శివాజీ రాజా, వాణీ దేవి, కోదండ రామిరెడ్డి
ప్రముఖ దివంగత దర్శకులు వీరమాచనేని మధుసూదనరావు (జూన్ 14, 1923లో జన్మించారు) శతజయంతి ఉత్సవాలు జూన్ 11న హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన సమావేశంలో దర్శకుడు కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘మధుసూదనరావుగారు మన మధ్య లేకపోయినా దర్శకుడిగా ఆయన ప్రతిభ మరికొన్ని వందల ఏళ్లు బతికే ఉంటుంది.
ఆయన దగ్గర శిష్యరికం చేయడం నా అదృష్టం’’ అన్నారు. ‘‘నాన్నగారి శత జయంతి ఉత్సవాలకు సినీ పరిశ్రమ నుంచి అందర్నీ ఆహ్వానిస్తున్నాం’’ అన్నారు మధుసూదనరావు కుమార్తె వాణీదేవి. ‘‘ఈ సంవత్సరం నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావుగారు, సూర్యకాంతంగారు, వి. మధుసూదనరావుగారి శత జయంతి కావడం తెలుగు పరిశ్రమ పులకించి పోయే సంవత్సరం. మన మధ్య లేకపోయినా వారు పరిశ్రమకు చూపించిన మంచి మార్గాన్ని ఎప్పటికీ అనుసరిస్తూనే ఉంటాం’’ అన్నారు శివాజీరాజా. ‘‘మావయ్య విలువలతో జీవించారు. అదే విలువలను తన చిత్రాల ద్వారా పది మందికి పంచటానికి ప్రయత్నించారు’’ అన్నారు నాని (మధుసూదనరావు మేనల్లుడు). ఈ కార్యక్రమంలో మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపాల్ డా. జి. కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment