రారాకి నూరేళ్లు  | Tadi Prakash Article On Rachamallu Ramachandra Reddy Centenary Birth Anniversary 2022 | Sakshi
Sakshi News home page

రారాకి నూరేళ్లు 

Published Mon, Feb 28 2022 12:51 AM | Last Updated on Mon, Feb 28 2022 12:53 AM

Tadi Prakash Article On Rachamallu Ramachandra Reddy Centenary Birth Anniversary  2022 - Sakshi

రాచమల్లు రామచంద్రారెడ్డి శతజయంతి నేడు

తెలుగువాక్యం గుడిపాటి వెంకట చలం చేతిలో ఎంత సౌందర్యాన్ని సంతరించుకుందో, భాష, భావ వ్యక్తీ కరణ ఎంత జీవకళతో నిలిచి మెలి గాయో, ౠ–రాచమల్లు రామ చంద్రా రెడ్డి చేతిలో తెలుగు సాహిత్య విమర్శ కూడా పదునుదేలి, అంత శక్తి మంతమైన మారణాయుధమై కవులూ, రచయితల గుండెల్ని చీల్చి వేసింది.
రారా ఒక్కమాట అన్నాడూ అంటే అది గుచ్చుకుని తీరుతుంది. కొరడా లాంటి విమర్శతో కొట్టిన దెబ్బ కొన్ని దశా బ్దాలు గుర్తుండి పోతుంది. ఆయన కటువైన మాట, తట్టుతేలు తుంది కొట్టినచోట ! ‘ఈ సమాజం ఎంత పాడయిపోయినా, దిగంబరులు రాసిందాన్ని కవిత్వం అనేంతగా దిగజారి పోయిందా?’ అంటాడు. అంతేనా? ‘అన్ని బూతులు రాసిన చేతుల్తో ఆ దిగంబరులు అన్నం ఎలా తింటారో?’ అనీ అన్నాడు. దాంతో దిగంబర కవిత్వం కొత్త విప్లవదారులు వేస్తోందని ఎగిరెగిరిపడుతున్న వాళ్ళ నోళ్లు పడిపోయాయి. సాహిత్యంలో తేడా వస్తే కత్తి దూసి నరుకుతాడు రారా. నిలు వెల్లా నిజాయతీ నిండిన మనిషి. గొప్ప స్నేహితుడు. దయా ళువు. ఆప్యాయంగా పలకరించి ఆదరించే వాడాయన. 

అది 1977 జూలై నెల. ‘ఈనాడు’లో ట్రైనీ సబ్‌ ఎడిటర్‌గా జాయిన్‌ అయ్యాను. నాలాంటి 30 మందికి అనువాదం నేర్పించే గురువు రారా. తెల్లచొక్కా, ప్యాంటూ, మెరిసే బట్ట తల, నల్లగా బక్కపల్చగా, సాధారణమైన మధ్యతరగతి మనిషి. ఆయన ఎంత ప్రజ్ఞావంతుడో మాలో ముగ్గురికి మాత్రమే తెలుసు. మాస్కో ‘ప్రగతి ప్రచురణాలయం’లో ఆరేళ్ళు అనువాదకుడిగా ఉండి 1976లోనే ఆయన ఇండియా వచ్చారు. రారా విమర్శ వ్యాసాల సంపుటి ‘సారస్వత వివేచన’ తెలుగు సాహితీ లోకాన్ని నివ్వెర పరిచింది. దానికి ఆర్టిస్ట్‌ మోహన్‌ కవర్‌ పేజీ వేయడం వల్ల ఆ పుస్తకాన్ని అప్పటికే చదివి ఉన్నాను. కెరటాల్లాంటి వాక్యాలు. ఊపిరి సలపనివ్వని శైలి. గురజాడ, చలం, శ్రీశ్రీ, తిలక్, మహీధర లాంటి వాళ్ళ రచనలపై రారా పొగడ్త, విమర్శ మనల్ని కట్టిపడేస్తాయి. ‘‘మహాను భావుడు చలం’’ అంటూనే ఆయన లోపాల్ని ఎండ గడతాడు. శ్రీశ్రీ కవిత్వానికి వక్రభాష్యాలు చెప్పాడంటూ అద్దేపల్లి రామ్మోహనరావుని తిడుతూ, ‘‘ఆయన అజ్ఞానాంధ కారాన్ని ఛేదించే ఆయుధం నా దగ్గర లేదు. ఇది చదివి ఒకవేళ ఆయన ఆత్మహత్యాయత్నం చేస్తే దానికి నేను బాధ్యుణ్ణి కాను’’ అన్నారు రారా. 
   
‘ఈనాడు’లో అనువాదం కోసం మాకందరికీ ‘హిందూ’ పేపర్లు ఇచ్చేవాళ్ళు. బేనర్‌ ఐటం ఎక్కువగా ప్రఖ్యాత జర్నలిస్టు జి.కె. రెడ్డిది ఉండేది. ఆయన హైఫ్లోన్‌ ఇంగ్లీష్‌లో ఢిల్లీ రాజకీయాలు రాసేవాడు. ‘‘ఆ జీకె రెడ్డి పాండిత్య ప్రకర్ష మన కొద్దు గానీ, దాని తర్వాత ఉన్న ఐటం ట్రాన్స్‌లేట్‌ చేయండి ’’ అనేవారు రారా. వార్తంటే సూటిగా, స్పష్టంగా ఉండాలనీ, పాండిత్య ప్రదర్శన అవసరం లేదనీ చెప్పినట్టేగా! 

ఒకరోజు ‘ఈనాడు’ ఎడిటోరియల్‌ సెక్షన్‌లో షిఫ్ట్‌ ఇన్‌ఛార్జి సీట్లో కూర్చుని ఉన్నారు రారా. ఆ రోజు పేపర్‌ ఆయనే తీసుకు రావాలి. ‘హిందుస్తాన్‌ టైమ్స్‌’ ఇంగ్లీషు పేపర్లో ఒక అరపేజీ వ్యాసం నాకు ఇస్తూ, ‘‘చదివి కుదించి రాయి’’ అన్నారు. కోకా కోలా కంపెనీ ఇండియాలో చేస్తున్న అక్రమాల గురించిన వ్యాసం అది. రాశాను. రారా నా ఐటం చదివి, కరెక్ట్‌ చేశారు. ‘‘కోకాకోలా మాయాజాలం’’ అని చివరి పేరాకి నేను పెట్టిన చిన్న సబ్‌హెడ్డింగ్‌ని గ్రీన్‌ఇంక్‌ పెన్‌తో కొట్టేశారు. నా ప్రాణం చివుక్కుమంది. అందులో తప్పులేదు. చిన్న రిథం కూడా ఉంది కదా! తర్వాత రారా మరో కాగితం తీసుకుని దాన్నే పెద్ద హెడ్డింగ్‌గా పెట్టారు. నా ఆనందం ఇక చెప్పేది కాదు. మర్నాడు ‘ఈనాడు’లో అది పెద్ద వార్తగా వచ్చింది. 

మా అందరినీ అనువాదం చేయమని, రారా నెమ్మదిగా సిగరెట్‌ తీసి వెలిగించేవారు. యాష్‌ట్రేలో వేసిన అగ్గిపుల్ల పూర్తిగా కాలి పోయేదాకా తదే కంగా చూస్తూ ఉండేవారు. తక్కువ మాటలు... చాలా ప్రశాంతంగా ఉండే మనిషి. ఏమైనా చెప్పాలంటే హాయిగా, నవ్వుతూ వివరించేవారు. చలాన్నీ, తిలక్‌నీ ఉతికి ఆరేసింది ఈయనేనా అని ఆశ్చర్యం నాకు ! ఒకరోజు రారాని అడిగాను. ‘సోవియట్‌లో చాలా ఏళ్ళు ఉన్నారుగా, ఆ సమాజం ఎలా ఉంది?’ అని. ‘‘అదే గనక మనం కోరుకునే సోషలిజం అయితే ఆ సోషలిజం నాకొద్దు’’ అన్నారాయన. ‘అంటే?’ అన్నాను. ‘‘నాలుగు బ్రెడ్డు ముక్కలకీ, బంగాళా దుంపలకీ అంతంత క్యూలేమిటో నాకెప్పటికీ అర్థం కాదు ’’ అన్నారు. ఆ ఆరేడు నెలల్లో రారా మాలో ఎవర్నీ విసుకున్నదీ, కోప్పడిందీ లేనే లేదు. బిడ్డల తెలీనితనాన్ని మన్నించే తండ్రి లాగే ఉండేవాడు.    
   
రావిశాస్త్రి షష్టిపూర్తి సంచిక (జూలై 30)కి రారా రాసిన వ్యాసానికి, ‘గ్యాలరీ కోసం రాస్తున్నారా?’ అని శీర్షిక పెట్టారు. ‘అదేమిటి... రారా మిమ్మల్ని అంతమాట అన్నాడు’ అని మిత్రులు రావిశాస్త్రితో అంటే, ‘డోన్ట్‌ ప్లే టు ద గ్యాలరీ అన్నాడు. అందులో తప్పేముంది?’ అన్నారు శాస్త్రిగారు.
రారాకి బాగా పేరు తెచ్చిన మరో పుస్తకం ‘అనువాద సమస్యలు’. 1988లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందింది. అందులో అనేకమంది స్రముఖుల తప్పుల్ని ఎతి ్తచూపుతూ రారా చేసిన కామెంట్లు చదివి తీరాలి. తెలుగులో అనువాదం మీద వచ్చిన సాధికారికమైన పుస్తకం అది. ‘ట్రాన్స్‌ లేషన్‌ ఈజ్‌ లైక్‌ ఎ మిస్ట్రెస్‌ – ఇఫ్‌ ఫెయిత్‌ఫుల్, ఇటీజ్‌ నాట్‌ బ్యూటిఫుల్‌. ఇఫ్‌ బ్యూటిఫుల్, ఇటీజ్‌ నాట్‌ ఫెయిత్‌ఫుల్‌ – అనే ఒక  ఫ్రెంచి నానుడిలో మొదలవుతుందా పుస్తకం. 
ఓ ఇంగ్లీషు వాక్యాన్ని అనువదించడంలో వీరేశలింగం పంతులుగారు చేసిన తప్పును కూడా రారా పట్టుకున్నాడు. ఎంతటివాళ్లు చేసిన తప్పునైనా రారా క్షమించడు. అదే ఆయన ప్రత్యేకత. ఆయన ఔన్నత్యం.
  ∙
కడప జిల్లా, సింహాద్రిపురం మండలం, పైడిపాలెంలో రా.రా. 1922 ఫిబ్రవరి 28న జన్మించారు. ఈ రోజు ఆ మహాను భావుడి శతజయంతి. ఇంటర్‌ తర్వాత  రారా మద్రాసులోని గిండీ ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరారు. అక్కడ 1941లో గాంధీజీ నిరాహార దీక్షకు మద్దతుగా ఇంజనీరింగ్‌ విద్యార్థులు సమ్మె చేశారు. తర్వాత క్షమాపణ చెప్పుకున్నవాళ్ళని తిరిగి చేర్చు కున్నారు. ‘క్షమాపణ చెప్పం’ అన్న రారానీ, చండ్ర పుల్లారెడ్డినీ కాలేజీ నుంచి బహిష్కరించారు. అదే తెలుగు సాహిత్యానికి గొప్ప మేలు చేసింది.

1955లో నాటి కమ్యూనిస్టు నాయకుడు గజ్జెల మల్లారెడ్డికి పులివెందుల నియోజక వర్గంలో రారా ఎలక్షన్‌ ఏజెంట్‌గా ఉన్నారు. 1960లో రారా కథా సంకలనం ‘అలసిన గుండెలు’ అచ్చయింది. గొప్ప కథకుడిగా రారాకి గుర్తింపు రాలేదు. అయితే కొడవటిగంటి కుటుంబ రావు ఆ కథల్ని మెచ్చుకున్నారు. నిరంతర అధ్యయనంలో రారా మార్క్సిస్టు విమర్శకు నిగా రాటుదేలారు. ఇంగ్లీషు భాష మీద గట్టి పట్టు ఉన్న రారా యూరోపియన్‌ సాహిత్యాన్ని బాగా చదివేవారు. సన్నిహిత మిత్రులైన మల్లారెడ్డి, వై.సి.వి. రెడ్డి కవిత్వాన్నీ ఆయన విమ ర్శించేవారు. ఎక్కడన్నా రారా గానీ, సాహిత్యం మాటొస్తే ఎంతటి వాణ్ణయినా పోరా అనేవాడు! అందుకే రారాని శ్రీశ్రీ ‘హార్ట్‌లెస్‌ క్రిటిక్‌’ అన్నాడు. ‘విశా లాంధ్ర’లో సబ్‌ ఎడిటర్‌గా కొంత కాలమే ఉండగలిగారు. రారా సంపాదకత్వంలో 1968 ఏప్రిల్‌లో ‘సంవేదన’ మొద లైంది. ఆ త్రైమాసిక తెలుగు సాహిత్య రంగాన్ని ఒక కుదుపు కుదిపింది. కడపలో జరిగిన ‘సంవేదన’ ఆవిష్కరణ సభకు శ్రీశ్రీ, కొ.కు. హాజరయ్యారు. అయితే ‘సంవేదన’ ఏడు సంచికలే వచ్చాయి. 1970లో రారా మాస్కో వెళ్లిపోవడంతో పత్రిక ఆగిపోయింది. ‘సంవేదన’ తర్వాత అలాంటి ప్రామా ణికమైన సాహిత్య పత్రికని ఎవరూ తీసుకురాలేక పోయారు. మాస్కో నుంచి వచ్చాక , ‘ఈనాడు’లో చేరిన రారా సంపాద కీయాలు రాశారు. ఊపిరి తిత్తుల వ్యాధి వల్ల ఆరోగ్యం క్షీణించింది. 1988లో నవంబరు 24న ఆయన తుదిశ్వాస విడిచారు.

రారా అంతటి ప్రతిభా సంపన్నుణ్ణి పట్టించుకునే దిక్కు లేకపోయింది. కమ్యూనిస్టు పార్టీ, విశ్వవిద్యాలయాలూ తమకేమీ పట్టనట్టే ఉండిపోయాయి. సన్మానాలూ, శాలువలూ, పూలదండలూ అంటే ఎంత హేళనో ఆయనకి! ఎంత కటువైన విమర్శ చేసినా, గొప్ప హాస్య దృష్టితోనే చాచికొట్టేవాడు. మార్క్స్, ఎంగెల్స్‌ రచనలు, సోవియెట్‌ సాహిత్యాన్ని ఏళ్ళ తరబడి అనువాదం చేశాడు. శతజయంతి సందర్భంగా రారాని తలుచుకోవడం అంటే తెలుగు సాహిత్య విమర్శని ఆకాశ మార్గాన నడిపించిన పురుషోత ్తమునికి ఒక నమస్కారం పెట్టుకోవడమే! నిక్కచ్చిగా, నిజాయితీగా చేసిన నిఖార్సయిన విమర్శకి తలవొగ్గి వినమ్రంగా ప్రణమిల్లడమే! 

చివరిమాట... ‘భారతీయ సాహిత్య నిర్మాతలు’ సిరీస్‌లో కేంద్ర సాహిత్య అకాడెమీ రారా జీవితచరిత్రను 2006లో ప్రచురించింది. రచయిత తక్కొలు మాచిరెడ్డి. బాగుంటుంది. వీలైతే, 1988 నవంబర్‌ 25, 26 తేదీల్లో రారాకి నివాళిగా ‘ఉదయం’ దినపత్రికలో కె.ఎన్‌.వై. పతంజలి సంపాదకీయం రాశారు. గొప్పగా ఉంటుంది. వీలైతే చదవండి. 

వ్యాసకర్త: తాడి ప్రకాష్‌
సీనియర్‌ జర్నలిస్ట్‌ ‘ 9704541559 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement