(పొట్లపల్లి శతజయంతి ఉత్సవాల ప్రారంభం. నేడు 10 గంటలకు ఓ.యూ.లోని ప్రొ‘‘ జి.రాంరెడ్డి దూరవిద్యా కేంద్రం ఆడిటోరియంలో జాతీయ సదస్సు జరగనుంది.)
పొట్లపల్లి రామారావు స్వభావ రీత్యా రాజకీయ జీవి కాదు. రాజకీయ ప్రమేయం వున్న అనుబంధ సాహిత్య సంస్థల్లో ఆయనకి ప్రత్యక్ష భాగస్వామ్యం లేదు. అయితే ప్రజోపయోగకరమైన రాజకీయాల గురించీ, సంక్షేమ రాజ్యం గురించీ పొట్లపల్లికి స్పష్టమైన వైఖరి వుందని చెప్పడానికి ఆయన జీవించిన జీవితం, సృజించిన సాహిత్యమే ప్రబలమైన సాక్ష్యాలు.
‘కీర్తి ప్రతిష్ఠలు, దానం, యిలాంటి క్షుద్రత్వాలను, అల్పత్వాలను అన్నీ తొలగించివేయి. రచన కోసరం సర్వస్వం త్యాగం చేయనిదే రచనలు సృష్టి కావు’ (నాలో నేను) అని నమ్మిన పొట్లపల్లి రామారావు ప్రధానంగా సాహిత్య జీవి. స్వేచ్ఛా లాలసుడు. ఆదర్శ భావుకుడు. హృదయ సంస్కర్త. ఆత్మ విమర్శకుడు. రామారావు వ్యక్తిత్వం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వొదగదు. రాజకీయ ప్రమేయం వున్న అనుబంధ సాహిత్య సంస్థల్లో ఆయనకి ప్రత్యక్ష భాగస్వామ్యం లేదు. అందువల్ల యే సంస్థా ఆయన్ని భుజానికెత్తుకోలేదు. ప్రజోపయోగకరమైన రాజకీయాల గురించీ, సంక్షేమ రాజ్యం గురించీ పొట్లపల్లికి స్పష్టమైన వైఖరి వుందని చెప్పడానికి ఆయన జీవించిన జీవితం, సృజించిన సాహిత్యమే ప్రబలమైన సాక్ష్యాలు.
కవిత్వంలో కాళోజీకీ, కథారచనలో వట్టికోటకీ సమవుజ్జీ పొట్లపల్లి. ముగ్గురూ రెండో తరానికి చెందిన తెలంగాణ సాహిత్య వైతాళికుల్లో ఆకాశమంత యెత్తు నిలిచిన త్రినగాలు. ముగ్గురూ సమవయస్కులే కాదు; సమస్కంధులు కూడా. ఒకరి ఆత్మని మరొకరు పట్టుకున్నవారు. ఒకే గంగ త్రిపథగ అయినట్టు ముగ్గురూ తమ తమ ప్రత్యేకతల్తో తెలంగాణ ప్రజా జీవన క్షేత్రాల్లోకి ప్రవహించారు. ‘పొట్లపల్లి రామారావు ప్రపంచ పౌరుడు. అతడు విశ్వకుటుంబి. రంగు రూపు దేశం వేషం భాష సంస్కృతి మొదలగువాటి పేర పాటించబడే విభేదాలేవి పాటించేవాడు కాడు. మానవునిలోని ఆత్మీయతను పెంపొందించి విశ్వమానవ సౌభ్రాతృత్వం నెలకొల్పితేనే కానీ ప్రపంచశాంతి చేకూరదని అతని దృఢ విశ్వాసం’ అని (ఆత్మ నివేదనం ముందుమాటలో) కాళోజీ చెప్పిన మాటలు అక్షర సత్యాలు.
తొలినాళ్ళలో పొట్లపల్లి రాసిన ‘ఆత్మ నివేదన’ కవిత్వం అభ్యుదయ భావాలతో నిండి వుంది. కష్టజీవుల శ్రమ లేకుంటే ప్రభువుల భోగాలు లేవని మార్క్సిస్టు తత్త్వశాస్త్ర సారాన్ని తేలిక మాటల్లో సూత్రీకరించాడు. సంపన్న భూస్వామ్య కుటుంబంలో పుట్టి ఫ్యూడల్ దోపిడిని పెదాలపై అమలయ్యే హింసని దగ్గరగా చూసి చలించిన రామారావు శ్రమ విలువనీ శ్రమజీవుల హక్కుల్నీ స్వయంగా అర్థం చేసుకొని తన కవిత్వం కథలు నాటికల ద్వారా పాఠకులకీ ప్రేక్షకులకీ బోధపరిచాడు. ‘మనం పండించె పంటతోనె గద నరలోకం జీవి నిలబడుతున్నది. లేకుంటే వీళ్ళు పెద్ద పెద్ద బంగ్లాలల్ల కూసోని, కాగితాల మీద సిరా గీతాలు గీయంగనే పంటలు పండుతాయి?’ ‘సర్ బరాహి’ (1945) నాటికలో వెట్టి మాదిగ గొంతు రామారావుదే.
ఆళ్వారు స్వామి జైలులోపల కథలకంటే చాలా ముందే రామారావు జైలు కథలు వెలికి వచ్చాయి. వట్టికోటకి జైలు అనుభవాలు రికార్డు చేయడానికి రామారావే స్ఫూర్తి కావొచ్చు. ఇద్దరి అనుభవాలు వేరుగా వుండ వచ్చునేమో గానీ క్షణికావేశంలో తెలియక తప్పులు చేసి, అసలు యే నేరం చేయక పోయినా క్రూరమైన శిక్షలు అనుభవించే అభాగ్యులైన ఖైదీల పట్ల వారి మానవీయ స్పందనలు మాత్రం వొకటే. రాజ్య స్వభావం పట్ల దాని శకార న్యాయం పట్ల పొట్లపల్లికి స్పష్టమైన అవగాహన వుందని చెప్పడానికి యెన్నో వుదాహరణలు ‘జైలు’ కథల్లో వున్నాయి.
అయితే ‘చుక్కలు’ (1965) రాసేనాటికి పొట్లపల్లి ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఆ మార్పు ఆ తర్వాతి కాలపు కవిత్వంలో (అక్షరదీప్తి, 1993) సైతం కొనసాగింది. అంతర్ముఖుడై బాహ్య సంఘర్షణని పట్టించుకోకుండా తనలోకి చూసుకోవడం మొదలెట్టాకా తన తొలినాళ్ళ రాజకీయ అభిప్రాయాల నుంచి రామారావు దూరమయ్యాడని కేవీయార్ లాంటి వాళ్ళు భావించడంలో కొంత నిజం వున్నప్పటికీ కవిగా రామారావు సమాజం పట్ల తన బాధ్యతని మర్చిపోలేదు. మనిషి లోపలి బలహీనతల మీద యెక్కువ దృష్టి సారించాడు. ‘నేను చదివిన చదువులు, అధ్యయనం చేసిన శాస్త్రాలు, గడించిన అనుభవాలు ఏమీ లేవు. బడికి రాని కారణంగా పేరు తొలగింపబడి, బయటికి గెంటివేయబడ్డ విఫల విద్యార్థిని నేను. బడి నుండి గెంటివేయబడ్డ విద్యార్థులకు చెట్లు, చేమలు, కొండలు వాగులే సైదోడులుగా మిగులుతాయి. ప్రకృతితో ఏర్పడ్డ ఆ సాన్నిహిత్యం క్రమక్రమంగా ఒక విధమైన ఏకాంతంలోకి మారింది. ఏకాంతంలో తోడుగా ఉండేవి ఆలోచనలు’ అని తాను అంతర్ముఖుడు కావడానికి కారణాలు సైతం ‘చుక్కలు’లో పేర్కొన్నాడు. యీ లోచూపు పొట్లపల్లిని శుద్ధ ఆత్మవాదిగా మార్చిందని చెప్పడం తప్పే అవుతుంది. అప్పుడు కూడా మనిషిని కేంద్రంగా చేసుకొని సమాజ శ్రేయస్సునే కాంక్షించాడు. సమత్వ భావన సాధించడం కోసం మనిషి పెంపొందించుకోవాల్సిన ‘హృదయ పరిపక్వత’ గురించీ, ‘ఆత్మ వికాసం’ గురించీ ఆలోచించాడు. ఇతరుల్ని నియంత్రించే చట్టాలు కాకుండా తనను తాను నియంత్రించుకొనే చట్టాల గురించి చింతన చేశాడు. ఆ కాలంలో వొక విధంగా వర్గ సామరస్యాన్ని కోరుకున్నాడు. పీడకుల్లో పరివర్తన ఆశించాడు. ప్రజాస్వామ్య సిద్ధాంతం సఫలమవ్వాలంటే ఆత్మ నిగ్రహం ఆత్మ విమర్శల అవసరాన్ని గుర్తించాడు. ‘అట్టడుగు జనం యొక్క సంతుష్టి మీదనే దేశ క్షేమం ఆధారపడి ఉంది – పునాదులు కదిలిన ఇల్లు కలకాలం నిలవజాలదు’ అన్న నిర్ధారణ చేశాడు. ఈ ప్రజాస్వామిక భావననే పొట్లపల్లి చివరిదాకా విశ్వసించాడు.
1947లో పొట్లపల్లి రాసిన ‘సైనికుని జాబులు’ ఆయన రాజకీయ దృక్పథాన్ని తెలుసుకోడానికి నిలువెత్తు సాక్ష్యాలు. దేశాధినేతల యుద్ధోన్మాదంలో సైనికుల దైన్యాన్నీ పరాధీనతనీ నిస్సహాయతనీ గొప్ప ఆర్తితో చిత్రించాడు. సాధారణంగా అభ్యుదయ రచయితల రచనల్లో కనిపించే యుద్ధ వ్యతిరేకత శాంతి కాముకతతో పాటు పొట్లపల్లి సైనిక జాబుల్లో వుదాత్తమైన మానవీయమైన జీవన తాత్త్విక కోణాలు ఆవిష్కారమయ్యాయి. అంతేకాదు పాశ్చాత్య దేశాల భౌతిక తృష్ణ యితర దేశాల్ని సరుకుల మార్కెట్లుగా మార్చిందనీ, ప్రకృతి విధ్వంసానికి సైతం ఆ తృష్ణ కారణమౌతుందనీ 70 సంవత్సరాల పూర్వమే గుర్తించిన క్రాంతదర్శి పొట్లపల్లి. అయితే చాలామంది భావించినట్లు భారతీయ సంప్రదాయమో తాత్వికతతో ప్రపంచ శాంతికి మార్గదర్శనం చేస్తుందన్న భ్రమలు ఆయనకీ లేవు. ‘మన హిందూ వేదాంత సూక్తులతో ప్రపంచ శాంతి అనేది కల్ల. మన వేదాంతముతో మన దేశములోనే శాంతి స్థాపించుకోలేనప్పుడు ప్రపంచశాంతి అనడం కూడా సిగ్గే... భౌతిక కాంక్షా ప్రవాహములో పుడకలుగా కొట్టుకుపోవడానికి బదులు నావలమై నావికులమై మన దేశాన్ని విపదాబ్ధి నుంచి కాపాడడమే’ కర్తవ్యమని సమన్వయ దృష్టిని ప్రబోధించాడు. జాతీయోద్యమంలోని పరిమితుల్ని లోపాల్ని సైతం రామారావు గుర్తించాడనటానికి ‘పాదధూళి’ (1948) నాటిక నిదర్శనంగా నిలుస్తుంది. గాంధీని జాతీయ బూర్జువా సమాజం తమ స్వార్థానికి వాడుకున్న వైనాన్ని యీ నాటికలో యెత్తి చూపాడు.
ప్రభుత్వాల అవార్డులు తీసుకొనేవారి విషయంలో తటస్థంగా వున్నా కొన్ని సార్లు ఆయనకి తెలియకుండానే వాటి పట్ల వ్యతిరేకత అసంకల్పితంగా వెలికి వచ్చేది. కాళోజీకి పద్మవిభూషణ్ ఇచ్చినప్పుడు ఇచ్చేవాడు ఎందుకిచ్చాడనేది కాదు ప్రశ్న, తీసుకొనేవాడు ఎందుకు తీసుకున్నాడు అనేదే ప్రశ్న (ఏ సవాల్ నయ్యే దేనేవాలా కైకు దియా హై , ఏ సవాల్ హై లేనేవాలా కైకు లియా హై) అని తీవ్రంగానే విమర్శించాడు. అది ఉర్దూలో అనడంవల్ల అంతగా ప్రచారంలోకి రాలేదు.
రాత్రికి రాత్రి విప్లవాలు రావనీ వ్యవస్థలో మార్పులు అకస్మాత్తుగా సంభవించవనీ రామారావు నమ్మకం. తుపాకి గొట్టంలో నుండి అధికారం ఉద్భవిస్తుంది అన్న నినాదాన్ని కూడా అంగీకరించలేదు. ‘తుపాకిగొట్టంలో ఆవేశం పాలు తప్ప ఆలోచన భాగం శూన్యంగా కనిపిస్తుంది’ అని నిర్ధారిస్తాడు. ‘తుపాకి వాడి చేతిలో వుంటుందో తుపాకి చేతిలో వాడుంటాడో తెలియదు’ అన్నప్పుడు ఆయుధధారి విచక్షణాశీలి అయివుండాలన్న తాత్త్వికతని బోధించాడు. అదే సమయంలో ‘తలబరువుగా పరిణమించిన ఏ వ్యవస్థకు గాని ఏదో ఒక దశలో ప్రజలు చరమగీతం పాడక తప్పదు’ అని తీర్మానిస్తాడు.
‘ఎన్ని ప్రాణులు ఎండలో కమిలి, వానలో నాని, చలికి బిగిసి, నిద్రలు కాచి, కడుపు అంటగట్టుకొని శ్రమిస్తే ఈ అపార సంపద కూడింది ?... ఎంతమంది నిసుగులు తాగడానికి పాలులేక, సరియైన పోషణ లేక తల్లి ఒళ్లో ప్రాణాలు వదులుతున్నారో!... కళ్ళలో మెరుపు, హృదయంలో తృష్ణగల వక్తలు, తాత్వికులు, వైజ్ఞానికులు, శిల్పులు; ఎంతమంది అనామకులై పోతున్నారో! ఈ ప్రభుత్వాలు ఎన్నడైనా ఆలోచించాయా ?’( నా డైరీలో కొన్ని పేజీలు, 1945) యిదీ పొట్లపల్లి రామారావు హృదయం. అదే ఆయన రాజకీయ దృక్పథం. ఆయన సాహిత్య – జీవిత ప్రస్థానాల పొడవునా అది ఆచరణాత్మకంగా ప్రతిఫలించింది. దానికి అభ్యుదయవాదమనో సంస్కరణవాదమనో మానవతావాదమనో ప్రజాతంత్రవాదమనో యే పేరు పెడతామో, అది యే యిజాల్లోకి పదాల్లోకి యిముడుతుందో వొదుగుతుందో నిర్ణయించాల్సింది సహృదయులే.
- ఎ.కె.ప్రభాకర్
040–27761510
Comments
Please login to add a commentAdd a comment