ప్రొఫెసర్ సతీష్ ధవన్ (ఫైల్)
భారత అంతరిక్ష ప్రయోగాలంటే టక్కున గుర్తుకు వచ్చేది విక్రమ్ సారాభాయ్.. ఆ తర్వాత ప్రొఫెసర్ సతీష్ ధవన్. వీరు ఆనాడు వేసిన పునాదులే నేడు మన దేశాన్ని అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో అంతర్జాతీయంగా ఎంతో ఎత్తున నిలిపాయి. సౌండింగ్ రాకెట్ల నుంచి భారీ రాకెట్లను నింగిలోకి పంపడమే కాకుండా మంగళయాన్, చంద్రయాన్ లాంటి భారీ ప్రయోగాలు చేసి అగ్రదేశాల సరసన భారత్ నిలవడంలో సతీష్ ధవన్ చేసిన కృషి ఎంతో ఉంది. ఆయన శకం ఇస్రోకు మార్గదర్శకం.. ఆదర్శనీయం. నేడు ధవన్ శత జయంతి సందర్భంగా జ్ఞాపకాలు స్మరిద్దాం.
సాక్షి, శ్రీహరికోట(సూళ్లూరుపేట): అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే కాదు.. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ నెలకు కేవలం ఒక్క రూపాయి జీతం తీసుకుని అందరికీ ఆదర్శవంతంగా నిలిచారు సతీష్ ధవన్. ఇస్రో తొలినాళ్లలో చిన్న తరహా రాకెట్ ప్రయోగాలకు పరిమితమైంది. భవిష్యత్‌లో పెద్ద పెద్ద ఉపగ్రహాలను రోదసీలోకి పంపి దేశ ప్రజలకు అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని సతీష్ అనుక్షణం పరితపించారు. ఆయన ఆనాడు చేసిన ఆలోచనల్లో నుంచి పుట్టినవే పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లు. ఇవి తయారు చేయడానికి ఆయన ఆధ్యర్యంలో ఎన్నో ప్రయోగాత్మక పరీక్షలు చేసి విజయం సాధించారు.
వాజ్‌పేయితో (ఫైల్)
♦1920 సెప్టెంబర్ 25న శ్రీనగర్‌లో ధవన్ జన్మించారు. విద్యార్థిగా అత్యంత ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించారు.
♦మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రులై, ఉన్నత విద్య నిమిత్తం అమెరికాకు వెళ్లారు. అలాగే ఈయన ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్ చేశారు.
♦1951లో స్వదేశానికి వచ్చిన వెంటనే బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో అధ్యాపకుడిగా చేరిన అనతికాలంలోనే పదోన్నతి పొందారు.
♦1962లో ఆ సంస్థకు డైరెక్టర్ అయ్యారు.
♦1972లో అంతరిక్ష పితామహులు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ మరణానంతరం ఇస్రోను ముందుకు నడపగలిగిన వ్యక్తిగా ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆ బాధ్యతలను ధవన్‌కు అప్పగించారు.
♦బెంగళూరు ఐఐటీకి డైరెక్టర్‌గా కొనసాగుతూనే ఇస్రో చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తూ నెలకు ఒక్క రూపాయి జీతంగా తీసుకున్న గొప్పవ్యక్తిగా ఆయన గురించి ఈ నాటికి చెప్పుకోవడం విశేషం.
ఇందిరాగాందీతో సతీష్ ధవన్ (ఫైల్)
♦సమాచార వ్యవస్థ, వాతావరణ పరిశోధన, భూమిలో దాగి ఉన్న ఖనిజసంపద ఉనికిని తెలుసుకోవడం కోసం బహుళ ప్రయోజనాలకై సొంతంగా ఉపగ్రహాలను తయారుచేసి ప్రయోగించాలనే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ కన్నకలలను ధవన్ నిజం చేశారు.
♦ఇస్రో చైర్మన్ అయిన అనతికాలంలోనే మన తొలి ఉపగ్రహం ఆర్యభట్ట, భాస్కర, యాపిల్ ఉపగ్రహాలను నిర్మించి ఎస్‌ఎల్‌వీ ఉపగ్రహవాహకనౌక ద్వారా ప్రయోగించగలిగారు. ఇన్‌శాట్, ఐఆర్‌ఎస్, తరహా ఉపగ్రహాల నిర్మాణ ప్రణాళికలు తయారు చేశారు..
♦భారత అంతరిక్ష పరిశోధనాయాత్రలో ఆయన శకం ముఖ్యమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు.
♦పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఆయన దేశ అంతరిక్ష రంగానికి విశేష సేవలు అందించారు. 2002 సంవత్సరంలో జనవరి 3వ తేదీన తుదిశ్వాస విడిచారు.
♦ఆయన పేరును మరిచిపోకుండా శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి 2002 సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌గా నామకరణం చేసి ఇస్రో ఘనమైన నివాళిని అర్పించింది.
♦షార్‌లోని రెండోగేట్‌కు అవతల వైపున సతీష్ ధవన్ విగ్రహాన్ని ఏర్పాటుచేసి దానికి సతీష్ ధవన్ మెమోరియల్‌గా నామకరణం చేసి ఆయన పట్ల భక్తిభావాన్ని చాటుకుంది ఇస్రో.
ఐకే గుజ్రాల్‌తో (ఫైల్)
అవార్డులు
♦1981లో పద్మవిభూషణ్ అవార్డు, ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అవార్డు, కాలిఫోరి్నయా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు ఇచ్చిన పురస్కారాలను స్వీకరించారు. ఆయన హయాంలో పలువురు ప్రధానమంత్రులు షార్‌కు విచ్చేసి ప్రయోగాలను వీక్షించారు.
ముఖ్య ఘట్టాలు
♦నేడు పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి చెందిందంటే అది ఆనాడు సతీష్ ధవన్ చేసిన కృషి ఫలితమే.
♦భారత తొలి అంతరిక్ష పితామహుడిగా విక్రమ్ సారాభాయ్ పేరుగాంచారు. ఆయన కన్న కలలను సాకారం చేసిన వ్యక్తిగా ప్రొఫెసర్ సతీష ధవన్ నిలిచారు.
♦ధవన్ భారీ రాకెట్‌లు, ఉపగ్రహాలు తయారు చేసి గ్రహాంతర ప్రయోగాలే చేసే స్థాయికి ఇస్రోని తీసుకువెళ్లారు.
♦ఇస్రో ప్రయోగించిన సమాచార ఉపగ్రహాలతో అనేక గ్రామాల్లో టెలివిజన్ ద్వారా దూరవిద్య సదుపాయాన్ని (టెలీ ఎడ్యుకేషన్) కల్పించారు. ఈ అనుభవం భారత జాతీయ సమాచార ఉపగ్రహ వ్యవస్థకు ఎంతో దోహదపడి సమాచార రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు.
♦ఆనాడు ఆయన వేసిన పునాదులతో నేడు సమాచార రంగంలో కొత్త ఒరఒడిని సృష్టిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment