ఆర్‌ఎస్‌ఎస్‌గా నేడు అందరికీ సుపరిచితమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బహుముఖాలుగా విస్తరించడానికి కీలకమైన భూమిక పోషించినవారు గోల్వాల్కర్. మహారాష్ట్రలోని నాగపూర్ దగ్గర గల రాంటెక్‌లో 1906 ఫిబ్రవరి 19న సదాశివరావు, లక్ష్మీబాయ్ దంపతులకు మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్ జన్మించారు. తొమ్మిదిమంది సంతానంలో బతికి బట్టకట్టినది ఈయన ఒక్కరే. ప్రభుత్వ ఉద్యోగి అయిన తండ్రి తరచూ బదిలీలు కావడంతో చిన్నతనంలో దేశంలోని వివిధ ప్రాంతాలను గోల్వాల్కర్ చూశారు. అప్పటి నుంచే ఆయనలో మతపరమైన, ఆధ్యాత్మికమైన ఆసక్తి పెరిగింది. క్రైస్తవాన్ని తీవ్రంగా వ్యతిరేకించి హిస్లాప్ కాలేజీని వదిలిపెట్టి వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేరి సైన్స్ లో 1927లో డిగ్రీ చేయడంతోపాటు, 1929లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. తరువాత మెరైన్ బయోలజీ చేయడానికి మద్రాస్ వెళ్లినప్పటికీ తండ్రి పదవీ విరమణ కారణంగా పూర్తి చేయకుండానే వెనక్కి వచ్చి బెనారస్ యూనివర్సిటీలోనే జువాలజీ బోధించడం ప్రారంభించారు.
గోల్వాల్కర్ ధరించే సామాన్యమైన దుస్తులు, పొడవాటి గడ్డం కారణంగా ఆయనను గురూజీ అని పిలిచేవారు. తరువాత నాగపూర్ చేరుకున్న ఆయన అప్పటి ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ సంచాలక్ కె.బి. హెగ్డేవార్ సలహా మేరకు 1937లో న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. నాగపూర్ శాఖకు 1934లో కార్యదర్శిగా నియమితులైన గోల్వాల్కర్‌ను 1939లో ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్టు హెగ్డేవార్ ప్రకటించారు. ఆయన మరణానంతరం పగ్గాలు చేపట్టిన గోల్వాల్కర్ ఆర్‌ఎస్‌ఎస్‌ను దేశంలోనే బలమైన మతవాద రాజకీయ శక్తిగా నిర్మించారు. లక్షమంది ఉండే సభ్యుల సంఖ్యను పది లక్షలకు చేర్చారు. రాజకీయ, సామాజిక, మత, విద్య, కార్మికరంగాలకు 50 ప్రధాన శాఖల ద్వారా విస్తరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను విదేశాలకు కూడా విస్తరించారు. భారతీయ స్వయం సేవక్ సంఘ్, హిందూ స్వయం సేవక్ సంఘ్ పేరిట ఏర్పడిన సంస్థల్లో పలువురు హిందువులు సభ్యులుగా చేరారు. ఆర్‌ఎస్‌ఎస్ విస్తరణలో కీలక పాత్ర పోషించిన గోల్వాల్కర్ 1973, జూన్ 5న కన్నుమూశారు. (రేపు గోల్వాల్కర్ జయంతి సందర్భంగా)
Comments
Please login to add a commentAdd a comment