
షార్‌లో కూంబింగ్
ప్రధాని రాక సందర్భంగా మొదలైన హడావుడి
అణువణువూ జల్లెడ పడుతున్న ప్రత్యేక దళాలు
ముమ్మరంగా వాహన తనిఖీలు
సూళ్లూరుపేట: ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటన సందర్భంగా శ్రీహరికోట, సూళ్లూరుపేటలో పోలీసుల హడావుడి పెరిగింది. 30వ తేదీన జరగనున్న పీఎస్‌ఎల్‌వీ సీ23 రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు 29వ తేదీనే మోడీ షార్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా గుంటూరు రేంజ్ ఐజీ సునీల్‌కుమార్ సోమవారం షార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరోవైపు ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ పర్యవేక్షణలో స్పెషల్ బెటాలియన్ దళాలు సుమారు 50 మంది రంగంలోకి దిగి కూంబింగ్ చేశాయి. శ్రీహరికోటలోని అడవిని అణువణువూ జల్లెడ పట్టారు. మరికొన్ని బృందాలు శ్రీహరికోట పరిసర ప్రాంతాల్లోని దీవుల్లో కూంబింగ్ నిర్వహించాయి. వాకాడు మండలం రాయదొరువు, నవాబుపేట నుంచి తమిళనాడులోని పల్‌వేరికాడ్ వరకు కూంబింగ్ కొనసాగుతోంది. మరోవైపు మెరైన్, కోస్టుగార్డు బృందాలు తీరంలో పహారా కాస్తున్నాయి. డాగ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది మూడు బృందాలుగా ఏర్పడి ప్రతి బ్రిడ్జి, కల్వర్టును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తడ మండలం వేనాడు వద్ద పది మందితో ప్రత్యేక అవుట్ పోస్టు ఏర్పాటు చేశారు.
అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై వెంటనే సమాచారం ఇవ్వాలని అన్ని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. స్థానిక పోలీసులు శ్రీహరికోట-సూళ్లూరుపేట మార్గంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అటకానితిప్ప వద్ద సీఐఎస్‌ఎఫ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా చెక్‌పోస్టు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు షార్ సీఐఎస్‌ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ ధనుంజయ శుక్లా ఆధ్వర్యంలో షార్ చుట్టూ పహారా పెంచారు. మొదటిగేటు వద్దనుంచే తనిఖీలను ముమ్మరం చేశారు. మరో రెండు రోజుల్లో అదనపు బలగాలను తెప్పిస్తున్నారు. ప్రధాని పర్యటన ముగిసేదాకా బందోబస్తు రోజు రోజుకూ పెంచుతారు. షార్ కేంద్రంపై ఉగ్రవాదుల కన్ను ఉండడంతో భద్రతను మరింత కట్టుదిట్టంగా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రోజురోజుకూ భద్రతను పెంచుకుంటూ పోతామని సీఐ ఎం రత్తయ్య తెలిపారు.