![Special Story About Green Signal For Ladies At Mumbai - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/8/Mumbai.jpg.webp?itok=0wyvI2B-)
ట్రాఫిక్ సిగ్నల్ మీద ఎవరు ఉంటారు? ఎర్రలైట్ వెలిగినా పచ్చలైట్ వెలిగినా ఆ దీపాల మీద పురుషుడి బొమ్మే ఉంటుంది. మరి స్త్రీలు? స్త్రీలు రోడ్ల మీదకు రారా? పబ్లిక్ స్పేసెస్ మీద వారికి హక్కు ఉండదా? ట్రాఫిక్ సిగ్నల్ విధానం పురుష కేంద్రకంగా ఎందుకు ఉండాలి? ఈ ఆలోచన ఇదివరకే ఇతర దేశాలలో వచ్చింది. మీరు పురుషుణ్ణి ప్రతినిధిగా తీసుకుంటే మేము స్త్రీని తీసుకుంటాం అని జర్మనీ, నెదర్‌లాండ్స్, ఆస్ట్రేలియా తమ ట్రాఫిక్ సిగ్నెల్స్‌లో స్త్రీ సంకేతాన్ని తీసుకోవడం ప్రారంభించాయి. అయితే దీని మీద చర్చలు జరిగాయి. పూర్తిగా పురుషుణ్ణి తీసుకోవడం ఎలా సరికాదో పూర్తిగా స్త్రీని తీసుకోవడం కూడా సరికాదని వ్యాఖ్యానాలు వినిపించాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ ‘జెండర్ న్యూట్రల్’గా ఉండటం గురించి అందరూ ఆలోచించాలన్న వాదనలూ వచ్చాయి.
అయితే పురుషుడి సంకేతానికి బదులు స్త్రీ సంకేతాన్ని తీసుకోవడం గురించి మెచ్చుకునే వారు ఎక్కువగానే ఉన్నారు. పబ్లిక్ ప్లేసులు స్త్రీలవి కూడా అని ఈ సిగ్నలింగ్ వల్ల చెప్పినట్టయ్యిందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా దేశంలో మొదటిసారి ముంబైలో ట్రాఫిక్ సిగ్నల్స్‌కు పురుషుడి సంకేతం కాకుండా స్త్రీ సంకేతం వాడటం మొదలైంది. ముంబైలో సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న సిద్దివినాయక గుడి నుంచి మహిమ్ వరకు ఉన్న రోడ్డులో అన్ని ట్రాఫిక్ సిగ్నెల్స్‌లోనూ పురుషులకు బదులు స్త్రీ సంకేతాలను వాడుతున్నారు. వచ్చేపోయేవారు ఈ మార్పును ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ఒక కొత్తదృష్టి కలిగినవారై చూస్తున్నారు. అంతా మెదడులోనే ఉంటుంది. దానికి మెల్లమెల్లగా సిగ్నల్ ఇచ్చుకుంటూ వెళితే పురుషులు తాము జరిగి స్త్రీలకు దక్కవలసిన సమాన భాగం కొరకు ఆలోచిస్తారు. అందుకు ఇలాంటి ప్రయత్నాలు తప్పనిసరి.
Comments
Please login to add a commentAdd a comment