రాజ్‌కపూర్ శతజయంతి ( 1924-2024)
జన్మించి నూరేళ్లు. మరణించి ముప్పై ఆరేళ్లు. మొదటి సినిమా ‘ఆగ్’ వచ్చి 75 ఏళ్లు. ఇవాళ్టికీ రష్యా వెళితే వినిపించే పాట ‘ఆవారా హూ’... చైనాలో పలికే భారతీయ నటుడి పేరు రాజ్ కపూర్. ‘ది గ్రేటెస్ట్ షో మేన్ ఆఫ్ ఇండియా’. మేరా జూతా హై జపానీ పంట్లూన్ ఇంగ్లిస్తానీ... కాని మనసు? ‘ఫిర్ భి దిల్ హై హిందూస్తానీ’. ఉత్సవంలా బతికి ఉత్సవంలా మరణించినవాడు రాజ్ కపూర్. ‘జీనా యహా.. మర్నా యహా’ సినిమాను ప్రేమించి పులకించినవాడు. అతనికి నివాళి. ఘన స్మరణ.
మే 2, 1988.
న్యూదిల్లీ సిరిఫోర్ట్ ఆడిటోరియమ్... జాతీయ పురస్కారాల ప్రదానం. హాలు కిక్కిరిసి ఉంది. ప్రభుత్వ, సినీ రంగ పెద్దలు ఆసీనులై ఉన్నారు. వేదిక మీద రాష్ట్రపతి ఒక్కొక్కరి పేరు పిలిచి పురస్కారాలు అందిస్తున్నారు. ‘ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార బహూకరణ. గ్రహీత– రాజ్ కపూర్’. ఆ పేరు వినగానే ఆడిటోరియం చప్పట్లతో దద్దరిల్లింది. అందరూ వేదిక మీదకు రాబోతున్న రాజ్ కపూర్ కోసం చూస్తున్నారు.
కాని ముందు వరుసలో ఉన్న రాజ్ కపూర్ కుర్చీలో నుంచి లేవలేకపోతున్నారు. కొన్ని నిముషాల ముందే ఆయనకు ఆస్తమా అటాక్ వచ్చింది. అలా రాకూడదని రెండు గంటల ముందు హోటల్‌లో ఇంజెక్షన్ చేసుకొని వచ్చారు. అయినా వచ్చింది. సభలో ఉన్నవారి ఎదురు చూపు. లేవలేని తన అశక్తత. మాట పెగలట్లేదు. కాని కళ్లు పని చేస్తున్నాయి. కళాకారుడి కళ్లు అవి.
‘నేను వేదిక మీదకు రాలేను రాష్ట్రపతి గారూ’... కళ్లతోనే మొర పెట్టుకున్నారు రాజ్ కపూర్. వేదిక మీద ఉన్న రాష్ట్రపతి కె.వెంకట్రామన్ ఆ కళ్లలోకి చూసి సంగతి గ్రహించారు. ప్రొటోకాల్ పట్టించుకోకుండా స్వయంగా తానే వేదిక దిగి రాజ్ కపూర్ వైపు కదిలారు. ఆయన వస్తుంటే శక్తినంతా కూడగట్టుకుని రాజ్‌కపూర్ లేచి నిలబడ్డారు. ‘దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం’ సగౌరవంగా ఆయనకు దక్కింది. రాష్ట్రపతిని స్జేజ్ మీద నుంచి కిందకు వచ్చేలా చేసిన సంఘటన మరొకటి లేదు. రాజ్ కపూర్ మాత్రం? అలాంటి వాడు మరొకడున్నాడా ఏమిటి?
1955.
జవహర్‌లాల్ నెహ్రూ ‘సోవియెట్ యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ రష్యా’ను ప్రధాని హోదాలో సందర్శించారు. ఇరు దేశాల మధ్య స్నేహం వెల్లివిరుస్తున్న సమయం. రష్యన్లను, స్థానిక భారతీయులను ఉద్దేశించి ఇరు దేశాల ప్రధానులు మాట్లాడే సభ. ముందు నెహ్రూ మాట్లాడి జనాన్ని ఉత్సాహ పరిచి కూచున్నారు. నెహ్రూ గొప్ప వక్త. రష్యా ప్రధాని నికొలాయ్ బల్గనిన్‌కు నెహ్రూని మించి సభను రక్తి కట్టించాలనిపించింది. తన మంత్రులకు సైగ చేశారు. వాళ్లంతా వచ్చి బల్గనిన్ ఇరు పక్కలా నిలుచున్నారు. నెహ్రూకు ఏం అర్థం కాలేదు. ఒక్కసారిగా రష్యా ప్రధాని, మంత్రులు పాట అందుకున్నారు.
ఆవారా హూ... ఆవారా హూ..
యా గర్దిష్ మే హూ ఆస్‌మాన్‌కా తారాహూ ఆవారాహూ...
జనం కేరింతలు. నెహ్రూ ఉన్న సభ అది. మార్మోగుతున్నది రాజ్ కపూర్ పేరు.
‘ఉదయాన్నే తెల్లబట్టలు వేసుకొని వెళ్లాలి. సాయంత్రానికి దుమ్ము కొట్టుకుపోయి రావాలి’ అని చెప్పాడు పృథ్వీరాజ్ కపూర్ తన పెద్ద కొడుకు రాజ్ కపూర్‌ని రంజిత్ స్టూడియోలో పనిలో పెట్టి. మెట్రిక్యులేషన్ తర్వాత ‘ఇక చదవను సినిమాల్లో పని చేస్తా’ అని రాజ్ కపూర్ కోరడంతో సినిమా తీయాలంటే అన్ని పనులు తెలియాలి అని స్టూడియో పనిలో పెట్టి పృథ్వీరాజ్ కపూర్ అన్న మాట అది.
అప్పటికే ప్రాభవంలో ఉన్న నటుడి కొడుకైనప్పటికీ రాజ్ కపూర్ ఒక ఆర్డినరీ క్లాప్ బాయ్‌లానే జీవితాన్ని మొదలుపెట్టాడు. రంజిత్ స్టూడియో, బాంబే టాకిస్, ఫిల్మ్‌స్థాన్... వీటన్నింటిలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి చివరకు తండ్రి దగ్గరే పృథ్వీ థియేటర్‌లో చేరితే పది రూపాయల జీతం, రెండు జతల బట్టలు, వానాకాలంలో ఉచితంగా వాడుకోవడానికి రైన్ కోట్, టోపీ దక్కాయి. రాజ్ కపూర్ అలా రాజ్ కపూర్ అయ్యాడు.
తెల్లబట్టలు నల్లగా పీలికలయ్యేంతగా కష్టపడ్డాడు. కష్టం చేసేవాడిని అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. ఈ నీలికళ్ల అందగాడిలో ఏదో ఉంది అని దర్శకుడు కేదార్ శర్మ రాజ్ కపూర్‌తో హీరోగా అతని మొదటి సినిమా ‘నీల్ కమల్’ తీశాడు. హీరోయిన్ పదమూడేళ్ల మధుబాల. ఆడలేదు. అయితే సినిమాల్లో ఫస్ట్ టేక్ ఓకే కాకపోతే రీటేక్ చేయొచ్చు. రీటేక్ కోసం మరింత కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. తెచ్చుకోనివాడు పోతాడు. రాజ్ కపూర్ పడి లేవడం తెలిసినవాడు.
రాజ్ కపూర్‌కు పెళ్లయ్యింది (1946). ఎవరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడకూడదని తానే ప్రొడ్యూసర్‌గా, డైరెక్టర్‌గా ‘ఆగ్’ (1947) తీశాడు. ఏంటి... మూతి మీద సరిగా మీసాలు కూడా రాని కుర్రాడు సినిమా తీయడమా.. ‘ఆగ్’ (మంట) అని టైటిలా? సీనియర్ డిస్ట్రిబ్యూటర్లకు ఒళ్లు మండింది. రాజ్ కపూర్ కనపడితే ‘ఏమయ్యా రాజ్. అన్నీ నువ్వే అయ్యి సినిమా తీస్తున్నావ్. సినిమా హాలు కూడా కట్టుకోరాదూ?’ అన్నారు. ‘హాలెందుకు?’ అనడిగాడు రాజ్ కపూర్. ‘ఎందుకేంటయ్యా. మంట అంటుకుంటే నీ హాలు బూడిదైతే చాలదా? మావన్నీ ఎందుకు?’ అన్నారు. హేళన అలా ఉంటుంది. ‘ఆగ్’ విడుదలైంది. ఓ మోస్తరుగా ఆడింది. నవ్వులు ఆగాయి. రాజ్‌కు తెలుసు... ఈ ప్రయత్నాలన్నీ అడ్డ పెడలు వేసి సైకిలు తొక్కడమేనని. సీటెక్కి తొక్కే సమయానికి తోటి కుర్రాళ్లు తోడవుతారని. అయ్యారు. కె.ఏ. అబ్బాస్ (రచయిత), శంకర్ జైకిషన్ (సంగీత దర్శకులు), ముకేష్ (గాయకుడు), శైలేంద్ర– హస్రత్ జైపూరి (గీత కర్తలు)... వీళ్ల తోడుగా రాజ్ కపూర్ మరో సినిమా తీశాడు. విడుదలైంది.
బర్సాత్ (1949).
భారీ హిట్. రాజ్ కపూర్ అట... నర్గిస్ అట... పదండి హాళ్లకు... కలుద్దాం వీళ్లను... థియేటర్లలో మంట అంటుకుంది... కలెక్షన్ల మంట... కాసుల మంట.... అగ్గితో కురిసే కుంభవృష్టి.
రాజ్‌కపూర్ టీమ్‌కు ఇద్దరు ముఖ్యమైన స్త్రీలు తోడయ్యారు. నర్గిస్, లతా మంగేష్కర్. ‘బర్సాత్’ లో నర్గిస్, రాజ్ కపూర్. ఒక దాని వెంట ఒకటిగా సినిమాలు చేశారు. ఆవారా, ఆహ్, శ్రీ 420, చోరి చోరి.... కేవలం వినోదం రాజ్ కపూర్ ఉద్దేశం కాదు. కథ ఉంటుంది. జనం తమ కథే అనుకునే కథ. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆనాటి రోజుల్లో అగమ్యంగా ఉన్న పేదవాళ్లు, ఎవరికీ పట్టని బీదలకు ప్రతినిధిగా కథానాయకుణ్ణి పెట్టి ‘ఆవారా’ తీశాడు. పని దొరక్క ఉపాధి కోసం వలసకు బయలుదేరి గ్రామీణ నిష్కల్మషం నుంచి నగర పతనాలకు ప్రయాణిస్తూ నైతిక ఘర్షణను ఎదుర్కుంటున్న యువకులకు ప్రతినిధిగా హీరోని పెట్టి ‘శ్రీ420’ తీశాడు.
చార్లి చాప్లిన్‌ను పోలిన ఆహార్యం, చలాకీతనం, అమాయకత్వం.. తోడుగా వ్యక్తిత్వం ఉన్న పాత్రల్లో నర్గిస్... ఆ జంట పండింది. క్లాసిక్స్ అందరూ తీస్తారు. కాని కొందరు వాటితో అందరినీ తాకుతారు. సాంస్కృతిక ఆదాన ప్రదానాలలో భాగంగా రష్యాలో సినిమాల విడుదలకు మన దేశం అనుమతించింది. వాటిలో ప్రధానమైనవి రెండు: ‘దో భిగా జమీన్’ (బిమల్ రాయ్ – 1953), ఆవారా (1951). మాస్కోలో మన ప్రభుత్వం పూనికతో ‘దో భిగా జమీన్’ పోస్టర్లు ఎక్కువ పడ్డాయి. ఎందుకంటే రష్యన్లు అలాంటి సినిమాలను మెచ్చుతారని. ఒక్కరోజు. రష్యన్లు దో భిగా జమీన్, ఆవారా రెండూ చూశారు. రాత్రికి రాత్రి అంతా మారిపోయింది. మాస్కో అంతా ఎక్కడ చూసినా ఆవారా పోస్టర్లే. 4 రోజుల్లో 15 లక్షల మంది మూడు నగరాల్లో చూశారు. అదీ రాజ్‌కపూర్.
రాజ్ కపూర్ ఏది చేసినా పెద్దగా ఆలోచించి చేసేవాడు. అతడు సన్నివేశాన్ని ముందు సంగీతంతో ఊహిస్తాడని అంటారు. సంగీతం ఇలా ఉంటే సన్నివేశం అలా తీయొచ్చు అనుకుంటాడట. ‘ఆవారా’లో డ్రీమ్ సీక్వెన్సు, ‘శ్రీ 420’లో ‘΄్యార్ హువా ఇక్‌రార్ హువా’ పాటకు వేసిన సెట్.. సినిమా అంటే విజువల్స్... మ్యూజిక్.... ఇవి రెండు బెస్ట్‌గా ఉంటే సినిమా హిట్. ‘సంగం’కు ఇంకో ఆకర్షణ అమర్చాడు– లొకేషన్స్. విదేశీ లొకేషన్లలో తీసిన మొదటి హిందీ సినిమా అది. భారీ హిట్. ఆ తర్వాతి రోజుల్లో యశ్ చోప్రా ఫార్ములాను స్థిరపరిచాడు.
రాజ్‌కపూర్ గొప్పగా కలగని... కాలం కంటే ముందుకెళ్లి రెండు ఇంటర్వెల్స్‌తో తీసిన ‘మేరా నామ్ జోకర్’ దెబ్బ కొట్టింది. ఇప్పుడు క్లాసిక్‌గా నిలిచింది. ఆ సినిమాలో మూడు ఎపిసోడ్స్ ఉంటాయి. కౌమార స్థితిలోని రిషి కపూర్, అతని టీచర్‌గా సిమి గెరెవాల్... వీరి ఎపిసోడ్ ఫ్రెంచ్ సినిమాకు తగ్గదని విమర్శకులు మెచ్చుకున్నారు. ఆ ఎపిసోడ్‌ను కొనసాగిస్తూ, ‘మేరా నామ్ జోకర్’ను ఫ్లాప్ చేసినందుకు ప్రేక్షకుల మీద ప్రతీకారం తీర్చుకుంటూ రాజ్ కపూర్ తీసిన సినిమాయే ‘బాబీ’. ఈ టీనేజ్ లవ్ స్టోరీ నేటికీ వందల భారతీయ సినిమాలకు కథను అందిస్తూనే ఉంది.
రాజ్ కపూర్ ప్రకృతిలోని, మగాడిలోని, స్త్రీలోని స్త్రీత్వాన్ని గొప్పగా పట్టించుకున్న దర్శకుడు. స్త్రీ పురుషుల భావోద్వేగాలను, వీటిని ప్రేరేపించే లేదా నియంత్రించే సాంఘిక పరిమితులు, నియంత్రణలు... వీటినే అతడు ఎక్కువగా కథాంశాలు తీశాడు. అయితే మార్పు గురించి తన తాపత్రయం ఒదులుకోలేదు. ‘జాగ్తే రహో’, ‘బూట్ పాలిష్’, ‘జిస్ దేశ్ మే గంగా బెహతీ హై’, ‘దిల్లీ దూర్ నహీ’, ‘సత్యం శివమ్ సుందరం’, ‘ఈ దేశంలో బీదవాళ్లు ఎక్కువ. వారు బాగు పడితే దేశం బాగు పడినట్టే’ అని రాజ్ కపూర్ అంటారు.
ఉజ్వలమైన కాలాన్ని చరిత్రలో నుంచి తుడిచి పెట్టడం అసాధ్యం. జనులు మెచ్చిన కళాకారుణ్ణి సాంస్కృతిక పుటల్లో నుంచి చెరిపివేయడం దుస్సాధ్యం. దేవ్ ఆనంద్, దిలీప్ కుమార్ అతని సరిజోడిగా గొప్ప ప్రతిభ చాటారు. కాని రాజ్ కపూర్ సినిమానే తన జీవితం చేసుకున్నాడు. సినిమా నుంచి పొందాడు. సినిమాకు ఇచ్చాడు. నటుడుగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, గొప్ప సంగీత సాహిత్యాలకు వారధిగా... దేదీప్యంగా నిలిచిన స్ఫూర్తిగా... ఇలా మరొకరు లేరు.
అందుకే రాజ్ కపూర్ శత జయంతి ముగింపును దేశమంతా సగౌరవంగా జరుపుకుంటోంది.
రాజ్ కపూర్‌ను గుర్తు చేసుకోవడం ద్వారా తన సినీ సౌందర్యాన్నీ, సినీ రసాత్మకతను గుర్తు చేసుకుంటోంది. ఒక పూట వెచ్చించి రాజ్ కపూర్ సినిమాలు చూసినా, పాటలు విన్నా జీవిత కాలం అంటిపెట్టుకొని పోయే ప్రియమైన కళాకారుడతడు. మళ్లీ మళ్లీ పుట్టడు. అతని కాలంలో మనం ఉన్నాం. అతని శత జయంతి ముగింపులోనూ ఉన్నాం. ఎంత సంతోషం. ఈ ఘనత కొనసాగాలి. ది షో మస్ట్ గో ఆన్.
జీనా యహా మర్నా యహా
ఇస్‌కే సివా జనా కహా.
Comments
Please login to add a commentAdd a comment