ఇస్రో ప్రగతిలో త్రిమూర్తులు | The Role Of Vikram Sarabhai, Satish Dhawan And APJ Abdul Kalam Is Key To ISRO Achievements | Sakshi
Sakshi News home page

ఇస్రో ప్రగతిలో త్రిమూర్తులు

Published Fri, Jul 12 2019 8:01 AM | Last Updated on Fri, Jul 12 2019 8:01 AM

The Role Of Vikram Sarabhai, Satish Dhawan And APJ Abdul Kalam Is Key To ISRO Achievements - Sakshi

విక్రమ్‌సారాభాయ్, సతీష్‌ ధవన్‌, ఏపీజే అబ్దుల్‌కలాం

సౌండింగ్‌ రాకెట్‌ స్థాయి నుంచి చంద్రయాన్‌–2 ప్రయోగం దాకా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎన్నో మైలురాళ్లను దాటింది.  విక్రమ్‌సారాభాయ్, ప్రొఫెసర్‌ సతీష్‌ ధవన్‌ దేశఅంతరిక్ష ప్రయోగాలకు బీజాలు వేశారు. ఆ తర్వాత ఏపీజే అబ్దుల్‌ కలాం వాటిని విజయపథంలో నడిపించేందుకు ఎంతో కృషి చేశారు. నేడు ఇస్రో సాధిస్తున్న విజయాల్లో వీరి పాత్ర కీలకం. ప్రపంచ దేశాల్లో భారత్‌కు గుర్తింపు వచ్చిందంటే దాని వెనుక వీరు వేసిన బాటలో నడిచిన శాస్త్రవేత్తలు ఎందరో ఉన్నారు. 

సాక్షి, సూళ్లూరుపేట: భారత అంతరిక్ష ప్రయోగాల పితామహులు విక్రమ్‌సారాభాయ్, సతీష్‌ ధవన్‌ వేసిన బీజాలతో నేడు వినువీధిలో ఇస్రో విజయపతాకాన్ని ఎగురవేస్తోంది. డాక్టర్‌ విక్రమ్‌సారాబాయ్‌ భారత అంతరిక్ష పరిశోధన సంస్థను బుడి బుడి అడుగులతో నడిపించగా, తప్పటడుగులు లేకుండా సజావుగా నడిపించిన శాస్త్రవేత్త సతీష్‌ ధవన్‌.  ఆ తరువాత ఏపీజే అబ్దుల్‌ కలాం ఇస్రోను ముందుకు నడిపించారు. 1972లో విక్రమ్‌సారాభాయ్‌ దురదృష్టవశాత్తు మరణించారు. ఆ తరువాత ప్రభుత్వం అంతరిక్ష పరిశోధన సంస్థను ఎవరు నడిపించగలరని వెతుకుతుండగా అందిరి అలోచనల్లో పుట్టిన వ్యక్తి ప్రొఫెసర్‌ సతీష్‌ ధవన్‌. విక్రమ్‌సారాభాయ్‌ మరణానంతరం 1979లో షార్‌ కేంద్రంగా అంతరిక్ష పరిశోధనలను ఆనాటి ఇస్రో చైర్మన్‌ సతీస్‌ ధవన్, మరో ముఖ్యశాస్త్రవేత్త, దివంగత రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం నడిపించారు.


షార్‌ నుంచి చేపట్టిన తొలిప్రయోగం ఎస్‌ఎల్‌వీ–3 ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా ఏపీజే అబ్దుల్‌కలాం(ఫైల్‌) 

వీరిద్దరి సారధ్యంలో షార్‌ నుంచి మొదట ప్రయోగించిన ఎస్‌ఎల్‌వీ–3 విఫలమైనప్పుడు నిరాశ,నిస్పృహలకు లోనైన సహచర శాస్త్రవేత్తల వెన్నుతట్టి మరో ప్రయోగానికి కార్యోన్ముఖులను చేశారని ఈ నాటికి వారి గురించి తెలిసిన సహచర శాస్త్రవేత్తలు చెప్పుకోవడం విశేషం. ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ వంటి భారీ రాకెట్ల ప్రయోగానికి ఆద్యుడిగా ఇస్రో చరిత్రలో నిలిచిపోయారు సతీష్‌ ధవన్‌. ఆ తరువాత యూఆర్‌ రావు, కసూర్తిరంగన్, మాధవన్‌నాయర్, ప్రస్తుతం డాక్టర్‌ కే రాధాకృష్ణన్, ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ వంటి అతిరథ మహారధులు ఇస్రో చైర్మన్లుగా అంతరిక్ష ప్రయోగాలను కొత్త పుంతలు తొక్కిస్తూ ప్రపంచ దేశాల్లో భారత్‌ను బలమైన దేశంగా నిలబెట్టారు. ఇస్రో తొలినాళ్లలో సరైనా సాంకేతిక పరిజ్ఞానం లేక చిన్నచిన్న ఉపగ్రహాలను ప్రయోగించుకుంటూ రష్యా, ప్రాన్స్‌ ంటి దేశాలకు చెందిన అంతరిక్ష సంస్థలపై ఆధారపడి పెద్ద పెద్ద ఉపగ్రహాలను పంపేది.

నేడు ఆ స్థాయిని దాటి విదేశాలకు చెందిన ఉపగ్రహాలను వాణిజ్యపరంగా పంపిస్తూ సంవత్సరానికి సరాసరిన సుమారు రూ.1000కోట్లకుపైగా ఆదాయాన్ని గడిస్తోంది. ఇప్పటి వరకు 30 దేశాలకు చెందిన 297 ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించి త్రిబుల్‌ సెంచరీకి చేరువలో ఉంది. అదే ఇస్రో ఇప్పటి వరకు 30 ఉపగ్రహాలను మాత్రమే విదేశాల నుంచి పంపించింది. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ చంద్రయాన్‌–1, మంగళ్‌యాన్‌–2, నేడు చంద్రయాన్‌–2 వంటి గ్రహాంతర ప్రయోగాలు చేసే స్థాయికి ఎదిగింది. నేడు అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచంలో భారత్‌ నాలుగో దేశంగా అవతరించనుండడానికి ఆనాటి అంతరిక్ష పితామహులు వేసిన బీజాలే కారణం. నేటి తరం శాస్త్రవేత్తలు ఇస్రో భాహుబలి రాకెట్‌గా పేరు పొందిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 రాకెట్‌ ద్వారా సుమారు నాలుగు టన్నుల బరువు కలిగిన చంద్రయాన్‌–2 మిషన్‌ ద్వారా చంద్రుడిపై పరిశోధనలకు సిద్ధమవుతున్నారు.

భారత అంతరిక్ష పరిశోధనలకు త్రిమూర్తులు చేసిన కృషిని మరిచిపోకుండా కేరళలోని రాకెట్‌ విడిభాగాల తయారీ కేంద్రానికి విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌సెంటర్, శ్రీహరికోటకు వెళ్లే మార్గానికి విక్రమ్‌ సారాభాయ్‌ మార్గ్, శ్రీహరికోట హైలీ అల్టిట్యూడ్‌ రేంజ్‌ (షార్‌) కేంద్రానికి ప్రొఫెసర్‌ సతీష్‌ ధవన్‌ పేరుతో సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌గా, బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రానికి ప్రొఫెసర్‌ యూఆర్‌రావు శాటిలైట్‌ సెంటర్లుగా నామకరణాలు చేసి వారికి అంకితం ఇవ్వడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement