రాజ్ కపూర్ శత జయంతి ఉత్సవాలకు సన్నాహాలు
భారతీయ సినీ పరిశ్రమ ఖ్యాతిని పెంచడంలో కృషి చేసిన ఎందరో సినీ ప్రముఖుల్లో నటుడు–దర్శక–నిర్మాత రాజ్‌కపూర్ ఒకరు. రాజ్ సాహెబ్, ది షో మేన్ ది గ్రేటెస్ట్ షో మేన్ ఆఫ్ ఇండియన్ సినిమా, చార్లీ చాప్లిన్ ఆఫ్ ఇండియన్ సినిమా... ఇలా రాజ్‌కుమార్‌ను ఆయన ఫ్యాన్స్, సన్నిహితులు, ప్రేక్షకులు పిలుచుకునేవారు. రాజ్ కపూర్ చేసిన ఎన్నో అద్భుత చిత్రాలు ఆయన్ను ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయేలా చేశాయి.
కాగా ఈ నెల 14న రాజ్‌కపూర్ శత జయంతి. ఈ సందర్భంగా డిసెంబరు 13 నుంచి 15 వరకు రాజ్‌కుమార్ ఐకానిక్ సినిమాలను దేశంలోని 40 నగరాల్లో దాదాపు 150 థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ‘రాజ్‌కపూర్ – 100 సెలబ్రేటింగ్ ది సెంచరీ ఆఫ్ ది గ్రేటెస్ట్ షో మేన్’ పేరిట ‘ఆర్‌కే ఫిలిమ్స్, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా’ల నేతృత్వంలో ఈ సినిమాల ప్రదర్శన ఉంటుంది.
రాజ్‌కపూర్ కెరీర్‌లోని ఐకానిక్ ఫిల్మ్స్ ‘ఆగ్ (1948), బర్సాత్ (1949), ఆవారా (1951), శ్రీ 420 (1955), జాగ్తే రహో (1956), జిష్ దేశ్ మే గంగా బహ్‌తీ హై (1960), సంగం (1964), మేరే నామ్ జోకర్ (1970), బాబీ (1973), రామ్ తేరీ గంగా మైలీ (1985)’ వంటి సినిమాలు ‘రాజ్‌కపూర్ – 100 సెలబ్రేటింగ్ ది సెంచరీ ఆఫ్ ది గ్రేటెస్ట్ షో మేన్’ వేడుకల్లో ప్రదర్శితం కానున్నాయి. పీవీఆర్ ఐనాక్స్, సినీ పోలీస్ సినిమాస్‌లో ఈ సినిమాల ప్రదర్శన ఉంటుందని బాలీవుడ్ సమాచారం. ఈ చిత్రాల టికెట్ ధర వంద రూపాయలుగా నిర్ణయించారు.
భారతీయ సినిమా దార్శనికుడు
‘‘రాజ్‌కపూర్ భారతీయ సినీ తెరకు భావోద్వేగాలు అద్దిన దార్శనికుడు. ఆయన విజన్‌కు ఈ ఫెస్టివల్ ఓ నివాళి’’ అన్నారు రణ్‌ధీర్ కపూర్ (రాజ్‌కపూర్ తనయుడు). ‘‘రాజ్ కపూర్ సినిమాలు మాలో స్ఫూర్తి నింపుతూనే ఉంటాయి’’ అన్నారు రణ్‌బీర్ కపూర్ (రాజ్‌కపూర్ మనవడు).
అవిభక్త భారతదేశంలోని పెషావర్‌లో పృథ్వీ రాజ్‌కపూర్, రామ్ సర్నీదేవి దంపతులకు డిసెంబరు 14, 1924లో జన్మించారు రాజ్‌కపూర్ (అసలు పేరు సృష్టినాథ్ కపూర్). యాక్టర్‌గా పృథ్వీరాజ్ కపూర్ కెరీర్‌ను బిల్డ్ చేసుకునే క్రమంలో ఆయన పలు ప్రాంతాలకు మకాం మార్చాల్సి వచ్చింది. ఇలా రాజ్ కపూర్ చదువు వివిధ స్కూల్స్‌లో జరిగింది.
ఇక తన తండ్రి ఓ లీడ్ రోల్‌లో నటించిన ‘ఇన్‌క్విలాబ్’ (1935) చిత్రంతో బాల నటుడిగా పదేళ్ల వయసులో తెరపైకి వచ్చారు రాజ్ కపూర్. ‘నీల్ కమల్’ (1947) మూవీతో లీడ్ యాక్టర్‌గా కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత హీరోగా ‘బర్సాత్’తో తొలి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమాతో రాజ్‌కపూర్ పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోయింది. ఇక 1951లో విడుదలైన ‘అవారా’ చిత్రం రాజ్ కపూర్ కేరీర్‌ను అమాంతం పెంచేసింది.
ఈ సినిమాకు విదేశీ ప్రేక్షకుల ఆదరణ కూడా లభించిందంటే ఆయన కెరీర్ ఈ టైమ్‌లో ఎంతటి పీక్ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా నాటి తరంలో ఇండియన్ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన వారిలో రాజ్ కపూర్ ముందు వరుసలో ఉంటారు. ఆయన స్టార్‌డమ్ కొనసాగేలా ‘శ్రీ 420, సంగం’ వంటి సినిమాలు సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. ఇక రాజ్‌కపూర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మేరా నామ్ జోకర్’ చిత్రం ఆయన్ను నిరాశకు గురిచేసింది.
ఈ సినిమాకు ఆశించిన ఫలితం దక్కలేదు. నాలుగు గంటల నిడివితో రెండు ఇంట్రవెల్స్‌తో రిలీజైన ఈ చిత్రం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఇదే సినిమాకు కాలక్రమేణా కల్ట్ మూవీ స్టేటస్ దక్కడం విశేషం. ఇక 1948లో ఆర్కే స్టూడియో సంస్థను స్థాపించి, సినిమాలు నిర్మించారు రాజ్ కపూర్. తన కుమారుడు రిషి కపూర్‌ను హీరోగా పరిచయం చేస్తూ రాజ్ కపూర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘బాబీ’ సినిమా 1973లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
దర్శకుడిగానూ రాజ్ కపూర్ సూపర్‌హిట్. ‘బర్సాత్, ఆవారా, శ్రీ 420, సంగం, మేరా నామ్ జోకర్’ వంటి చిత్రాలు అందుకు ఓ నిదర్శనం. సినిమా రంగంలో ఆయన చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మ భూషణ్ పురస్కారాలతో సత్కరించింది. ఇంకా జాతీయ అవార్డులతో పాటు పలు అవార్డులు అందుకున్నారు రాజ్ కపూర్. ఈ గ్రేట్ షో మేన్ 1988 జూన్ 2న ఢిల్లీలో కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment