బహుముఖ ప్రజ్ఞాశాలి సతీష్ ధవన్
-
షార్ డైరెక్టర్ పీ కున్హికృష్ణన్
-
షార్‌లో ఘనంగా ధవన్ జయంతి వేడుకలు
శ్రీహరికోట (సూళ్లూరుపేట):
భారత అంతరిక్ష పితామహుల్లో ప్రొఫెసర్ సతీష్ ధవన్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా చెప్పుకోవచ్చునని, ఆయన హయాంలోనే భారత అంతరిక్ష ప్రయోగాల బుడి బుడి అడుగులతో ప్రారంభమయ్యాయని షార్ డెరెక్టర్ పీ కున్హికృష్ణన్ పేర్కొన్నారు. అంతరిక్ష పితామహుల్లో తొలితరం శాస్త్రవేత్త అయిన సతీష్ ధవన్ 97వ జయంతి ఉత్సవాలను ఆదివారం షార్‌లో ఘనంగా జరుపుకున్నారు. షార్‌లోని రెండోగేట అవతలవైపు ఉన్న సతీష్ ధవన్ మెమోరియల్‌లో ఆయన విగ్రహానికి, బ్రహ్మప్రకాష్ హాల్లో ఉన్న ఆయన చిత్రపటానికి షార్ డైరెక్టర్ పీ కున్హికృష్ణన్, వీఎస్‌ఎస్‌సీ డైరెక్టర్ డాక్టర్ పీ శివన్ పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరిక్ష ప్రయోగాల్లో తొలితరం శాస్త్రవేత్తల్లో ఒకరైన సతీష్ ధవన్ ఇస్రో అభివృద్ధికి చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. అంతరిక్ష ప్రయోగాలు చేయాలని తొలినాళ్లలో ఎంటీసీఆర్ ఆంక్షలతో ఇతర దేశాలు మనకు సాంకేతిక పరిజ్ఞానం అందించకపోవడంతో దాన్ని సవాల్‌గా తీసుకుని డాక్టర్ విక్రమ్‌సారాభాయ్, ప్రొఫెసర్ సతీష్ ధవన్ లాంటి ఎందరో శాస్త్రవేత్తలు తమ మేధా సంపత్తితో అంతరిక్ష శాస్త్ర విజ్ఞానాన్ని మనకు అందించారన్నారు. తొలినాళ్లలో సౌండింగ్ రాకెట్‌లు ప్రయోగించే స్థాయి గ్రహాంతర ప్రయోగాలు చేయడమే కాకుండా ఖగోళ పరిశోధన, నావిగేషన్ ఏర్పాటు చేసుకోవడం వంటì ఉపగ్రహాలను తయారు చేసి పంపించే స్థాయికి ఎదిగామంటే ఆనాడు సతీష ధవన్ లాంటి శాస్త్రవేత్తలు వేసి బీజమేనన్నారు. ఆయన ఆలోచనలకు ప్రతిరూపమే నేడు షార్ రెండో ప్రయోగవేదిక అని చెప్పారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ శివన్, కంట్రోలర్ జేవీ రాజారెడ్డి, గ్రూప్ డైరెక్టర్ పీ విజయసారధితో పాటు పీఎస్‌ఎల్‌వీ సీ35 ప్రయోగానికి విచ్చేసిన శాస్త్రవేత్తలందరూ నివాళులర్పించారు. అదే విధంగా సూళ్లూరుపేట పట్టణంలోని కేఆర్‌పీ కాలనీ సమీపంలో ఉన్న సతీష్ ధవన్ స్మారక ఆసుపత్రిలో కూడా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.