‘‘ప్రతి యాక్టర్ కెరీర్‌లో ఓ బెంచ్ మార్క్ ఫిల్మ్ ఉంటుందంటుంటారు. నా కెరీర్‌లో ‘హను–మాన్’ని నా బెంచ్ మార్క్ ఫిల్మ్‌గా ఫీలవుతున్నాను. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. క్లైమాక్స్‌లో ఓ సన్నివేశం కోసం రోప్ సాయంతో ఐదు రోజులు గాల్లోనే ఉన్నాను. రెండున్నరేళ్లు ఏ సినిమా ఒప్పుకోలేదు. యాక్టర్‌గా నా కెరీర్ పరంగా, నా వయసు పరంగా ఈ రెండున్నరేళ్ల కాలం చాలా కీలకమైనది. ‘హను–మాన్’ సక్సెస్ కావడం సంతోషంగా ఉంది’’ అని తేజ సజ్జా అన్నారు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘హను–మాన్’. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలైంది. ‘హను–మాన్’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చెబుతూ, శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో తేజ సజ్జా పంచుకున్న విశేషాలు.
∙తెలుగుతో పాటు హిందీ, కన్నడ వంటి భాషల్లో కూడా ‘హను–మాన్’ బాగా ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకీ రానంత స్పందన ఈ సినిమాకు హిందీలో వస్తోందని చెబుతున్నారు. మా సినిమాకు కాస్త సింపతీ వర్కౌట్ అయ్యిందని అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మా సినిమా ట్రైలర్, టీజర్ చూసి హిందీ, కన్నడవారు మమ్మల్ని అడిగి సినిమా తీసుకున్నారు. ఏం జరి గినా అంతిమంగా సినిమానే మాట్లాడుతుంది. సినిమానే నిలబడుతుంది. నిర్మాత నిరంజన్‌రెడ్డిగారు, ప్రశాంత్‌వర్మ ‘హను–మాన్’ సినిమాను బాగా చేశారు.
‘హను–మాన్’ సినిమా సమయంలో నేను ఇతర సినిమాలు ఒప్పుకోకపోవడానికి కారణం ఆ సినిమాల ఇంపాక్ట్ ‘హను–మాన్’ పై పడకూడదని. ఈ సినిమా సక్సెస్ మా అందరిదీ. ఈ సినిమా యూనిట్ సభ్యులు వారి వారి డిపార్ట్‌మెంట్స్‌లోనే కాక, ఇతర క్రాఫ్ట్స్‌లో కూడా కలుగజేసుకుని బాధ్యతగా చేశారు. ఉదాహరణకు నా లుక్ లోని కొన్ని కాస్ట్యూమ్స్‌కు మా సినిమా ఆర్ట్ డైరెక్టర్ వర్క్ చేశారు. ఈ సినిమా విషయంలో మొదట్నుంచి ఏదో ఆధ్యాత్మిక శక్తి మమ్మల్ని ముందుకు నడిపిందని నా నమ్మకం. ‘హను–మాన్’ సినిమాను మేం చేయలేదు. ‘హను–మాన్’ సినిమా మా చేత చేయబడింది. ఈ సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని మేం అనుకుంటున్నాం.
‘హను–మాన్’ సినిమాలోని హనుమంతుని విగ్రహం సినిమాకు ఆకర్షణగా నిలిచింది. గ్రాఫిక్స్ అలా చేయడానికి ఆరు నెలల సమయం పట్టింది. క్లైమాక్స్ చిత్రీకరణకు 60 రోజులకు పైగా సమయం పట్టింది. ‘హను–మాన్’ప్రాజెక్ట్ గురించి చిరంజీవిగారికి తెలుసు. ఈ సినిమాలోని హనుమంతుని పాత్ర గురించి ఆయనకు తెలుసు. మా ఇంటెన్షన్ హనుమంతుని పాత్రలో చిరంజీవిగారు అనే. ఆ సంగతి అలా ఉంచితే చిరంజీవిగారు ఇంకా ‘హను–మాన్’ సినిమా చూడలేదు. అయితే రిలీజైన రోజున శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ పంపారు.
Comments
Please login to add a commentAdd a comment