ఢిల్లీ: యావత్ భారతంతో పాటు ప్రపంచం కూడా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టబోయే చంద్రయాన్-3 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. జులై 14వ తేదీన శ్రీహరికోట(ఏపీ) సతీశ్ ధావన్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. అయితే ఈ ప్రయోగానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారా? అనే ప్రశ్న.. ఇస్రో చీఫ్‌కు ఎదురైంది?.
చంద్రయాన్-3 మిషన్ ఏర్పాట్ల గురించి ఇస్రో చీఫ్ సోమనాథ్ మీడియాతో చిట్ ఛాట్ చేశారు. అయితే మోదీ హాజరవుతారా? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘‘ప్రతీ ఒక్కరినీ మేం ఈ కార్యక్రమానికి ఆహ్వానించాం. అయితే వాళ్లు వస్తారా.. రారా.. అనేది మాత్రం వాళ్లకే వదిలేశాం అని తెలిపారాయన. ఇదిలా ఉంటే.. జులై 13-14 తేదీల్లో భారత ప్రధాని మోదీ, ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రయోగ సమయంలో హాజరవ్వడం అనుమానంగానే కనిపిస్తోంది. అయితే చంద్రుడిపై ల్యాండింగ్ సమయంలో జరిగే కార్యక్రమానికి మాత్రం హాజరు కావొచ్చని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. 2019లో చంద్రయాన్ 2 మిషన్ లాంఛ్‌కి ప్రధాని మోదీ హాజరయ్యారు. అయితే చంద్రుడి మీద క్రాష్ ల్యాండ్‌తో అది విఫలమైంది. ఆ సమయంలో ఇస్రో చైర్మన్‌గా ఉన్న కే శివన్ అది చూసి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. అది చూసి ప్రధాని మోదీ.. ఆయన హత్తుకుని ఓదర్చారు.
చంద్రుడిపై పరిశోధన, అక్కడి రహస్యాల అన్వేషణ, వ్యోమగాములను పంపించడం ద్వారా అంతరిక్ష రంగంలో భారత్ సత్తా ప్రదర్శించేందుకు చంద్రయాన్ ప్రాజెక్టును తెర మీదకు తెచ్చారు. మూడు ప్రయోగాలకు సుమారు రూ.1,600 కోట్లు వ్యయం అంచనా వేశారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2008 అక్టోబర్ 22న చేపట్టిన చంద్రయాన్–1 ప్రయోగం విజయవంతమైంది. అక్కడ నీటి జాడలున్నాయని గుర్తించింది. చంద్రయాన్–1 ప్రయోగానికి రూ.380 కోట్లు ఖర్చు చేశారు.
2019 జూలై 15న చంద్రయాన్–2కు శ్రీకారం చుట్టింది. ఆర్బిటార్ ద్వారా ల్యాండర్, ల్యాండర్ ద్వారా రోవర్‌ను పంపించడమే కాకుండా 14 రకాల పేలోడ్స్‌ను పంపించారు. ప్రయోగమంతా సక్సెస్ అయిందనుకున్న తరుణంలో ఆఖరు రెండు నిమిషాల్లో ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టడంతో సంకేతాలు ఆగిపోయాయి.చంద్రయాన్–2 ప్రాజెక్టును రూ.598 కోట్లు వ్యయం చేశారు.
అయితే చంద్రయాన్ 3 కచ్చితంగా విజయవంతమై తీరుతుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. జులై 14వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2గం.35నిమిషాల సమయంలో చంద్రయాన్ 3 మొదలవుతుంది. ఈ మిషన్ 45 రోజులపాటు కొనసాగి ఆగష్టు చివరికల్లా చంద్రుడిపై ల్యాండింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు.. చంద్రయాన్–3 ప్రయోగానికి దాదాపు రూ.615 కోట్లు వెచ్చిస్తున్నారు.
ఇదీ చదవండి: విభిన్నం, వినూత్నం.. చంద్రయాన్
Comments
Please login to add a commentAdd a comment