గఘన విజయం | The success of of the experiment 43 in sriharikota | Sakshi
Sakshi News home page

గఘన విజయం

Published Tue, Jul 1 2014 3:38 AM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM

గఘన విజయం

గఘన విజయం

సూళ్లూరుపేట శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సోమవారం ఉదయం 9.52 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ23 నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 19.55 నిమిషాల్లో ప్రయోగం విజయవంతమైంది. ఈ విజయంతో భారత కీర్తి పతాకం గగన తలంలో రెపరెపలాడింది. అలాగే ఇస్రో 43వ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమక్షంలో విజయవంతంగా నిర్వహించినందుకు శాస్త్రవేత్తల్లో రెట్టించిన ఉత్సాహం కనిపించింది.
 
- వాణిజ్య విజయాల్లో అగ్రస్థానం
- ఇస్రోకు నమ్మకమైన ఆయుధంగా గుర్తింపు

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఐదు దశాబ్దాల్లో ఎన్నో శ్లాఘనీయమైన విజయాలను సొంతం చేసుకుంది. ఈ విజయాల్లో పోలార్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్(పీఎస్‌ఎల్‌వీ) కీలకపాత్ర పోషిస్తోంది. వాణిజ్యపరమైన ప్రయోగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బహుళప్రయోజనకారిగా ఇస్రోకు నమ్మకమైన ఆయుధంగా మారింది. శ్రీహరికోట నుంచి సోమవారం నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ23తో ఈ సిరీస్‌లో 27 ప్రయోగాలు పూర్తయ్యాయి. షార్ నుంచి జరిగిన 43 ప్రయోగాల్లో 27 పీఎస్‌ఎల్‌వీయే కావడం విశేషం.
 
వాణిజ్యపరమైన ప్రయోగాల్లో....

వాణిజ్యపరంగా పీఎస్‌ఎల్‌వీ ద్వారా 19 దేశాలకు చెందిన 38 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. వీటిలో ఎక్కువగా జర్మనీకి చెందిన టబ్‌శాట్, బర్డ్, కాంపాస్-1, రూబెన్-8, క్యూబ్‌శాట్-1, క్యూబ్‌శాట్-2, రూబెన్ 9.1, రూబెన్ 9.2, ఎన్‌ఎల్‌ఎస్ 7.1, ఎన్‌ఎల్‌ఎస్ 7.2 ఉపగ్రహాలు ఉన్నాయి.  కెనడాకు చెందిన క్యాన్‌ఎక్స్-2, ఎన్‌ఎల్‌ఎస్-5, ఎన్‌ఎల్‌ఎస్-1, షఫ్పైర్, నియోశాట్, ఎన్‌ఎల్‌ఎస్-7.1, ఎన్‌ఎల్‌ఎస్-7.2, సింగపూర్‌కు చెందిన ఎక్స్‌శాట్, వెలాక్సీ, జపాన్‌కు చెందిన క్యూట్-1.7, సీడ్స్, ప్రాయిటర్, డెన్మార్స్‌కు చెందిన ఆయుశాట్-2, ఎన్‌ఎల్‌ఎస్8.3, ఆస్ట్రియా ఎన్‌ఎల్‌ఎస్8.1, ఎన్‌ఎల్‌ఎస్ 8.2, ప్రాన్స్‌కు చెందిన స్పాట్-06, స్పాట్-07, స్విట్జర్లాండ్‌కు చెందిన క్యూబ్‌శాట్-4,టీశాట్-1 ఉపగ్రహాలను కూడా పీఎస్‌ఎల్‌వీనే నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇదే జాబితాలో అల్జీరియాకు చెందిన ఆల్‌శాట్-24, ఇటలీకి చెందిన అజిల్,  సౌత్‌కొరియాకు చెందిన కిట్‌శాట్, అర్జెంటినాకు చెందిన ఫ్యూహెన్‌శాట్, ఇజ్రాయెల్‌కు చెందిన టెక్సార్, లక్సెంబర్గ్‌కు చెందిన వెజల్‌శాట్,  టర్కీకి చెందిన క్యూబ్‌శాట్-3, బెల్జియంకు చెందిన ప్రోబా,ఇండోనేషియాకు చెందిన లాపాన్-టబ్‌శాట్,  నెదర్‌లాండ్స్‌కు చెందిన డెల్ఫీ-సీ3,  యునెటైడ్ కింగ్‌డమ్‌కు చెందిన స్ట్రాడ్-1 ఉపగ్రహాలు ఉన్నాయి.
 
 
ప్రధాని పర్యటనలో పదనిసలు
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు శ్రీహరికోటలోని షార్‌కు చేరుకున్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ23 ప్రయోగం అనంతరం సోమవారం ఉదయం 10.45 గంటలకు ఆయన తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న విశేషాలు.. - సూళ్లూరుపేట

  • షార్‌కు విచ్చేసిన ఐదో ప్రధానమంత్రి నరేంద్రమోడీ.
  • ప్రధాని షెడ్యూల్ సమయం కన్నా గంట ఆలస్యంగా షార్‌కు వచ్చారు.
  • ఒకే హెలికాఫ్టర్‌లో వచ్చిన గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబునాయుడు మధ్యాహ్నం 3.30 గంటలకు షార్‌కు వస్తారని మొదట ప్రకటించినా, 3 గంటలకే చేరుకున్నారు.
  • ప్రధానికి స్వాగతం పలికేందుకు వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎంపీలను,  మాజీ ఎమ్మెల్యేలను కొద్దిసేపు గేట్‌వద్ద ఆపారు. జిల్లా బీజేపీ నాయకులు మాత్రం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అనుమతి తెచ్చుకోవడంతో నేరుగా వెళ్లి స్వాగతం పలికారు.
  • మిషన్‌కంట్రోల్ రూంలో సీఎం చంద్రబాబును ఎవరూ పట్టించుకోకపోవడంతో దూరదూరంగా ఉంటూ కనిపించారు. ప్రధానమంత్రి కూడా చంద్రబాబును దగ్గరకు రమ్మని పిలిచిన సందర్భం లేదు. ఇస్రో శాస్త్రవేత్తలు కూడా చంద్రబాబుని పట్టించుకోలేదు.
  • భాస్కర గెస్ట్‌హౌస్‌లో బసచేసిన నరేంద్ర మోడీకి రాష్ట్ర రాజధాని నిర్మాణం, రుణమాఫీ తదితర అంశాలపై చంద్రబాబు పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధాని నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో చంద్రబాబు మౌనంగా కనిపించారు.
  • రాకెట్ ప్రయోగం సక్సెస్ అయిన సమయంలోనూ చంద్రబాబు ముఖంలో చిరునవ్వు కూడా కనిపించలేదు.
  • మిషన్ కంట్రోల్ రూంలో మోడీ 26 నిమిషాల పాటు చేసిన ప్రసంగం అందరినీఆకట్టుకుంది.
  • షార్‌కు విచ్చేసిన ప్రధానమంత్రుల్లో ఇప్పటి వరకు ఎవరూ మోడీలా శాస్త్రసాంకేతిక రంగాలను ఔపోసన పట్టినట్లు సుదీర్ఘంగా ప్రసంగించకపోవడం గమనార్హం.
  • ప్రధానికి గుజరాతీ వంటకాలతోనే రాత్రి భోజనం, ఉదయం టిఫిన్ ఏర్పాటు చేశారు.
  •  మోడీ పర్యటన సందర్భంగా సుమారు 3 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. సరైన భోజనం, తలదాచుకునేందుకు విశ్రాంతి భవనం లేకపోవడంతో పోలీసులు చెట్ల కిందే గడిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement