పీఎస్ఎల్వీ-సీ 27 ప్రయోగం విజయవంతం
రాష్ట్రీయం
సింగరేణికి యూఏఈ పురస్కారం తెలంగాణలోని సింగరేణి సంస్థకు యునెటైడ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి చెందిన గోల్డెన్ పీకాక్ ఇన్నోవేటివ్ ప్రోడక్డ్/సర్వీస్ పురస్కారం లభించింది. ఏప్రిల్ 20న ఎమిరేట్స్ ప్రభుత్వం దుబాయ్‌లో ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. బొగ్గు గనుల కోసం తవ్వి తీసిన మట్టిని తిరిగి వినియోగించుకోవడంలో చూపిన విధానాలకు ఈ బహుమతి దక్కింది.
చిత్తూరు జిల్లాలో ఐఐటీకి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో తిరుపతికి సమీపాన ఏర్పేడు మండలంలో ఏర్పాటు చేసే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ(ఐఐఎస్ఈఆర్)లకు, శ్రీసిటీ సెజ్‌లో ఏర్పాటు చేసే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ- చిత్తూరు)లకు మార్చి 28న శంకుస్థాపన జరిగింది.
భద్రాద్రి విద్యుత్తు కేంద్రానికి భూమిపూజ
ఖమ్మం జిల్లా పినపాక మండలంలో ఏర్పాటు చేసే భద్రాద్రి విద్యుత్తు ఉత్పత్తి కేంద్రానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మార్చి 28న భూమి పూజ చేశారు. 1080 మెగావాట్ల ఈ విద్యుత్తు కేంద్రాన్ని రూ.7290.60 కోట్ల ఖర్చుతో ఏర్పాటుచేస్తున్నారు.
అవార్డులు
భారత సంతతి శాస్త్రవేత్తకు అమెరికా అవార్డు అమెరికా ప్రెసిడెన్షియల్ అవార్డుకు భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త ఎస్. కంభంపాటి ఎంపికయ్యారు. ఆయన ప్రస్తుతం అమెరికాలోని సదరన్ యూనివర్సిటీలో జీవశాస్త్రం ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. విద్యార్థులలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనాసక్తి పెంచేందుకు కృషిచేసినందుకు గాను ఈ అవార్డు లభించింది. ఈయన విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ చదివారు.
ఇస్రోకు గాంధీ శాంతి బహుమతి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు 2014 సంవత్సరానికిగానూ గాంధీ శాంతి బహుమతి లభించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక బృందం ఇస్రోను ఎంపిక చేస్తూ మార్చి 27న నిర్ణయం తీసుకుంది. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడినందుకు ఇస్రోను ఎంపిక చేశారు. అహింసా మార్గంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పు కోసం కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు ఈ బహుమతి కింద రూ. 1 కోటి నగదు, ప్రశంసా పత్రం ప్రదానం చేస్తారు.
క్రీడలు
ఆస్ట్రేలియాకు ప్రపంచకప్ క్రికెట్ ప్రపంచ కప్‌ను ఆస్ట్రేలియా ఐదోసారి గెలుచుకుంది. మెల్బోర్న్లో మార్చి 29న జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించింది. విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు రూ. 24.85 కోట్లు ప్రైజ్ మనీ దక్కింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్: జేమ్స్ ఫాల్కనర్(ఆస్ట్రేలియా); మ్యాన్ ఆఫ్ ద సిరీస్: మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా) ఎంపికయ్యారు. ఈ టోర్నీలో గప్ట్టిల్(న్యూజిలాండ్) అత్యధికంగా 547 పరుగులు చేశాడు. స్టార్క్(ఆస్ట్రేలియా), బౌల్ట్ (న్యూజిలాండ్) ఇరువురు అత్యధిక (22) వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా 2015తోపాటు 1987, 1999, 2003, 2007 ప్రపంచకప్‌ను ఐదుసార్లు గెలుచుకుంది. తదుపరి ప్రపంచకప్ 2019లో ఇంగ్లండ్‌లో జరుగుతుంది.
ప్రపంచ నెంబర్ వన్ సైనా నెహ్వాల్
హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్మహిళల విభాగంలో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నారు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. సైనా నెంబర్‌వన్ ర్యాంక్‌ను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య.. ఏప్రిల్ 2న అధికారికంగా ప్రకటిస్తుంది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొనే 1980లో నెంబర్‌వన్ ర్యాంక్ దక్కించుకున్నారు.
సైనా, శ్రీకాంత్‌లకు ఇండియా ఓపెన్ టైటిల్స్
ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ టైటిల్స్‌ను భారత్‌కు చెందిన సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ గెలుచుకున్నారు. న్యూఢిల్లీలో మార్చి 29న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సైనా ఇంతనోన్ రత్చనోక్ (థాయిలాండ్)ను ఓడించింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)ను శ్రీకాంత్ ఓడించాడు.
హాకీ ఇండియా అవార్డులు
తొలిసారిగా ప్రవేశపెట్టిన హాకీ ఇండియా అవార్డులను న్యూఢిల్లీలో మార్చి 28న బహుకరించారు. మేజర్ ధ్యాన్‌చంద్ జీవిత సాఫల్య పురస్కారం బల్బీర్ సింగ్ సీనియర్(90)కు దక్కింది. ఆయనకు ట్రోఫీతో పాటు రూ.30 లక్షల నగదు ఇచ్చారు. 1948-56 వరకు స్వర్ణ పతకాలు సాధించిన భారత హాకీ జట్టులో బల్బీర్ సింగ్ ఆడారు. 1956లో ఒలంపిక్ ఫైనల్స్‌లో ఆయన చేసిన ఐదు గోల్స్ రికార్డు ఇప్పటికీ అలాగే ఉంది. ఉత్తమ క్రీడాకారుడు అవార్డు బీరేంద్ర లక్రాకు, ఉత్తమ క్రీడాకారిణి అవార్డు వందనా కటారియాకు దక్కింది.
వార్తల్లో వ్యక్తులు
అఖిల్ శర్మకు బ్రిటీష్ ఫోలియో ప్రైజ్ భారత-అమెరికన్ నవలాకారుడు అఖిల్ శర్మకు 2015 సంవత్సరానికి ప్రతిష్టాత్మక బ్రిటీష్ సాహిత్య అవార్డు ఫోలియో ప్రైజ్ లభించింది. 2014 సంవత్సరంలో వెలువడిన ఆయన నవల ‘ఫ్యామిలీ లైఫ్’కు ఈ బహుమతి దక్కింది. ఢిల్లీకి చెందిన శర్మ(42) ఓ పేద కుర్రాడి జీవితాన్ని కథా వస్తువుగా తీసుకొని తన స్వీయ అనుభవంలోని సంఘటనలను జోడించి ఈ నవలను రాశారు. ఫోలియో ప్రైజ్‌ను 2014లో తొలిసారి ప్రదానం చేశారు.
విదేశాంగ శాఖ జేఎస్ వికాస్ స్వరూప్
విదేశాంగ శాఖలో అధికార ప్రతినిధిగా(జాయింట్ సెక్రెటరీ)గా వికాస్ స్వరూప్‌ను కేంద్రం మార్చి 25న నియమించింది. సయిద్ అక్బరుద్దీన్ స్థానంలో వికాస్ స్వరూప్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం యు.ఎన్ ప్రధాన కేంద్రంలో జాయింట్ సెక్రటరీగా ఉన్నారు.
మిస్ ఇండియా వరల్డ్‌గా అదితి ఆర్య
చండీగఢ్‌కు చెందిన అదితి ఆర్య ఫెమినా మిస్ ఇండియా వరల్డ్-2015గా ఎంపికయ్యారు. మిస్ ఇండియా వరల్డ్‌గా నిలిచిన అదితి ఆర్య మిస్ వరల్డ్ కిరీటం కోసం జరిగే పోటీల్లో పాల్గొంటారు.
దేశం విడిచి వెళ్లిపోయిన యెమన్ అధ్యక్షుడు
అధ్యక్ష భవనంపై తిరుగుబాటు దళాలు దాడి చేయ డంతో యెమన్ అధ్యక్షుడు అబెద్ రబ్బో మన్సౌర్ హాది మార్చి 25న సురక్షిత ప్రాంతానికి పారిపోయారు. షియా వర్గానికి చెందిన హుతి తిరుగుబాటుదారులు అడెన్‌లోని హాదీ నివాసభవనంపై క్షిపణి దాడులు జరిపారు. యెమన్ రక్షణ మంత్రి మహుద్ అల్ సుబైహిని బందీగా చేసుకున్నట్లు తిరుగుబాటుదారులు ప్రకటించారు. దేశంలో పరిస్థితి మరింత దిగజారక ముందే యెమన్‌ను కాపాడే బాధ్యత తీసుకోవాలని హాదీ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని కోరారు.
జాతీయం
ఫార్య్చూన్ జాబితాలో మోదీ అమెరికాకు చెందిన ఫార్చ్యూన్ మేగజీన్ 2015 సంవత్సరానికి విడుదల చేసిన ప్రపంచ అత్యుత్తమ నేతల జాబితాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఐదో స్థానంలో నిలిచారు. 50 మందితో కూడిన ఈ జాబితాలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్కు మొదటి స్థానం దక్కింది. రెండో స్థానంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు అధ్యక్షుడు మరియో డ్రాగీ నిలిచారు. భారత్‌ను వ్యాపారానికి సానుకూలంగా మలిచేందుకు చర్యలు, మహిళలపై దాడులను అరికట్టడం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచుకోవడం వంటి వాటికి మోదీ కృషి చేస్తున్నారని పత్రిక పేర్కొంది. భారత్‌కు చెందిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఈ జాబితాలో 28వ స్థానంలో నిలిచారు.
అంతర్జాతీయ ఇంధన సదస్సు-2015
అంతర్జాతీయ ఇంధన సదస్సు.. ఊర్జా సంగమ్-2015 న్యూఢిల్లీలో మార్చి 27న జరిగింది. సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ సంపన్నులు గ్యాస్ రాయితీని వదులుకోవాలని కోరారు. ఇంతవరకు 2.8 లక్షల మంది రాయితీలు వదులుకున్నారని, ఇందువల్ల రూ. 100 కోట్లు ఆదా అయిందన్నారు. ఈ మొత్తాన్ని పేదల సంక్షేమం కోసం వినియోగిస్తామని తెలిపారు.
మిజోరం గవర్నర్ తొలగింపు
మిజోరం గవర్నర్‌గా ఉన్న అజీజ్ ఖురేషిని కేంద్ర ప్రభుత్వం మార్చి 28న తొలగించింది. ఈయన 2017 మే వరకు కొనసాగాల్సి ఉంది. మిజోరం గవర్నర్‌గా పశ్చిమబెంగాల్ గవర్నర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఖురేషిని యూపీఏ ప్రభుత్వం నియమించింది.
‘ప్రగతి’ని ప్రారంభించిన ప్రధాని
ప్రజల ఫిర్యాదులకు పరిష్కారం, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు, సమీక్ష లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వపు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత కార్యక్రమం ‘ప్రగతి’ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో మార్చి 25న ప్రారంభించారు. ప్రొయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్(ప్రగతి-సానుకూల పాలన, సమయోచిత అమలు) అనేది సాంకేతిక పరిజ్ఞాన ఆధారితమైన ఒక ప్రత్యేకమైన సమగ్ర, పారస్పరిక వేదిక అని ప్రధాని వివరించారు. ఈ వేదిక నుంచి ప్రధాని మోదీ ప్రతి నెల నాలుగో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులతో సమావేశమవుతారు. ఆ రోజును‘ప్రగతి డే’గా పిలుస్తారు.
స్పెక్ట్రం వేలంలో రూ. 1.10 లక్షల కోట్లు
టెలికాం స్పెక్ట్రం వేలంలో కేంద్ర ప్రభుత్వానికి రూ. 1.10 లక్షల కోట్లు సమకూరాయి. 19 రోజుల పాటు జరిగిన 115 రౌండ్ల వేలం మార్చి 25న ముగిసింది. బేస్ ధర ప్రకారం రూ. 82,395 కోట్లు రావాల్సి ఉండగా, వేలంలో నికరంగా రూ. 1,09,847 కోట్లకు బిడ్లు వచ్చాయి. పలు టెలికాం సంస్థలకు వివిధ సర్కిళ్లలో పర్మిట్ల గడువు 2015-16లో ముగియనుంది. ఇందువల్ల స్పెక్ట్రం వేలం నిర్వహించారు. ఈ స్పెక్ట్రం పర్మిట్లు 20 ఏళ్ల పాటు ఉంటాయి. 2జీ, సీడీఎంఏ, 3జీ సేవల కోసం 17 సర్కిళ్లలో ప్రభుత్వం వేలం నిర్వహించింది.
పీఎస్ఎల్వీ-సీ 27 ప్రయోగం విజయవంతం
పీఎస్ఎల్వీ-సీ 27 ప్రయోగం విజయవంతమైంది. మార్చి 28న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి పీఎస్ఎల్వీ ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1డి ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భారత ప్రాంతీయ దిక్సూచి(నావిగేషన్) ఉపగ్రహ వ్యవస్థ (ఐఆర్ఎన్ఎస్ఎస్) అభివృద్ధికి గానూ ఈ ఉపగ్రహాన్ని పంపారు. దీంతో అమెరికా, రష్యా, చైనాలకున్న నావిగేషన్ వ్యవస్థ వల్ల విపత్తుల అంచనా, నౌకలు, ఇతర వాహనాల కదలికలను గుర్తించవచ్చు. ఐఆర్ఎన్ఎస్ఎస్-1డి బరువు 1,425 కిలోలు. దీన్ని రూ. 145 కోట్లతో రూపొందించారు. ఇది 10 సంవత్సరాల పాటు పనిచేస్తుంది.
సెక్షన్-66ఎ చెల్లదన్న సుప్రీం కోర్టు
వెబ్సైట్లలో అభ్యంతరకర వ్యాఖ్యలను పోస్ట్‌చేసే వ్యక్తులను అరెస్ట్ చేయడానికి వీలు కల్పించే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) చట్టంలోని సెక్షన్-66ఎను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు మార్చి 24న తీర్పునిచ్చింది. ఈ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధంగా, సందిగ్ధంగా ఉందని కోర్టు పేర్కొంది. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించేదిగా ఉందని అభిప్రాయపడింది. ప్రజలకున్న సమాచారాన్ని తెలుసుకునే హక్కు(19 ఎ)పై ఈ సెక్షన్ ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని కోర్టు వ్యాఖ్యానించింది.
భారత్ చైనా వృద్ధిని అధిగమిస్తుందన్న ఏడీబీ
భారత్ 2015-16 ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతం వృద్ధితో చైనా వృద్ధిరేటును అధిగమిస్తుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) మార్చి 24న విడుదల చేసిన నివేదిక అంచనా వేసింది. ఈ వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8.2 శాతంగా ఉంటుందని పేర్కొంది. చైనా వృద్ధి రేటు 2015-16లో 7.2 శాతంగా, 2016-17లో 7 శాతంగా మాత్రమే ఉంటుంది.
ఎన్నికల్లో పోటికి విద్యార్హత
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు విద్యార్హతను నిర్ణయిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు రాజస్థాన్ శాసనసభ మార్చి 27న ఆమోదం తెలిపింది. దేశంలో పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికల్లో పోటీకి కనీస విద్యార్హతను నిర్ణయించిన తొలి రాష్ట్రం రాజస్థానే. సర్పంచ్ పదవికి 8వ తరగతి, రిజర్వుడ్ గిరిజన ప్రాంతాలకైతే 5వ తరగతి చదివి ఉండాలి. జిల్లా పరిషత్ లేదా సమితి ఎన్నికల్లో పోటీ చేయాలంటే పదో తరగతి చదివి ఉండాలి.