నందకుమార్, సిద్ధు ముద్ద, చిరంజీవి, వరుణ్ తేజ్, శక్తి ప్రతాప్ సింగ్
‘‘మనందరిలో దేశభక్తి ఎంత ఉన్నా కానీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ లాంటి సినిమాలు చూసినప్పుడు ఆ దేశభక్తి ఉప్పొంగిపోతుంది. ముఖ్యంగా మన యువత ఇలాంటి సినిమాలు చూడాలి. ఈ మూవీని తీయడం యూనిట్ బాధ్యత. విజయం అందించి మన రియల్ హీరోలైన సైనికులకు నివాళి అర్పించాల్సిన, అంకితం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని హీరో చిరంజీవి అన్నారు. వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’.
మానుషి చిల్లర్, రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలు పోషించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్ద రినైసన్స్ పిక్చర్స్‌పై నిర్మించిన ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ–‘‘శక్తి ప్రతాప్ సింగ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ 75 రోజుల్లోనే చాలా రీజనబుల్ బడ్జెట్లో తీశాడు.
కానీ, ట్రైలర్ చూస్తే ఎంతో రిచ్‌నెస్, ఎక్కువ బడ్జెట్ మూవీలా కనిపిస్తోంది. డబ్బు ఖర్చు పెడితేనే రిచ్‌నెస్ రాదు.. మన ఆలోచన ల నుంచి వస్తుంది. తక్కువ ఖర్చులో అలా రిచ్‌గా చూపిస్తే సినిమా బాగా వస్తుంది.. ఇటు నిర్మాతలూ బాగా ఉంటారు. సినిమా ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. అందుకే శక్తి ప్రతాప్ సింగ్‌ని మన యంగ్ డైరెక్టర్స్ స్ఫూర్తిగా తీసుకోవాలి. వరుణ్ ప్రతి సినిమాలోనూ వైవిధ్యంగా కనిపిస్తాడు.
నేను ‘టాప్‌గన్’ మూవీ చూసినప్పుడు ఇంత బాగా మనం చేయగలమా? అనిపించింది. ఆ విజువల్స్‌కి ఆశ్చర్యపోయాను. ఈరోజు ‘టాప్‌గన్’ లాంటి గొప్ప సినిమాని ‘ఆపరేషన్ వాలెంటైన్’ రూపంలో మనవాళ్లు సులభంగా చేశారంటే.. ప్రతిభ ఎవడి సొత్తు కాదు.. మనం ఆ స్థాయిలో ఉన్నామని ఈ మూవీ ద్వారా నిరూపించబడుతుంది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది’’ అన్నారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘మా వరుణ్‌గాడు మంచి సినిమా ఇచ్చాడని మీరు(మెగా అభిమానులు) గర్వపడేందుకు ప్రతి సినిమాకి కష్టపడుతుంటాను. ‘ఆపరేషన్ వాలెంటైన్’ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు శక్తి ప్రతాప్ సింగ్ హడా. ‘‘మా మూవీని సైనికులకు అంకితం ఇస్తున్నాం’’ అన్నారు నిర్మాత సిద్ధు ముద్ద. ఈ వేడుకలో సహ నిర్మాత నందకుమార్, కెమెరామేన్ హరి కె.వేదాంతం, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, నటులు నవదీప్, అభినవ్ గోమటం, శతాఫ్, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ శశి, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల, ఫైట్ మాస్టర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment