‘షోలే’ సినిమా కొంతమంది నటుల అసలు పేర్లను చెరిపేసి కొత్త పేర్లను ఇచ్చింది. అంజాద్ ఖాన్ పేరు చెరిపేసి గబ్బర్ సింగ్. మెక్ మోహన్ పేరు చెరిపేసి సాంబా, జగ్‌దీప్ పేరు చెరిపేసి ‘సూర్మా భోపాలి’. ఆ సినిమాలో జగ్‌దీప్ వేసింది కేవలం రెండే సీన్లు. కాని జీవితాంతం ఆ సీన్లు అతడిని నిలబెట్టాయి. సూర్మా భోపాలి అనే పేరును కూడా. ‘షోలే’ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతున్నా సూర్మా భోపాలి సీన్లు తీయలేదు. ‘రెండు సీన్లకు నేనెందుకు పోండి’ అన్నాడు జగ్‌దీప్ ఆ వేషానికి. కాని షోలే రాసిన జావేద్ అఖ్తర్ పట్టు వీడలేదు. భోపాల్ జావేద్ సొంత ఊరు. అక్కడి ముస్లిం స్త్రీలు మాట్లాడే పద్ధతిని కొన్నాళ్ల క్రితం జగ్‌దీప్‌కు చూపినప్పుడు జగదీప్ అదే అనుకరణలో డైలాగులు చెప్పి జావేద్‌ను మెప్పించాడు. అదే యాసతో ‘సూర్మా భోపాలి’ వేషం రాశాడతడు. దానికి జగ్‌దీపే న్యాయం చేయగలడు. అందుకని ఎలాగో ఒప్పించి చేయించారు.
వీరు, జయ్ అనబడు ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ సూర్మా భోపాలి కట్టెల అడితికి వచ్చి అతనికి లొంగిపోతారు. ‘మమ్మల్ని పట్టించి మా మీద పెట్టిన ఇనామ్‌ను నువ్వు తీసుకో. జైలు నుంచి వచ్చాక మాకు సగం ఇవ్వు’ అంటారు. గొప్పలు చెప్పుకునే సూర్మా భోపాలి వారిని పట్టిచ్చి కట్టెల అడితికి వచ్చేపోయే వారికి అది తానే చేసిన ఘనకార్యంగా చిలువలు పలువలుగా చెప్పుకుంటూ ఉంటాడు. నోటినిండా పాన్, తల మీద టోపీ, దీర్ఘాలుగా వచ్చే మాట, పిట్టల దొర వంటి బుద్ధి... ఇవన్నీ ఆ రెండు సీన్లలోనే జగ్‌దీప్ ప్రేక్షకులకు పట్టిచ్చాడు. డబ్బును ‘పైసే’ అంటారు. కానీ సూర్మా భోపాలి ‘పీషే పీషే పీషే’ అని అందరినీ నవ్విస్తాడు. ఆ ‘పీషే’ను ప్రయివేట్ టాక్‌లో ఉపయోగించడం షోలే అభిమానులు చేసే పని.
జగ్‌దీప్ అదృష్టజాతకుడు. తల్లితోటి ముంబైకి ఆరేడేళ్ల వయసులో వొట్టి కాళ్లతో వచ్చి ఇనుప కొలిమిలో పని చేశాడు. సబ్బుల ఫ్యాక్టరీలో పని చేశాడు. తల్లితో కలిసి గాలిపటాలు తయారు చేసి పేవ్‌మెంట్ల మీద అమ్మాడు. కాని అదే జగ్‌దీప్ ఆ తర్వాత హీరో అంతటి వాడయ్యి ‘చలి చలిరే పతంగ్ మేరి చలిరే’ అంటూ గాలిపటాలు ఎగరేస్తూ తెర మీద పాటలు పాడాడు. జగ్‌దీప్ చైల్డ్ ఆర్టిస్ట్. పేవ్‌మెంట్ మీద అతణ్ణి చూసిన ఒక సినిమా సప్లయర్ ‘అఫ్సానా’ (1951)లో రోజుకు మూడు రూపాయల కూలీకి స్టూడియోకు తీసుకెళ్లాడు. జగ్‌దీప్ బెరుకు లేకుంటా చటాపటా డైలాగులు చెప్పాడు. ఆ తర్వాత జగ్‌దీప్ గురుదత్‌తో సూపర్‌హిట్ సినిమా ‘ఆర్ పార్’ చేశాడు. బిమల్ రాయ్ దగ్గర చరిత్రాత్మకంగా నిలిచిన ‘దో భీగా జమీన్’లో పని చేశాడు. ‘నువ్వు ఏడుపు బాగా చేస్తున్నావు. కనుక బాగా నవ్వించగలవు’ అని బిమల్‌రాయ్ ఆ సినిమా తీసేటప్పుడు జగ్‌దీప్‌తో అన్నాడు. జగ్‌దీప్ నటించిన ‘హమ్ పంఛీ ఏక్ డాల్ కే’ జాతీయ ఉత్తమ బాలల చిత్రంగా నిలిచింది.
జగ్‌దీప్ ముంబై సినిమాలలో కన్నా మన మద్రాసు వారు తీసే హిందీ రీమేకుల్లో ఎక్కువగా నటించాడు. ఏ.వి.ఎం వారి ‘భాభీ’ (కులదైవం) జగ్‌దీప్‌కు చాలా పేరు తెచ్చింది. ‘తీన్ బహురానియా’ (భలే కోడళ్లు), ‘ఖిలోనా’ (పునర్జన్మ), ‘సాస్ భీ కభీ బహూ థీ’ (అత్తా ఒకింటి కోడలే), ‘బిదాయి’ (తల్లా పెళ్లామా) ఈ సినిమాలన్నింటిలోనూ జగ్‌దీప్ పని చేశాడు. ఖిలోనాలో అతడు చేసిన పాత్రకు బెస్ట్ కామిక్ రోల్ పురస్కారం దక్కింది. ముంబైలో చిన్న గదిలో ఉండే జగదీప్ ఈ సినిమాలతో వచ్చిన డబ్బుతో ముంబైతో పాటు చెన్నైలో కూడా ఆస్తులు కొన్నాడని అంటారు. జగదీప్‌ను తెలుగులో రాజబాబుతో పోల్చవచ్చు. ఇద్దరూ చాలా వేగంగా శరీరాన్ని కదిలిస్తూ నటిస్తారు. నగేష్ కూడా ఈ కోవలోకే వస్తారు. కదలకుండా నవ్వించినవారు రేలంగి, మెహమూద్. జగ్‌దీప్ చిన్నప్పటి నుంచి సినిమాల్లో ఉన్నా సినిమా మనిషిగా లేడు. అతని ఇంటర్వ్యూలు చూడటం తక్కువ. సినిమా వేడుకల్లో దాదాపుగా కనపడడు. కాని ‘సూర్మా భోపాలి’ పాత్ర హిట్ అయ్యాక అదే పేరుతో ఒక సినిమా తీసి తాను హీరోగా నటిస్తే అతని మీద అభిమానంతో అమితాబ్, ధర్మేంద్ర ఇంకా చాలామంది సినిమా వాళ్లు ఫ్రీగా కాసేపు కనిపించారు.
జగదీప్ చివరగా మెరిసిన సినిమా ‘అందాజ్ అప్నా అప్నా’. అందులో సల్మాన్‌ఖాన్ తండ్రిగా, టైలర్‌గా తన మార్క్ చూపిస్తాడు. జగదీప్ సంతానంలో జావేద్ జాఫ్రీ, నవీద్ జాఫ్రీ ‘బూగీ వూగీ’ షోను కనిపెట్టి దాదాపు 17 ఏళ్లు హిట్ చేశారు. జావేద్ జాఫ్రీ బాలీవుడ్‌లో ప్రముఖ నటుడిగా కొనసాగుతున్నాడు. జగ్‌దీప్ అసలు పేరు ‘సయ్యద్ ఇష్టియాక్ అహ్మద్ జాఫ్రీ’ అని తెలుసుకోవడంలో పెద్దగా ప్రయోజనం లేదు. అతడు ఎల్లవేళలా ప్రేక్షకులకు సూర్మా భోపాలియే. నిండయిన కట్టెల అడితి వచ్చిన వారికంతా వంట చెరుకు ఎలా అందిస్తోందో అలా అతడు చేసిన ప్రతి సినిమాలోనూ నవ్వులు పంచాడు. 81 ఏళ్లకు అతడు తీసుకున్న విశ్రాంతి అర్థవంతమైనది. అతన్ని మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాం. (హాస్యనటుడు జగదీప్ బుధవారం ముంబైలో మరణించాడు. అతడి అంత్యక్రియలు గురువారం ముగిశాయి) – సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment