బస్సులో ఇస్రో ప్రయోగశాలను తిలకించేందుకు బారులు తీరిన విద్యార్థులు
ఇస్రోకు చెందిన స్పేస్ ఆన్ వీల్ బస్సు సోమవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. అంతరిక్ష పితామహుడు విక్రం సారాభాయ్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్రలో ఇస్రో ఆధ్వర్యంలో స్పేస్ ఆన్ వీల్ బస్సు ద్వారా విద్యార్థులకు అంతరిక్ష ప్రయోగాల వివరాలను ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో స్పేస్ ఆన్ వీల్ బస్ ప్రదర్శనశాలను సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మున్షిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ చిప్ప ప్రభాకర్, జిల్లా సైన్స్ అధికారి మహేందర్ కలిసి ప్రారంభించారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే వివిధ ప్రాంతలకు చెందిన విద్యార్థులు ప్రదర్శనలను తిలకించేందుకు తరలివచ్చారు.
– ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)
జిల్లాలోని సిద్దిపేట, హుస్నాబాద్, దుబ్బాక, నియోజకవర్గాలతో పాటుగా చేర్యాల, మద్దురు, కొమురవెళ్లి మండల పాఠశాలలకు చెందిన వేలాది విద్యార్థులు అంతరిక్ష అద్భుతాలను తిలకించేందుకు తరలివచ్చారు. ఈ బస్సులో నావిక్‌కు సంబంధించిన ఇండియాన్ రిజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(నావిక్)ను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పూర్తి స్థాయి సమాచారం పొందుపర్చారు. విపత్తులు, సముద్రయాణం, సముద్రంలో సునామి, వివరాలను ఏ విధంగా రికార్డు చేస్తారో తదితర వివరాలను విద్యార్థులు తెలిసేలా వివరాలను ప్రదర్శించారు.
చంద్రయాన్–1 మిషన్, చంద్రయాన్–2 స్పేస్ క్రాప్ట్ (చంద్రమండలం పై చంద్రయాన్ ప్రయాణం), ఇండియాన్ శాటిలైట్ కమ్యూనికేషన్ అప్లికేషన్, ఇండియాన్ రిమోట్ సెన్‌సింగ్ అప్లికేషన్, రాకెట్ ఇంధనం (క్రైయోజనిక్), లాంచ్ వెహికిల్–టెక్నాలజీ, అడ్మిని్రస్టేషన్, ఫస్ట్ లాంచ్ ప్యాడ్ (ఎఫ్‌ఎల్‌పీ) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్ శ్రీహరికోట), సెకండ్ లాంచ్ ప్యాడ్(ఎస్‌ఎల్‌పీ) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్ శ్రీహరి కోట), మంగళ్‌యాన్( ఇండియన్ మార్‡్ష ఆర్‌బిట్ మిషన్) అంగారక గ్రహం పై భారత్ పంపిన శాటిలైట్ తదితర వివరాలు పొందుపర్చారు. ఇస్రో లాంచ్ చేసే వెహికిల్ మోడల్స్ తదితర వివరాలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచారు. ఈ ప్రదర్శనలకు సంబంధించిన విషయాలను, అదే విధంగా ఈ ప్రయోగాల్లో వాడిన శాటిలైట్‌లు, వాటి పని తీరు, వాటిలో వాడిన ఇంధనం, శాటిలైట్‌ల ప్రయోగాలు విజయవంతం ఏ విధంగా అయ్యాయి, ఏ విధంగా విఫలం అయ్యాయి తదితర వివరాలతో కూడిన పూర్తి స్థాయి సమాచారం ఈ బస్సులో విద్యార్థుల ప్రదర్శన కోసం ఉంచారు. ఉదయం నుంచే జిల్లా విద్యాశాఖ అధికారులు అశించిన దాని కంటే అధిక సంఖ్యలో ఇస్రో ప్రదర్శనలు తిలకించేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు బారులు తీరారు.
స్పేస్ ఆన్ వీల్ బస్సులో శాటిలైట్ తదితర నమూనాలు
ప్రదర్శనలు అబ్బురపరిచాయి
నేను కేవలం పుస్తకాల్లో మాత్రమే అంతరిక్షం, రాకెట్ విషయాలు చదివాను. కానీ ఈ బస్సులో అన్ని రకాల రాకెట్, శాటిలైట్‌లు, రాకెట్‌లో ఉపయోగించే ఇంధనాలు తదితర వివరాలతో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడం ద్వారా ఇప్పటి వరకు తెలియని అనేక విషయాలు తెలుసుకున్నాను. చంద్రయాన్ గురించి విషయాలు అద్భుతంగా కనిపించాయి.
–స్పూర్తి, 8వ తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల మిట్టపల్లి
రాకెట్ ఎలా పంపిస్తారో తెలుసుకున్నాను
రాకెట్‌ను ఆకాశంలోకి ఏ విధంగా పంపిస్తారో తెలుసుకున్నాను. భూమిపైకి వెళ్లిన కొద్ది రాకెట్ పరిమాణం, ప్రయాణ దిశలు ఏ విధంగా మారుతాయో ఈ బస్సులో పూర్తిగా తెలిపారు. రాకెట్ లాంచింగ్ తదితర వివరాలను తెలుసుకున్నాను. సముద్రంలో సంభవించే ప్రమాదాల తీవ్రతను ఏ విధంగా మనకు శాటిలైట్‌లు తెలియపరుస్తాయో ఈ బస్సులో పొందుపర్చారు.
–సానియా,7వతరగతి విద్యార్థి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల పారుపల్లి
మంగళ్‌యాన్ ప్రయోగాలను వీక్షించాను
అంగారక గ్రహంపై ప్రయోగించిన మంగళ్‌యాన్ ప్రయోగాలను ఈ బస్సులో అద్భుతంగా తీర్చిదిద్దారు. మంగళ్‌యాన్ ప్రయోగంలో ఏ విధంగా శాటిలైట్‌లను పంపారు అనే విషయాలను తెలుసుకున్నాను. క్రయోజనిక్ ద్రవరూప ఇంధనం అన్ని వాతావరణ పరిస్థితుల్లో రాకెట్ ప్రయాణించడానికి ఏ విధంగా పనిచేస్తుంది, తదితర వివరాలను తెలుసుకున్నాను.
–చంద్రశ్రీ, 9వ తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల సిద్దిపేట
Comments
Please login to add a commentAdd a comment