Vikram Sarabhai
-
విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలి
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): ఇస్రో తొలినాళ్లలో ఎడ్లబండి, సైకిల్‌పై శాటిలైట్, రాకెట్ పరికరాలను తీసుకువెళ్లే స్థాయి నుంచి చంద్రుడు, అంగారకుడు గ్రహాల మీద పరిశోధనలు చేసేస్థాయికి చేరడానికి నాడు విక్రమ్ సారాభాయ్ వేసిన పునాదులే కారణమని షార్ శాస్త్రవేత్త ఆర్.ప్రీతా చెప్పారు. విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తిని పెంపొందించుకుని ఇస్రోలో చేరి దేశానికి సేవ చేయాలని సూచించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని భారత అంతరిక్షయానంపై స్థానిక గోకులకృష్ణ కళాశాలలో విద్యార్థులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రీతా మాట్లాడుతూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థను స్థాపించి ప్రపంచస్థాయికి తీసుకువెళ్లడంలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పాత్రను చరిత్ర మరువలేనిదని చెప్పారు. నెల రోజుల్లో సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్–1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు తెలిపారు. కళాశాల సెక్రటరీ శ్రీనివాసబాబు, ఇంజినీరింగ్, ఫార్మసీ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
చైతన్య భారతి: అంతరిక్ష బాలకుడు... విక్రమ్ సారాభాయ్
అహ్మదాబాద్‌లో సంపన్నులు, జౌళి పారిశ్రామిక వేత్తలు, జైనులు అయిన సారాభాయ్‌ల కుటుంబం మహాత్మాగాంధీకి సన్నిహితమైనది. విక్రమ్ సోదరి మృదుల స్వాతంత్య్ర సమరంలో పొల్గొని అనేక పర్యాయాలు జైలుకి వెళ్లారు. వారి కుటుంబానికి చెందిన 21 ఎకరాల స్థలంలోప్రైవేటుగా ఏర్పాటు చేసుకున్న ప్రయోగాత్మక పాఠశాలలో విక్రమ్‌కి, ఆయన ఏడుగురు తోబుట్టువులకు ప్రాథమిక విద్య చెప్పించారు. రవీంద్రనాథ్ టాగూర్, జవహర్లాల్ నెహ్రూ, రుక్మిణీదేవి అరండేల్ వంటి విశిష్ట సందర్శకులతో పరిచయాలను కూడా కల్పించేవారు. సుమారు పదకొండేళ్ల వయసులో విక్రమ్ సారాభాయ్‌కి ఇష్టమైన హాబీ.. వేగంగా సైకిల్ తొక్కుతూ, చేతులను ఛాతీ మీద పెట్టుకుని, కాళ్లను హ్యాండిల్‌బార్ మీద పెట్టి, సూటిగా ఉన్న రహదారి మీద కళ్లు మూసుకుని, సైకిల్ ఎంత దూరం పోతుందో అంత దూరమూ పోనివ్వడం! పనివారు ఆయన్ని వెంటబడి, అలా చేయవద్దని బతిమాలుతూ ఉండేవారు. తరువాతి జీవితకాలంలో 80 కి పైగా శాస్త్రీయ పరిశోధన పత్రాలను సమర్పించి, దాదాపు 40 సంస్థలను స్థాపించి, భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, 1960లలో అణు కార్యక్రమానికి నేతృత్వం వహించిన ఘనుడు కూడా ఆయనే.స విక్రమ్ బెంగళూరుకు వెళ్లి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్ వద్ద భౌతిక శాస్త్రాన్ని అభ్యసించారు. తరువాత కాలంలో భారత అణు విద్యుత్ కార్యక్రమాన్ని నెలకొల్పిన హోమీ భాభాతో అక్కడే విక్రమ్‌కి స్నేహం ఏర్పడింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత విక్రమ్ సారాభాయ్ ఫిజికల్ రిసెర్చ్ లేబొరేటరీని, భారతదేశపు మొట్టమొదటి జౌళి పరిశోధనా సహకార సంఘమైన అహ్మదాబాద్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ రిసెర్చ్ అసోసియేషన్ (ఎ.టి.ఐ.ఆర్.ఎ) ని; దేశంలో మొదటి మార్కెటింగ్ పరిశోధనా సంస్థ అయిన ఆపరేషన్స్ రిసెర్చ్ గ్రూపు; ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (అహ్మదాబాద్) మొదలుగా ఎన్నెన్నో సంస్థలను స్థాపించారు. 1960లలో అగ్రరాజ్యాల మధ్య ఆధిపత్య పోరాటానికి ఆలంబనగా నిలచిన అంతరిక్ష కార్యక్రమాన్ని ఒక బడుగు దేశమైన భారతదేశం చేపట్టడం బొత్తిగా అనూహ్యం. కానీ దానిని సుసాధ్యం చేయడమే కాక, కమ్యూనికేషన్లు, వాతావరణ అంచనాలు, ఖనిజ నిక్షేపాలను కనుగొనడం వంటి శాంతియుత ప్రయోజనాలకు అంతరిక్ష కార్యక్రమాన్ని ఆయన నిర్దేశించడం శాస్త్రవేత్తగా ఆయనలోని ప్రగతిశీలతను చాటుతుంది. ఉపగ్రహ బోధనా టెలివిజన్ ప్రయోగంలో ఆయన 1975–76లో నాసా ఉపగ్రహం ద్వారా భారతదేశంలోని 2,400 నిరుపేద గ్రామాలకు పాఠాలను ప్రసారం చేశారు. చిరునవ్వు వీడని ముఖంతో రోజుకు 18 నుంచి 20 గంటల సేపు ఆయన పని చేసేవారు. 1971 డిసెంబర్ 30 వ తేదీన కేవలం 52 ఏళ్ల వయసులో ఆయన మరణించారు. – అమృతా షా, సారాభాయ్ జీవిత చరిత్ర రచయిత్రి (చదవండి: మహోజ్వల భారతి: చాణక్య నరసింహ) -
చైతన్య భారతి: అగ్ని విహాంగం
అబ్దుల్ కలామ్ 2015 జూలై 27న షిల్లాంగ్‌లోని ఐ.ఐ.ఎం.లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మధ్యలోనే హఠాత్తుగా కుప్పకూలిపోయారు. 84 ఏళ్ల ఆయన శరీరం నుంచి ఆత్మ అంతరిక్షానికేగింది. అంతరిక్షానికే ఎందుకంటే.. అది ఆయన మనసుకు నచ్చిన సాంకేతిక ప్రదేశం. రామేశ్వరం దీవిలోని ఒక తమిళ ముస్లిం కుటుంబంలో జన్మించిన ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ భారతదేశ సర్వ స్వతంత్ర గణతంత్ర రాజ్యానికి 11 వ రాష్ట్రపతి కావడానికి సుదీర్ఘ పయనమే సాగించారు. ఇంటర్మీడియట్ పరీక్ష తర్వాత ఇంజనీరింగ్‌లో చేరడంపై సలహా ఇచ్చేవారెవరూ లేకపోవడంతో ఆయన బి.ఎస్.సి. చదివారు. విమానాన్ని నడపాలనే ఉబలాటంతో ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యారు. కానీ, భారత వైమానిక దళంలో పైలట్ ఉద్యోగం ఆయనకు తృటిలో తప్పిపోయింది. అయినా, రక్షణ ఏరోనాటికల్ వ్యవస్థలో యంత్ర విహంగాలకు ఆయన సన్నిహితంగా మసలుతూ వచ్చారు. అంతరిక్ష పరిశోధనా జాతీయ కమిటీ 1960ల ప్రారంభంలో ఏర్పాటవడంతో ఆయన జీవితంలో మొదటి మలుపు వచ్చింది. దాని కింద ప్రతిభావంతులైన ఏరోనాటికల్ ఇంజనీర్ల బృందాన్ని సృష్టించారు. అదే ఆ తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గా రూపాంతరం చెందింది. ఒక స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమం కోసం అమెరికా వెళ్లడం కలాం జీవితాన్ని ఇంకో మలుపు తిప్పింది. ఆయనకు విక్రమ్ సారాభాయ్, సతీశ్ ధావన్ వంటి మహామహుల ఆశీర్వాదాలు కూడా లభించాయి. ప్రతిభావంతులైనవారు ఇంకా అనేకమంది ఉన్నా ఉపగ్రహ వాహక నౌక ప్రాజెక్టు నాయకత్వ బాధ్యతలకు ఆయనను ఎంపిక చేశారు. ఒక దశాబ్దంపాటు పడిన కఠిన శ్రమ భారతదేశం అంతరిక్ష పరిశోధనల్లో – 1980లలోని ఎస్.ఎల్.వి.–3 ప్రయోగంతో – సఫలం అయ్యేలా చేసింది. ఆయనను 1981లో పద్మభూషణ్ వరించింది. క్షిపణి నిర్మాణ సామర్థ్యాలను స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసే బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు. కలామ్‌కు 1990లో పద్మవిభూషన్ లభించింది. దేశాన్ని 2020 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మలచడం గురించి కూడా కలామ్ అప్పట్లో ఒక పథకాన్ని రూపొందించారు. తేలిక రకం యుద్ధ విమానం ప్రాజెక్టును రూపుదిద్దిన ఘనత కూడా కలామ్‌దే. ఆయన 1997లో భారతరత్న అయ్యారు. ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. 2002లో అప్పటి పాలక ఎన్.డి.ఎ. ప్రభుత్వం కోరడంతో ఆయన రాష్ట్రపతిగా నిలబడి, ఆ పదవికి ఎన్నికయ్యారు. ఇక కలామ్ ఆత్మకథ ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ పుస్తకం ప్రతులు అత్యధికంగా అమ్ముడయ్యాయి. కలాం శాకాహారి. వివాహం చేసుకోలేదు. వ్యకిగత ఆస్తులు, సంపదలు ఏమీ లేవు. – అరుణ్ తివారీ, ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ పుస్తక సహ గ్రంథకర్త (చదవండి: చైతన్య భారతి: అణుశక్తిమాన్) -
అంతరిక్షం.. ఆవిష్కృతం
ఇస్రోకు చెందిన స్పేస్ ఆన్ వీల్ బస్సు సోమవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. అంతరిక్ష పితామహుడు విక్రం సారాభాయ్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ, ఛత్తీస్గడ్, మహారాష్ట్రలో ఇస్రో ఆధ్వర్యంలో స్పేస్ ఆన్ వీల్ బస్సు ద్వారా విద్యార్థులకు అంతరిక్ష ప్రయోగాల వివరాలను ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో స్పేస్ ఆన్ వీల్ బస్ ప్రదర్శనశాలను సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మున్షిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ చిప్ప ప్రభాకర్, జిల్లా సైన్స్ అధికారి మహేందర్ కలిసి ప్రారంభించారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే వివిధ ప్రాంతలకు చెందిన విద్యార్థులు ప్రదర్శనలను తిలకించేందుకు తరలివచ్చారు. – ప్రశాంత్‌నగర్(సిద్దిపేట) జిల్లాలోని సిద్దిపేట, హుస్నాబాద్, దుబ్బాక, నియోజకవర్గాలతో పాటుగా చేర్యాల, మద్దురు, కొమురవెళ్లి మండల పాఠశాలలకు చెందిన వేలాది విద్యార్థులు అంతరిక్ష అద్భుతాలను తిలకించేందుకు తరలివచ్చారు. ఈ బస్సులో నావిక్‌కు సంబంధించిన ఇండియాన్ రిజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(నావిక్)ను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పూర్తి స్థాయి సమాచారం పొందుపర్చారు. విపత్తులు, సముద్రయాణం, సముద్రంలో సునామి, వివరాలను ఏ విధంగా రికార్డు చేస్తారో తదితర వివరాలను విద్యార్థులు తెలిసేలా వివరాలను ప్రదర్శించారు. చంద్రయాన్–1 మిషన్, చంద్రయాన్–2 స్పేస్ క్రాప్ట్ (చంద్రమండలం పై చంద్రయాన్ ప్రయాణం), ఇండియాన్ శాటిలైట్ కమ్యూనికేషన్ అప్లికేషన్, ఇండియాన్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్, రాకెట్ ఇంధనం (క్రైయోజనిక్), లాంచ్ వెహికిల్–టెక్నాలజీ, అడ్మిని్రస్టేషన్, ఫస్ట్ లాంచ్ ప్యాడ్ (ఎఫ్ఎల్పీ) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్ శ్రీహరికోట), సెకండ్ లాంచ్ ప్యాడ్(ఎస్ఎల్పీ) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్ శ్రీహరి కోట), మంగళ్యాన్( ఇండియన్ మార్‡్ష ఆర్బిట్ మిషన్) అంగారక గ్రహం పై భారత్ పంపిన శాటిలైట్ తదితర వివరాలు పొందుపర్చారు. ఇస్రో లాంచ్ చేసే వెహికిల్ మోడల్స్ తదితర వివరాలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచారు. ఈ ప్రదర్శనలకు సంబంధించిన విషయాలను, అదే విధంగా ఈ ప్రయోగాల్లో వాడిన శాటిలైట్లు, వాటి పని తీరు, వాటిలో వాడిన ఇంధనం, శాటిలైట్ల ప్రయోగాలు విజయవంతం ఏ విధంగా అయ్యాయి, ఏ విధంగా విఫలం అయ్యాయి తదితర వివరాలతో కూడిన పూర్తి స్థాయి సమాచారం ఈ బస్సులో విద్యార్థుల ప్రదర్శన కోసం ఉంచారు. ఉదయం నుంచే జిల్లా విద్యాశాఖ అధికారులు అశించిన దాని కంటే అధిక సంఖ్యలో ఇస్రో ప్రదర్శనలు తిలకించేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు బారులు తీరారు. స్పేస్ ఆన్ వీల్ బస్సులో శాటిలైట్ తదితర నమూనాలు ప్రదర్శనలు అబ్బురపరిచాయి నేను కేవలం పుస్తకాల్లో మాత్రమే అంతరిక్షం, రాకెట్ విషయాలు చదివాను. కానీ ఈ బస్సులో అన్ని రకాల రాకెట్, శాటిలైట్లు, రాకెట్లో ఉపయోగించే ఇంధనాలు తదితర వివరాలతో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడం ద్వారా ఇప్పటి వరకు తెలియని అనేక విషయాలు తెలుసుకున్నాను. చంద్రయాన్ గురించి విషయాలు అద్భుతంగా కనిపించాయి. –స్పూర్తి, 8వ తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల మిట్టపల్లి రాకెట్ ఎలా పంపిస్తారో తెలుసుకున్నాను రాకెట్‌ను ఆకాశంలోకి ఏ విధంగా పంపిస్తారో తెలుసుకున్నాను. భూమిపైకి వెళ్లిన కొద్ది రాకెట్ పరిమాణం, ప్రయాణ దిశలు ఏ విధంగా మారుతాయో ఈ బస్సులో పూర్తిగా తెలిపారు. రాకెట్ లాంచింగ్ తదితర వివరాలను తెలుసుకున్నాను. సముద్రంలో సంభవించే ప్రమాదాల తీవ్రతను ఏ విధంగా మనకు శాటిలైట్లు తెలియపరుస్తాయో ఈ బస్సులో పొందుపర్చారు. –సానియా,7వతరగతి విద్యార్థి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల పారుపల్లి మంగళ్యాన్ ప్రయోగాలను వీక్షించాను అంగారక గ్రహంపై ప్రయోగించిన మంగళ్యాన్ ప్రయోగాలను ఈ బస్సులో అద్భుతంగా తీర్చిదిద్దారు. మంగళ్యాన్ ప్రయోగంలో ఏ విధంగా శాటిలైట్లను పంపారు అనే విషయాలను తెలుసుకున్నాను. క్రయోజనిక్ ద్రవరూప ఇంధనం అన్ని వాతావరణ పరిస్థితుల్లో రాకెట్ ప్రయాణించడానికి ఏ విధంగా పనిచేస్తుంది, తదితర వివరాలను తెలుసుకున్నాను. –చంద్రశ్రీ, 9వ తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల సిద్దిపేట -
కరీంనగర్లో ముగిసిన ఇస్రో ప్రదర్శన
సాక్షి, తిమ్మాపూర్(మానకొండూర్): తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో రెండురోజులపాటు నిర్వహించిన ఇస్రో అంతరిక్ష ప్రదర్శన అందరినీ ఆలోచింపజేసింది. ఇస్రో పితామహుడు, ప్రముఖ ఖగోళశాస్త్రవేత్త విక్రం సారాబాయి శత జయంతి సందర్భంగా రాష్ట్రంలోని ఐదు ప్రముఖనగరాల్లో నిర్వహిస్తోంది. ఖగోళ ప్రదర్శన కరీంనగర్ జిల్లాలో రెండురోజులపాటు నిర్వహించారు. ఈ ప్రదర్శనను తిలకించేందుకు వేలాదిగా విద్యార్థులు తరలివచ్చారు. విద్యార్థుల్లో శాస్త్రసాంకేతి క పరిజ్ఞానం పెంపొందించడమే లక్ష్యంగా ప్రదర్శన ఏర్పాట యింది. ఉమ్మడి కరీంనగర్లోపాటు సిద్దిపేట, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు వేలాదిమంది తరలివచ్చి ప్రదర్శన తిలకించారు. విద్యార్థులకు ఇస్రోశాస్త్రవేత్తలు ప్రతీ విషయం వివరిస్తూ ఖగోళశాస్త్రంపై ఆసక్తి పెంపొందించారు. విద్యార్థులతోపాటు వారి వెంట వచ్చిన ఉపాధ్యాయులు కూడా ఖగోళ పరిశోధనలు, రాకె ట్ ప్రయోగం, కమ్యూనికేషన్, టెక్నికల్ శాటిలైన్ ప్రయో గం, చంద్రయాన్, మంగళ్యాన్, రాకెట్, పీఎస్ఎల్వీ, ఉపగ్రహాల ప్రయోగం, పని తీరు, జీవితకాలం, అంతరిక్షంలో జరిగే ప్రమాదాలు, ఫ్యూయల్ వినియోగం, ప్రయోగంలో పాల్గొనే శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బంది, సాంకేతిక పరిజ్ఞానం, దేశం తరఫున ఇప్పటివరకు ప్రయోగించిన ఉపగ్రహాల గురించి వివరించారు. ఆకట్టుకున్న రాకెట్ ప్రయోగ ప్రదర్శన ఇస్రోశాస్త్రవేత్తలు విద్యార్థులకోసం తాత్కాలికంగా రూపొందించి ప్రయోగించిన రాకెట్‌లాంచింగ్ సన్నివేశం విద్యార్థులను సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. తక్కువ ఖర్చుతో నిర్మించిన వాటర్రాకెట్ను విద్యార్థులు ఆసక్తిగా గమనించారు. ఒత్తిడి, పైగి ఎగిసే వేగం తదితర అంశాల గురించి విద్యార్థులు వివరించారు. సందేహాలను శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. గైడ్లు కూడా విద్యార్థుల అనుమానాలు నివృత్తి చేశారు. ఆలోచింపజేసిన చంద్రయాన్–2 ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్–2 ప్రయోగాన్ని కళ్లకు కట్టేలా శాస్త్రవేత్తలు ప్రదర్శించారు. ప్రత్యేకంగా రూపొందించిన ఇస్రో బస్సులో చంద్రయాన్ ప్రయోగం, అది వెళ్లిన దూరం, క్రాష్ ల్యాండ్ అయిన వివరాలు వీడియో రూపంలో ప్రదర్శించడంతోపాటు విద్యార్థులకు ప్రత్యేకంగా వివరించారు. ప్రయోగం తీరు, విఫలం కావడానికి కారణాలు విద్యార్థులను ఆలోచింపజేసింది. రాకెట్లు, ఉపగ్రహ నమూనాల ప్రదర్శన.. ఇస్రో ప్రదర్శనలో భాగంగా రాకెట్ల నమూనాలు, ఉపగ్రహ నమూనాలు, ఇంధన వినియోగం, భూఆకర్షణ శక్తి, గురు గ్రహ ఆకర్షణ, కక్షలు, ఒక కక్ష నుంచి మరో కక్షలోకి ప్రవేశపెట్టే విధానం, కమ్యూనికేషన్, టెక్నీకల్ ఇన్మర్మేషన్ వినియోగం తదితర అంశాలను శాస్త్రవేత్తలు చిత్రాలు, వీడియోల ద్వారా సందర్శకులకు వివరించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, సందర్శకులు ‘సాక్షి’తో అభిప్రాయాలు ఇలా పంచుకున్నారు. తక్కువ ఖర్చుతో రాకెట్ ప్రయోగం.. రాకెట్ ప్రయోగంపై అందరికీ అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఇళ్లలో లభించే ఖాళీ బాటిళ్లు, గాలి, నీరుతో ప్రయోగించే విధానాన్ని ఇస్రో ప్రదర్శనలో విద్యార్థులకు కళ్లకు కట్టేలా చూపించాం. ప్రతక్ష అనుభవం ద్వారా విద్యార్థులకు అవగాహన కలిగింది. చాలామంది సందర్శకులు తమ అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. సందేహాలు అడిగి తెలుసుకున్నారు. – హరీష్‌కుమార్, ఇస్రో గైడ్ శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి ప్రతీ విద్యార్థిలో శాస్త్రపరిజ్ఞానం ఉండాలనే లక్ష్యంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాం. కరీంనగర్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనకు అనూహ్య స్పందన వచ్చింది. చాలామంది విద్యార్థులు హాజరై ప్రత్యక్ష అనుభవం పొందారు. సందేహాలు నివృత్తి చేశారు. అనుమానాల గురించి అడిగి తెలుసుకున్నారు. నమూనాలు ప్రత్యక్షంగా పరిశీలించారు. – పద్మారాణి, ఇస్రో శాస్త్రవేత్త శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంపే లక్ష్యం.. విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పెంపే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో దేశంలోని వంద నగరాల్లో ప్రదర్శనకు కార్యాచరణ రూపొందించాం. ఇందులో భాగంగా తెలంగాణలో ఇప్పటికే హైదరాబాద్, ఖమ్మంలో ప్రదర్శన ఏర్పాటు చేశాం. కరీంనగర్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనకు విశేష స్పందన లభించింది. సుమారు 20 వేల మంది రెండురోజులు ప్రదర్శన తిలకించారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకున్నారు. – రాజశ్రీ, ఇస్రో మేనేజర్ ప్రత్యక్ష అనుభూతి.. ఇస్రో అంతరిక్ష ప్రదర్శనను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. ఈ ప్రదర్శనలో నేను వలంటీర్ గైడ్‌గా వ్యవహరించా. నేను ప్రయోగాలు, ఉపగ్రహాలు రాకెట్ల గురించి తెలుసుకుంటూ సందర్శనకు వచ్చిన విద్యార్థులకు వివరించడం ప్రత్యక్ష అనుభూతి కలిగించింది. చాలా వరకు నేను నేర్చుకోవడంతోపాటు విద్యార్థులకు తెలియజేశా. – పల్లవి, గైడ్ -
ఇస్రో ప్రగతిలో త్రిమూర్తులు
సౌండింగ్ రాకెట్ స్థాయి నుంచి చంద్రయాన్–2 ప్రయోగం దాకా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎన్నో మైలురాళ్లను దాటింది. విక్రమ్‌సారాభాయ్, ప్రొఫెసర్ సతీష్ ధవన్ దేశఅంతరిక్ష ప్రయోగాలకు బీజాలు వేశారు. ఆ తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం వాటిని విజయపథంలో నడిపించేందుకు ఎంతో కృషి చేశారు. నేడు ఇస్రో సాధిస్తున్న విజయాల్లో వీరి పాత్ర కీలకం. ప్రపంచ దేశాల్లో భారత్‌కు గుర్తింపు వచ్చిందంటే దాని వెనుక వీరు వేసిన బాటలో నడిచిన శాస్త్రవేత్తలు ఎందరో ఉన్నారు. సాక్షి, సూళ్లూరుపేట: భారత అంతరిక్ష ప్రయోగాల పితామహులు విక్రమ్‌సారాభాయ్, సతీష్ ధవన్ వేసిన బీజాలతో నేడు వినువీధిలో ఇస్రో విజయపతాకాన్ని ఎగురవేస్తోంది. డాక్టర్ విక్రమ్‌సారాబాయ్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థను బుడి బుడి అడుగులతో నడిపించగా, తప్పటడుగులు లేకుండా సజావుగా నడిపించిన శాస్త్రవేత్త సతీష్ ధవన్. ఆ తరువాత ఏపీజే అబ్దుల్ కలాం ఇస్రోను ముందుకు నడిపించారు. 1972లో విక్రమ్‌సారాభాయ్ దురదృష్టవశాత్తు మరణించారు. ఆ తరువాత ప్రభుత్వం అంతరిక్ష పరిశోధన సంస్థను ఎవరు నడిపించగలరని వెతుకుతుండగా అందిరి అలోచనల్లో పుట్టిన వ్యక్తి ప్రొఫెసర్ సతీష్ ధవన్. విక్రమ్‌సారాభాయ్ మరణానంతరం 1979లో షార్ కేంద్రంగా అంతరిక్ష పరిశోధనలను ఆనాటి ఇస్రో చైర్మన్ సతీస్ ధవన్, మరో ముఖ్యశాస్త్రవేత్త, దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నడిపించారు. షార్ నుంచి చేపట్టిన తొలిప్రయోగం ఎస్ఎల్వీ–3 ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఏపీజే అబ్దుల్‌కలాం(ఫైల్) వీరిద్దరి సారధ్యంలో షార్ నుంచి మొదట ప్రయోగించిన ఎస్ఎల్వీ–3 విఫలమైనప్పుడు నిరాశ,నిస్పృహలకు లోనైన సహచర శాస్త్రవేత్తల వెన్నుతట్టి మరో ప్రయోగానికి కార్యోన్ముఖులను చేశారని ఈ నాటికి వారి గురించి తెలిసిన సహచర శాస్త్రవేత్తలు చెప్పుకోవడం విశేషం. ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ వంటి భారీ రాకెట్ల ప్రయోగానికి ఆద్యుడిగా ఇస్రో చరిత్రలో నిలిచిపోయారు సతీష్ ధవన్. ఆ తరువాత యూఆర్ రావు, కసూర్తిరంగన్, మాధవన్నాయర్, ప్రస్తుతం డాక్టర్ కే రాధాకృష్ణన్, ఏఎస్ కిరణ్‌కుమార్ వంటి అతిరథ మహారధులు ఇస్రో చైర్మన్లుగా అంతరిక్ష ప్రయోగాలను కొత్త పుంతలు తొక్కిస్తూ ప్రపంచ దేశాల్లో భారత్‌ను బలమైన దేశంగా నిలబెట్టారు. ఇస్రో తొలినాళ్లలో సరైనా సాంకేతిక పరిజ్ఞానం లేక చిన్నచిన్న ఉపగ్రహాలను ప్రయోగించుకుంటూ రష్యా, ప్రాన్స్ ంటి దేశాలకు చెందిన అంతరిక్ష సంస్థలపై ఆధారపడి పెద్ద పెద్ద ఉపగ్రహాలను పంపేది. నేడు ఆ స్థాయిని దాటి విదేశాలకు చెందిన ఉపగ్రహాలను వాణిజ్యపరంగా పంపిస్తూ సంవత్సరానికి సరాసరిన సుమారు రూ.1000కోట్లకుపైగా ఆదాయాన్ని గడిస్తోంది. ఇప్పటి వరకు 30 దేశాలకు చెందిన 297 ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించి త్రిబుల్ సెంచరీకి చేరువలో ఉంది. అదే ఇస్రో ఇప్పటి వరకు 30 ఉపగ్రహాలను మాత్రమే విదేశాల నుంచి పంపించింది. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ చంద్రయాన్–1, మంగళ్యాన్–2, నేడు చంద్రయాన్–2 వంటి గ్రహాంతర ప్రయోగాలు చేసే స్థాయికి ఎదిగింది. నేడు అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచంలో భారత్ నాలుగో దేశంగా అవతరించనుండడానికి ఆనాటి అంతరిక్ష పితామహులు వేసిన బీజాలే కారణం. నేటి తరం శాస్త్రవేత్తలు ఇస్రో భాహుబలి రాకెట్‌గా పేరు పొందిన జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ ద్వారా సుమారు నాలుగు టన్నుల బరువు కలిగిన చంద్రయాన్–2 మిషన్ ద్వారా చంద్రుడిపై పరిశోధనలకు సిద్ధమవుతున్నారు. భారత అంతరిక్ష పరిశోధనలకు త్రిమూర్తులు చేసిన కృషిని మరిచిపోకుండా కేరళలోని రాకెట్ విడిభాగాల తయారీ కేంద్రానికి విక్రమ్ సారాభాయ్ స్పేస్‌సెంటర్, శ్రీహరికోటకు వెళ్లే మార్గానికి విక్రమ్ సారాభాయ్ మార్గ్, శ్రీహరికోట హైలీ అల్టిట్యూడ్ రేంజ్ (షార్) కేంద్రానికి ప్రొఫెసర్ సతీష్ ధవన్ పేరుతో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌గా, బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రానికి ప్రొఫెసర్ యూఆర్‌రావు శాటిలైట్ సెంటర్లుగా నామకరణాలు చేసి వారికి అంకితం ఇవ్వడం విశేషం. -
జనవరి 3న చంద్రయాన్– 2
సాక్షి బెంగళూరు: వచ్చే ఏడాది జనవరి 3న చంద్రయాన్–2 మిషన్ చేపడతామని ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. ఈ ప్రయోగానికి రూ. 800 కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ శత జయంతి ఉత్సవాలను ఆదివారం బెంగళూరులోని ఇస్రో కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇస్రో మాజీ చైర్మన్లు కస్తూరి రంగన్, కిరణ్‌కుమార్ కూడా పాల్గొన్నారు. అనంతరం శివన్ మీడియాతో మాట్లాడుతూ 3,890 కేజీల బరువైన చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ఎంకే–3 రాకెట్ ద్వారా చంద్రుని మీదికి పంపిస్తామని తెలిపారు. ఈ మిషన్‌కు విక్రమ్ సారాభాయ్ మిషన్ అని నామకరణం చేస్తామని వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో 50 ఉపగ్రహాలు ప్రయోగించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. ఒక్క 2019లోనే 22 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నట్లు తెలిపారు. ఇస్రో చరిత్రలో ఎక్కువ ప్రయోగాలు జరిపిన ఏడాది ఇదే కాబోతోందని అన్నారు. ఈ ఏడాది కూడా తమకు తీరికలేని షెడ్యూల్ ఉందని, ఇకపై నెలకు కనీసం రెండు ప్రయోగాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో బ్రిటన్‌కు చెందిన రెండు వాణిజ్య ఉపగ్రహాల్ని నింగిలోకి పంపనున్నట్లు చెప్పారు. ఇస్రో చిన్నస్థాయి వాహకనౌకలను కూడా తయారుచేస్తోందని తెలిపారు. అవసరమైనప్పుడు ఇలాంటి వాటిని కేవలం ముగ్గురు నుంచి ఆరుగురు మనుషుల సాయంతో, మూడు రోజుల్లోనే రూపొందించొచ్చని వెల్లడించారు. మరో మూడు, నాలుగు నెలల్లో ఇస్రో టీవీ చానల్‌ను ప్రారంభిస్తున్నట్లు శివన్ చెప్పారు. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన వివరాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను సామాన్యులకు చేరవేసేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. ఆంగ్లంతో పాటు ప్రాంతీయ భాషల్లో తమ చానల్ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. -
గఘన విజయం
సూళ్లూరుపేట శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సోమవారం ఉదయం 9.52 గంటలకు పీఎస్ఎల్వీ సీ23 నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 19.55 నిమిషాల్లో ప్రయోగం విజయవంతమైంది. ఈ విజయంతో భారత కీర్తి పతాకం గగన తలంలో రెపరెపలాడింది. అలాగే ఇస్రో 43వ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమక్షంలో విజయవంతంగా నిర్వహించినందుకు శాస్త్రవేత్తల్లో రెట్టించిన ఉత్సాహం కనిపించింది. - వాణిజ్య విజయాల్లో అగ్రస్థానం - ఇస్రోకు నమ్మకమైన ఆయుధంగా గుర్తింపు సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఐదు దశాబ్దాల్లో ఎన్నో శ్లాఘనీయమైన విజయాలను సొంతం చేసుకుంది. ఈ విజయాల్లో పోలార్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్(పీఎస్ఎల్వీ) కీలకపాత్ర పోషిస్తోంది. వాణిజ్యపరమైన ప్రయోగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బహుళప్రయోజనకారిగా ఇస్రోకు నమ్మకమైన ఆయుధంగా మారింది. శ్రీహరికోట నుంచి సోమవారం నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ23తో ఈ సిరీస్‌లో 27 ప్రయోగాలు పూర్తయ్యాయి. షార్ నుంచి జరిగిన 43 ప్రయోగాల్లో 27 పీఎస్‌ఎల్‌వీయే కావడం విశేషం. వాణిజ్యపరమైన ప్రయోగాల్లో.... వాణిజ్యపరంగా పీఎస్ఎల్వీ ద్వారా 19 దేశాలకు చెందిన 38 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. వీటిలో ఎక్కువగా జర్మనీకి చెందిన టబ్‌శాట్, బర్డ్, కాంపాస్-1, రూబెన్-8, క్యూబ్‌శాట్-1, క్యూబ్‌శాట్-2, రూబెన్ 9.1, రూబెన్ 9.2, ఎన్ఎల్ఎస్ 7.1, ఎన్ఎల్ఎస్ 7.2 ఉపగ్రహాలు ఉన్నాయి. కెనడాకు చెందిన క్యాన్ఎక్స్-2, ఎన్ఎల్ఎస్-5, ఎన్ఎల్ఎస్-1, షఫ్పైర్, నియోశాట్, ఎన్ఎల్ఎస్-7.1, ఎన్ఎల్ఎస్-7.2, సింగపూర్‌కు చెందిన ఎక్స్‌శాట్, వెలాక్సీ, జపాన్‌కు చెందిన క్యూట్-1.7, సీడ్స్, ప్రాయిటర్, డెన్మార్స్కు చెందిన ఆయుశాట్-2, ఎన్ఎల్ఎస్8.3, ఆస్ట్రియా ఎన్ఎల్ఎస్8.1, ఎన్ఎల్ఎస్ 8.2, ప్రాన్స్‌కు చెందిన స్పాట్-06, స్పాట్-07, స్విట్జర్లాండ్‌కు చెందిన క్యూబ్‌శాట్-4,టీశాట్-1 ఉపగ్రహాలను కూడా పీఎస్ఎల్వీనే నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇదే జాబితాలో అల్జీరియాకు చెందిన ఆల్‌శాట్-24, ఇటలీకి చెందిన అజిల్, సౌత్‌కొరియాకు చెందిన కిట్‌శాట్, అర్జెంటినాకు చెందిన ఫ్యూహెన్‌శాట్, ఇజ్రాయెల్‌కు చెందిన టెక్సార్, లక్సెంబర్గ్‌కు చెందిన వెజల్‌శాట్, టర్కీకి చెందిన క్యూబ్‌శాట్-3, బెల్జియంకు చెందిన ప్రోబా,ఇండోనేషియాకు చెందిన లాపాన్-టబ్‌శాట్, నెదర్లాండ్స్‌కు చెందిన డెల్ఫీ-సీ3, యునెటైడ్ కింగ్డమ్కు చెందిన స్ట్రాడ్-1 ఉపగ్రహాలు ఉన్నాయి. ప్రధాని పర్యటనలో పదనిసలు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు శ్రీహరికోటలోని షార్కు చేరుకున్నారు. పీఎస్ఎల్వీ సీ23 ప్రయోగం అనంతరం సోమవారం ఉదయం 10.45 గంటలకు ఆయన తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న విశేషాలు.. - సూళ్లూరుపేట షార్కు విచ్చేసిన ఐదో ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ప్రధాని షెడ్యూల్ సమయం కన్నా గంట ఆలస్యంగా షార్కు వచ్చారు. ఒకే హెలికాఫ్టర్‌లో వచ్చిన గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబునాయుడు మధ్యాహ్నం 3.30 గంటలకు షార్కు వస్తారని మొదట ప్రకటించినా, 3 గంటలకే చేరుకున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎంపీలను, మాజీ ఎమ్మెల్యేలను కొద్దిసేపు గేట్‌వద్ద ఆపారు. జిల్లా బీజేపీ నాయకులు మాత్రం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అనుమతి తెచ్చుకోవడంతో నేరుగా వెళ్లి స్వాగతం పలికారు. మిషన్‌కంట్రోల్ రూంలో సీఎం చంద్రబాబును ఎవరూ పట్టించుకోకపోవడంతో దూరదూరంగా ఉంటూ కనిపించారు. ప్రధానమంత్రి కూడా చంద్రబాబును దగ్గరకు రమ్మని పిలిచిన సందర్భం లేదు. ఇస్రో శాస్త్రవేత్తలు కూడా చంద్రబాబుని పట్టించుకోలేదు. భాస్కర గెస్ట్‌హౌస్‌లో బసచేసిన నరేంద్ర మోడీకి రాష్ట్ర రాజధాని నిర్మాణం, రుణమాఫీ తదితర అంశాలపై చంద్రబాబు పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధాని నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో చంద్రబాబు మౌనంగా కనిపించారు. రాకెట్ ప్రయోగం సక్సెస్ అయిన సమయంలోనూ చంద్రబాబు ముఖంలో చిరునవ్వు కూడా కనిపించలేదు. మిషన్ కంట్రోల్ రూంలో మోడీ 26 నిమిషాల పాటు చేసిన ప్రసంగం అందరినీఆకట్టుకుంది. షార్కు విచ్చేసిన ప్రధానమంత్రుల్లో ఇప్పటి వరకు ఎవరూ మోడీలా శాస్త్రసాంకేతిక రంగాలను ఔపోసన పట్టినట్లు సుదీర్ఘంగా ప్రసంగించకపోవడం గమనార్హం. ప్రధానికి గుజరాతీ వంటకాలతోనే రాత్రి భోజనం, ఉదయం టిఫిన్ ఏర్పాటు చేశారు. మోడీ పర్యటన సందర్భంగా సుమారు 3 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. సరైన భోజనం, తలదాచుకునేందుకు విశ్రాంతి భవనం లేకపోవడంతో పోలీసులు చెట్ల కిందే గడిపారు. -
43వ ప్రయోగం సక్సెస్
- ఇస్రో విజయపరంపర - భవిష్యత్తులో భారీ ప్రయోగాలకు సన్నాహాలు సూళ్లూరుపేట: అరుదైన విజయాలతో వినీలాకాశంలో త్రివర్ణ పతాకాన్ని ఇస్రో రెపరెపలాడిస్తోంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సోమవారం ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ23 సక్సెస్‌తో 43వ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇస్రో తన ఐదు దశాబ్దాల ప్రస్థానంలో షార్ నుంచి చేపట్టిన 43 ప్రయోగాలతో 71 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగింది. ఈ విజయాల వెనుక ఎందరో శాస్త్రవేత్తల అవిశ్రాంత కృషి ఉంది. వీరిలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ప్రొఫెసర్ సతీష్‌ధవన్ కృషి కీలకమైనది. శ్రీహరికోటలో రాకెట్ కేంద్రం రావడానికి విక్రమ్ సారాభాయ్ బీజం వేస్తే, దీనిని అభివృద్ధి చేయడంలో సతీష్ ధవన్ కీలకపాత్ర పోషించారు. 1962 నుంచి 1978 వరకు సౌండింగ్ రాకెట్ ప్రయోగాలు చేసుకుంటున్న ఇస్రో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆర్యభట్ట ఉపగ్రహాన్ని రష్యా నుంచి 1975 మే 19న ప్రయోగించింది. 1979 జూన్ 7న భాస్కర్-1 అనే ఉపగ్రహాన్ని కూడా రష్యానుంచే ప్రయోగించింది. ఈ లోపు శ్రీహరికోటలో రాకెట్ కేంద్రం ఏర్పాటుతో 1979 ఆగస్టు 10న ఎస్ఎల్వీ-3 ఇ1 పేరుతో ఒక మోస్తరు ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దురదృష్టవశాత్తూ ఆ ప్రయోగం విఫలమైంది. ఈ అపజయంతో కుంగిపోకుండా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు మన శాస్త్రవేత్తలు. 1980 జూలై 18న ఎస్ఎల్వీ-3 ఇ2 పేరుతో చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో నూతనోత్సాహంతో ముందుకు సాగారు. అక్కడినుంచి ఎస్ఎల్వీ సిరీస్‌లో నాలుగు ప్రయోగాలు చేసి మూడింటిని విజయవంతం చేశారు. 1987 మార్చి 24 ఏఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఈ సిరీస్ లో నాలుగు ప్రయోగాలు చేసి రెండు విజ యం సాధించగా, రెండు ఫెయిల య్యాయి. ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ రాకెట్లలో చిన్న తరహా ఉపగ్రహాలను పంపారు. 1993 సెప్టెంబర్ 20న పీఎస్ఎల్వీ లాంటి భారీరాకెట్ ప్రయోగాలకు నడుం బిగించారు. ఇందులో ఇప్పటిదాకా 27 ప్రయోగాలు చేయగా మొదట చేసిన ప్రయోగం తప్ప మిగిలినవన్నీ సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలోనే మరో అడుగు ముందుకేసి జీఎస్ఎల్వీ ప్రయోగాలను చేపట్టారు. జీఎస్ఎల్వీ సిరీస్‌లో ఎనిమిది ప్రయోగాలు చేయగా మూడు విఫలమయ్యాయి. షార్ నుంచి ఇప్పటివరకు మొత్తం 43 ప్రయోగాలు చేయగా ఏడు తప్ప మిగిలినవన్నీ విజయవంతమై అంతరిక్ష ప్రయోగాలు చేసే దేశాల్లో భారత్‌ను ఐదో స్థానంలో నిలిపాయి. జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో కీలకమైన క్రయోజనిక్ దశను రష్యా సాంకేతిక సహకారం తీసుకుని ప్రయోగించేవారు. ఈ దశను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించుకునే ప్రయత్నంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికి, ఈ ఏడాది జనవరి 5న చేపట్టిన జీఎస్ఎల్వీ డీ5 ప్రయోగ విజయంతో సాంకేతిక నైపుణ్యం సాధించి మరో అడుగు ముందుకేశారు. భవిష్యత్తులో పీఎస్ఎల్వీ రాకెట్‌ను వాప్యారాభివృద్దికి వాడుకుంటూ జీఎస్ఎల్వీ రాకెట్లు ద్వారా భారీ సమాచార ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది.