సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : సతీష్ ధావన్‌స్పేస్ సెంటర్ (షార్) నుంచి మంగళవారం మధ్యాహ్నం 2.38.26 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ25 విజయంతో సర్వత్రా హుషార్ నెలకొంది. శ్రీహరికోటలో పండగ వాతావరణం చోటు చేసుకుంది. అంగారకుడిపైకి పరిశోధనల నిమిత్తం చేస్తున్న ప్రయోగం కావడంతో శ్రీహరికోటలోని షార్ ఉద్యోగుల కుటుంబాలు, బంధువులు రాకెట్ ప్రయోగాన్ని భవనాల మీద నుంచి వీక్షించారు. రాకెట్ నింగికేగుతున్న సమయంలో వారి చప్పట్లతో శ్రీహరికోట మారుమోగిపోయింది. ఇస్రో మొట్టమొదటగాసారి గ్రహాంతర ప్రయోగం కావడంతో షార్ ఉద్యోగుల్లో కూడా సంతోషం వ్యక్తమైంది.
ఏ ఇద్దరు కలిసినా ప్రయోగ విజయాన్ని పంచుకుంటూ ఒకరినొకరు అలింగనం చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు. రాకెట్ నింగిలోకి ఎగుస్తున్నంత సేపు కరతాళధ్వనులతో దేశభక్తిని చాటుకున్నారు. షార్‌లో బందోబస్తులో ఉన్న పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది మీడియా సెంటర్‌లోని టీవీల్లో ప్రయోగాన్ని ఆద్యంతం వీక్షించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. 2011లో నాలుగు విజయాలు, 2012లో రెండు విజయాలు, ఈ ఏడాది కూడా నాలుగు విజయాలు నమోదు కావడంతో షార్ ఉద్యోగులు సంబరాలను జరుపుకున్నారు. సూళ్లూరుపేట, తడ ప్రాంతాల్లోని గ్రామీణులు సైతం మిద్దెలపై నుంచి రాకెట్ ప్రయోగాన్ని వీక్షించారు.
మరికొంత మంది ఉత్సాహవంతులు పులికాట్ సరస్సులో అటకానితిప్ప వద్ద నుంచి ప్రయోగాన్ని వీక్షించారు. ప్రయోగం విజయవంతంగా నిర్వహించడంతో ఈ ప్రాంత ప్రజల్లో కూడా విజయగర్వం తొణకిస లాడింది. భవిష్యత్తులో కూడా మరిన్ని పెద్ద ప్రయోగాలు చేసి మన శాస్త్రవేత్తలు పెద్దపెద్ద విజయాలు సాధించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. గతేడాదితో వంద ప్రయోగాలు పూర్తి చేసి సెంచరీ మైలు రాయిని దాటిన షార్ ఈ ప్రయోగంతో 109 విజయాలను సొంతం చేసుకుంది. షార్ నుంచి 40వ ప్రయోగంలో పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 25వ ప్రయోగం కావడంతో షార్ ఉద్యోగులు ఎక్కడలేని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇస్రో శాస్త్రవేత్తలకు
ప్రముఖుల ప్రశంసలు
అంగారక యాత్రను విజయవంతంగా నిర్వహించడంతో స్థానిక ప్రజాప్రతినిధులు షార్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే పరసా వెంకటరత్నయ్య, చెంగాళమ్మ పాలకమండలి మాజీ చైర్మన్ ఇసనాక హర్షవర్ధన్‌రెడ్డి, వేనాటి రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు దబ్బల రాజారెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం, కిలివేటి సంజీవయ్య తదితరులు శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇలాంటి పెద్ద పెద్ద ప్రయోగాలు చేసి ఇస్రో కీర్తిని మరింత ఇనుమడింప జేయాలని కోరారు.
షార్.. హుషార్
Published Wed, Nov 6 2013 3:34 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
Advertisement
Advertisement