ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్‌తో ప్రస్తుత చైర్మన్ శివన్ కరచాలనం
సాక్షి బెంగళూరు: వచ్చే ఏడాది జనవరి 3న చంద్రయాన్–2 మిషన్ చేపడతామని ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. ఈ ప్రయోగానికి రూ. 800 కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ శత జయంతి ఉత్సవాలను ఆదివారం బెంగళూరులోని ఇస్రో కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇస్రో మాజీ చైర్మన్లు కస్తూరి రంగన్, కిరణ్‌కుమార్ కూడా పాల్గొన్నారు. అనంతరం శివన్ మీడియాతో మాట్లాడుతూ 3,890 కేజీల బరువైన చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్వీ ఎంకే–3 రాకెట్ ద్వారా చంద్రుని మీదికి పంపిస్తామని తెలిపారు.
ఈ మిషన్‌కు విక్రమ్ సారాభాయ్ మిషన్ అని నామకరణం చేస్తామని వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో 50 ఉపగ్రహాలు ప్రయోగించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. ఒక్క 2019లోనే 22 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నట్లు తెలిపారు. ఇస్రో చరిత్రలో ఎక్కువ ప్రయోగాలు జరిపిన ఏడాది ఇదే కాబోతోందని అన్నారు. ఈ ఏడాది కూడా తమకు తీరికలేని షెడ్యూల్ ఉందని, ఇకపై నెలకు కనీసం రెండు ప్రయోగాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్‌లో బ్రిటన్‌కు చెందిన రెండు వాణిజ్య ఉపగ్రహాల్ని నింగిలోకి పంపనున్నట్లు చెప్పారు. ఇస్రో చిన్నస్థాయి వాహకనౌకలను కూడా తయారుచేస్తోందని తెలిపారు. అవసరమైనప్పుడు ఇలాంటి వాటిని కేవలం ముగ్గురు నుంచి ఆరుగురు మనుషుల సాయంతో, మూడు రోజుల్లోనే రూపొందించొచ్చని వెల్లడించారు. మరో మూడు, నాలుగు నెలల్లో ఇస్రో టీవీ చానల్‌ను ప్రారంభిస్తున్నట్లు శివన్ చెప్పారు. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన వివరాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను సామాన్యులకు చేరవేసేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. ఆంగ్లంతో పాటు ప్రాంతీయ భాషల్లో తమ చానల్ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment