Vikram Sarabhai: భారత అంతరిక్ష పరిశోధనలకు ఆద్యునిగా.. | Vikram Sarabhai Death Anniversary: Contributions in Science | Sakshi
Sakshi News home page

Vikram Sarabhai: భారత అంతరిక్ష పరిశోధనలకు ఆద్యునిగా..

Published Mon, Dec 30 2024 9:37 AM | Last Updated on Mon, Dec 30 2024 10:32 AM

Vikram Sarabhai Death Anniversary: Contributions in Science

విక్రమ్ సారాభాయ్ పేరు విన్నంతనే మనకు ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్‌’ రూపంలో స్ఫురణకు వస్తారు. ఈరోజు (డిసెంబరు 30) విక్రమ్ సారాభాయ్ వర్థంతి. భౌతిక శాస్త్రవేత్తగా, ఖగోళ శాస్త్రవేత్తగా దేశానికి ఎంతో సేవ చేసిన ఆయన 1971, డిసెంబరు 30న కన్నుమూశారు. శాస్త్రవేత్తగా ఆయన అందించిన సహకారం మరువలేనిది. విక్రమ్‌ సారాభాయ్ పలు విషయాలపై పరిశోధన పత్రాలు రాయడమే కాకుండా ఎన్నో సంస్థలను కూడా స్థాపించారు. భారతదేశ అంతరిక్ష పరిశోధనలకు, దేశ అణుశక్తి అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిది.

కేంబ్రిడ్జ్ నుండి పట్టా పొంది..
1919, ఆగస్టు 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించిన విక్రమ్ సారాభాయ్.. అంబాలాల్ సారాభాయ్, సరళా సారాభాయ్‌ల కుమారుడు. ఆయన 1937లో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ నుండి ట్రిపోస్ డిగ్రీని అందుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో భారతదేశానికి తిరిగి వచ్చిన విక్రమ్‌ సారాభాయ్‌(Vikram Sarabhai) మరో శాస్త్రవేత్త శివరామన్ పర్యవేక్షణలో పరిశోధనలు సాగించడం మొదలుపెట్టారు.

86 శాస్త్రీయ పరిశోధనా పత్రాలు
విక్రమ్ సారాభాయ్ తన జీవితంలో మొత్తం 86 శాస్త్రీయ పరిశోధనా పత్రాలను రాశారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, సంస్కృతికి సంబంధించిన 40 సంస్థలను స్థాపించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఆయన చేసిన కృషికిగాను మరణానంతరం ప్రభుత్వం  ఆయనకు పద్మభూషణ్ ప్రకటించింది. విక్రమ్‌ సారాభాయ్‌ పేరు మీద పలు సంస్థలు తెరుచుకున్నాయి. చంద్రయాన్ మిషన్‌(Chandrayaan Mission)కు చెందిన ల్యాండర్‌ను కూడా విక్రమ్ ల్యాండర్ అని పిలుస్తారు.

పరిశోధనలు సాగాయిలా..
విక్రమ్ సారాభాయ్ తన మొదటి పరిశోధనా కథనాన్ని టైమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాస్మిక్ రేంజ్ పేరుతో ప్రచురించారు. 1940-45 మధ్య కాలంలో సీవీ రామన్ సారధ్యంలో కాస్మిక్ రేంజ్‌పై పరిశోధనలు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కేంబ్రిడ్జ్‌కి తిరిగి వెళ్లిన విక్రమ్‌ సారాభాయ్‌ ఉష్ణమండల అక్షాంశాలలో కాస్మిక్ కిరణాలపై తన పరిశోధనను పూర్తి చేసి డాక్టరేట్ పొందారు.
అనంతరం భారత్‌కు తిరిగివచ్చి, కాస్మిక్ రేడియేషన్, రేడియో ఫిజిక్స్‌(Radio Physics)లపై పలు పరిశోధనలు సాగించారు.

అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తిగా..
ఇంటర్‌ప్లానెటరీ స్పేస్, సౌర ఈక్వటోరియల్ రిలేషన్స్, జియోమాగ్నెటిజంపై కూడా ఆయన పరిశోధనలు చేశారు. విక్రమ్‌ సారాభాయ్‌ పరిశోధనలను సైద్ధాంతిక భౌతిక శాస్త్రం, రేడియో భౌతిక శాస్త్రం పరిధిలోకి తీసుకువచ్చారు. ఆయన తన పరిశోధనలకు ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ నుండి ఆర్థికసాయం అందుకున్నారు. భారతదేశపు మొట్టమొదటి మార్కెట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఆపరేషన్ రీసెర్చ్ గ్రూప్ స్థాపనలో కూడా ప్రధాన పాత్ర పోషించారు. అతనితో పనిచేసిన చాలా మంది శాస్త్రవేత్తలు ఆయనను కృషీవలునిగా పేర్కొంటారు. తాను కన్న కలలను నిజం చేసుకున్న అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తిగా విక్రమ్‌ సారాభాయ్‌ని గుర్తిస్తారు.

ఆర్థికాభివృద్దిలో అంతరిక్షశాస్త్ర భాగస్వామ్యం
ప్రముఖ శాస్త్రవేత్త హోమీ జహంగీర్ భాభాను భారత అణువిద్యుత్ ప్లాంట్‌లో పనిచేయడానికి ప్రేరేపించినది..  ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని ఒప్పించింది విక్రమ్‌ సారాభాయ్‌నే. ఆయన కృషి, చొరవలతోనే ఇస్రో స్థాపితమయ్యింది. డాక్టర్ హోమీ జహంగీర్ భాభా తర్వాత, విక్రమ్‌ సారాభాయ్‌ ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్ అయ్యారు. డాక్టర్ సారాభాయ్ కేవలం విజ్ఞాన శాస్త్రానికే కాకుండా సమాజం, ఆర్థికాభివృద్ధిలో దాని భాగస్వామ్యానికి  రూపకల్పన చేశారు. అంతరిక్ష శాస్త్రం సాయంలో కమ్యూనికేషన్, వాతావరణ శాస్త్రం, సహజ వనరుల అన్వేషణ సాగించవచ్చని తెలిపారు. భారతదేశంలో శాటిలైట్ టెలివిజన్ ప్రసారాల అభివృద్ధి విక్రమ్‌ సారాభాయ్‌ ప్రోత్సహించిన రాకెట్ టెక్నాలజీ కారణంగానే సాధ్యమయ్యింది.

ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎన్నటికీ మరువలేని రెండు దుర్ఘటనలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement