అబ్దుల్ కలామ్ 2015 జూలై 27న షిల్లాంగ్‌లోని ఐ.ఐ.ఎం.లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మధ్యలోనే హఠాత్తుగా కుప్పకూలిపోయారు. 84 ఏళ్ల ఆయన శరీరం నుంచి ఆత్మ అంతరిక్షానికేగింది. అంతరిక్షానికే ఎందుకంటే.. అది ఆయన మనసుకు నచ్చిన సాంకేతిక ప్రదేశం. రామేశ్వరం దీవిలోని ఒక తమిళ ముస్లిం కుటుంబంలో జన్మించిన ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ భారతదేశ సర్వ స్వతంత్ర గణతంత్ర రాజ్యానికి 11 వ రాష్ట్రపతి కావడానికి సుదీర్ఘ పయనమే సాగించారు. ఇంటర్మీడియట్ పరీక్ష తర్వాత ఇంజనీరింగ్‌లో చేరడంపై సలహా ఇచ్చేవారెవరూ లేకపోవడంతో ఆయన బి.ఎస్.సి. చదివారు.
విమానాన్ని నడపాలనే ఉబలాటంతో ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యారు. కానీ, భారత వైమానిక దళంలో పైలట్ ఉద్యోగం ఆయనకు తృటిలో తప్పిపోయింది. అయినా, రక్షణ ఏరోనాటికల్ వ్యవస్థలో యంత్ర విహంగాలకు ఆయన సన్నిహితంగా మసలుతూ వచ్చారు. అంతరిక్ష పరిశోధనా జాతీయ కమిటీ 1960ల ప్రారంభంలో ఏర్పాటవడంతో ఆయన జీవితంలో మొదటి మలుపు వచ్చింది. దాని కింద ప్రతిభావంతులైన ఏరోనాటికల్ ఇంజనీర్ల బృందాన్ని సృష్టించారు. అదే ఆ తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గా రూపాంతరం చెందింది. ఒక స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమం కోసం అమెరికా వెళ్లడం కలాం జీవితాన్ని ఇంకో మలుపు తిప్పింది.
ఆయనకు విక్రమ్ సారాభాయ్, సతీశ్ ధావన్ వంటి మహామహుల ఆశీర్వాదాలు కూడా లభించాయి. ప్రతిభావంతులైనవారు ఇంకా అనేకమంది ఉన్నా ఉపగ్రహ వాహక నౌక ప్రాజెక్టు నాయకత్వ బాధ్యతలకు ఆయనను ఎంపిక చేశారు. ఒక దశాబ్దంపాటు పడిన కఠిన శ్రమ భారతదేశం అంతరిక్ష పరిశోధనల్లో – 1980లలోని ఎస్.ఎల్.వి.–3 ప్రయోగంతో – సఫలం అయ్యేలా చేసింది. ఆయనను 1981లో పద్మభూషణ్ వరించింది. క్షిపణి నిర్మాణ సామర్థ్యాలను స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసే బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు. కలామ్‌కు 1990లో పద్మవిభూషన్ లభించింది.
దేశాన్ని 2020 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మలచడం గురించి కూడా కలామ్ అప్పట్లో ఒక పథకాన్ని రూపొందించారు. తేలిక రకం యుద్ధ విమానం ప్రాజెక్టును రూపుదిద్దిన ఘనత కూడా కలామ్‌దే. ఆయన 1997లో భారతరత్న అయ్యారు. ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. 2002లో అప్పటి పాలక ఎన్.డి.ఎ. ప్రభుత్వం కోరడంతో ఆయన రాష్ట్రపతిగా నిలబడి, ఆ పదవికి ఎన్నికయ్యారు. ఇక కలామ్ ఆత్మకథ ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ పుస్తకం ప్రతులు అత్యధికంగా అమ్ముడయ్యాయి. కలాం శాకాహారి. వివాహం చేసుకోలేదు. వ్యకిగత ఆస్తులు, సంపదలు ఏమీ లేవు.
– అరుణ్ తివారీ, ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ పుస్తక సహ గ్రంథకర్త
(చదవండి: చైతన్య భారతి: అణుశక్తిమాన్)
Comments
Please login to add a commentAdd a comment