వేశ్యలు, అక్రమ సారావ్యాపార సామ్రాజ్యాలలో అట్టడుగు అంచుల అభాగ్యులు, పెరుగు తున్న నగరంలో విస్తరిస్తున్న నేరమయ అధోజగత్ వాసులు పరిచితులూ, క్లయింట్లూ అయ్యారు.
పదమూడో ఏటనుంచే రచనమీద ప్రారంభమైన ఆసక్తి, పదిహేనో ఏట అచ్చయిన తొలి కథ, విస్తారమైన అధ్యయనం వల్ల 1949కి ముందే మొదలైన సాహిత్య జీవితానికి అటు మిలిటరీ అకౌంట్స్ ఉద్యోగంలో దేశ మంతా తిరిగి సంపాదించిన జీవితానుభవం, ఇటు న్యాయవాద వృత్తిలో అట్టడుగు ప్రజల జీవితాలతో సన్ని హిత పరిచయం, మార్క్సిస్టు దృక్పథం, రాజకీయ విశ్వా సాలు పదును పెట్టాయి. సాహిత్య సృజన సాధనలో భాగమైన అంతకు ముందరి కథలు పక్కనపెట్టినా, అల్ప జీవి నవల (1953) నుంచి ఇల్లు నవల (1993) వరకూ నిండా నాలుగు దశాబ్దాలు తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రబలంగా ప్రచండంగా వీచిన గాలి ఆయన. ఈ రెండు నవలల మధ్యలో మరొక ఐదు నవలలు (రాజు–మహిషి 1965, గోవులొస్తున్నాయి జాగ్రత్త 1966, రత్తాలు– రాంబాబు 1976, సొమ్మలు పోనాయండి 1980, మూడు కథల బంగారం 1982), డెబ్బైకి పైగా కథలు, మూడు నాటకాలు, దాదాపు రెండు వందల వ్యాసాలు, వచన రచ నలు, నేరుగా రాసిన కొన్ని కవితలు, అనేక ఉపన్యా సాలు... కనీసం మూడు వేల పేజీల సృజన.
పోలీసు వ్యవస్థ అక్రమాలు, న్యాయవ్యవస్థ అన్యా యాలు–ఆయన రాసిన ఐదారు దశాబ్దాల తర్వాత కూడా ఈ సమాజంలో కొన్ని యథాతథంగా ఉన్నాయి. ఆ మాటకొస్తే రూపం మార్చుకున్నట్టు కనబడుతున్నప్పటికీ ఇంకా దుర్మార్గంగా తయారయ్యాయి. అందువల్లనే ఆయన ఇవాళ్టికీ సజీవంగా ఉంటారు. ‘‘...రచయిత ప్రతివాడు తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకి ఉపకారం చేస్తుందో అని ఆలోచించవల్సిన అవసరం ఉందని నేను తలుస్తాను. మంచికి హానీ, చెడ్డకి సహాయమూ చెయ్యగూడదని నేను భావిస్తాను’’ అని ఆయన అలవోకగా చెప్పిన మాటలు రచయితల దృక్పథ ప్రాధాన్యతను, పాఠకుల సాహిత్యా భిరుచినీ నిర్దేశిస్తాయి.
రావిశాస్త్రి రచనల్లో ఆరు సారా కథలు మాత్రమే చది వినా ఆయన అద్భుతత్వం పాఠకుల కళ్లకు కడుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో తొలి మద్యనిషేధం అమలైన కాలంలో ఆ నిషేధాన్ని అమలు చేయవలసిన వ్యవస్థల పూర్తి సహకారంతో అక్రమ సారావ్యాపారం ఎట్లా సాగిందో, ఆ వ్యాపారంలో చిన్న చేపలను పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఎట్లా పీడించాయో, ఆ వ్యథార్థ జీవన యథార్థ దృశ్యంలో ఎంత కరుణ, బీభత్సం, విషాదం, వ్యంగ్యం, వంచన దాగి ఉన్నాయో ఆ కథలు పాఠకులకు చూపు తాయి. అందుకే ఈ కథలు 1962లో పుస్తకంగా వెలువ డినప్పుడు రాసిన ముందుమాటలో ‘‘ఏకకాలంలో అనేక రసాలను ఉప్పొంగింపజేసే కళాఖండాలను మాత్రమే నేను ఉత్కృష్ట రచనలుగా అంగీకరిస్తాను’’ అంటూ, ఆ రసాను భూతికి ‘రసన’ అనే కొత్త పేరు పెట్టి, అది తాను చార్లీ చాప్లిన్ చిత్రాలలో, పికాసో గుయెర్నికాలో, డికెన్స్ నవ లల్లో, గురజాడ రచనల్లో గుర్తించాననీ, అది రావిశాస్త్రి రచనల్లో కూడా ఉందనీ శ్రీశ్రీ అన్నాడు.
ఈ రసన సృష్టికి రావిశాస్త్రికి పునాదిగా నిలిచినది అవ్యవస్థ మీద ఆగ్రహం. ‘‘విప్లవాలూ యుద్ధాలూ లేకుండా లోకంలో న్యాయం జరిగిపోతే, దేముడికి కానీ మనకి కానీ అంతకంటే కావలసిందేముంది?!... నా గుండెల మీద కూర్చున్న పెద్దపులి మనసు మార్చుకొని సన్యాసం పుచ్చుకొని, కమండలం పట్టుకొని తావళం తిప్పుకొని వాయుభక్షణ చేసుకొంటూ హరినామ సంకీ ర్తనలో కాలం గడుపుకుంటే దానికీ నాకూ పేచీనే లేదు. దిక్కపోతేనే పేచీ.
ఇది చదివిన నా స్నేహితులు ఒకాయన చిరునవ్వు నవ్వి, మీ గుండెల మీద కూర్చున్నది పెద్దపులి కాబట్టి మారదు; కానీ ఆ కూర్చున్నది మనిషైతే మారొచ్చు కదా అన్నారు. అప్పుడు నావంతు ప్రకారం నేను చిరునవ్వు నవ్వి, వాడే మనిషైతే అలా కూర్చోనే కూర్చోడు కదా అన్నాను’’ (రాముడు, 1970) అని రాసినప్పుడు రావిశాస్త్రి వ్యక్తీకరించినది ఆ ఆగ్రహాన్నే. తన అనుభవంలోకి వచ్చిన అవ్యవస్థకు సాహిత్యంలో అద్దం పట్టిన, దాని మీద తన ఆగ్రహాన్ని వ్యక్తీకరించిన రావిశాస్త్రి ఆ అవ్యవస్థ కొనసాగి నంతకాలమూ సజీవంగానే ఉంటారు, శతజయంతి ఒకా నొక మైలురాయి మాత్రమే.
-ఎన్. వేణుగోపాల్
వ్యాసకర్త వీక్షణం సంపాదకుడు
మొబైల్ : 98485 77028
(రావిశాస్త్రి శతజయంతి సంవత్సరం ప్రారంభం)
Comments
Please login to add a commentAdd a comment