Maya Bazar
-
అప్పుడు క్లాసిక్స్‌కు రంగులద్దాడు.. ఇప్పుడు మెగాఫోన్ పట్టాడు!
తెలుగు సినీ చరిత్రలో అద్భుత కళాఖండంగా నిలిచిన చిత్రం ‘మాయాబజార్’. కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో(1957) బ్లాక్ అండ్ వైట్‌లో విడుదలై సంచలనం సృష్టించింది. 2010లో ఈ చిత్రానికి రంగులద్ది కలర్లో రీరిలీజ్ చేస్తే భారీ స్పందన లభించింది. అయితే ఈ అద్భుత కళాఖండాన్ని కలర్ లోకి మార్చడానికి ఓ ప్రముఖ వ్యక్తి చాలా కష్టపడ్డాడు. అతనే జగన్మోహన్. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వందల నలుపు తెలుపు సినిమాలని రంగుల సినిమాలుగా మార్చిన జగన్మోహన్.. ఇప్పుడు మెగా ఫోన్ పట్టనున్నాడు. టెంపుల్ మీడియా సంస్థ ద్వారా చిత్ర రచయితా, దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. డిసెంబర్ 29న వీరి దర్శకత్వంలో నిర్మించబడుతున్న చిత్రం ముహూర్తం పూజా కార్యక్రమంతో ఆరంభమయింది. శ్రీ యతీష్, నందిని నిర్మించే ఈ చిత్రం షెడ్యూల్, మిగిలిన విషయాలు త్వరలో తెలియజేయ నున్నారు. -
ఎన్టిఆర్ శతజయంతి: పదే పదే తలచు తెలుగుజాతి
ఒక్క బాణాన్ని సంధించి ఏడు తాటిచెట్లను కూల్చిన శ్రీరామచంద్రుణ్ణి విని ఉంది తెలుగుజాతి. నూరు తప్పులను కాచి సుదర్శనాన్ని విడిచి శిశుపాలుని వధించిన కృష్ణలీల తెలుసు తెలుగుజాతికి. ఉగ్రరూపం దాల్చి రుద్ర తాండవమాడిన శివుడి జటాజూటాలు ఎలా ఉంటాయో ఊహకే పరిమితమాయె. పది శిరస్సుల రావణుడి రుధిర నేత్రాల తీక్షణత– చూడతరమా! గాండీవం చేబూనిన పార్థుడు– గదాధారి భీముడు– పంచభర్తృకకు తొడను చూపి ఆసీనురాలు కమ్మని సైగ చేసిన సుయోధనుడు... వినీ వినీ ఉన్నారు. అప్సరసలు కూడా వివశులయ్యే అందాల రాకుమారుడు– రాకుమారిని తెగించి వరించే తోట రాముడు– అష్టదిగ్గజాలతో పదములల్లే దేవరాయడు– పల్నాట బ్రహ్మనాయుడు... పొరుగునే పాండురంగడు... విన్నారయ్యా విన్నారు.. చూసేదెప్పుడు? వారి ఎదురుచూపు ఫలించింది. తెలుగు తెర వరము పొంది మురిపాల నటుడిని ప్రసవించింది. ఇదిగో ఇతడే నందమూరి తారక రామారావు అని పోస్టర్లేసి ప్రకటించింది. తదాదిగా తెలుగుజాతికి వినే బాధ తప్పింది. వారు ప్రతి పురాణాన్ని చూశారు. ప్రతి వేల్పును తిలకించారు. ప్రతి కథకు పరవశించారు. మరో వెయ్యేళ్లు ఈ అపురూపాన్ని దర్శిస్తారు. తెలుగు తెరకే ఇది సొంతం. తెలుగు నేలదే ఈ భాగ్యం. నేడు ఎన్టిఆర్ శతజయంతి వేడుకల ప్రారంభం సందర్భంగా ప్రత్యేక కథనం. విజయా స్టూడియో అధినేత నాగిరెడ్డి దగ్గరకు ఆ స్టూడియోలో జీతానికి పని చేసే ఆర్టిస్టులు ధైర్యంగా వచ్చి మాట్లాడరు. కాని నెలకు 500 రూపాయల జీతం, సినిమాకు ఐదు వేల రూపాయల పారితోషికం కాంట్రాక్టు మీద కొలువుకు చేరిన కొత్త నటుడు ఎన్.టి. రామారావు ఆ రోజు ఆయన దగ్గరకు వచ్చి నిలుచున్నారు. ‘ఏంటి రామారావ్’ అన్నారు నాగిరెడ్డి. ‘సార్.. క్యాంటిన్లో మీరు నాకు ఇవ్వమని అలాట్ చేసిన టిఫిన్ సరిపోవడం లేదు. పెంచాలి’. నాగిరెడ్డి ఒక్క క్షణం సర్దుకున్నారు. సాధారణంగా ఆ స్టూడియోలో ఆర్టిస్టులకు ఇంత టిఫిన్, టెక్నిషియన్లకు ఇంత టిఫిన్ అని నిర్దేశించారు. ఎన్.టి. రామారావుకు కూడా అంతే ఇస్తున్నారు. ఒడ్డు పొడవు ఉండి, రోజూ కసరత్తు చేస్తూ, రాళ్లు తిని కూడా అరాయించుకునే ఆరోగ్యంతో ఉన్న రామారావు గురించి చిన్న ఏమరపాటు జరిగిందని ఆయనకు అర్థమైంది. వెంటనే క్యాంటిన్‌కు కొత్త ఆదేశాలు వెళ్లాయి. ఆ రోజు ఆకలి గురించి కొట్లాడిన ఎన్.టి. రామారావు ఆ తర్వాత తెలుగువారి తొలి సినిమా రంగ ముఖ్యమంత్రి అయ్యి ఆకలిగొన్న వారందరికీ కిలో రెండు రూపాయల బియ్యం ఇవ్వడం చరిత్ర. ‘మాయాబజార్’ తర్వాత ఎన్.టి. రామారావుతో ‘లవకుశ’ తీయాలని నిశ్చయించుకున్నారు నాగిరెడ్డి, చక్రపాణి. దర్శకుడు బి.ఎన్. రెడ్డి. అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చారు. బి.ఎన్. రెడ్డి అంటే ‘మల్లీశ్వరి’ తీసి సినిమాకు ‘కళాఖండం’ అని ఉపమానం ఇచ్చినవారు. బి.ఎన్. రెడ్డి, రచయిత పాలగుమ్మి పద్మరాజు బెంగళూరు వెళ్లి 20 రోజులు ఉండి ఒక వరుస కథ రాసుకొని వచ్చారు ‘లవకుశ’ కోసం. చక్రపాణిని కూచోబెట్టి బి.ఎన్. నెరేషన్ ఇస్తున్నారు. ‘సీత శోకంలో ఉంది. రాముడి వీపు మాత్రమే కనిపిస్తూ ఉంది. తనను అడవులపాలు చేసినందుకు సీత రాముణ్ణి నిందిస్తూ ఉంది. రెండో సీను... రాముడి వీపునే చూపిస్తూ సీత శోకం. మూడో సీను..’ చక్రపాణి లేచి నిలబడ్డారు. ‘అందమైన ఎన్.టి. రామారావును పెట్టుకుని వీపు చూపిస్తూ రెండు సీన్లా. ఈ సినిమా ఆడినట్టే’ స్క్రిప్ట్ మూల పడేశారు. ఎన్.టి. రామారావు సినిమాలో ఉంటే మొదటి సీను నుంచి చివరి సీను వరకూ చూసుకోవడమే ప్రేక్షకుల పని. ఆ తర్వాత కొన్నేళ్లకు సి. పుల్లయ్య దర్శకత్వంలో ‘లవకుశ’ వచ్చింది. సీత శోకం చూడాలా రాముడి ఆవేదన చూడాలా... పల్లె జనాలు ఎడ్లబండ్లు వేసుకొని వచ్చి చెట్ల కింద పడుకుని సినిమా చూసి వెళ్లేవారు. 500 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా అది. రాముడి గొప్పతనమో... తారక రాముని నటనావైదుష్యమో. ‘బేడకు సినిమా’ అనేవారు ఆ రోజుల్లో. అంటే రెండు అణాలకు సినిమా. ఆ రెండు అణాలు ఇచ్చి సినిమా చూడటానికి కూడా జనం దగ్గర డబ్బులు ఉండేవి కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్త. అప్పటికి పదేళ్లకు కాస్త అటు ఇటుగా తెలుగు సినిమాలు మొదలయ్యాయి. మద్రాసుకు కళాకారులు చేరుకున్నారు. ‘ఆర్టిస్టు’ను గుర్తు పట్టి సినిమాలు చూడటం అనేది సీనియర్ శ్రీరంజని (జూ. శ్రీరంజని అక్క)తో మొదలయ్యింది. నాటకాల్లో మాదిరే ‘పాడి నటించేవారికి’ డిమాండ్ కనుక చిత్తూరు నాగయ్య, బళ్లారి రాఘవ, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు సింగింగ్ స్టార్స్ అయ్యారు. బెరుకు లేకుండా స్లీవ్‌లెస్ జాకెట్ వేసిన కాంచన మాల, భానుమతి క్యాలెండర్ స్టార్లుగా వెలిగారు. సీహెచ్ నారాయణరావు సుకుమార సౌందర్యం గల తొలి తెలుగు హీరో. అప్పుడు అక్కినేని రంగప్రవేశం చేసి ‘బాలరాజు’తో జాక్‌పాట్ కొట్టారు. కాని భారతీయ ఆత్మను, ఇతిహాసాన్ని, పౌరాణిక ఘనతను, చారిత్రక ఘటనలను, భక్తి ఉద్యమాలను, జానపద సంపదను, సాంఘిక జీవనాన్ని, కార్మిక కర్షకుల ప్రాతినిధ్యాన్ని, కుటుంబ భావోద్వేగాలను చూపే ఒక నాయకుడు, ఆ నాయకుడి చరిష్మా అవసరమయ్యింది. అది ఎన్.టి. రామారావు రూపంలో సంభవించింది. ఎంటైర్ సౌత్‌లో ఎం.జి.ఆర్, శివాజీ గణేశన్, రాజ్ కుమార్, ప్రేమ్ నజీర్... వీరందరూ గొప్ప జనాకర్షణ కలిగిన సినీ నాయకులే అయినా ఎన్.టి.ఆర్ చేసినవన్నీ చేయలేదు. ఎన్.టి.ఆర్ చేసినంత చేయలేదు. ఉత్తరాదిన ముగ్గురు సూపర్స్టార్లలో రాజ్‌కపూర్, దేవ్ ఆనంద్ ప్రధానంగా మెట్రో మనుషుల రిప్రెజెంటేటివ్స్. దిలీప్ కుమార్ మాత్రమే ఫోక్లోర్, హిస్టారికల్ (మొఘల్ ఏ ఆజమ్) చేశాడు. కాని మైథాలజీ వీరి ముగ్గురి పరిధిలో లేదు. రాజ్ కపూర్ దర్శకుడుగా గొప్పవాడు. సుదీర్ఘమైన సినిమా ‘మేరా నామ్ జోకర్’ (4 గంటల 13 నిమిషాలు) తీశాడు. దాని ఫలితం నిరాశ కలిగించింది. ఎన్.టి.ఆర్ కూడా దర్శకుడిగా సుదీర్ఘమైన సినిమా ‘దాన వీర శూర కర్ణ’ (4 గంటల 8 నిమిషాలు) తీశారు. 43 రోజుల్లో తీసిన ఈ సినిమా కలెక్షన్లలో వీర సినిమా. రికార్డులలో శూర సినిమా. పిల్లలకు నచ్చాలి ఫస్ట్. జేమ్స్‌బాండ్ సినిమాలు ఎందుకు నిలుస్తాయంటే, సూపర్‌మేన్, స్పైడర్‌మేన్ వంటి సూపర్ హీరోలు ఇన్నేళ్లయినా ఎందుకు ఉన్నారంటే వాళ్లు పిల్లలకు నచ్చుతారు. తమకు నచ్చినవారిని పిల్లలు పెద్దయినా వృద్ధులైపోయినా అభిమానిస్తూనే ఉంటారు. ‘పాతాళభైరవి’ అక్కినేనితో తీయాలా, ఎన్.టి.ఆర్తో తీయాలా అనే సందేహం వచ్చింది విజయా వారికి. కె.వి. రెడ్డి మనసు అక్కినేని మీద ఉంది. నాగిరెడ్డి–చక్రపాణి ఎంపిక ఎన్.టి.ఆర్ మీద ఉంది. నీ మాట వద్దు నా మాట వద్దు అని మరో నటుణ్ణి వెతుకుదాం అని కూడా అనుకున్నారు (తుపాకుల రాజారెడ్డి అనే నటుడితో రెండు రీళ్లు తీశారని ఒక కథనం). చివరకు ఒకరోజు అక్కినేని, ఎన్.టి.ఆర్ స్టూడియో కోర్టులో టెన్నిస్ ఆడుతూ ఉంటే ఎన్.టి.ఆర్ బంతిని బాదుతున్న స్టయిల్, క్రీడాగ్రహం చూసి ‘ఇతనే కరెక్ట్’ అనుకున్నారు కె.వి. రెడ్డి. అలా తోట రాముడుగా ఎన్.టి.ఆర్ సాహసం చేశారు. ప్రేమ కోసం వలలో పడ్డారు. నేపాళ మాంత్రికుడి తల నరికి పాతాళ భైరవి కరుణతో పాటు ప్రేక్షకుల కాసులు పొందారు. ఇది పెద్దలతో పాటు పిల్లలకు నచ్చింది. వారికి ఒక హీరో దొరికాడు. ఆ తర్వాత ఈ పిల్లలే ‘మాయాబజార్’ చూశారు. ఊరికే అలా చేతిని గాలిలో కదిపి అందరినీ తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్న కృష్ణుడు. మహా బలసంపన్నుడైన ఘటోత్కచుడే ముసలి వేషంలో ఉన్న కృష్ణుడి రెక్క పట్టుకు లేపలేకపోతాడు. ఆ కృష్ణబలం ఎన్.టి.ఆర్‌దే. ఇక ఆ పిల్లలు ఎన్.టి.ఆర్ని వదల్లేదు. ఎన్.టి.ఆర్ కూడా చందమామ పత్రికలో కనిపించే జానపదాలు, భట్టి విక్రమార్క కథలు, భక్తుల కథలు, వ్రత కథలు, అరేబియన్ నైట్స్ చేస్తూనే వెళ్లారు. గులే బకావళి కథ, ఆలీబాబా నలభై దొంగలు, బాగ్దాద్ గజదొంగ... అరేబియన్ నైట్స్ ఆధారితాలే. తెలుగు పిల్లల బ్రూస్లీ ఎన్టీఆరే (యుగ పురుషుడు). సూపర్‌మేన్ ఆయనే (సూపర్ మేన్). టార్జాన్ ఆయనే (రాజపుత్ర రహస్యం). ఎల్విస్ ప్రెస్లీ ఆయనే (ఆటగాడు). ఒక కళాకారుడికి ఎంతో నిర్మలత్వం, అమాయకత్వం ఉంటే తప్ప ఇలాంటి పాత్రలు చేయడు. ఎన్.టి.ఆర్ చేశారు. ఆ నిర్మలత్వమే పిల్లలకు నచ్చుతుంది. అందుకే పిల్లల వినోద సామ్రాజ్యానికి అధిపతి ఎన్.టి.ఆర్. ఎన్.టి.ఆర్కు ద్రవిడ స్పృహ ఉంది. ప్రాంతీయ చైతన్యం ఉంది. ‘టెక్ట్స్’ను పరుల కంటితో కాక స్వీయ దృష్టితో అర్థం చేసుకునే జ్ఞానం ఉంది. జనంకు ఏదైనా చెప్పడానికే ఆయన ‘నేషనల్ ఆర్ట్స్ థియేటర్’ అనే నాటక సంస్థను బెజవాడలో స్థాపించారు. నిర్మాతగా మారాక కూడా ‘తోడు దొంగలు’ వంటి సందేశాత్మక సినిమాయే తీశారు. ‘పాతాళ భైరవి’, ‘మల్లీశ్వరి’ వంటి సూపర్‌హిట్స్ ఇచ్చిన హీరో ఆ వెంటనే ‘రాజూ పేద’లో కన్న కొడుకును అడుక్కు రమ్మని పంపే పోలిగాడి పాత్రను చేస్తాడా? ‘డ్రైవర్ రాముడు’ వంటి మాస్ హిట్ ఇచ్చి ఆ వెంటనే భార్య లేచిపోయిన భర్తగా ‘మావారి మంచితనం’లో నటిస్తాడా? ఆయన ప్రయోగశీలి. అందుకే ‘హీరోగా చేయడానికి’ ఏమీ లేకపోయినా తెలుగువారి రెండు విశిష్ట నాటకాలు ‘కన్యాశుల్కం’, ‘చింతామణి’లో ఆయన నటించాడు. తన పేరు మీద టైటిల్ లేకపోయినా ‘తెనాలి రామకృష్ణ’, ‘మహామంత్రి తిమ్మరుసు’ లో శ్రీ కృష్ణ దేవరాయలుగా నటించాడు. అలాగే ఆయనకు పురాణాలను దర్శించే పద్ధతి వేరేగా ఉండేది. ‘రావణుని పాత్రను చేస్తాను... డైరెక్ట్ చేయండి’ అని కె.వి. రెడ్డి దగ్గరకు వెళితే ‘కృష్ణుడిగా చూపించిన నేను రావణుడిగా చూపించలేను. జనం చూడరు’ అన్నారు. కాని ఎన్.టి.ఆర్ ‘సీతారామ కల్యాణం’ లో రావణుడి పాత్ర వేసి మెప్పించి, ఘన విజయం సాధించారు. తెలుగువారు ‘దుష్ట చతుష్టయం’గా చెప్పుకునే వారిలో ఇద్దరు గూర్చిన దృష్టిని సమూలంగా మార్చాడాయన. భారతంలో దుర్యోధనుడి పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంది అని పదేపదే చెప్పారు. ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన రావి కొండలరావుతో ఎన్.టి.ఆర్ ‘బ్రదర్... దుర్యోధనుడికి డ్యూయెట్ పెడతారా ఎవరైనా’ అని అడిగారు. రావి కొండలరావుకు ఈ ప్రశ్న నేపథ్యం ఏ మాత్రం తెలియదు. ఆయన రామారావును మెప్పిద్దామని ‘ఎవడు పెడతాడు సార్ బుద్ధి లేకపోతే గాని’ అన్నాడు. ‘మేం పెడుతున్నాం బ్రదర్ దాన వీర శూర కర్ణలో’ అన్నారు ఎన్.టి.ఆర్ ఆ తర్వాత కొన్ని రోజుల పాటు రావి కొండలరావు ఎన్టీఆర్ ఎదుట పడితే ఒట్టు. ఎన్.టి.ఆర్ దుర్యోధనునికి డ్యూయెట్ పెట్టి ‘చిత్రం... భళారే విచిత్రం’ అనిపించారు. ఇక ఎన్.టి.ఆర్కు కర్ణుడి మీద సానుభూతి దృష్టి రావడానికి తమిళ ‘కర్ణన్’ కారణం. శివాజీ తమిళంలో చేసిన ‘కర్ణన్’ కర్ణుడు ఎంత గొప్పవాడో వర్ణదృష్టితో చెబుతుంది. ఆ సినిమాలో కృష్ణుడిగా నటించిన ఎన్టీఆర్‌కు ఇది నచ్చింది. ఆ సినిమాకు మాటలు రాసింది శక్తి కృష్ణసామి. ఈ రచయితే ‘వీరపాండ్య కట్టబొమ్మన్’కు మాటలు రాసి తమిళంలో ఉధృత డైలాగ్ ఒరవడిని సృష్టించాడు. ఆ స్థాయిలో డైలాగ్స్ ఉండాలని కొండవీటి వెంకటకవిని ఒప్పించి రాయించారు ఎన్.టి.ఆర్. అసలు దానవీర శూర కర్ణ ఒక రకంగా శబ్ద చిత్రం. కేవలం మాటలు విన్నా చాలు. ఆ మాటలు ఒక్క ఎన్.టి.ఆరే చెప్పగలరు. హితుడా... ఆగాగు ఏమంటివి ఏమంటివి... నటుడికి ధారణశక్తి, ఉచ్ఛారణ శక్తి, వాచక ఔన్నత్యం ఉండాలి. ఏ కాలంలో అయినా నటుడు అనే వాడికి ఎన్.టి.ఆర్ వదిలి వెళ్లిన సిలబస్, పరీక్ష పేపర్ ఈ డైలాగ్. ప్రదర్శించడం మాత్రమే కళ కాదు. కొనసాగడమే కళ. అంటే కొనసాగేందుకు ఎప్పటికప్పుడు సృజన సామర్థ్యాలను కల్పించుకోవడమే కళ. తెలుగు నాట ఎన్.టి.ఆర్, అక్కినేని... ఇద్దరూ సుదీర్ఘంగా కొనసాగేందుకు కంకణబద్ధులై ఎప్పటికప్పుడు తమను తాము తీర్చిదిద్దుకుంటూ వెళ్లారు. ఎన్.టి.ఆర్కు ‘పాతాళభైరవి’లాగా అక్కినేనికి ‘దేవదాసు’ ఒక పెద్ద మైలురాయిగా మారింది. మిడిల్ క్లాస్, ఎలైట్ సెక్షన్స్‌తో పాటు మహిళా ప్రేక్షకుల బలంతో అక్కినేని కొనసాగితే ఆబాల గోపాలాన్ని మెస్మరైజ్ చేస్తూ ఎన్.టి.ఆర్ కొనసాగారు. తమాషా ఏమిటంటే ‘దొంగ రాముడు’, ‘భలే రాముడు’, ‘అందాల రాముడు’ అక్కినేని చేసినా ‘రాముడు’ టైటిల్‌కు పేటెంట్ ఎన్.టి.ఆర్ పరమే అయ్యింది. అక్కినేని ‘అనార్కలి’ చేస్తే ఎన్.టి.ఆర్ ‘అక్బర్ సలీంఅనార్కలి’ చేశారు. అక్కినేని క్షేత్రయ్య చేస్తే ఎన్.టి.ఆర్ వేములవాడ భీమకవి చేశారు. అక్కినేని మహాకవి కాళిదాసు. ఎన్.టి.ఆర్ శ్రీనాథ కవిసార్వభౌమ. ఈ సన్నిహితాలకు సామీప్యాలకు అంతే లేదు. కాని వీరిరువురూ కలిసి నటించిన సినిమాలలో ‘మిస్సమ్మ, మాయాబజార్’ చిన్న రసాలు.. పెద్ద రసాలు. నిజం చెప్పాలంటే ఎన్.టి.ఆర్కు కె.వి. రెడ్డి తర్వాత గట్టి దర్శకుల బలం లేదు. అక్కినేనికి ముందు నుంచి భరణి రామకృష్ణ, ఆదుర్తి సుబ్బారావు, విక్టరీ మధుసూదనరావు, వి.బి. రాజేంద్ర ప్రసాద్ తదితరులు కొనసాగారు. తర్వాతి తరం కృష్ణ, శోభన్‌బాబు వచ్చాక కొత్త దర్శకులు వీరితో సినిమాలు చేయసాగారు. అయినా సరే ఎన్.టి.ఆర్ తన దారిన తాను ప్రయోగాలు చేస్తూనే వెళ్లారు. బాలీవుడ్లో స్టార్ల సినిమాలకు తెలుగులో ఎన్.టి.ఆరే సూట్ అయ్యారు. అమితాబ్ ‘జంజీర్’– ‘నిప్పులాంటి మనిషి’గా, ‘డాన్’ – ‘యుగంధర్’గా, రాజేష్ ఖన్నా ‘రోటి’– ‘నేరం నాది కాదు ఆకలిది’గా, ధర్మేంద్ర ‘యాదోంకి బారాత్’– ‘అన్నదమ్ముల అనుబంధం’గా ఆయన నటించారు. 39 ఏట ‘భీష్మ’లో, 49 ఏట ‘బడి పంతులు’ లో పూర్తి వృద్ధ పాత్రల్లో చేయడం ఆయనకే చెల్లింది. కృష్ణ, రజనీకాంత్, చిరంజీవిలతో మల్టీస్టారర్స్ చేశారు. కాని దాసరి రావడంతో అక్కినేనికి బలం దొరికినట్టు కె. రాఘవేంద్రరావు రావడంతో ఎన్.టి.ఆర్కు బలం దొరికింది. కె. రాఘవేంద్రరావు ఎన్.టి.ఆర్‌ను ఒక దర్శకుడిగా కాక ఒక అభిమానిగా డైరెక్ట్ చేశారు. అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపిస్తూ తీసిన ‘అడవి రాముడు’ సినిమా సగటు ప్రేక్షకుడికి ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండాలో చూపింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ‘వేటగాడు’, ‘గజదొంగ’, ‘డ్రైవర్ రాముడు’, ‘కొండవీటి సింహం’, ‘జస్టిస్ చౌదరి’ వంటి భారీ హిట్స్ ఇవ్వడం ఎన్.టి.ఆర్‌ను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్‌కు చేర్చింది. అదే సమయంలో దాసరి ‘సర్దార్ పాపారాయుడు’, ‘బొబ్బిలిపులి’ తీసి ఎన్.టి.ఆర్ కెరీర్‌ని పతాక స్థితికి తీసుకెళ్లారు. ఇక సినిమాల్లో చేయాల్సింది ఏమీ మిగల్లేదు అని అనిపించే స్థితి. ఎన్.టి.ఆర్ జనం గురించి ఆలోచించిన సమయం. ఆయన రాజకీయ ప్రవేశంతో తెలుగు తెర పగటి తీక్షణతను, రాత్రి వెన్నెలను ఒక మేరకు కోల్పోయింది. కాని మహా నటులకు కూడా పరాజయాలు ఉంటాయి. వాటిని దాటి రావడమే కళాకారులు చేయవలసిన పని అని ఎన్.టి.ఆర్ కెరీర్ చూసినా అర్థమవుతుంది. ఎన్.టి.ఆర్ నటించిన ‘చంద్రహారం’, ‘కాడెద్దులు – ఎకరం నేల’, ‘చిన్ననాటి స్నేహితులు’, ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’, ‘పల్లెటూరి చిన్నోడు’, ‘అమ్మాయి పెళ్లి’, ‘అక్బర్ సలీం అనార్కలి’, ‘సతీ సావిత్రి’, ‘శ్రీరామ పట్టాభిషేకం’, ‘రాజపుత్ర రహస్యం’, ‘సామ్రాట్ అశోక’, ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ వంటి భారీ అపజయాలు ఉన్నాయి. కాని ఈ అపజయాలు చూసిన ఎన్.టి.ఆర్ సినిమా కథ గ్రామర్‌లో ఇమడని ‘బ్రహ్మంగారి చరిత్ర’ను సినిమాగా తీసి సూపర్‌హిట్ సాధించడం మరచిపోరాదు. ‘నర్తనశాల’ లో బృహన్నలగా వేసి మెప్పించడమూ సామాన్యం కాదు. అయితే ఎన్.టి.ఆర్‌లోని నిజమైన ఆర్టిస్టును పట్టుకున్న సినిమాలు ఆయనకు దొరికినట్టేనా? ఆయన తనలోని నటుడిని పరిపూర్ణంగా ప్రదర్శించగలిగాడా? చెప్పలేము. కమర్షియల్ సినిమా ఆయన ప్రతిభకు పరిమితులు విధించిందనే చెప్పాలి. ఎన్.టి.ఆర్ చూడగానే సంతోషం వేసే నటుడు. ఆయన రిక్షా వెనుక బొమ్మగా ఉన్నాడు. పూజగదిలో దేవుని క్యాలెండర్‌గా కూడా ఉన్నాడు. దశాబ్దాల పాటు కోట్లాది మంది కష్టాలను కొన్ని గంటల పాటు మరిపించగలిగాడాయన. ఆయన పేరును తెలుగుజాతి పదే పదే తలుస్తుంది. గౌరవంతో కొలుస్తుంది. ఎన్.టి.ఆర్ అమరుడు. -
తెలుగు క్లాసిక్స్: విజయా వారి వేసవి
పిల్లలకు సెలవులు. ఈసారి ‘విజయా’ వారి వేసవి చూపించండి. అంటే? విజయ సంస్థ తీసిన సినిమాలు చూపించడమే. ఉపాయంతో మాంత్రికుణ్ణి హతమార్చే తోటరాముణ్ణి ‘పాతాళ భైరవి’లో, రాజ్యం లేకపోయినా శౌర్యానికి ఢోకా ఉండకూడదని చెప్పే అభిమన్యుడిని ‘మాయాబజార్’లో, లౌక్యం ఉంటే పనులు సాధ్యమవుతాయని చూపే ఎంటి.రావు, మేరీలను ‘మిస్సమ్మ’లో, గట్టిగా సంకల్పిస్తే ఏ కోరికైనా నెరవేర్చుకోవచ్చనే రాకుమారుడు ప్రతాప్‌ను ‘జగదేక వీరుని కథ’లో పరిచయం చేయడమే. పిల్లలకు ఈ సినిమాలు వినోదం మాత్రమే ఇవ్వవు... జీవన సూత్రాలను చెబుతాయి. తెలుగు మాట, పలుకు నేర్పుతాయి. ఇంకేటి... టివి ముందు కూచోబెట్టండి. ‘సాహసం సేయరా ఢింబకా’ అంటాడు నేపాళ మాంత్రికుడు ‘పాతాళ భైరవి’లో. సాహసం చేయకుండా ఉట్టినే కూచోడానికి కాదు పుట్టింది. చదువులోనో, ఉద్యోగంలోనో, బతుకులోనో ఏదో ఒక సందర్భంలో సాహసం చేయాలి. అప్పుడే విజయం వరిస్తుంది. రాకుమారి కూడా. కాని సాహసం చేసే దారిలో ఎన్నో అడ్డంకులుంటాయి. మనల్ని కాటేసే పాములుంటాయి. వాటి తల అణచాలి. ‘దేవికి సాష్టాంగ దండ ప్రమాణం సేయరా’ అంటాడు మాంత్రికుడు రాకుమారుడితో. సాష్టాంగపడితే తల నరకాలని అతడి దుష్టపన్నాగం. కాని దేవి సలహా వల్ల రాకుమారుడు ఆ మాంత్రికుణ్ణే సాష్టాంగపడటం ఎలాగో చూపమని చెప్పి అదే అదనుగా ఆ దుర్మార్గుడి తల నరుకుతాడు. ఇదంతా పిల్లలకు పాఠమే. ‘పాతాళ భైరవి’ చూస్తే వారికి సమయస్ఫూర్తి వస్తుంది. ప్రమాదం నుంచి బయటపడటం తెలుస్తుంది. మొదట కష్టాలు ఎదురైనా గట్టిగా కష్టపడితే విజయం వరిస్తుందని కూడా తెలుస్తుంది. తెలుగులో మాత్రమే కనిపించే ముచ్చటైన జానపద చిత్రం ఇది. ‘జగదేక వీరుని కథ’లో అర్ధరాత్రి అడవిలో నిదురిస్తుంటాడు రాకుమారుడు ఎన్.టి.ఆర్. తోడు రేలంగి. రెండు దెయ్యాలు వీరిని ఆటపట్టించడానికి బయలుదేరుతాయి. ఆ అరుపులు ఈ అరుపులు అరిచి రేలంగిని భయభ్రాంతం చేస్తాయి. కాని రాకుమారుడు భయపడతాడా? వాటి పిలకపట్టి సీసాలో బంధిస్తాడు. మూడు కోర్కెలు నెరవేరిస్తేనే వదులుతానంటాడు. వాటినే వాహనంగా చేసుకుని తాను వెళ్లాల్సిన చోటుకు వెళతాడు. దెయ్యాలు భూతాలు మనం భయపడే వరకే. మనం ధైర్యంగా ఉంటే వాటి పని అంతే. ఇదే సినిమాలో మూర్ఖపురాజు రాజనాల ఉంటాడు. అతడు రాకుమారుణ్ణి మంటల్లో తోద్దామనుకుంటే రాకుమారుడే తెలివిగా అతణ్ణి మంటల పాలు చేస్తాడు. పిల్లలకు ‘జగదేక వీరుని కథ’ మంచి కాలక్షేపం. క్లయిమాక్స్‌లో ఒకే రామారావు ఐదుగురిలా మారి పాడే ‘శివశంకరి’ పాట వాళ్లు ఇప్పుడూ ఎంజాయ్ చేస్తారు. మిస్సమ్మలో డిటెక్టివ్ ఏఎన్ఆర్ చాలా చురుగ్గా ఉంటాడు. చిన్నప్పుడు తప్పిపోయిన సావిత్రిని వెతికే పని అతనిదే. అతను వెతుకున్నది సావిత్రినే అన్నది మొదటి రీలులోనే తెలిసిపోతుంది. పిల్లలు కూడా నాగేశ్వరరావుతో పాటు సావిత్రిని ఆమె తల్లిదండ్రులకు అప్పజెప్పాలని చూస్తుంటారు. బతుకు బాదరబందీ కోసం ఎన్.టి.ఆర్, సావిత్రిలు ఆడే దొంగ నాటకాల వంటివి అవసరమే అన్నది తెలుసుకుంటారు. స్త్రీలతో ఎంత చక్కగా వ్యవహరించాలో కూడా. ఈ సినిమాలో ఎన్టిఆర్ సావిత్రితో ఎంతో మర్యాదగా వ్యవహరిస్తాడు. బతకనేర్చిన రేలంగి కూడా వాళ్లు తెలుసుకోదగ్గ మోడలే. ఇక ‘జస్టిస్... జస్టిస్... ఐ వాంట్ జస్టిస్’ అంటూ తిరిగే అసలు సిసలు కేటుగాడు రమణారెడ్డిని కూడా వాళ్లు గమనిస్తారు. కొందరికి ముక్కు మీద కోపం వున్నా వారి మనసు మంచిది అని సావిత్రిని చూసి అర్థం చేసుకుంటారు. వెన్నెలను చూసి ‘రావోయి చందమామ’ అని పాడటం కూడా. ఇక ‘మాయాబజార్’లో పిల్లలకు నచ్చనిది ఏది? కృష్ణుడు, ఘటోత్కచుడు, అభిమన్యుడు, లక్ష్మణ కుమారుడు, శకుని... అందరూ వారి అభిమాన పాత్రలే. బాణం కొట్టి మెట్లు కట్టడం, ప్రియదర్శినిలో నచ్చిన మనుషులతో వీడియో కాల్, మనుషులు డబ్బుంటే ఒక లాగా డబ్బు లేనప్పుడు ఒకలాగ వ్యవహరిస్తారని చెప్పే రేవతి (ఛాయాదేవి) పాత్ర, అన్నింటినీ చక్రం తిప్పే శ్రీకృష్ణుడు, అమాయకంగా ఉండి అసాధ్యుడిగా మారే ఘటోత్కచుడు... అతని మాయలు... పొగడ్తలతో బతికిపోయే శర్మ, శాస్త్రులు, నోరు తిరగని రాక్షస శిష్యులు, తమాషా గురువు చిన్నమయ్య... ఈ వేసవిలో పిల్లలు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడాల్సిన సినిమాలు. ఈ సినిమాలలో మూడిటికి కె.వి.రెడ్డి, ఒకదానికి ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించారు. అన్నింటిని నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించారు. పింగళి నాగేంద్రరావు కొత్త కొత్త మాటలు కనిపెట్టడం నేర్పుతారు. ఆహ్లాదం ఇచ్చే వినోదం ఎలా ఉంటుందో ఈ సినిమాలు చూపుతాయి. పిల్లలకు తప్పక చూపించండి. -
తెలుగువారి శకుని
‘మాయాబజార్’ షూటింగ్ జరుగుతోంది. ‘సత్యపీఠం’ మీద నిలబడి శకునిగా సి.ఎస్.ఆర్ డైలాగులు చెప్పాలి. ‘టేక్’ అన్నారు దర్శకుడు కె.వి.రెడ్డి. సి.ఎస్.ఆర్. సత్యపీఠం ఎక్కారు. అంతవరకూ పాండవుల మీద ఎన్ని కుత్సితాలు పన్నారో సత్యపీఠం మహిమ వల్ల బయటకు కక్కారు. షాట్ అద్భుతంగా వచ్చింది. కె.వి.రెడ్డి గారు ‘పాస్’ అన్నారు. సమాంతరంగా తమిళ వెర్షన్ షాట్ తీయాలి. తమిళంలో ఆ పాత్ర వేస్తున్నది ప్రఖ్యాత నటుడు నంబియార్. టేక్ అన్నారు కె.వి.రెడ్డి. నంబియార్ టేక్ తిన్నారు. టేక్ అన్నారు కె.వి.రెడ్డి. నంబియార్ మళ్లీ టేక్ తిన్నారు. ఐదారు టేకులు అయ్యాయి. ఫిల్మ్ వేస్టవుతోంది. కె.వి.రెడ్డి గారు నంబియార్ దగ్గరకు వెళ్లి మెత్తగా ‘మీరేదో పెద్ద నటులంటే తీసుకున్నాం. మా సి.ఎస్.ఆర్‌ను చూడండి. ఎలా డైలాగ్ చెప్పాడో’ అన్నారు. నంబియార్ తల వొంచుకున్నారు. నంబియార్నే ఏముంది... తాను సీన్లో ఉంటే మరొకరు తనను మించి తల ఎత్తలేనంత ప్రతిభ చూపిన తెలుగువారి అచ్చనటుడు సి.ఎస్.ఆర్ అను ‘చిలకలపూడి సీతా రామాంజనేయులు’. ఒక రకంగా ఆయన ఎన్.టి.ఆర్కు అగ్రజుడి వంటివారు. రంగస్థలం మీద స్థానం నరసింహారావు సత్యభామ వేస్తే సి.ఎస్.ఆర్ శ్రీకృష్ణుడు వేసేవారు. పి.పుల్లయ్య ‘శ్రీవేంకటేశ్వరుని మహాత్యS్మం’ తీస్తే వేంకటేశ్వరస్వామిగా మొదటిసారి ఆయనే ఆ ఇలవేల్పు వేషం కట్టారు. ఎన్.టి.ఆర్ రానంత వరకూ తెలుగువారి శ్రీకృష్ణుడు, తుకారాం, రామదాసు అన్నీ సి.ఎస్.ఆరే. కాని చిద్విలాసం చూడండి. ఏ కృష్ణుడిగా అయితే తాను ఫేమస్ అయ్యారో అదే కృష్ణుడి వేషంతో ఫేమస్ కాబోతున్న ఎన్.టి.ఆర్ పక్కన శకునిగా ‘మాయాబజార్’లో నటించారు. 1940లలో తెలుగు టాకీలు పుంజుకునే వరకూ గుంటూరు, కృష్ణ, ఒంగోలు ప్రాంతాలలో సి.ఎస్.ఆర్ పేరు చెప్తే నాటకాలు హౌస్‌ఫుల్‌గా కిటకిటలాడేవి. నాటకాల్లో ఖర్చులు పోగా ఆ రోజుల్లోనే నెలకు రెండు మూడు వందలు సంపాదించేవారు. కాని సినిమాలకు ఆయన వెళ్లక తప్పలేదు. నాగయ్య వంటి స్టార్‌ని, ఎన్.టి.ఆర్, అక్కినేని వంటి నవ యువకులని గమనించుకుని క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడకా తప్పలేదు. అయినా ఏమిటి లోటు? అక్షరం అక్షరాన్ని విరిచి ఆయన డైలాగ్ చెప్పే పద్ధతికి ఒక తెలుగుదనం ఉండేది. దానికి నేల నుంచి బాల్కనీ వరకు అభిమానగణం ఉండేది. ‘కన్యాశుల్కం’లో ఆయన రామప్పంతులు. ఎన్.టి.ఆర్ గిరీశం. ఇద్దరూ కలిసి మధురవాణి మంచం కింద దాక్కునే సీను బహు ముచ్చటైనది. ‘మాయాబజార్’లో రేలంగి, సి.ఎస్.ఆర్. ‘ఈ మాత్రం దానికి మంచం కింద దాక్కోవాలటయ్యా’ అంటాడు గిరీశం. ‘అప్పుచేసి పప్పుకూడు’ లో సిఎస్ఆర్ చేసిన జిత్తులమారి జమీందారు పాత్ర ఆ తర్వాతి కాలంలో సాఫ్ట్ విలనీ చేయాలనుకున్న వారికి మోడల్. వడ్డీ చెల్లిస్తూ అసలు ఎగ్గొట్టడం ఆ జమీందారు నేర విధానం. ‘వారికి కావలసింది వడ్డీ. మనకు కావలిసింది అసలు’ అంటాడు నిశ్చింతగా. ఈ సి.ఎస్.ఆరే ‘దేవదాసు’లో సావిత్రి భర్తగా నటించాడు. ‘జగదేకవీరుని కథ’లో కొత్తమంత్రిగా రాజనాల పక్కన చేరి ‘హే రాజన్... శృంగార వీరన్’ అని కొత్త తరహా పిలుపుతో బుట్టలో వేసుకొని చివరకు ఆ రాజు మంటల పాలబడి హరీమనే వరకు నిద్రపోడు. అంతకు ముందు ఎన్ని పాత్రలు చేసినా ‘మాయాబజార్’లో శకుని పాత్రతో ఆయన చిరంజీవి అయ్యాడు. అటు దుర్యోధనుణ్ణి దువ్వుతూ, ఇటు లక్ష్మణ కుమారుణ్ణి బుజ్జగిస్తూ, మరోవైపు శ్రీకృష్ణుణ్ణి కనిపెట్టుకుంటూ ఆయన ఆ సినిమా అంతా హైరానా పడతాడు. ఆడపెళ్లివారి ఏర్పాట్లు చూసి నోరెళ్లబెట్టిన శర్మ, శాస్త్రి ఏకంగా మగపెళ్లి వాళ్ల ముందు వారిని పొగుడుతుంటే ‘ఇదిగో శర్మ, శాస్త్రుల్లు... మీకు పాండిత్యం ఉందిగానీ బుద్ధి లేదోయ్’ అని సి.ఎస్.ఆర్ చెప్పే డైలాగు ఒక పాఠం లాంటిది. బతకడానికి కామన్సెన్స్ అవసరాన్ని తెలియచేసే శకుని మాట అట. ఆయన ఆ వేషం కోసం చేతుల్లో పట్టుకుంది పాచికలను కాదు. ప్రేక్షకుల పల్స్‌ని. సి.ఎస్.ఆర్ 56 ఏళ్లకే 1962లో మరణించారు. తక్కువ కాలంలో తక్కువ పాత్రలు వేశాడాయన. దానికి కారణం లౌక్యం పాటించకపోవడం, ఎంత పెద్దవారినైనా వేళాకోళం చేయగలగడం కొంత కారణం. ఆయనకు ముక్కుపొడుం అలవాటు ఉండేది. పాండిబజార్లో ఆయన రోజూ చెట్టు కింద పొడుం పీలుస్తూ నిలబడి దర్బార్ నడిపేవారు. ఆయన గురించి మాట్లాడటం, రాయడం తక్కువ. కేవలం తన పనితో ఆయన ఇంకా నిలబడి ఉన్నాడు. ‘మాయాబజార్’ తెలుగు ఇళ్లల్లో ప్లే అయినంత కాలం మన మీద పాచిక విసురుతూనే ఉంటాడు. ఆయన దుష్టశకుని కాదు. మన ఇష్ట శకుని. – సాక్షి ఫ్యామిలీ -
తీపి జ్ఞాపకాల మాయాబజార్
చిన్ననాటి స్నేహితులైన వీరిద్దరి పేర్లు శృతి, అనూష. ఇద్దరూ ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత ఒకరు ఎంబిఎ, ఇంకొకరు ఇంటీరియర్ డిజైనింగ్ చేశారు. రెండేళ్లపాటు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి ఒకానొక సమయంలో ఈ రొటీన్ ఉద్యోగాలు కాదు మనం చేయాల్సింది అనుకున్నారు. ఏదైనా వినూత్నమైన వ్యాపారాన్ని ప్రారంభిస్తే..? అని ఆలోచించారు. ఆ ఆలోచన నుంచి వీరు సృష్టించినదే.. ‘ది మాయాబజార్.’ పాతికేళ్ల వయసులో కచ్చితమైన ప్రణాళికతో సరికొత్త బిజినెస్‌లో అడుగుపెట్టిన శృతి, అనూషలు ఆ విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఇటీవలి కాలంలో.. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత వెడ్డింగ్ షూట్స్ తీయించుకునేవారు ఎక్కువయ్యారు. అలాగే గర్భిణిగా ఉన్నప్పుడు ఆ అందమైన జ్ఞాపకాన్ని పదిలపరుచుకోవడానికి ప్రెగ్నెన్సీ ఫొటో షూట్, చిన్నారుల క్యూట్ ఫొటోలు, కాలేజీ అమ్మాయిలైతే.. ఫ్యాషన్ స్టిల్స్æ.. ఇలా రకరకాలుగా ఫొటోలకు, వీడియో షూట్స్‌కి ప్లాన్ చేసుకుంటున్నారు. దాంతో షూట్స్ తీసుకునే లొకేషన్స్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ థీమ్‌నే పట్టుకున్నారు శృతి, అనూష. అన్ని రకాలుగా విశ్లేషించుకున్న తర్వాత రీసెర్చ్ ప్రారంభించారు. నెట్ అంతా జల్లెడ పట్టారు. తెలిసిన వారిని, తెలియని వారిని పరిచయం చేసుకొని మరీ సమాచారం సేకరించారు. ‘‘దేశవ్యాప్తంగా ఫొటో షూట్స్‌కి ఢిల్లీలో, ముంబయిలో చక్కటి స్థలాలు ఉన్నాయి. రకరకాల షూట్స్ కోసం చాలా మంది మన దగ్గర నుంచి అక్కడికి వెళుతుంటారు. ఇవన్నీ కూడా చూసి స్టడీ చేయడానికి మాకు ఏడాది సమయం పట్టింది’’ అన్నారు శృతి. ‘‘మా స్నేహితులు, బంధువులతో పాటు మేం కూడా ఫొటో, వీడియో షూట్స్‌కి తగిన ప్లేస్ కోసం చాలా చోట్ల ప్రయత్నం చేశాం. ఫొటో, వీడియో షూట్స్‌కి సరైన ప్లేస్ దొరక్క, ఖర్చు ఎక్కువ పెట్టలేక ప్రాజెక్ట్స్‌ను వదిలేసుకున్నవారెందరో. తెలిసిన ఫొటోగ్రాఫర్లు, వెడ్డింగ్ ప్లానర్లు, షార్ట్ ఫిల్మ్‌లు, యాడ్ ఫిల్మ్‌ల నిర్మాతలను, కెమెరామెన్స్‌ని కలిసి మాట్లాడాం. వీరందరికి అవసరమైన, అందించాల్సిన వసతులను బేరీజు వేసుకుకుని మాయాబజార్‌ని నిర్మించాం’’ అని చెప్పారు అనూష. ఆర్నెళ్లకు ఒకసారి ‘‘దేశంలో ఫొటోషూట్ అవసరాల కోసం ఇప్పుడున్న స్టూడియోలన్నీ చిన్నవే. దీనిని దృష్టిలో ఉంచుకుని ఐదు ఎకరాల స్థలాన్ని ఏడేళ్లపాటు లీజుకు తీసుకున్నాం. ఎకరం స్థలంలో స్టూడియో నిర్మించాం. అందులో మేకప్ రూమ్, ఛేంజింగ్ రూమ్, ఇండోర్, అవుట్ డోర్ వసతులు కాకుండా పదిహేను వరకు భిన్నమైన సెట్స్ వేశాం. వీటిని ప్రతీ ఆర్నెల్లకు ఒకసారి మార్చేలా ప్లాన్ చేశాం. మిగిలిన స్థలంలో గార్డెన్స్‌తో పాటు పలు రకాల ఆకర్షణలు జోడించబోతున్నాం..’’ అని శృతి తెలిపారు. స్టూడియో ఏర్పాటుతో పాటు సెట్స్‌కు అవసరమైన ఇతరత్రా సామగ్రి చాలా అవసరం అవుతుంది. ఆ విషయాన్ని చెబుతూ.. ‘‘అందుకు మేం ఇద్దరం దేశంలో ఢిల్లీ, ముంబై, రాజస్థాన్.. వంటి చాలా ప్రాంతాలు తిరిగి అపురూపమైన యాంటిక్ పీసులను సేకరించాం. పాతకాలం నాటి తలుపులు, నిజమైన ఎద్దుల బండి.. ఇలా ఏ లొకేషన్ సెట్‌కి ఏది ముఖ్యమో అలా ప్రతీది మేమిద్దరం ఎంపిక చేసి, డిజైన్ చేయించుకున్నాం..’’ అని తెలిపారు అనూష. అమ్మాయిలే బెస్ట్ వ్యాపారం అనేది ఒడిదొడుకులతో కూడినది. ఆర్థిక లావాదేవీల్లో కచ్చితత్త్వం ఉండాలి కదా... మీకేమైనా సమస్యలు వస్తే అనే ప్రశ్నకు..‘‘మా ఇద్దరి మధ్య ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు రాలేదు. ఇక ముందూ రావు. నిజానికి ఇలాంటి సృజనాత్మక భాగస్వామ్యానికి అమ్మాయిలే బెస్ట్’’ అని నవ్వుతూ చెప్పారు శృతి, అనూష. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో శృతి, అనూషలు సృష్టించిన ఈ ‘మాయాబజార్’ ఈ ఇద్దరమ్మాయిల సృజనకు అద్దం పడుతోంది. – నిర్మలారెడ్డి సొంత పెట్టుబడి ఈ ఇద్దరు కలలు కన్న మాయాబజార్ స్టూడియో కిందటేడాదే సాకారం అయింది. వ్యాపారాలు చేయాలంటే పెద్దలు సంపాదించిన ఆస్తులు ఉండాలి అనుకునేవారికి వీళ్లు కాస్త ధైర్యాన్ని ఇచ్చే మాటల్నే చెబుతున్నారు. ‘‘మేం అనుకున్న స్టూడియో రూపకల్పనకు పెద్ద మొత్తంలోనే ఖర్చు అయ్యింది. అయినా వెనకంజ వేయలేదు. మా ఇళ్లలో అమ్మనాన్నలని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాం. మేం ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బు, మిగిలినది రుణాల రూపంలో తీసుకున్నాం. మా తపన చూసిన మా అమ్మానాన్న కొంత పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు’’ అని చెప్పారు అనూష, శృతి. -
50 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన రజనీకాంత్
రజనీకాంత్ కెరీర్లోనే బిగెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన 'కొచ్చడయాన్' అరుదైన రికార్డును సొంతం చేసుకోనుంది. రజనీ కూమార్తె సౌంధర్య రజనీకాంత్ దర్శకత్వం చేసిన ఈ యానిమేషన్ చిత్రం కర్ణాటకలోనూ విడుదల కానుంది. ఇప్పటికే తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, మరాఠి, భోజ్‌పురి, బెంగాలీ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా తాజాగా కన్నడంలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. దాదాపు 50 ఏళ్లుగా కన్నడ చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ సినిమాలపై నిషేధం ఉండగా ఇటీవలే ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. దీంతో 50 ఏళ్ల తరువాత కన్నడంలో రిలీజ్ అవుతున్న తొలి డబ్బింగ్ సినిమాగా కొచ్చడయాన్ రికార్డ్ సృష్టించనుంది . యాబై ఏళ్ల క్రితం 1965లో తెలుగు సూపర్ హిట్ సినిమా మాయబజార్ కన్నడంలో అనువాదమైంది. ఆ తరువాత ఇన్నేళ్లకు కొచ్చడయాన్ డబ్ కావడంపై రజనీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఫ్యామిలీ పిక్చర్ ఏదీ!
గ్రాఫిక్స్ సరే స్టోరీ ఏది? మాయాబజార్ ఎవర్గ్రీన్ పాలిటిక్స్, క్రైమ్... బాబోయ్ బోర్! డబుల్ డోస్ ఇస్తున్నారు అందరం కలసి సినిమాకు వెళ్లలేం అమ్మకో సినిమా నచ్చుతుంది.. తమ్ముడి మూవీ టేస్ట్ డిఫరెంట్.. నాకు ఇష్టమైంది వాళ్లిద్దరికీ నచ్చదు.. అంతా కలసి సినిమాను ఎంజాయ్ చెయ్యలేకపోతున్నాం. మెజారిటీ యూత్ చెప్పే మాటలివి. గ్రాఫిక్స్ థ్రిల్ చేస్తున్నా, మెసేజ్ ఉండటం లేదని... హీరో, హీరోయిన్ బాగున్నా కథకు టిక్ పెట్టలేకపోతున్నామనేది వాళ్లలో కనిపించే అసంతృప్తి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని సరోజినీనాయుడు వనితా మహావిద్యాలయలో సినిమా ట్రెండ్‌పై విద్యార్థినుల డిస్కషన్... లలిత: అబ్బ ఏం గ్రాఫిక్సే.. భలే థ్రిల్‌గా ఉంది తెలుసా! హీరోయిన్ డ్రెస్ చూస్తే.. ఫ్లాట్ అవ్వాల్సిందే. నిహారిక: ఇంతకీ స్టోరీ ఏంటి? లలిత: స్టోరీ.. ఎలా చెప్పాలి. ఒక రకంగా లవ్! కాకపోతే మిడిల్ నుంచి ట్రాజిడీ. ప్రబంధ: తెలుసమ్మా తెలుసు. అందుకే మా పేరెంట్స్ ఆ సినిమా వద్దన్నారు. అంబిక : ఏ సినిమాలో మాత్రం ఇంతకు మించి ఏం ఉంటుంది. యూత్ ఓరియంటెడ్గానే తీస్తారు. కల్యాణి: లవ్ లవ్ అంటూ నూరిపోయడం.. తల్లిదండ్రులపై తిరగబడ్డం.. ఈ కథలేనా యూత్ ఓరియంటెడ్? లలిత: తల్లీ అది కాదు ఉద్దేశం. ఫ్యాషన్ డ్రెస్.. ఫాస్ట్ సాంగ్స్ ఇవే కదా యూత్ కోరుకునేది. ఐశ్వర్య: ఛా.. అవి లేకుండా యూత్ సెంటిమెంట్ సినిమాలు రావడం లేదా? క్లిక్ అవ్వడం లేదా? నిహారిక: అన్నా చెల్లెళ్ల అనుబంధం.. తాతా-మనవడు. ఎంత బాగుంటాయో కదా! లలిత: అంతొద్దమ్మా. అవి బాగుంటాయని నాకూ తెలుసు. కానీ అలాంటి మూవీలే వస్తే యాక్సెప్ట్ చేస్తారా? సిన్సియర్‌గా మెసేజ్ ఉండాలనే ప్రయత్నం చేస్తే ఆలోచిస్తారా? అంబిక: ఎందుకు అంగీకరించరు? లీడర్ సినిమా ఎంత ఇన్స్పిరేషన్గా ఉంది. యూత్‌కు ఎలాంటి మెసేజ్ ఇచ్చింది. యాక్సెప్ట్ చేయలేదా? ప్రబంధ: అక్కడిదాకా ఎందుకు, మాయాబజార్ సినిమాలోనూ అప్పట్లో ఒక మాదిరి గ్రాఫిక్స్ చూపించారు. ఆ మాయలు. మంత్రాలు ఎంత థ్రిల్‌గా ఉండేవి. ఈ మధ్య ఓ ఊరి కోటను సెంటర్ పాయింట్‌గా తీసుకుని సినిమా తీశారు. అందులో ఏం స్టోరీ ఉంది? కనీసం ఎంటర్టైన్మెంట్ కూడా లేదు. కల్యాణి: నిజమే సినిమాను ప్యూర్లీ కమర్షియల్ చేస్తున్నారు. అరె.. లెక్చరర్స్ మీద తిరగబడటాన్ని హీరోయిజంగా చూపిస్తే ఎట్లా! ఐశ్వర్య: అక్కడిదాకా ఎందుకు? హీరోయిన్ల డ్రెసెస్ ఎలా ఉంటున్నాయి. వాటి ప్రభావం మనపైనా ఉంటోంది కదా! క్రైమ్ రేట్ పెరగడానికి ఈ తరహా సినిమాలు కూడా కారణమే! లలిత: సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. అయితే అందులో పరిధులు దాటొద్దనేది మన పేరెంట్స్ ఒపీనియన్. దాంతో ఏ సినిమా చూడాలన్నా వాళ్ల పర్మిషన్ కంపల్సరీ. నిహారిక: వాళ్లకు కూడా భయమే కదా! అందుకే అలా చేస్తున్నారు. కొన్ని సినిమాలు చూస్తామంటే వాళ్లు కూడా వద్దనరు కదా! లలిత: అవునవును. గుండమ్మ కథ. ఎంకీ నాయుడు బావ. అవేనా? నిహారిక: ఏం! సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టును ఉదాహరణగా ఎందుకు చెప్పడం లేదు. ఇలాంటి సినిమాలే రావాలని పేరెంట్స్ కోరుకుంటున్నారు. లలిత: ఒకటి మాత్రం మనం మిస్ అవుతున్నాం. నా చిన్నప్పుడైతే అమ్మా, నాన్న, చెల్లి, తమ్ముడు అంతా కలసి సినిమాకు వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు అందరం కలసి ఒక సినిమాకి వెళ్లలేం. ఒక్కొక్కళ్లకి ఒక్కో సినిమా నచ్చుతోంది. ప్రబంధ: సాంగ్స్ విషయంలోనూ అంతే. చిన్నప్పుడు నాన్నకు నచ్చిన సాంగ్ వింటుంటే నాకూ వినాలనిపించేది. కానీ ఇప్పుడు అందరికీ నచ్చే సాంగ్స్ కొన్ని మాత్రమే ఉంటున్నాయి. కల్యాణి: క్రైమ్, పాలిటిక్స్‌కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. న్యూస్ పేపర్ల నిండా అవే. మళ్లీ మూవీల్లోనూ అవసరమంటావా? అంబిక: పొలిటీషియన్ని యాజిటీజ్‌గా చూపించాలి. కానీ సినిమా వాళ్లు అతడ్నో హీరోగా చూపిస్తున్నారు. దీన్ని చూసి ఏం నేర్చుకోమన్నట్టు! నిహారిక: ఇంతకీ ఏ టైప్ సినిమా కావాలని మీ ఉద్దేశం. లలిత: సకుటుంబ సపరివార సమేతంగా చూడగలిగే ఎంటర్టైన్మెంట్తో కూడిన మూవీకే నా ఓటు. ప్రబంధ, కల్యాణి, ఐశ్వర్య: సెంట్‌పర్సంట్ ఇది నిజం. మా ఓటు కూడా నీకే. ప్రస్తుతం వస్తున్న సినిమాలు కుటుంబ సమేతంగా చూడలేకపోతున్నాం. రెండు గంటల సినిమాలో వినోదంతో పాటు ఏదైనా మంచి సందేశం ఉంటే బావుంటుంది. యూత్‌కు ఉపయోగపడే సినిమాలు రావాలి. - డాక్టర్ బి.వాణి, ప్రిన్సిపాల్ -
అపురూపం: ఒకే ఒక మాయాబజార్
తెలుగు సినిమా పుట్టి ఎనభై సంవత్సరాలు పూర్తయ్యాయి! ఇన్ని సంవత్సరాలలో... అన్ని తరాల వారికి నచ్చిన చిత్రం అన్ని వయసులవారు మెచ్చిన చిత్రం ఏదైనా ఉందంటే, అది ‘మాయాబజార్’ ఒక్కటే! భారీ తారాగణంతో, భారీ సెట్స్‌తో, దాదాపు 30 లక్షల బడ్జెట్‌తో తెలుగు తమిళ భాషలలో విజయ ప్రొడక్షన్స్‌వారు అందించిన దృశ్యకావ్యం ఈ మాయా బజార్! అన్ని విధాలా భారీగా తీస్తున్నాము. హిట్టవుతుందా అని మథనపడ్డారట అందరూ. హిట్టయ్యింది! ఎంత హిట్టంటే... తెలుగు సినిమా ఇంతవరకూ ఎప్పుడూ చూడనంత! ‘వివాహ భోజనంబు వింతైన వంటకంబు...’ పాట చిత్రీకరణప్పుడు ఘటోత్కచుడు పాత్రధారి ఎస్వీ రంగారావు దగ్గర లైటింగ్ ఎక్స్‌పోజర్‌ని చెక్ చేసుకుంటున్న ఛాయాగ్రాహకుడు మార్కస్‌బార్‌ట్లే (పైన). సినిమాలో శశిరేఖ పాత్రధారి సావిత్రిపై ‘నీవేనా నను తలచినది...’ పాటను చిత్రీకరిస్తున్నప్పటి స్టిల్ ఇది (కుడి). సావిత్రి అభినయిస్తుండగా దర్శకుడు కె.వి.రెడ్డి (కుర్చీలో), ఛాయాగ్రాహకుడు మార్కస్‌బార్‌ట్లే తదితరులు పరిశీలిస్తున్న అపురూపమైన స్టిల్ ఇది! ఇక ఈ సినిమాలో ‘సుందరి నీవంటి దివ్య స్వరూపము’ పాటను రేలంగి (లక్ష్మణ కుమారుడు) సావిత్రి వెంటపడుతూ పాడగా సావిత్రి ‘దూరం దూరం..’, ‘పెద్దలున్నారు...’ వంటి చిన్న చిన్న మాటలు పాట మధ్యలో అంటుంది. ఆ పాట రికార్డింగ్ సమయంలో ఘంటసాల (ఎడమ చివర), కె.వి.రెడ్డి (ఎడమ నుంచి నాలుగో వ్యక్తి) తదితరులు సావిత్రితో రిహార్సల్స్ చేయిస్తున్న దృశ్యం ఇది (ఎడమ). ప్రేక్షకులు 1957లో తొలిసారి ఈ సినిమాని చూశారు. ఇప్పటికీ చూస్తున్నారు! మునుముందూ చూస్తారు!! అంతేముందీ మాయాబజార్లో!!! నటీనటుల అందమా... వారి అభినయమా... కథా... కథనమా... సెట్టింగులా... లైటింగులా... మాటలా... పాటలా... ఏం బాగుంటాయి ఈ సినిమాలో? అన్నీ బాగుంటాయి! అవును... నిజంగా... అన్నీ బాగుంటాయి! అందుకే... ‘మాయా బజార్’ అంత బాగుంటుంది!!! నిర్వహణ: సంజయ్ కిషోర్ sanjjaykkishor@gmail.com