srirangam srinivasarao
-
సూపర్ స్టార్ కృష్ణ గురించి అప్పట్లో మహాకవి శ్రీశ్రీ ఏమన్నారో తెలుసా?
సూపర్ స్టార్ కృష్ణ.. వెండితెరపై ఆయన పేరు చేరగని ముద్ర. సాహసాలకు, సంచనాలకు ఆయన కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆదిలోనే పాత్రలతో ప్రయోగాలు చేశారు. అప్పటి వరకు ఏ హీరో చేయని సాహసం చేసి జేమ్స్‌బాండ్ తరహాలో గుఢాచారి 116 సినిమాతో అద్భుతం చేశాడు. ఇక తొలి తెలుగు కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు సినిమాలో రికార్డులు క్రియేట్ చేశారు. హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచిన ఆయన కథ తెలుగు వెండితెరపై ఓ చరిత్రగా నిలిచింది. చదవండి: ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్ స్టార్ ఓ హీరోగానే కాదు వ్యక్తిగతంగా మంచి మనుసున్న చాటుకున్న నటుడు. కష్టకాలంలో నిర్మాతలను ఆదుకున్న గొప్ప హీరో. అందుకే ఆయనను నిర్మాతల హీరో అన్నారు. స్టార్ హీరోగా, మంచి మనసు చాటుకున్న వ్యక్తిగా సూపర్ స్టార్ సువర్ణాక్షరాలతో అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. అలాంటి ఆయన గురించి ప్రముఖ రచయిత, మహాకవి శ్రీశ్రీ గతంలో ఏమన్నారో తెలుసా. అప్పట్లోనే తనదైన రాతలతో కృష్ణ గొప్పతనాన్ని శ్రీశ్రీ చాటిచెప్పారు. ఓ సందర్భంలో కృష్ణ గురించి ప్రస్తావించిన ఓ పాత న్యూస్ పేపర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: అందుకే ఆయనను నిర్మాతల హీరో అన్నారు ‘‘నేను ఒక అక్షరం రాసినా దానికి విలువ కట్టి పారితోషికం ఇచ్చిన ఏకైక వ్యక్తి కృష్ణ’’ అని శ్రీశ్రీ అన్నారు. 1994లో ఓ ప్రముఖ పత్రికలో ఈ వ్యాఖ్యలు ప్రచురితం అయ్యాయి. ఇది చూసిన నెటిజన్లు కృష్ణ గొప్పతనానికి, వ్యక్తిత్వానికి జోహార్లు చేస్తున్నారు. కాగా గుండెపోటు కారణంగా కృష్ణ మంగళవారం(నవంబర్ 15) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన పార్థివదేహన్ని అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఉంచారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఆయన అంతిమ యాత్ర మహప్రస్థానం వరకు సాగనుంది. -
నూరేళ్ల రావిశాస్త్రి
‘తెలుగు బాగా రాయాలంటే ఏం చేయాలి?’ అని శ్రీశ్రీని అడిగారట రావిశాస్త్రి. ‘ఇంగ్లిష్ బాగా చదవండి’ అని శ్రీశ్రీ జవాబు. ‘ఈ లోకంలో డబ్బూ యాపారం తప్ప మరేటి లేదు ప్లీడరు బాబూ’ అంటుందొక క్లయింటు ‘మాయ’ అనే కథలో. రావిశాస్త్రి బాగా రాయడం ఆమె నుంచి నేర్చుకున్నారేమో. ‘మనల్ని ఇలా ఉంచినవాడు దేవుడైతే వాడు దేవుడు కాడు. మనల్ని ఇలా ఉంచింది మనుషులైతే వాళ్లు మనుషులు కాదు’ అంటుంది మరో పాత్ర ‘బుద్బుదం’ అనే కథలో. రావిశాస్త్రి బాగా రాయడం ఆమె నుంచీ నేర్చుకుని ఉండొచ్చు. జనుల ఆవేదనకు చెవి వొగ్గితే బలమైన భాష పుడుతుందని తుదకు తెలుసుకున్నారు రావిశాస్త్రి. ‘పతితులార భ్రష్టులార బాధాసర్ప దష్టులార’ అని శ్రీశ్రీ అంటే పతితులు ఎందుకు పతితులయ్యారో, భ్రష్టులను ఎవరు భ్రష్టత్వం పట్టించారో, బాధాసర్ప దష్టులు తమను నులిమేస్తున్న పడగలను ఖండించాలంటే ఏ ఎరుకను కలిగించుకోవాలో చెప్పినవారు రావిశాస్త్రి. ‘అల్పజీవు’లను తెలుగు కథాపుటలలోకి నడిపించుకొనొచ్చి వారి కథలను, కన్నీటిని, పిరికి నవ్వును, చేతగాని ప్రతిఘటనను, ఒప్పుకోలేని అణచివేతను, గత్యంతరం లేని సర్దుబాటును లోకానికి తెలిపిన రచయిత రావిశాస్త్రి. ‘ఏ పాపం చేయనివారు జైళ్లలోను జైలు బయట మగ్గుతున్నారు’ అనుకుని మగ్గిపోతున్న ఈ బతుకుల్లో కాసింతైనా గాలి వీయించడానికి కలాన్ని వీవెనగా చేసుకున్న మహోపకారి రావిశాస్త్రి. గత కాలాన్ని ఊహించండి. తాత తండ్రులను నమిలేసిన కాలం. కుక్కి మంచాలలోనే కలలన్నీ కూలిపోయిన కాలం. అట్టి కాలంలో ఒక పదహారేళ్ల అమ్మాయి ‘జరీ అంచు తెల్లచీర’ కావాలనుకుంటే ఆ కనీస కోరికకై పడే శోకం చేసే రోదన రావిశాస్త్రి రాస్తే పాఠకులు ఈనాటికీ మర్చిపోలేదు. ఆ పిల్ల తండ్రి ఎలాగోలా పన్నెండు రూపాయలు తెచ్చి ‘అడుగుతున్నావు కదమ్మా... పదా కొందాం’ అని వెళితే చూడగానే పోల్చుకునే బీదతనం ఎదుట దుకాణదారు పరిహాసంగా చీర పరిచి ఇరవైకు ఏ మాత్రం తగ్గకపోతే... రావిశాస్త్రి ఎలా ముక్తాయిస్తారు? ‘కుక్కి మంచంలో కూలబడి కూర్చున్న ఈ పదహారేళ్ల ఆడపిల్ల ఏకధారగా వరద వరదగా ఏడుస్తోంది. ఇది మెరుపులేని మబ్బు. ఇది తెరిపి లేని ముసురు. ఇది ఎంతకీ తగ్గని ఎండ. ఇది ఎప్పటికీ తెల్లవారని చీకటి రాత్రి. ఇది గ్రీష్మం. ఇది శిశిరం. ఇది దగ్ధం చేసే దావానలం. ఇది రెక్కల్ని రాల్చేసే నైరాశ్యం. ఒక్కటి... ఒక్కటే సుమండీ... ఒక్క జరీ అంచు తెల్లచీర’. రావిశాస్త్రి కథల్లో కవిత్వం ఉందని వెతికి ఆ కవిత్వాన్ని పుస్తకంగా వెలువరించాడు త్రిపురనేని శ్రీనివాస్. పొయ్యి ముట్టించాలనుకుంటున్నప్పుడు వేగిరానికై కిరోసిన్‌ను కుమ్మరించొచ్చు అనుకున్న రావిశాస్త్రి తన కథల్లో అనూహ్యమైన ప్రతీకలను, ప్రయోగాలను, శ్లేషను, వ్యంగ్యాన్ని, నాటకీయతను, జనుల భాషను, బోధకుని కంఠధ్వనిని ప్రవేశపెట్టి పాఠకులను తనవైపుకు లాక్కున్నారు. తాను ప్లీడరుగా పని చేస్తూ ‘న్యాయం’ అనే కథలో కోర్టును ‘అబద్ధాలకి పాముల పుట్ట’ అనగలిగే ధీశాలి. ‘కార్నర్ సీటు’ల్లో కూచుని బాధేమిటో తెలుపక హఠాత్తుగా ఆత్మహత్య చేసుకునే దీనులను మనలో నశిస్తున్న మంచితనానికి ఆనవాలుగా ఆయన కదూ చూపించినది? ‘కండ గలవాడే మనిషోయ్’ అని గురజాడ అంటే శారీరక, మానసిక దౌర్బల్యంతో యువత ఏ పనికీ కొరగాకుండా ఉండటాన్ని సహించలేని రావిశాస్త్రి ‘వర్షం’ కథను రాసి కర్తవ్యోన్ముఖులను చేస్తారు. ‘పువ్వులు’ కథలోలాగా ఎంత తొక్కినా తెల్లారేసరికి పకపకలాడే బంతిపూల వంటి బీద జనా లదే ఆయన పక్షం. నిత్యం కోర్టుల్లో జూటా ముఖాలను చూసి విసిగిపోయిన రావిశాస్త్రి ‘డికెన్స్, గుర జాడల రచనలే మంచితనం మీద ఈ మాత్రం అభిమానం పెంచుకునేలా చేశాయి’ అని రాసుకున్నారు. గురజాడ దారిలోనే రావిశాస్త్రి కూడా ‘మంచి అన్నది పెంచడానికే’ తెలుగు కథను నడిపించారు. రావిశాస్త్రి అను రాచకొండ విశ్వనాథశాస్త్రి తెలుగులో స్టార్ స్టేటస్ పొందిన తొలితరం సీరియస్ రచయిత. జనం పక్షాన రాస్తూ కూడా పాఠకాకర్షణ పొందవచ్చు అని నిరూపించారు. కాళీపట్నం, బీనాదేవి, కె.ఎన్.వై. పతంజలి... ఎందరో రచయితలు ఆయన రచనల ప్రభావంతో తోవ తెలుసుకున్నారు. గొంతు వెతుక్కున్నారు. విరసం– రావిశాస్త్రి పరస్పరం వెలుతురు పంచుకోవడం మరో ముఖ్యఘట్టం. ‘వేతన శర్మ’, ‘షోకు పిల్లి’, ‘పిపీలికం’ కథలు అందుకు తార్కాణం. రాచకొండ విశ్వనాథశాస్త్రి ఉత్తరాంధ్రకో తెలుగు రాష్ట్రాలకో పరిమితమయ్యే రచయిత ఎంత మాత్రం కాదు. రోదన ఉన్న చోటుకంతా బడుగుజీవి బతుకుతున్న తావుకంతా ఆయన కథ చేరగలదు. అదే సమయంలో రావిశాస్త్రి ఎంత ‘స్థానికుడు’ అంటే ఆయన రచన అనువాదానికి పూర్తిగా లొంగదు. అయినా సరే ఎంత చేర్చగలమో అంత కనీసం భారతీయ పాఠకులకు చేర్చవలసిన ‘బాకీ’ మనకు ఉంది. జూలై 30– రావిశాస్త్రి శత జయంతి. తెలుగు సాహిత్యానికి సంబంధించి గొప్ప ఉత్సవ సందర్భం. పాఠకులు, అభిమానులు రెండు రాష్ట్రాలలో ఉత్సాహంగా కార్యక్రమాలు చేయనున్నారు. అయితే ఇంతటి గొప్ప రచయితను ఈ సందర్భంగానైనా స్కూళ్లకు, కాలేజీలకు చేర్చాల్సిన పని ప్రభుత్వాలది. ‘రచయిత ప్రతివాడూ తాను రాస్తున్నది ఏ మంచికి హాని చేస్తున్నదో ఏ చెడుకు ఉపకారం చేస్తున్నదో గమనించుకోవాలి’ అన్నాడాయన. ప్రభుత్వం, పాలనా వ్యవస్థ, మీడియా, పౌరులు మొత్తంగా మనుషులు ఏ మంచికి హాని చేయని, ఏ చెడుకు మేలు చేయని సంస్కారంలో సమాజాన్ని ఉంచడమే ఆ మహా రచయితకు నిజమైన నివాళి. ఛాత్రిబాబూ నువు గొప్పోడివోయ్. -
జాతిని మేల్కొలిపిన యుగకర్త శ్రీశ్రీ
తిరుపతి కల్చరల్ : తన రచనలతో జాతిని మేల్కొలిపిన యుగకర్త శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కొనియాడారు. మానవ వికాస వేదిక, రాజా చంద్ర ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో సోమవారం శ్రీశ్రీ స్వీయ దస్తూరితో రాసిన మహాప్రస్థానం గ్రంథావిష్కరణ సభ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీశ్రీతో తనకున్న అనుభవాలు, జ్ఞాపకాలను పంచుకుంటూ ప్రస్థానం గీతాలను ఆలపించారు. శ్రీశ్రీ రచనలు జన హృదయాలను ప్రభావితం చేసేలా సాగాయన్నారు. చలం చెప్పినట్లు శ్రీశ్రీ కవిత్వం తెలుగు జాతిని ఊగించి, శాసించి, లాలించిందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. తిరుపతితో పాటు వ్యక్తిగతంగా శ్రీశ్రీకి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. తన సోదరుడు భూమన కారణంగా శ్రీశ్రీ ప్రభావం తనపై పడిందన్నారు. ఆయనతో ఉన్న తనకున్న అనుభవాలను, మధురస్మతులను పంచుకుననారు. చిన్ననాటి నుంచి ఆయన రచనలు తనపై ఎంతో ప్రభావం చూపాయన్నారు. ‘కవి’యుగ దైవం శ్రీశ్రీ సినీ గేయ రచయిత భువనచంద్ర మాట్లాడుతూ.. కలాన్ని జయించిన వ్యక్తి శ్రీశ్రీ అని కొనియాడారు. శ్రీరంగం కవిత్వం చదవని వారు రచయితలే కాదని నమ్ముతున్నట్లు తెలిపారు. కలియుగ దైవం శ్రీవారు అయితే ‘కవి’యుగ దైవం శ్రీశ్రీ అని కొనియాడారు. శ్రీవారి పాదాల చెంత మొట్టమొదటి డబ్బింగ్ సినిమా రచనకు ఆధ్యుడు శ్రీశ్రీనే అని గుర్తు చేసుకున్నారు. ఆయన అక్షర విలువను ఎంచడం ఎవరి తరం కాదన్నారు. ఎన్ని సిరులు వెళ్లినా శ్రీశ్రీ మాత్రం మననుంచి వదలి వెళ్లలేదని అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అద్భుత కవితల ప్రవకర్త శ్రీశ్రీ అని కొనియాడారు. తెలుగు సాహిత్యాన్ని ఆకాశం నుంచి నేల మీదకు దింపారని అన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కళాపోషకుడిగా తెలుగు వైభవాన్ని చాటిన ఘనుడని కొనియాడారు. తన బిడ్డకు రాజకీయ వారసత్వంతో పాటు సాంస్కతిక వారసత్వాన్ని అందించారన్నారు. కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. నేటి తరానికి, యువతరానికి శ్రీశ్రీ రచనలు ఓ చైతన్య దీపికలుగా నిలుస్తాయన్నారు. అంతటి మహనీయుడు రచించిన మహాప్రస్థానం గ్రంథావిష్కరణ తన చేతుల మీదుగా జరగడం మహద్భాగ్యమని తెలిపారు. పుస్తక ప్రచురణ కర్తకు రూ.20 వేలు బహుమతిగా అందజేశారు. పుస్తకావిష్కరణ చేసిన అభినయ్ రెడ్డి తిరుపతి నగర డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ చేతుల మీదుగా శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రతిని రచయిత నామిని సుబ్రహ్మణ్యంనాయుడికి, రెండో ప్రతిని విశ్రాంత ప్రిన్సిపల్ పెద్ది సత్యనారాయణకు అందజేశారు. కార్యక్రమంలో శ్రీశ్రీ ప్రింటర్స్ అధినేత విశ్వేశ్వరరావు, రాజాచంద్ర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు దుర్గాప్రసాద్, కార్పొరేషన్ మేయర్ శిరీషా, మానవ వికాస వేదిక కనీ్వనర్లు సాకం నాగరాజు, శైలకుమార్, పలువురు కవులు, రచయితలు, సాహితీ వేత్తలు పాల్గొన్నారు. -
శ్రీశ్రీ సినీగేయ ప్రస్థానం
శ్రీశ్రీ సినిమా పాటకు శ్రీకారం చుట్టడం, మహాప్రస్థానం గ్రంథరూపంలో వెలువడ్డం– రెండూ 1950లోనే కావడం యాదృచ్ఛికం. 1940లో విడుదలైన కాలచక్రంలో శ్రీశ్రీ మహాప్రస్థాన గీతం కొన్ని మార్పులతో ఉపయోగించబడినా, దాన్ని ఆయన తన మొదటి సినిమా పాటగా పరిగణించలేదు. 1950లో ఆర్.ఎస్.జునార్కర్ దర్శకత్వంలో వచ్చిన ఆహుతి డబ్బింగ్ చిత్రంతోనే శ్రీశ్రీ సినీ వ్యాసంగం ప్రారంభమైంది. నీరా ఔర్ నందా హిందీ చిత్రానికి తెలుగు సేత అయిన ఆ చిత్రంలోని 9 పాటలనూ శ్రీశ్రీయే రాశారు. వాటిలో మొదటిదైన ‘ప్రేమయే జనన మరణ లీల’ అనేది తన ప్రథమ గీతమని శ్రీశ్రీ స్వయంగా పేర్కొన్నారు. సినిమా కోసం శ్రీశ్రీ యెక్కువ పాటలు రాసిన మొదటి చిత్రం 1952లో విడుదలైన మరదలు పెళ్లి. శ్రీశ్రీ సుమారు 200 స్ట్రెయిట్ చిత్రాలకు, 80 డబ్బింగ్ చిత్రాలకు కలిపి దాదాపు వెయ్యి పాటలు రాసినా, సంఖ్యాపరంగా డబ్బింగ్ పాటలే యెక్కువ కావడం విచిత్రం! బహుముఖంగా చిత్రగీతాలు రాసిన శ్రీశ్రీ ఆ రంగంలో అనేక ధోరణులకు ఆద్యులూ అగ్రగణ్యులూ అయ్యారు. మాతృకకు మక్కికి మక్కి కాకుండా అవసరమైన మేరకు మాత్రమే ‘లిప్‌సింక్’ను పాటించి, తెలుగు నుడికారంతో డబ్బింగ్ రచనలు చేసి, దానికొక ఒరవడి ప్రవేశపెట్టారు. వామపక్ష భావజాలంతో సామ్యవాద గీతాలను రాసి సినీ పరిశ్రమలో చైతన్య గీతాలకు అంకురార్పణ చేశారు. తెలుగు సినిమాల్లో యెక్కువ దేశభక్తి గీతాలను రచించిన ఖ్యాతి కూడా ఆయనకే దక్కుతుంది. మహాప్రస్థానం, ఖడ్గసృష్టి కవితా సంకలనాల్లో ముందుగా వెలువడి, ఆ తరువాత పాటలుగా సినిమాలకెక్కినవి పాతికకుపైనే ఉన్నాయి. ఈ విషయంలో కూడా అగ్రతాంబూలం శ్రీశ్రీదే. ఆకలిరాజ్యం, మహానది సినిమాల్లో కథనాయకుడు(కమల్‌హాసన్) మహోద్రేకంగా శ్రీశ్రీ కవితల్ని ఉటంకించడం తెలుగు సినీకవుల్లో ఆయనకు మాత్రమే దక్కిన ఘనత. కవిత్వంలో ఛందోబందోబస్తులను ఛట్‌ఫట్ చెయ్యమన్న శ్రీశ్రీ అనేక సాంఘిక చిత్రాల్లో కూడా పద్యాలను రచించారు. బొబ్బిలి యుద్ధంలో మధురాతి మధురమైన జావళీని రాసి తనకు చేతకాని ప్రక్రియ లేదని నిరూపించారు. తన పాటల్లో తనకు నచ్చినది మాత్రం ‘పంతాలు పట్టింపులు’లోని ‘ఇనుకోరా, ఇనుకోరా, ఈ మల్లన్న మాటే ఇనుకోరా’గా ప్రకటించారు. ఆరాధనలోని ‘నా హృదయంలో నిదురించే చెలీ’ ప్రేమగీతంలో ఆ చెలి యెవరని ఓ విమర్శకుడు ప్రశ్నిస్తే , ఆ చెలి కమ్యూనిజమని చమత్కరించారు. శ్రీశ్రీ పేరు చెప్పగానే మూడు ముఖ్యమైన పాటలు గుర్తొస్తాయి. అవి– తెలుగు సినిమా పాటకు మొదటి జాతీయ పురస్కార గౌరవాన్ని దక్కించిన అల్లూరి సీతారామరాజు చిత్రంలోని ‘తెలుగు వీర లేవరా’. బతుకు మీద విరక్తితో ఆత్మహత్యకు పూనుకొన్న ఓ వ్యక్తిని ఆ ప్రయత్నం నుంచి విరమింపజేసి పూర్ణాయువును పోసిన వెలుగు నీడలు చిత్రంలోని ‘కలకానిది విలువైనది’. ఓ కన్నడ ప్రేక్షకుణ్ని సైతం కేవలం ఆ పాట కోసం ఇరవై సార్లు ఆ సినిమా చూసేలా చేసిన పునర్జన్మ చిత్రంలోని ఓ సజీవ శిల్పసుందరీ. శ్రీశ్రీ నిజాయితీ, నిబద్ధత గల సహృదయ కవి. తెలుగు వీర లేవరా పాటలో సింహాలై గర్జించాలి అనే చోట వ్యాకరణ దోషం వుందని తనే చెప్పి ఆ తర్వాత సవరించుకున్నారు. కలకానిది పాటలోని రెండు పంక్తుల భావం ఆ పాట తమిళ వెర్షన్ రాసిన నారాయణ కవిదనీ ఆ ఘనత తనకు చెందదనీ ప్రకటించారు. దేవత చిత్రంలోని బొమ్మను చేసి ప్రాణము పోసి పల్లవి వీటూరిదని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. 30 ఏప్రిల్ 1910న జన్మించిన శ్రీశ్రీ 15 జూన్ 1983న అస్తమించారు. ఆయన అవసాన దశలో రాసిన నేటిభారతంలోని అర్ధరాత్రి స్వతంత్రం అంధకార బంధురం అనే విప్లవ గీతం ఆయనకు ప్రభుత్వమిచ్చిన ఏకైక నంది పురస్కారం– అది ఆ తర్వాత వచ్చిన అనేక స్వాతంత్య్ర సంబంధిత గీతాలకు స్ఫూర్తినిచ్చింది. -పైడిపాల -
శ్రీశ్రీ రచనలు తరతరాలకూ స్ఫూర్తి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘విశ్వవేదికపై తెలుగు కవిత కీర్తిపతాకను ఎగురవేసిన మహాకవి శ్రీశ్రీ జయంతి నేడు. కవిత్వానికి ఉండే శక్తి ప్రపంచాన్ని కదిలించగలదని, సమాజ హితానికి తోడ్పడగలదని శ్రీశ్రీ తన అభ్యుదయ రచనల ద్వారా చాటిచెప్పారు. ఆయన రచనలు తరతరాలకూ స్ఫూర్తినిరగిలించే దివిటీలుగా నిత్యం వెలుగుతూనే ఉంటాయి.’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. నేడు మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా సీఎం జగన్ ఈ మేరకు ట్వీట్ చేశారు. అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా శ్రీశ్రీ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - శ్రీ శ్రీ.
-
రెండు శ్రీలూ రెండు సాహిత్య ప్రతీకలు
మరో ప్రపంచం తాత్విక కవి శ్రీశ్రీ. మార్క్సిస్టు దృక్పథానికి సాహిత్య అన్వయ ద్రష్ట - శ్రీశ్రీ. శ్రామిక వర్గ ప్రజా కవి - శ్రీశ్రీ. శ్రీశ్రీలో రెండుగా శ్రీలూ - రెండు చీలి పోయిన వర్గ సమాజానికి సాహిత్య ప్రతీకలు. ‘ఈ శతాబ్దం నాది’ అని ఎలు గెత్తి చాటి చెప్పిన శ్రీశ్రీ కలంలో ఈనాటి వర్త మాన సామాజిక సంఘర్షణలోని ఆక్రోశం కూడా ప్రతిధ్వని స్తుంది. ‘ఈ శతాబ్దం నాది’ అని శ్రీశ్రీ అన్నది వ్యక్తి గతం కాదు. తాను ఏ శ్రామిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ ప్రజలది అని ఉద్దేశం. మంటల చేత మాట్లాడించి, కన్నీళ్ల చేత కవాతు చేయించి చెమటా నెత్తురులను రాపిడి పెట్టి -అగ్ని కిరీటపు ధగధగలతో ఎర్రబావుటా నిగనిగల్ని తెలుగు సాహిత్య ప్రపంచంలో ఎగరేసిన చైతన్యాగ్ని శిఖ శ్రీశ్రీ. ‘అరసం’ కానివ్వండి, ‘విరసం’ కాని వ్వండి. -శ్రీశ్రీ ఎప్పుడూ ఏదో ఒక నిర్మాణంతో మమేకమైనవాడే. ఉద్యమాలతో నిరంతరం మమేక మయ్యే సమష్టి వ్యక్తిత్వం - శ్రీశ్రీ. ఉత్పత్తి విధానాన్ని సామాజీకరించిన పెట్టుబడి దారీ వ్యవస్థకీ, ఉత్పత్తి సాధనాల్ని ప్రజలపరం చేయాలనే సామ్యవాద వ్యవస్థకీ మధ్య సంఘర్షణ గుణాత్మకంగా పరిష్కారం అయ్యేంతవరకూ శ్రీశ్రీ కవిత్వం ప్రాసంగికతని కల్గే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘‘సామ్రాజ్యవాద ప్రపంచీక రణ’’ ఆర్థిక, సాంస్కృతిక విధానానికీ, శ్రీశ్రీ ‘‘మరో ప్రపంచ’’ దృక్పథమే కచ్చితమైన, శాస్త్రీయమైన, గతితార్కికమైన, చారిత్రకమైన ప్రత్యామ్నాయం. ఈ వాస్తవాన్ని అవగాహన చేసుకున్నది, పసి గట్టినదీ బలంగా సామ్రాజ్యవాద మేధావులే! కాబట్టే -‘అనాథలంతా, అశాంతులంతా, అనేకు లింకా దీర్ఘశ్రుతిలో, తీవ్రధ్వనితో విప్లవ శంఖం పూరి స్తారోయ్’ అన్న హెచ్చరిక వెనుక ప్రమాదాన్ని గ్రహించి శ్రామికవర్గ ఐక్యతని చీలికలు పీలికలుగా పోగులుపెట్టి తునకల సిద్ధాంతంతో ‘అత్యాధుని కతా’ వాదంగా సాహితీ, సాంస్కృతిక రంగాలలో ప్రవేశపెట్టి - వైరుధ్యాల సంక్లిష్టతని గందరగోళం స్థాయికి చేరుస్తోంది సాంస్కృతిక సామ్రాజ్యవాదం. శ్రీశ్రీ కవిత్వం విప్లవ భావజాలాన్ని ఎర్ర బావుటా నిగనిగల్తో తెలుగునేల మీద ఆవిష్కరిం చింది. చాలామంది విప్లవం, అభ్యుదయం వైరు ధ్యం ఉన్నట్లుగా రెండూ రెండు భిన్న అంశాలుగా భావిస్తుంటారు. ఈ వర్గ సమాజం ఉన్నంతకాలం శ్రీశ్రీ కవిత్వం బతికే ఉంటుంది. శ్రీశ్రీ కవిత్వం బతికున్నంతకాలం శ్రీశ్రీ బతికే ఉంటాడు. శ్రీశ్రీ బతి కున్నంతకాలం మరో ప్రపంచం ఆశయం బతికే ఉంటుంది. మరో ప్రపంచం ఆశయం బతికున్నంత కాలం సాహిత్య సాంస్కృతిక రంగాలలో గుణాత్మక మార్పులకేసి పరిమాణాత్మక మార్పులు ప్రవహిస్తూనే ఉంటాయి. పరిమాణాత్మక మార్పులు గుణాత్మక మార్పు వైపు పోగుపడకుండా ప్రతి మలుపులోనూ శ్రీశ్రీపై, అతని కవిత్వంపై ఈనాటికీ జరుగుతున్న దాడులు నిజానికి శ్రీశ్రీ మీద కాదు శ్రీశ్రీ... ఏ మరో ప్రపంచ తాత్వికతని ఏ అశాంతుల, అనాథల, అనేకుల (బహుజనాలలో) ఏ పీడితుల (దళితులు) పక్షం వహించి గొంతెత్తి, కలమెత్తి ప్రాతినిధ్యం వహించాడో ఆ శ్రామిక వర్గ దృక్పథం మీద దాడులవి. కుటుంబరావుగారు శ్రీశ్రీ గురించి ఇలా అంటారు ‘‘నిజమే - శ్రీశ్రీని దాటి తెలుగు సాహి త్యం చాలా దూరమే వచ్చేసింది. కానీ శ్రీశ్రీ అంత ఎత్తుకి ఇంకా ఎదగలేదు.’ దీనిని సమీక్షిం చుకోవాలి. మాట్లాడ్డం మాట్లాడ్డం కోసం కాదు. వినడం వినడం కోసం కాదు. రాయడం రాయడం కోసం కాదు. చదవడం చదవడం కోసం కాదు. సాహిత్యం సాహిత్యం కోసం కాదు. భావజాల రంగంలో సంఘర్షణ భౌతిక శక్తిగా మారి నూతన ప్రజాతంత్ర విప్ల వాన్ని పూర్తి చేసుకోవలసిన కూడలిలో ఉన్నాం. అక్షరాలుగా మిగిలిపోకుండా, పదాలుగా కూడబలు క్కొని వాక్యాలుగా కవాతు చేద్దాం! సూర్యరశ్మి అం తటి వేడీ వెలుతురూ ఉన్న రసాత్మక కావ్యాన్ని ఆచ రణాత్మకంగా ఆవిష్కరిద్దాం! పదండి ముందుకు..! - పీఎస్ నాగరాజు వ్యాసకర్త ప్రజాసాహితి సంపాదకుడు మొబైల్ : 94419 13829 (నేడు శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా)