ప్రశాంత్ వర్మ, చిరంజీవి, తేజ సజ్జా, నిరంజన్ రెడ్డి, అమృతా అయ్యర్
‘‘సంక్రాంతి అన్నది సినిమాలకు చాలా మంచి సీజన్. ఎన్ని చిత్రాలు వచ్చినా సరే కథ బాగుండి.. కంటెంట్‌లో సత్తా ఉండి.. దేవుడి ఆశీస్సులు ఉన్నాయంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరించి, విజయం అందిస్తారు. చిత్ర పరిశ్రమ ఎప్పుడూ పచ్చగా ఉండాలి. ఈ సంక్రాంతికి వస్తున్న ‘గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ’ సినిమాలతో పాటు ‘హను–మాన్’ కూడా బాగా ఆడాలి.. ఆడుతుంది’’ అని హీరో చిరంజీవి అన్నారు.
తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హను–మాన్’. శ్రీమతి చైతన్య సమర్పణలో కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ–‘‘హను–మాన్’ టీజర్, ట్రైలర్ చూడగానే అద్భుతంగా అనిపించడంతో డైరెక్టర్ ఎవరని అడిగి, ప్రశాంత్ వర్మ గురించి తెలుసుకున్నాను. ‘మీ సూపర్ హీరో ఎవరు?’ అని ఓ ఇంటర్వ్యూలో సమంత అడిగినప్పుడు.. ‘హను–మాన్’ అని టక్కున చెప్పేశాను.
అదే ఈ సినిమాకి టైటిల్‌గా పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రశాంత్ వర్మ ఆలోచన, తేజ కష్టం వృథా కావు. అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరక్కపోవచ్చు. కానీ, సినిమాని విడుదల రోజు.. లేకుంటే మరుసటి రోజు.. ఫస్ట్ షో.. లేదంటే సెకండ్ షో చూస్తారు. సినిమా బాగుంటే ఎన్ని రోజులైనా చూస్తారు. ‘హను–మాన్’లాంటి మంచి సినిమా తీసిన నిరంజన్ రెడ్డిగారికి థ్యాంక్స్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది.
ఈ చిత్రం ఆడినన్ని రోజులు ప్రతి టిక్కెట్‌పై వచ్చే డబ్బులో ఐదు రూపాయలు అయోధ్యలోని రామమందిరానికి విరాళంగా ఇస్తామని యూనిట్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది. రామమందిరంప్రారంభోత్సవానికి నాకు ఆహ్వానం అందింది.. కుటుంబ సమేతంగా వెళతాను’’ అన్నారు. కె.నిరంజన్ మాట్లాడుతూ– ‘‘నేను ఏదైతే నమ్మానో దాన్ని అలాగే తెరపైకి తీసుకొచ్చిన ప్రశాంత్‌కి థ్యాంక్స్.
మా విజన్‌తో నిర్మించిన ‘హను–మాన్’ని ప్రేక్షకులు బిగ్‌స్క్రీన్స్‌లో చూసి ఆశీర్వదించాలి’’ అన్నారు. ‘‘నా జీవితంలో నా తల్లిదండ్రుల తర్వాత నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే అది చిరంజీవిగారికే. ఆయన స్ఫూర్తితో ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు చేస్తున్నా. రామ్‌చరణ్‌గారికి రాజమౌళిగారు, రవితేజగారికి పూరి జగన్నాథ్‌గారు, నాకు.. ప్రశాంత్ వర్మగారు అని సగర్వంగా చెబుతున్నా’’ అన్నారు తేజ సజ్జా. ‘‘నన్ను నమ్మి ‘హను–మాన్’ తీయమని సపోర్ట్ చేసిన నిరంజన్ రెడ్డి సర్‌కి థ్యాంక్స్.
కలలో కూడా సినిమా గురించే ఆలోచిస్తాడు తేజ.. తనకి సినిమా అంటే అంత ప్రేమ. ఈ సంక్రాంతికి పిల్లలు, పెద్దలందరూ థియేటర్స్‌కి వచ్చి ఎంజాయ్ చేసేలా ‘హను–మాన్’ ఉంటుంది అన్నారు ప్రశాంత్ వర్మ. ఈ వేడుకలో అమృతా అయ్యర్, వరలక్ష్మీ శరత్‌కుమార్, నటుడు వినయ్ రాయ్, కెమెరామేన్ దాశరథి శివేంద్ర, డైరెక్టర్ కేవీ అనుదీప్, రచయిత–డైరెక్టర్ బీవీఎస్ రవి, సంగీత దర్శకులు అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్, గౌర హరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment