‘మాయాబజార్’ షూటింగ్ జరుగుతోంది. ‘సత్యపీఠం’ మీద నిలబడి శకునిగా సి.ఎస్.ఆర్ డైలాగులు చెప్పాలి. ‘టేక్’ అన్నారు దర్శకుడు కె.వి.రెడ్డి. సి.ఎస్.ఆర్. సత్యపీఠం ఎక్కారు. అంతవరకూ పాండవుల మీద ఎన్ని కుత్సితాలు పన్నారో సత్యపీఠం మహిమ వల్ల బయటకు కక్కారు. షాట్ అద్భుతంగా వచ్చింది. కె.వి.రెడ్డి గారు ‘పాస్’ అన్నారు. సమాంతరంగా తమిళ వెర్షన్ షాట్ తీయాలి. తమిళంలో ఆ పాత్ర వేస్తున్నది ప్రఖ్యాత నటుడు నంబియార్. టేక్ అన్నారు కె.వి.రెడ్డి. నంబియార్ టేక్ తిన్నారు. టేక్ అన్నారు కె.వి.రెడ్డి. నంబియార్ మళ్లీ టేక్ తిన్నారు. ఐదారు టేకులు అయ్యాయి. ఫిల్మ్ వేస్టవుతోంది. కె.వి.రెడ్డి గారు నంబియార్ దగ్గరకు వెళ్లి మెత్తగా ‘మీరేదో పెద్ద నటులంటే తీసుకున్నాం. మా సి.ఎస్.ఆర్‌ను చూడండి. ఎలా డైలాగ్ చెప్పాడో’ అన్నారు. నంబియార్ తల వొంచుకున్నారు.
నంబియార్‌నే ఏముంది... తాను సీన్‌లో ఉంటే మరొకరు తనను మించి తల ఎత్తలేనంత ప్రతిభ చూపిన తెలుగువారి అచ్చనటుడు సి.ఎస్.ఆర్ అను ‘చిలకలపూడి సీతా రామాంజనేయులు’. ఒక రకంగా ఆయన ఎన్.టి.ఆర్‌కు అగ్రజుడి వంటివారు. రంగస్థలం మీద స్థానం నరసింహారావు సత్యభామ వేస్తే సి.ఎస్.ఆర్ శ్రీకృష్ణుడు వేసేవారు. పి.పుల్లయ్య ‘శ్రీవేంకటేశ్వరుని మహాత్యS్మం’ తీస్తే వేంకటేశ్వరస్వామిగా మొదటిసారి ఆయనే ఆ ఇలవేల్పు వేషం కట్టారు. ఎన్.టి.ఆర్ రానంత వరకూ తెలుగువారి శ్రీకృష్ణుడు, తుకారాం, రామదాసు అన్నీ సి.ఎస్.ఆరే. కాని చిద్విలాసం చూడండి. ఏ కృష్ణుడిగా అయితే తాను ఫేమస్ అయ్యారో అదే కృష్ణుడి వేషంతో ఫేమస్ కాబోతున్న ఎన్.టి.ఆర్ పక్కన శకునిగా ‘మాయాబజార్’లో నటించారు.
1940లలో తెలుగు టాకీలు పుంజుకునే వరకూ గుంటూరు, కృష్ణ, ఒంగోలు ప్రాంతాలలో సి.ఎస్.ఆర్ పేరు చెప్తే నాటకాలు హౌస్‌ఫుల్‌గా కిటకిటలాడేవి. నాటకాల్లో ఖర్చులు పోగా ఆ రోజుల్లోనే నెలకు రెండు మూడు వందలు సంపాదించేవారు. కాని సినిమాలకు ఆయన వెళ్లక తప్పలేదు. నాగయ్య వంటి స్టార్‌ని, ఎన్.టి.ఆర్, అక్కినేని వంటి నవ యువకులని గమనించుకుని క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడకా తప్పలేదు. అయినా ఏమిటి లోటు? అక్షరం అక్షరాన్ని విరిచి ఆయన డైలాగ్ చెప్పే పద్ధతికి ఒక తెలుగుదనం ఉండేది. దానికి నేల నుంచి బాల్కనీ వరకు అభిమానగణం ఉండేది. ‘కన్యాశుల్కం’లో ఆయన రామప్పంతులు. ఎన్.టి.ఆర్ గిరీశం. ఇద్దరూ కలిసి మధురవాణి మంచం కింద దాక్కునే సీను బహు ముచ్చటైనది.
‘మాయాబజార్’లో రేలంగి, సి.ఎస్.ఆర్.
‘ఈ మాత్రం దానికి మంచం కింద దాక్కోవాలటయ్యా’ అంటాడు గిరీశం. ‘అప్పుచేసి పప్పుకూడు’ లో సిఎస్‌ఆర్ చేసిన జిత్తులమారి జమీందారు పాత్ర ఆ తర్వాతి కాలంలో సాఫ్ట్ విలనీ చేయాలనుకున్న వారికి మోడల్. వడ్డీ చెల్లిస్తూ అసలు ఎగ్గొట్టడం ఆ జమీందారు నేర విధానం. ‘వారికి కావలసింది వడ్డీ. మనకు కావలిసింది అసలు’ అంటాడు నిశ్చింతగా. ఈ సి.ఎస్.ఆరే ‘దేవదాసు’లో సావిత్రి భర్తగా నటించాడు. ‘జగదేకవీరుని కథ’లో కొత్తమంత్రిగా రాజనాల పక్కన చేరి ‘హే రాజన్... శృంగార వీరన్’ అని కొత్త తరహా పిలుపుతో బుట్టలో వేసుకొని చివరకు ఆ రాజు మంటల పాలబడి హరీమనే వరకు నిద్రపోడు.
అంతకు ముందు ఎన్ని పాత్రలు చేసినా ‘మాయాబజార్’లో శకుని పాత్రతో ఆయన చిరంజీవి అయ్యాడు. అటు దుర్యోధనుణ్ణి దువ్వుతూ, ఇటు లక్ష్మణ కుమారుణ్ణి బుజ్జగిస్తూ, మరోవైపు శ్రీకృష్ణుణ్ణి కనిపెట్టుకుంటూ ఆయన ఆ సినిమా అంతా హైరానా పడతాడు. ఆడపెళ్లివారి ఏర్పాట్లు చూసి నోరెళ్లబెట్టిన శర్మ, శాస్త్రి ఏకంగా మగపెళ్లి వాళ్ల ముందు వారిని పొగుడుతుంటే ‘ఇదిగో శర్మ, శాస్త్రుల్లు... మీకు పాండిత్యం ఉందిగానీ బుద్ధి లేదోయ్’ అని సి.ఎస్.ఆర్ చెప్పే డైలాగు ఒక పాఠం లాంటిది. బతకడానికి కామన్‌సెన్స్ అవసరాన్ని తెలియచేసే శకుని మాట అట. ఆయన ఆ వేషం కోసం చేతుల్లో పట్టుకుంది పాచికలను కాదు. ప్రేక్షకుల పల్స్‌ని.
సి.ఎస్.ఆర్ 56 ఏళ్లకే 1962లో మరణించారు. తక్కువ కాలంలో తక్కువ పాత్రలు వేశాడాయన. దానికి కారణం లౌక్యం పాటించకపోవడం, ఎంత పెద్దవారినైనా వేళాకోళం చేయగలగడం కొంత కారణం. ఆయనకు ముక్కుపొడుం అలవాటు ఉండేది. పాండిబజార్‌లో ఆయన రోజూ చెట్టు కింద పొడుం పీలుస్తూ నిలబడి దర్బార్ నడిపేవారు. ఆయన గురించి మాట్లాడటం, రాయడం తక్కువ. కేవలం తన పనితో ఆయన ఇంకా నిలబడి ఉన్నాడు. ‘మాయాబజార్’ తెలుగు ఇళ్లల్లో ప్లే అయినంత కాలం మన మీద పాచిక విసురుతూనే ఉంటాడు. ఆయన దుష్టశకుని కాదు. మన ఇష్ట శకుని. – సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment