చంద్రయాన్‌-3 దిగిన స్థలం శివశక్తి పాయింట్‌: ప్రధాని మోదీ | PM Modi ISRO Visit: PM Modi Meets ISRO Scientists, Praised For Successful Moon Landing Of Chandrayaan 3 - Sakshi
Sakshi News home page

PM Modi ISRO Visit: ఇస్రోకు అభినందనలు.. ఆగస్టు 23ను స్పేస్‌డేగా ప్రకటించిన ప్రధాని మోదీ

Published Sat, Aug 26 2023 7:55 AM | Last Updated on Sat, Aug 26 2023 10:25 AM

Chandrayaan 3 Moon Landing PM Modi Meets ISRO Scientists - Sakshi

బెంగుళూరు: దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనలను ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా బెంగుళూరు చేరుకున్నారు. చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతం చేసి భారత ఖ్యాతిని దశదిశలు వ్యాపింప చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకుని వారిని ఆయన అభినందించారు. 

శనివారం ఉదయాన్నే బెంగుళూరులోని హాల్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన ప్రజలనుద్దేశించి  మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడానికి నన్ను నేను ఆపుకోలేక నేరుగా బెంగుళూరు వచ్చానని అన్నారు. అనంతర ఇస్రో చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలను అభినందించారు. ఇది సరికొత్త భారతదేశానికి వేకువని కొనియాడారు.   జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అని నినదించి ప్రజలను ఉత్సాహపరిచారు. 

అనంతరం రోడ్ షో నిర్వహించి ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ మరియు కమాండ్ నెట్‌వర్క్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలను అభినందించారు. తొలుత చంద్రయాన్-3 బృందంతో ఫోటోలు తీసుకున్నారు. అనంతరం ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ ప్రధానికి చంద్రయాన్-3 ప్రయోగంలో వివిధ దశల గురించి వివరించారు.   

ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ..  ఈరోజు భారత్ చంద్రుడిపై అడుగు పెట్టింది. భారతదేశం ప్రపంచానికి వెలుగులు విరజిమ్ముతుంది.  నేను దక్షిణాఫ్రికాలో ఉన్నా నా మనసంతా ఇక్కడే ఉంది. మిమ్మల్ని కలవడానికి ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశాను.  భారత్ సత్తా ఏంటో ఇస్రో ప్రపంచానికి చూపించింది.. ఇస్రో శాస్త్రవేత్తల కృషికి, నిబద్ధతకు సెల్యూట్ చేస్తున్నాను. చంద్రయాన్-3 విజయం దేశ ప్రజల్లో సంతోషాన్ని కలిగించింది. ఇది మామూలు విజయం కాదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకెళ్తోంది.  ప్రతీ ఇంటిపైనే కాదు.. చంద్రుడిపై కూడా భారత జెండా ఎగురుతోంది.

ఇస్రో సాధించిన విజయం దేశానికే గర్వకారణం. భారతదేశం శక్తి సామర్ధ్యాలను ప్రపంచమంతా కీర్తిస్తోంది. ఎవ్వరూ సాధించలేని విజయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సాధించారు. దేశాభివృద్ధిలో స్పేస్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది.  చంద్రయాన్-3 అడుగుపెట్టిన స్థలాన్ని శివశక్తి పాయింట్‌గా నామకరణం చేస్తున్నాం. చంద్రయాన్-2 దిగిన ప్రాంతాన్ని తిరంగా పాయింట్‌గా పేరు పెడుతున్నాం.

ఈ ప్రయోగంలో మహిళా సైంటిస్టుల పాత్ర ఎంతో ఉంది. భారత సాంకేతిక శక్తిని ప్రపంచమంతా చూస్తోంది. అంతరిక్ష రంగంలో భారతదేశం చరిత్ర సృష్టించింది. ఇస్రో శాస్త్రవేత్తలు దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చారు. చంద్రయాన్-3 చంద్రుడిపై అడుగుపెట్టిన ఆగస్టు 23ను మనం  నేషనల్ స్పేస్ డేగా జరుపుకుందామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement