తీపి జ్ఞాపకాల మాయాబజార్‌ | The Maya Bazaar Concept By Shruti And Anushka For Wedding Anniversary | Sakshi
Sakshi News home page

తీపి జ్ఞాపకాల మాయాబజార్‌

Published Fri, Jan 31 2020 5:42 AM | Last Updated on Fri, Jan 31 2020 6:01 AM

The Maya Bazaar Concept By Shruti And Anushka For Wedding Anniversary - Sakshi

మాయాబజార్‌లో ఓ షూట్‌ సెట్టింగ్‌ 

చిన్ననాటి స్నేహితులైన వీరిద్దరి పేర్లు శృతి, అనూష. ఇద్దరూ ఇంజనీరింగ్‌ చదివారు. ఆ తర్వాత ఒకరు ఎంబిఎ, ఇంకొకరు ఇంటీరియర్‌ డిజైనింగ్‌ చేశారు. రెండేళ్లపాటు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేసి ఒకానొక సమయంలో ఈ రొటీన్‌ ఉద్యోగాలు కాదు మనం చేయాల్సింది అనుకున్నారు. ఏదైనా వినూత్నమైన వ్యాపారాన్ని ప్రారంభిస్తే..? అని ఆలోచించారు. ఆ ఆలోచన నుంచి వీరు సృష్టించినదే.. ‘ది మాయాబజార్‌.’ పాతికేళ్ల వయసులో కచ్చితమైన ప్రణాళికతో సరికొత్త బిజినెస్‌లో అడుగుపెట్టిన శృతి, అనూషలు ఆ విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.

ఇటీవలి కాలంలో.. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత వెడ్డింగ్‌ షూట్స్‌ తీయించుకునేవారు ఎక్కువయ్యారు. అలాగే గర్భిణిగా ఉన్నప్పుడు ఆ అందమైన జ్ఞాపకాన్ని పదిలపరుచుకోవడానికి ప్రెగ్నెన్సీ ఫొటో షూట్, చిన్నారుల క్యూట్‌ ఫొటోలు, కాలేజీ అమ్మాయిలైతే.. ఫ్యాషన్‌ స్టిల్స్‌æ.. ఇలా రకరకాలుగా ఫొటోలకు, వీడియో షూట్స్‌కి ప్లాన్‌ చేసుకుంటున్నారు. దాంతో షూట్స్‌ తీసుకునే లొకేషన్స్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ థీమ్‌నే పట్టుకున్నారు శృతి, అనూష. అన్ని రకాలుగా విశ్లేషించుకున్న తర్వాత రీసెర్చ్‌ ప్రారంభించారు. నెట్‌ అంతా జల్లెడ పట్టారు. తెలిసిన వారిని, తెలియని వారిని పరిచయం చేసుకొని మరీ సమాచారం సేకరించారు. ‘‘దేశవ్యాప్తంగా ఫొటో షూట్స్‌కి ఢిల్లీలో, ముంబయిలో చక్కటి స్థలాలు ఉన్నాయి. రకరకాల షూట్స్‌ కోసం చాలా మంది మన దగ్గర నుంచి అక్కడికి వెళుతుంటారు. ఇవన్నీ కూడా చూసి స్టడీ చేయడానికి మాకు ఏడాది సమయం పట్టింది’’ అన్నారు శృతి.

‘‘మా స్నేహితులు, బంధువులతో పాటు మేం కూడా ఫొటో, వీడియో షూట్స్‌కి తగిన ప్లేస్‌ కోసం చాలా చోట్ల ప్రయత్నం చేశాం. ఫొటో, వీడియో షూట్స్‌కి సరైన ప్లేస్‌ దొరక్క, ఖర్చు ఎక్కువ పెట్టలేక ప్రాజెక్ట్స్‌ను వదిలేసుకున్నవారెందరో. తెలిసిన ఫొటోగ్రాఫర్లు, వెడ్డింగ్‌ ప్లానర్లు, షార్ట్‌ ఫిల్మ్‌లు, యాడ్‌ ఫిల్మ్‌ల నిర్మాతలను, కెమెరామెన్స్‌ని కలిసి మాట్లాడాం. వీరందరికి అవసరమైన, అందించాల్సిన వసతులను బేరీజు వేసుకుకుని మాయాబజార్‌ని నిర్మించాం’’ అని చెప్పారు అనూష.

ఆర్నెళ్లకు ఒకసారి
‘‘దేశంలో ఫొటోషూట్‌ అవసరాల కోసం ఇప్పుడున్న స్టూడియోలన్నీ చిన్నవే. దీనిని దృష్టిలో ఉంచుకుని ఐదు ఎకరాల స్థలాన్ని ఏడేళ్లపాటు లీజుకు తీసుకున్నాం. ఎకరం స్థలంలో స్టూడియో నిర్మించాం. అందులో మేకప్‌ రూమ్, ఛేంజింగ్‌ రూమ్, ఇండోర్, అవుట్‌ డోర్‌ వసతులు కాకుండా పదిహేను వరకు భిన్నమైన సెట్స్‌ వేశాం. వీటిని ప్రతీ ఆర్నెల్లకు ఒకసారి మార్చేలా ప్లాన్‌ చేశాం. మిగిలిన స్థలంలో గార్డెన్స్‌తో పాటు పలు రకాల ఆకర్షణలు జోడించబోతున్నాం..’’ అని శృతి తెలిపారు.

స్టూడియో ఏర్పాటుతో పాటు సెట్స్‌కు అవసరమైన ఇతరత్రా సామగ్రి చాలా అవసరం అవుతుంది. ఆ విషయాన్ని చెబుతూ.. ‘‘అందుకు మేం ఇద్దరం దేశంలో ఢిల్లీ, ముంబై, రాజస్థాన్‌.. వంటి చాలా ప్రాంతాలు తిరిగి అపురూపమైన యాంటిక్‌ పీసులను సేకరించాం. పాతకాలం నాటి తలుపులు, నిజమైన ఎద్దుల బండి.. ఇలా ఏ లొకేషన్‌ సెట్‌కి ఏది ముఖ్యమో అలా ప్రతీది మేమిద్దరం ఎంపిక చేసి, డిజైన్‌ చేయించుకున్నాం..’’ అని తెలిపారు అనూష.

అమ్మాయిలే బెస్ట్‌
వ్యాపారం అనేది ఒడిదొడుకులతో కూడినది. ఆర్థిక లావాదేవీల్లో కచ్చితత్త్వం ఉండాలి కదా... మీకేమైనా సమస్యలు వస్తే అనే ప్రశ్నకు..‘‘మా ఇద్దరి మధ్య ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు  రాలేదు. ఇక ముందూ రావు. నిజానికి ఇలాంటి సృజనాత్మక భాగస్వామ్యానికి అమ్మాయిలే బెస్ట్‌’’ అని నవ్వుతూ చెప్పారు శృతి, అనూష. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో శృతి, అనూషలు సృష్టించిన ఈ ‘మాయాబజార్‌’ ఈ ఇద్దరమ్మాయిల సృజనకు అద్దం పడుతోంది. – నిర్మలారెడ్డి

సొంత పెట్టుబడి
ఈ ఇద్దరు కలలు కన్న మాయాబజార్‌ స్టూడియో కిందటేడాదే సాకారం అయింది. వ్యాపారాలు చేయాలంటే పెద్దలు సంపాదించిన ఆస్తులు ఉండాలి అనుకునేవారికి వీళ్లు కాస్త ధైర్యాన్ని ఇచ్చే మాటల్నే చెబుతున్నారు. ‘‘మేం అనుకున్న స్టూడియో రూపకల్పనకు పెద్ద మొత్తంలోనే ఖర్చు అయ్యింది. అయినా వెనకంజ వేయలేదు. మా ఇళ్లలో అమ్మనాన్నలని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాం. మేం ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బు, మిగిలినది రుణాల రూపంలో తీసుకున్నాం. మా తపన చూసిన మా అమ్మానాన్న కొంత పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు’’ అని చెప్పారు అనూష, శృతి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement