satish dhawan
-
ఇస్రో హీరో..
భారత అంతరిక్ష ప్రయోగాలంటే టక్కున గుర్తుకు వచ్చేది విక్రమ్ సారాభాయ్.. ఆ తర్వాత ప్రొఫెసర్ సతీష్ ధవన్. వీరు ఆనాడు వేసిన పునాదులే నేడు మన దేశాన్ని అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో అంతర్జాతీయంగా ఎంతో ఎత్తున నిలిపాయి. సౌండింగ్ రాకెట్ల నుంచి భారీ రాకెట్లను నింగిలోకి పంపడమే కాకుండా మంగళయాన్, చంద్రయాన్ లాంటి భారీ ప్రయోగాలు చేసి అగ్రదేశాల సరసన భారత్ నిలవడంలో సతీష్ ధవన్ చేసిన కృషి ఎంతో ఉంది. ఆయన శకం ఇస్రోకు మార్గదర్శకం.. ఆదర్శనీయం. నేడు ధవన్ శత జయంతి సందర్భంగా జ్ఞాపకాలు స్మరిద్దాం. సాక్షి, శ్రీహరికోట(సూళ్లూరుపేట): అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే కాదు.. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ నెలకు కేవలం ఒక్క రూపాయి జీతం తీసుకుని అందరికీ ఆదర్శవంతంగా నిలిచారు సతీష్ ధవన్. ఇస్రో తొలినాళ్లలో చిన్న తరహా రాకెట్ ప్రయోగాలకు పరిమితమైంది. భవిష్యత్‌లో పెద్ద పెద్ద ఉపగ్రహాలను రోదసీలోకి పంపి దేశ ప్రజలకు అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని సతీష్ అనుక్షణం పరితపించారు. ఆయన ఆనాడు చేసిన ఆలోచనల్లో నుంచి పుట్టినవే పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ రాకెట్లు. ఇవి తయారు చేయడానికి ఆయన ఆధ్యర్యంలో ఎన్నో ప్రయోగాత్మక పరీక్షలు చేసి విజయం సాధించారు. వాజ్‌పేయితో (ఫైల్) ♦1920 సెప్టెంబర్ 25న శ్రీనగర్‌లో ధవన్ జన్మించారు. విద్యార్థిగా అత్యంత ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించారు. ♦మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రులై, ఉన్నత విద్య నిమిత్తం అమెరికాకు వెళ్లారు. అలాగే ఈయన ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్ చేశారు. ♦1951లో స్వదేశానికి వచ్చిన వెంటనే బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో అధ్యాపకుడిగా చేరిన అనతికాలంలోనే పదోన్నతి పొందారు. ♦1962లో ఆ సంస్థకు డైరెక్టర్ అయ్యారు. ♦1972లో అంతరిక్ష పితామహులు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ మరణానంతరం ఇస్రోను ముందుకు నడపగలిగిన వ్యక్తిగా ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆ బాధ్యతలను ధవన్‌కు అప్పగించారు. ♦బెంగళూరు ఐఐటీకి డైరెక్టర్‌గా కొనసాగుతూనే ఇస్రో చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తూ నెలకు ఒక్క రూపాయి జీతంగా తీసుకున్న గొప్పవ్యక్తిగా ఆయన గురించి ఈ నాటికి చెప్పుకోవడం విశేషం. ఇందిరాగాందీతో సతీష్ ధవన్ (ఫైల్) ♦సమాచార వ్యవస్థ, వాతావరణ పరిశోధన, భూమిలో దాగి ఉన్న ఖనిజసంపద ఉనికిని తెలుసుకోవడం కోసం బహుళ ప్రయోజనాలకై సొంతంగా ఉపగ్రహాలను తయారుచేసి ప్రయోగించాలనే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ కన్నకలలను ధవన్ నిజం చేశారు. ♦ఇస్రో చైర్మన్ అయిన అనతికాలంలోనే మన తొలి ఉపగ్రహం ఆర్యభట్ట, భాస్కర, యాపిల్ ఉపగ్రహాలను నిర్మించి ఎస్ఎల్వీ ఉపగ్రహవాహకనౌక ద్వారా ప్రయోగించగలిగారు. ఇన్శాట్, ఐఆర్ఎస్, తరహా ఉపగ్రహాల నిర్మాణ ప్రణాళికలు తయారు చేశారు.. ♦భారత అంతరిక్ష పరిశోధనాయాత్రలో ఆయన శకం ముఖ్యమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. ♦పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఆయన దేశ అంతరిక్ష రంగానికి విశేష సేవలు అందించారు. 2002 సంవత్సరంలో జనవరి 3వ తేదీన తుదిశ్వాస విడిచారు. ♦ఆయన పేరును మరిచిపోకుండా శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి 2002 సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌గా నామకరణం చేసి ఇస్రో ఘనమైన నివాళిని అర్పించింది. ♦షార్‌లోని రెండోగేట్కు అవతల వైపున సతీష్ ధవన్ విగ్రహాన్ని ఏర్పాటుచేసి దానికి సతీష్ ధవన్ మెమోరియల్‌గా నామకరణం చేసి ఆయన పట్ల భక్తిభావాన్ని చాటుకుంది ఇస్రో. ఐకే గుజ్రాల్‌తో (ఫైల్) అవార్డులు ♦1981లో పద్మవిభూషణ్ అవార్డు, ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అవార్డు, కాలిఫోరి్నయా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు ఇచ్చిన పురస్కారాలను స్వీకరించారు. ఆయన హయాంలో పలువురు ప్రధానమంత్రులు షార్కు విచ్చేసి ప్రయోగాలను వీక్షించారు. ముఖ్య ఘట్టాలు ♦నేడు పీఎస్ఎల్వీ రాకెట్ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి చెందిందంటే అది ఆనాడు సతీష్ ధవన్ చేసిన కృషి ఫలితమే. ♦భారత తొలి అంతరిక్ష పితామహుడిగా విక్రమ్ సారాభాయ్ పేరుగాంచారు. ఆయన కన్న కలలను సాకారం చేసిన వ్యక్తిగా ప్రొఫెసర్ సతీష ధవన్ నిలిచారు. ♦ధవన్ భారీ రాకెట్లు, ఉపగ్రహాలు తయారు చేసి గ్రహాంతర ప్రయోగాలే చేసే స్థాయికి ఇస్రోని తీసుకువెళ్లారు. ♦ఇస్రో ప్రయోగించిన సమాచార ఉపగ్రహాలతో అనేక గ్రామాల్లో టెలివిజన్ ద్వారా దూరవిద్య సదుపాయాన్ని (టెలీ ఎడ్యుకేషన్) కల్పించారు. ఈ అనుభవం భారత జాతీయ సమాచార ఉపగ్రహ వ్యవస్థకు ఎంతో దోహదపడి సమాచార రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ♦ఆనాడు ఆయన వేసిన పునాదులతో నేడు సమాచార రంగంలో కొత్త ఒరఒడిని సృష్టిస్తున్నాం. -
ఇస్రో ప్రగతిలో త్రిమూర్తులు
సౌండింగ్ రాకెట్ స్థాయి నుంచి చంద్రయాన్–2 ప్రయోగం దాకా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎన్నో మైలురాళ్లను దాటింది. విక్రమ్‌సారాభాయ్, ప్రొఫెసర్ సతీష్ ధవన్ దేశఅంతరిక్ష ప్రయోగాలకు బీజాలు వేశారు. ఆ తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం వాటిని విజయపథంలో నడిపించేందుకు ఎంతో కృషి చేశారు. నేడు ఇస్రో సాధిస్తున్న విజయాల్లో వీరి పాత్ర కీలకం. ప్రపంచ దేశాల్లో భారత్‌కు గుర్తింపు వచ్చిందంటే దాని వెనుక వీరు వేసిన బాటలో నడిచిన శాస్త్రవేత్తలు ఎందరో ఉన్నారు. సాక్షి, సూళ్లూరుపేట: భారత అంతరిక్ష ప్రయోగాల పితామహులు విక్రమ్‌సారాభాయ్, సతీష్ ధవన్ వేసిన బీజాలతో నేడు వినువీధిలో ఇస్రో విజయపతాకాన్ని ఎగురవేస్తోంది. డాక్టర్ విక్రమ్‌సారాబాయ్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థను బుడి బుడి అడుగులతో నడిపించగా, తప్పటడుగులు లేకుండా సజావుగా నడిపించిన శాస్త్రవేత్త సతీష్ ధవన్. ఆ తరువాత ఏపీజే అబ్దుల్ కలాం ఇస్రోను ముందుకు నడిపించారు. 1972లో విక్రమ్‌సారాభాయ్ దురదృష్టవశాత్తు మరణించారు. ఆ తరువాత ప్రభుత్వం అంతరిక్ష పరిశోధన సంస్థను ఎవరు నడిపించగలరని వెతుకుతుండగా అందిరి అలోచనల్లో పుట్టిన వ్యక్తి ప్రొఫెసర్ సతీష్ ధవన్. విక్రమ్‌సారాభాయ్ మరణానంతరం 1979లో షార్ కేంద్రంగా అంతరిక్ష పరిశోధనలను ఆనాటి ఇస్రో చైర్మన్ సతీస్ ధవన్, మరో ముఖ్యశాస్త్రవేత్త, దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నడిపించారు. షార్ నుంచి చేపట్టిన తొలిప్రయోగం ఎస్ఎల్వీ–3 ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఏపీజే అబ్దుల్‌కలాం(ఫైల్) వీరిద్దరి సారధ్యంలో షార్ నుంచి మొదట ప్రయోగించిన ఎస్ఎల్వీ–3 విఫలమైనప్పుడు నిరాశ,నిస్పృహలకు లోనైన సహచర శాస్త్రవేత్తల వెన్నుతట్టి మరో ప్రయోగానికి కార్యోన్ముఖులను చేశారని ఈ నాటికి వారి గురించి తెలిసిన సహచర శాస్త్రవేత్తలు చెప్పుకోవడం విశేషం. ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ వంటి భారీ రాకెట్ల ప్రయోగానికి ఆద్యుడిగా ఇస్రో చరిత్రలో నిలిచిపోయారు సతీష్ ధవన్. ఆ తరువాత యూఆర్ రావు, కసూర్తిరంగన్, మాధవన్నాయర్, ప్రస్తుతం డాక్టర్ కే రాధాకృష్ణన్, ఏఎస్ కిరణ్‌కుమార్ వంటి అతిరథ మహారధులు ఇస్రో చైర్మన్లుగా అంతరిక్ష ప్రయోగాలను కొత్త పుంతలు తొక్కిస్తూ ప్రపంచ దేశాల్లో భారత్‌ను బలమైన దేశంగా నిలబెట్టారు. ఇస్రో తొలినాళ్లలో సరైనా సాంకేతిక పరిజ్ఞానం లేక చిన్నచిన్న ఉపగ్రహాలను ప్రయోగించుకుంటూ రష్యా, ప్రాన్స్ ంటి దేశాలకు చెందిన అంతరిక్ష సంస్థలపై ఆధారపడి పెద్ద పెద్ద ఉపగ్రహాలను పంపేది. నేడు ఆ స్థాయిని దాటి విదేశాలకు చెందిన ఉపగ్రహాలను వాణిజ్యపరంగా పంపిస్తూ సంవత్సరానికి సరాసరిన సుమారు రూ.1000కోట్లకుపైగా ఆదాయాన్ని గడిస్తోంది. ఇప్పటి వరకు 30 దేశాలకు చెందిన 297 ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించి త్రిబుల్ సెంచరీకి చేరువలో ఉంది. అదే ఇస్రో ఇప్పటి వరకు 30 ఉపగ్రహాలను మాత్రమే విదేశాల నుంచి పంపించింది. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ చంద్రయాన్–1, మంగళ్యాన్–2, నేడు చంద్రయాన్–2 వంటి గ్రహాంతర ప్రయోగాలు చేసే స్థాయికి ఎదిగింది. నేడు అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచంలో భారత్ నాలుగో దేశంగా అవతరించనుండడానికి ఆనాటి అంతరిక్ష పితామహులు వేసిన బీజాలే కారణం. నేటి తరం శాస్త్రవేత్తలు ఇస్రో భాహుబలి రాకెట్‌గా పేరు పొందిన జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ ద్వారా సుమారు నాలుగు టన్నుల బరువు కలిగిన చంద్రయాన్–2 మిషన్ ద్వారా చంద్రుడిపై పరిశోధనలకు సిద్ధమవుతున్నారు. భారత అంతరిక్ష పరిశోధనలకు త్రిమూర్తులు చేసిన కృషిని మరిచిపోకుండా కేరళలోని రాకెట్ విడిభాగాల తయారీ కేంద్రానికి విక్రమ్ సారాభాయ్ స్పేస్‌సెంటర్, శ్రీహరికోటకు వెళ్లే మార్గానికి విక్రమ్ సారాభాయ్ మార్గ్, శ్రీహరికోట హైలీ అల్టిట్యూడ్ రేంజ్ (షార్) కేంద్రానికి ప్రొఫెసర్ సతీష్ ధవన్ పేరుతో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌గా, బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రానికి ప్రొఫెసర్ యూఆర్‌రావు శాటిలైట్ సెంటర్లుగా నామకరణాలు చేసి వారికి అంకితం ఇవ్వడం విశేషం. -
31న పీఎస్ఎల్వీ–సీ39 ప్రయోగం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఈ నెల 31న పీఎస్ఎల్వీ–సీ39 ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారు. దీని ద్వారా ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్ఎన్ఎస్ఎస్) ఉప గ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 10 నుంచి 15లోపు బెంగళూరు నుంచి ఉపగ్రహం షార్కి వచ్చే అవకాశముంది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భారత్‌కు దిక్సూ చి వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు 7 ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్లను రోదసీలోకి పంపగా, అందులో ఒకటి సేవలను అందించడం మానేసింది. దానిస్థానంలో ఈ నెల 31న మరో ఉపగ్రహన్ని పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అద్భుతంగా పనిచేస్తున్న ఆస్ట్రోశాట్: విశ్వంలోని మూలాలను శోధించేందుకు 2015 సెప్టెంబర్ 28న ప్రయోగించిన 1,513 కిలోల ఆస్ట్రోశాట్ అద్భుతంగా పనిచేస్తోందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) గురువారం ప్రకటించింది. ఇది ఖగోళంలో 360 రకాల పదార్థాలను పరిశోధించి సమాచారాన్ని అందించింది. ఖగోళ పరిశోధనకు ఇస్రో చేసిన తొలి ప్రయోగం ఇదే కావడం విశేషం. 1996లో అప్పటి ఇస్రో చైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ విశ్వంలోని గ్రహాలు, వాటి నుంచి వెలువడే వ్యర్థాలు, నక్షత్రాల పుట్టుక, వాటికి అవతల ఉన్న స్థితిగతులను తెలుసుకోవడానికి ఓ ఉపగ్రహ ప్రయోగాన్ని ప్రతిపాదించారు. దాన్ని 2015లో అమలు చేశారు. విశ్వంలోని సుదూర పదార్థాలను అధ్యయనం చేయడానికి, నక్షత్రాల ఆవిర్భావం, న్యూట్రాన్ స్టార్స్, బ్లాక్‌హోల్స్, వాటి అయస్కాంత క్షేత్రాలు, గెలాక్సీ అవతలి పరిస్థితుల అధ్యయనానికి ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. ఆస్ట్రోశాట్‌లో అమర్చిన 5 రకాల ఉపకరణాలు ఖగోళంలోని స్థితిగతులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్నాయి. -
బహుముఖ ప్రజ్ఞాశాలి సతీష్ ధవన్
షార్ డైరెక్టర్ పీ కున్హికృష్ణన్ షార్‌లో ఘనంగా ధవన్ జయంతి వేడుకలు శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పితామహుల్లో ప్రొఫెసర్ సతీష్ ధవన్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా చెప్పుకోవచ్చునని, ఆయన హయాంలోనే భారత అంతరిక్ష ప్రయోగాల బుడి బుడి అడుగులతో ప్రారంభమయ్యాయని షార్ డెరెక్టర్ పీ కున్హికృష్ణన్ పేర్కొన్నారు. అంతరిక్ష పితామహుల్లో తొలితరం శాస్త్రవేత్త అయిన సతీష్ ధవన్ 97వ జయంతి ఉత్సవాలను ఆదివారం షార్‌లో ఘనంగా జరుపుకున్నారు. షార్‌లోని రెండోగేట అవతలవైపు ఉన్న సతీష్ ధవన్ మెమోరియల్‌లో ఆయన విగ్రహానికి, బ్రహ్మప్రకాష్ హాల్లో ఉన్న ఆయన చిత్రపటానికి షార్ డైరెక్టర్ పీ కున్హికృష్ణన్, వీఎస్ఎస్సీ డైరెక్టర్ డాక్టర్ పీ శివన్ పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరిక్ష ప్రయోగాల్లో తొలితరం శాస్త్రవేత్తల్లో ఒకరైన సతీష్ ధవన్ ఇస్రో అభివృద్ధికి చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. అంతరిక్ష ప్రయోగాలు చేయాలని తొలినాళ్లలో ఎంటీసీఆర్ ఆంక్షలతో ఇతర దేశాలు మనకు సాంకేతిక పరిజ్ఞానం అందించకపోవడంతో దాన్ని సవాల్‌గా తీసుకుని డాక్టర్ విక్రమ్‌సారాభాయ్, ప్రొఫెసర్ సతీష్ ధవన్ లాంటి ఎందరో శాస్త్రవేత్తలు తమ మేధా సంపత్తితో అంతరిక్ష శాస్త్ర విజ్ఞానాన్ని మనకు అందించారన్నారు. తొలినాళ్లలో సౌండింగ్ రాకెట్లు ప్రయోగించే స్థాయి గ్రహాంతర ప్రయోగాలు చేయడమే కాకుండా ఖగోళ పరిశోధన, నావిగేషన్ ఏర్పాటు చేసుకోవడం వంటì ఉపగ్రహాలను తయారు చేసి పంపించే స్థాయికి ఎదిగామంటే ఆనాడు సతీష ధవన్ లాంటి శాస్త్రవేత్తలు వేసి బీజమేనన్నారు. ఆయన ఆలోచనలకు ప్రతిరూపమే నేడు షార్ రెండో ప్రయోగవేదిక అని చెప్పారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ శివన్, కంట్రోలర్ జేవీ రాజారెడ్డి, గ్రూప్ డైరెక్టర్ పీ విజయసారధితో పాటు పీఎస్ఎల్వీ సీ35 ప్రయోగానికి విచ్చేసిన శాస్త్రవేత్తలందరూ నివాళులర్పించారు. అదే విధంగా సూళ్లూరుపేట పట్టణంలోని కేఆర్పీ కాలనీ సమీపంలో ఉన్న సతీష్ ధవన్ స్మారక ఆసుపత్రిలో కూడా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. -
కౌంట్‌డౌన్ షురూ
-
పీఎస్ఎల్వీ-సీ27 ప్రయోగం విజయవంతం
సూళ్లూరుపేట: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్).. తొలి ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.19 గంటలకు పీఎస్ఎల్వీ-సీ27 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. దీంతో గురువారం ఉదయం ప్రారంభమైన కౌంట్‌డౌన్ కి తెరపడింది. అంతకుముందు ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ శుక్రవారం, పీఎస్ఎల్వీ-సీ27 రాకెట్‌ను పరిశీలించారు. శాస్త్రవేత్తలతో సమీక్షల అనంతరం 1,425 కిలోల బరువున్న భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహం (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం-1డీ)ను అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. మన దేశ అవసరాల నిమిత్తం భారత క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థను సమకూర్చుకునేందుకు పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహ వ్యవస్థకు ఇస్రో శ్రీకారం చుట్టింది. మొత్తం ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించాలనే వ్యూహంలో భాగంగా ఇవాల్టిది నాలుగోది. ఉపగ్రహ ప్రయోగం విజయం సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇస్రో శాస్త్రవేత్తలకు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. Heartiest congratulations to ISRO Team on successful launch of IRNSS-1D satellite; Nation proud of the achievement #PresidentMukherjee — President of India (@RashtrapatiBhvn) March 28, 2015 పీఎస్ఎల్వీ -సీ 27 ప్రత్యేకతలివీ.. ఇస్రో చైర్మన్‌గా కిరణ్ కుమార్‌కు ఇదే తొలి ప్రయోగం. నావిగేషన్ శాటిలైట్ల శ్రేణిలో ఇది నాల్గోది. ఇదే ఏడాది మరో రెండు శాటిలైట్లను ప్రయోగించనున్నారు. మొత్తం 7 నావిగేషన్ ఉపగ్రహాలను 2016 లోగా ప్రయోగించునున్న ఇస్రో. దక్షిణాసియాలో మెరుగుపడనున్న ట్రాకింగ్, మ్యాపింగ్, నావిగేషన్. సముద్రంపై 20 మీటర్లు, భూమిపై 10 మీటర్ల పరిధిలో చూడగల అవకాశం. భారత భూభాగం నుంచి రెండువేల కిలోమీటర్ల వరకూ చూడగల నావిగేషన్ ఉపగ్రహాలు. మొత్తం ఐఆర్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు ఖరీదు రూ.1420 కోట్లు. ఒక్కో ఉపగ్రహం ఖరీదు రూ.125 కోట్లు. -
నింగికి ఎగసిన పీఎస్ఎల్వీ-సీ27
-
నేడు పీఎస్ఎల్వీ సీ27 ప్రయోగం
సూళ్లూరుపేట: శ్రీపొట్టి శ్రీరాములు నె ల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్).. మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.19 గంటలకు పీఎస్ఎల్వీ-సీ27 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. దీనికి సంబంధించి గురువారం ఉదయం 5.49 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. రాకెట్ ద్వారా 1,425 కిలోల బరువున్న భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహం (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం-1డీ)ను అంతరిక్ష కక్ష్యలోకి పంపనున్నారు. మనదేశ అవసరాల నిమిత్తం భారత క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థను సమకూర్చుకునేందుకు పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహ వ్యవస్థకు ఇస్రో శ్రీకారం చుట్టింది. ఈ ప్రయోగంలో మొత్తం ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించాల్సి ఉండగా ప్రస్తుతం నాలుగోదాన్ని పంపుతున్నారు. కాగా, ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ శుక్రవారం షార్కు చేరుకున్నారు. పీఎస్ఎల్వీ-సీ27 రాకెట్‌ను పరిశీలించి శాస్త్రవేత్తలతో మాట్లాడారు. -
షార్.. హుషార్
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : సతీష్ ధావన్స్పేస్ సెంటర్ (షార్) నుంచి మంగళవారం మధ్యాహ్నం 2.38.26 గంటలకు పీఎస్ఎల్వీ సీ25 విజయంతో సర్వత్రా హుషార్ నెలకొంది. శ్రీహరికోటలో పండగ వాతావరణం చోటు చేసుకుంది. అంగారకుడిపైకి పరిశోధనల నిమిత్తం చేస్తున్న ప్రయోగం కావడంతో శ్రీహరికోటలోని షార్ ఉద్యోగుల కుటుంబాలు, బంధువులు రాకెట్ ప్రయోగాన్ని భవనాల మీద నుంచి వీక్షించారు. రాకెట్ నింగికేగుతున్న సమయంలో వారి చప్పట్లతో శ్రీహరికోట మారుమోగిపోయింది. ఇస్రో మొట్టమొదటగాసారి గ్రహాంతర ప్రయోగం కావడంతో షార్ ఉద్యోగుల్లో కూడా సంతోషం వ్యక్తమైంది. ఏ ఇద్దరు కలిసినా ప్రయోగ విజయాన్ని పంచుకుంటూ ఒకరినొకరు అలింగనం చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు. రాకెట్ నింగిలోకి ఎగుస్తున్నంత సేపు కరతాళధ్వనులతో దేశభక్తిని చాటుకున్నారు. షార్‌లో బందోబస్తులో ఉన్న పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది మీడియా సెంటర్లోని టీవీల్లో ప్రయోగాన్ని ఆద్యంతం వీక్షించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. 2011లో నాలుగు విజయాలు, 2012లో రెండు విజయాలు, ఈ ఏడాది కూడా నాలుగు విజయాలు నమోదు కావడంతో షార్ ఉద్యోగులు సంబరాలను జరుపుకున్నారు. సూళ్లూరుపేట, తడ ప్రాంతాల్లోని గ్రామీణులు సైతం మిద్దెలపై నుంచి రాకెట్ ప్రయోగాన్ని వీక్షించారు. మరికొంత మంది ఉత్సాహవంతులు పులికాట్ సరస్సులో అటకానితిప్ప వద్ద నుంచి ప్రయోగాన్ని వీక్షించారు. ప్రయోగం విజయవంతంగా నిర్వహించడంతో ఈ ప్రాంత ప్రజల్లో కూడా విజయగర్వం తొణకిస లాడింది. భవిష్యత్తులో కూడా మరిన్ని పెద్ద ప్రయోగాలు చేసి మన శాస్త్రవేత్తలు పెద్దపెద్ద విజయాలు సాధించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. గతేడాదితో వంద ప్రయోగాలు పూర్తి చేసి సెంచరీ మైలు రాయిని దాటిన షార్ ఈ ప్రయోగంతో 109 విజయాలను సొంతం చేసుకుంది. షార్ నుంచి 40వ ప్రయోగంలో పీఎస్ఎల్వీ సిరీస్‌లో 25వ ప్రయోగం కావడంతో షార్ ఉద్యోగులు ఎక్కడలేని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రముఖుల ప్రశంసలు అంగారక యాత్రను విజయవంతంగా నిర్వహించడంతో స్థానిక ప్రజాప్రతినిధులు షార్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే పరసా వెంకటరత్నయ్య, చెంగాళమ్మ పాలకమండలి మాజీ చైర్మన్ ఇసనాక హర్షవర్ధన్‌రెడ్డి, వేనాటి రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు దబ్బల రాజారెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం, కిలివేటి సంజీవయ్య తదితరులు శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇలాంటి పెద్ద పెద్ద ప్రయోగాలు చేసి ఇస్రో కీర్తిని మరింత ఇనుమడింప జేయాలని కోరారు.