‘‘కథా కథనాల పట్ల ప్రేక్షకులకు ఉన్న అభిరుచి మన సినిమా అభివృద్ధికి దోహదపడుతుంది’’ అన్నారు హీరో తేజ సజ్జా. ‘‘హను–మాన్’ కేవలం సినిమా కాదు.. మన సాంస్కృతిక మూలాలు, సంప్రదాయాలకు కట్టిన పట్టం’’ అని కూడా అన్నారు. గోవాలో జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ఇండియన్ పనోరమా విభాగంలో ‘హను–మాన్’ని ప్రదర్శించారు.
ఈ సందర్భంగా తేజ సజ్జా మాట్లాడుతూ... ‘‘కల్పిత గ్రామమైన అంజనాద్రి నేపథ్యంలో దైవిక శక్తులను పొందిన ఓ చిన్న దొంగ... మహా శక్తిమంతుడైన హనుమంతుని దాకా సాగించే ప్రయాణాన్ని ఈ చిత్రం చూపించిందని, భారతీయ పురాణాల విశిష్టతను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఈ చిత్రం ద్వారా నిర్వర్తించామనీ అన్నారు. ఈ చిత్రం మన పౌరాణిక మూలాలను చాటి చెబుతూ భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై నిలిపిందన్నారు.
‘హను–మాన్ ’ సీక్వెల్ రూపకల్పన కోసం పని చేస్తున్నట్టు ధృవీకరించారు. తెలుగు పరిశ్రమ వినూత్న కథనాలతో అంతర్జాతీయంగా గొప్ప గుర్తింపు సాధిస్తోందన్నారు. ‘హను–మాన్’ సాంస్కృతిక వారసత్వం, ఆధునిక కథల శక్తిమంతమైన సమ్మేళనమని, భారతీయ పనోరమాలో భాగం కావడం ఈ చిత్ర కళాత్మక సాంస్కృతిక విశిష్టతకు నిదర్శనం’’ అంటూ తన ఆనంద వ్యక్తం చేశారు తేజ సజ్జా. – గోవా నుంచి సాక్షి ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment