ఇద్దరిదీ ఢిల్లీ.. ఇద్దరిదీ జేఎన్యూ. ఒకరిది ఫేస్‌బుక్. ఇంకొకరిది బాలీవుడ్. ఒకరు.. మనీ అండ్ మైండ్. ఇంకొకరు.. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. ఇద్దరి మీదా ఇప్పుడు కేసులు! కామెంట్స్ డిలీట్ చేయలేదని అంఖీ.. తీర్పులను ‘ఒబే’ చేయలేదని స్వరా.. ఆరోపణలు ఎదుర్కొంటున్నారు!! న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు.
మనీ మైండెడ్‌గా ఉండమని చెబుతుంటారు మహిళలకు అంఖీ దాస్. సముచితమైన సలహానేనా ఇది! డబ్బు మనిషిగా ఉండటం?! అంఖీ ఉద్దేశం, ఉద్బోధన సరిగ్గానే ఉన్నాయి. ‘మీ చేతిలో ఒక నైపుణ్యం ఉంటే, దానిని కనుక మీరు సొమ్ము చేసుకోకపోతే ఆ నైపుణ్యానికే అవమానం’ అంటారు. ఇందులో విడమరచి చెప్పేందుకు ఏమీ లేదు. అవకాశం లేక కానీ, ప్రతి ఇంట్లోని మహిళకూ తనూ ఏదైనా చేసి, నాలుగు డబ్బులు సంపాదించాలని ఉంటుంది. పరిస్థితులు వారిని వెనక్కు లాగుతూ ఉండొచ్చు. అప్పుడే కదా ముందుకు రప్పించే ‘మెంటర్’ ఉండాలి. దారి చూపించే మనిషి. కమల అనే గృహిణికి దారి చూపించడానికి యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్ నుంచి బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసి వచ్చిన కావ్య అనే అమ్మాయే అక్కర్లేదు. ఆకు కూరలు అమ్ముతూ వాడుకగా ఇంటి ముందు ఆగే వృద్ధురాలూ ‘మెంటర్’ కావచ్చు.
గత ఏడాది ఫిబ్రవరిలో ఇకనమిక్ టైమ్స్ ఉమెన్స్ ఫోరమ్‌లో మాట్లాడేందుకు ఢిల్లీ నుంచి ముంబై వచ్చిన అంఖీ దాస్.. ఆ ఫోరమ్‌కి హాజరైన మహిళలకు ఈ మాటే చెప్పారు. పట్టణాల్లోని మహిళా వ్యాపారవేత్తలు గ్రామాల్లోని ఔత్సాహిక యువతులకు ‘మెంటర్’గా ఉండాలని. వాళ్లనూ, వీళ్లను కలిపేందుకు అప్పటికే ఫేస్‌బుక్‌లో ఉన్న ‘గోల్’ ప్రోగ్రామ్‌లో చేరేందుకు వాళ్ల దగ్గర సంతకాలు కూడా తీసుకున్నారు అంఖీ దాస్. ఫేస్‌బుక్‌కు ఇండియా, దక్షిణ మధ్య ఆసియా దేశాల పబ్లిక్ పాలసీ డైరెక్టర్ ఆమె. చిన్న తాడు ఉన్నా బావిలోకి చేద వేయాలన్న అసక్తి ఉన్న మహిళల్ని మైనీ మైండెడ్‌గా మార్చడమే ‘గోల్’ లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరుతోంది కూడా.
ఫేస్‌బుక్ సహకారంతో గ్రామీణ యువతులు, పట్టణ ప్రాంత గృహిణులు ఆర్థికంగా శక్తిమంతులు అయ్యారంటే అందుకు అంఖీ దాస్ నిర్వహణా సామర్థ్యాలే కారణం. అయితే వేర్వేరు సామాజిక, రాజకీయ, పాలనా పరిస్థితులున్న దేశాలలో ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాను నడిపించడం అన్నది తరచు మాటలు పడవలసిన ‘జాబ్’ కూడా! నిందలు, ఆరోపణలు, విమర్శలు.. వీటితో పాటు ఇప్పుడు అంఖీ దాస్ బెదరింపుల్ని కూడా ఎదుర్కొంటున్నారు. చంపేస్తామని, రేప్ చేస్తామని రెండు రోజులుగా ఆమెకు ‘థ్రెట్స్’ వస్తున్నాయి. పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు ఆమె. ఆమెపైనా ఎఫ్.ఐ.ఆర్.లు నమోదు అవుతున్నాయి.
ఆగస్టు 14న ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ ఆంగ్ల దినపత్రికలో అంఖీ దాస్‌పై ఒక ఆర్టికల్ వచ్చింది. ఇండియాలో మైనారిటీలకు వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ అవుతున్న కామెంట్‌లను ఆమె తొలగించడం లేదని, లౌకిక గుణం కలిగి ఉండవలసిన ఫేస్‌బుక్‌ను మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంచుతూ, లౌకిక రాజ్యస్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారని అంఖీపై వాల్‌స్ట్రీట్ ఆరోపణ. దీనిపై వెను వెంటనే స్పందించిన సోషల్ మీడియా పౌరులు.. ‘నవ్వలా చేస్తావా! నిన్నేం చేస్తామో చూస్తుండు..’ అని ఆమెను తమ కామెంట్స్‌తో నేటికీ భయభ్రాంతురాలిని చేస్తూనే ఉన్నారు. అంఖీ పోలీసులను ఆశ్రయించారు.
ఫేస్‌బుక్‌లోకి రాకముందు వరకు ఆమె మైక్రోసాఫ్ట్ (ఇండియా) పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా ఉన్నారు. అంఖీ కోల్‌కతాలోని లోరెటో కాలేజ్‌లో డిగ్రీ చేశారు. ఢిల్లీ జె.ఎన్.యు.లో అంతర్జాతీయ సంబంధాలు, రాజనీతి శాస్త్రాలను చదివారు. మహిళలు, గ్రామీణ యువతుల ఆర్థిక , సామాజిక అభివృద్ధే ప్రధానంగా ఫేస్‌బుక్‌ను నడిపిస్తున్న అంఖీ దాస్ ప్రస్తుతానికైతే జవాబు చెప్పవలసిన స్థితిలోనే ఉన్నారు. ‘కమ్యూనల్ పోస్ట్’ లను డిలీట్ చేయకపోవడం అన్నది.. అది ఎవరి నిర్లక్ష్యం అయినా సరే.
అంఖీ దాస్‌తో పాటు ఇప్పుడు చిక్కుల్లో పడిన మరో మహిళ స్వరాభాస్కర్. దేశ లౌకిక స్పృహకు భంగం వాటిల్లేలా ఉద్దేశపూర్వకంగా ప్రవర్తించారన్నది అంఖీ పై నేరారోపణ అయితే.. న్యాయస్థానాల లౌకిక నిబద్ధతను శంకించిన ‘నేరానికి’ స్వరాపై అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు వెళ్లింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ముంబైలో ‘ముంబై కలెక్టివ్’ అనే ఎన్జీవో ఆధ్యర్వంలో ‘ఆర్టిస్ట్స్ అగైన్‌స్ట్ కమ్యూనిజం’అనే అంశం మీద మాట్లాడుతూ.. అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో న్యాయస్థానాల లౌకిక రాజ్యాంగ కట్టుబాటును ఈ బాలీవుడ్ నటి శంకించారు. అంఖీ లానే స్వరదీ ఢిల్లీనే. తనూ జె.ఎన్.యు.లో చదివింది. ఒక విషయంపై పరస్పర విరుద్ధంగా టీచర్‌తో తర్కించే ఒకే బెంచీలోని విద్యార్థుల్లా ‘మోదీకి అనుకూలం’ అని అంఖీ, ‘మోదీకి వ్యతిరేకం’ అని స్వర.. కేసులు ఎదుర్కొంటున్నారు. న్యాయ పోరాటానికి సిద్ధం అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment