
పీఎస్‌ఎల్‌వీ-సీ27 ప్రయోగం విజయవంతం
సూళ్లూరుపేట: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్).. తొలి ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.19 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ27 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. దీంతో గురువారం ఉదయం ప్రారంభమైన కౌంట్‌డౌన్ కి తెరపడింది. అంతకుముందు ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ శుక్రవారం, పీఎస్‌ఎల్‌వీ-సీ27 రాకెట్‌ను పరిశీలించారు. శాస్త్రవేత్తలతో సమీక్షల అనంతరం 1,425 కిలోల బరువున్న భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహం (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం-1డీ)ను అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
మన దేశ అవసరాల నిమిత్తం భారత క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థను సమకూర్చుకునేందుకు పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహ వ్యవస్థకు ఇస్రో శ్రీకారం చుట్టింది. మొత్తం ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించాలనే వ్యూహంలో భాగంగా ఇవాల్టిది నాలుగోది. ఉపగ్రహ ప్రయోగం విజయం సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇస్రో శాస్త్రవేత్తలకు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.
Heartiest congratulations to ISRO Team on successful launch of IRNSS-1D satellite; Nation proud of the achievement #PresidentMukherjee
— President of India (@RashtrapatiBhvn) March 28, 2015
పీఎస్‌ఎల్‌వీ -సీ 27 ప్రత్యేకతలివీ..
ఇస్రో చైర్మన్‌గా కిరణ్ కుమార్‌కు ఇదే తొలి ప్రయోగం.
నావిగేషన్ శాటిలైట్ల శ్రేణిలో ఇది నాల్గోది.
ఇదే ఏడాది మరో రెండు శాటిలైట్లను ప్రయోగించనున్నారు.
మొత్తం 7 నావిగేషన్ ఉపగ్రహాలను 2016 లోగా ప్రయోగించునున్న ఇస్రో.
దక్షిణాసియాలో మెరుగుపడనున్న ట్రాకింగ్, మ్యాపింగ్, నావిగేషన్.
సముద్రంపై 20 మీటర్లు, భూమిపై 10 మీటర్ల పరిధిలో చూడగల అవకాశం.
భారత భూభాగం నుంచి రెండువేల కిలోమీటర్ల వరకూ చూడగల నావిగేషన్ ఉపగ్రహాలు.
మొత్తం ఐఆర్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు ఖరీదు రూ.1420 కోట్లు.
ఒక్కో ఉపగ్రహం ఖరీదు రూ.125 కోట్లు.