గ్రాఫిక్స్ సరే స్టోరీ ఏది?
మాయాబజార్ ఎవర్‌గ్రీన్
పాలిటిక్స్, క్రైమ్... బాబోయ్ బోర్!
డబుల్ డోస్ ఇస్తున్నారు
అందరం కలసి సినిమాకు వెళ్లలేం
అమ్మకో సినిమా నచ్చుతుంది.. తమ్ముడి మూవీ టేస్ట్ డిఫరెంట్.. నాకు ఇష్టమైంది వాళ్లిద్దరికీ నచ్చదు.. అంతా కలసి సినిమాను ఎంజాయ్ చెయ్యలేకపోతున్నాం. మెజారిటీ యూత్ చెప్పే మాటలివి. గ్రాఫిక్స్ థ్రిల్ చేస్తున్నా, మెసేజ్ ఉండటం లేదని... హీరో, హీరోయిన్ బాగున్నా కథకు టిక్ పెట్టలేకపోతున్నామనేది వాళ్లలో కనిపించే అసంతృప్తి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని సరోజినీనాయుడు వనితా మహావిద్యాలయలో సినిమా ట్రెండ్‌పై విద్యార్థినుల డిస్కషన్...
లలిత: అబ్బ ఏం గ్రాఫిక్సే.. భలే థ్రిల్‌గా ఉంది తెలుసా! హీరోయిన్ డ్రెస్ చూస్తే.. ఫ్లాట్ అవ్వాల్సిందే.
నిహారిక: ఇంతకీ స్టోరీ ఏంటి?
లలిత: స్టోరీ.. ఎలా చెప్పాలి. ఒక రకంగా లవ్! కాకపోతే మిడిల్ నుంచి ట్రాజిడీ.
ప్రబంధ: తెలుసమ్మా తెలుసు. అందుకే మా పేరెంట్స్ ఆ సినిమా వద్దన్నారు.
అంబిక : ఏ సినిమాలో మాత్రం ఇంతకు మించి ఏం ఉంటుంది. యూత్ ఓరియంటెడ్‌గానే తీస్తారు.
కల్యాణి: లవ్ లవ్ అంటూ నూరిపోయడం.. తల్లిదండ్రులపై తిరగబడ్డం.. ఈ కథలేనా యూత్ ఓరియంటెడ్?
లలిత: తల్లీ అది కాదు ఉద్దేశం. ఫ్యాషన్ డ్రెస్.. ఫాస్ట్ సాంగ్స్ ఇవే కదా యూత్ కోరుకునేది.
ఐశ్వర్య: ఛా.. అవి లేకుండా యూత్ సెంటిమెంట్ సినిమాలు రావడం లేదా? క్లిక్ అవ్వడం లేదా?
నిహారిక: అన్నా చెల్లెళ్ల అనుబంధం.. తాతా-మనవడు. ఎంత బాగుంటాయో కదా!
లలిత: అంతొద్దమ్మా. అవి బాగుంటాయని నాకూ తెలుసు. కానీ అలాంటి మూవీలే వస్తే యాక్సెప్ట్ చేస్తారా? సిన్సియర్‌గా మెసేజ్ ఉండాలనే ప్రయత్నం చేస్తే ఆలోచిస్తారా?
అంబిక: ఎందుకు అంగీకరించరు? లీడర్ సినిమా ఎంత ఇన్‌స్పిరేషన్‌గా ఉంది. యూత్‌కు ఎలాంటి మెసేజ్ ఇచ్చింది. యాక్సెప్ట్ చేయలేదా?
ప్రబంధ: అక్కడిదాకా ఎందుకు, మాయాబజార్ సినిమాలోనూ అప్పట్లో ఒక మాదిరి గ్రాఫిక్స్ చూపించారు. ఆ మాయలు. మంత్రాలు ఎంత థ్రిల్‌గా ఉండేవి. ఈ మధ్య ఓ ఊరి కోటను సెంటర్ పాయింట్‌గా తీసుకుని సినిమా తీశారు. అందులో ఏం స్టోరీ ఉంది? కనీసం ఎంటర్‌టైన్‌మెంట్ కూడా లేదు.
కల్యాణి: నిజమే సినిమాను ప్యూర్లీ కమర్షియల్ చేస్తున్నారు. అరె.. లెక్చరర్స్ మీద తిరగబడటాన్ని హీరోయిజంగా చూపిస్తే ఎట్లా!
ఐశ్వర్య: అక్కడిదాకా ఎందుకు? హీరోయిన్ల డ్రెసెస్ ఎలా ఉంటున్నాయి. వాటి ప్రభావం మనపైనా ఉంటోంది కదా! క్రైమ్ రేట్ పెరగడానికి ఈ తరహా సినిమాలు కూడా కారణమే!
లలిత: సినిమా అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్. అయితే అందులో పరిధులు దాటొద్దనేది మన పేరెంట్స్ ఒపీనియన్. దాంతో ఏ సినిమా చూడాలన్నా వాళ్ల పర్మిషన్ కంపల్సరీ.
నిహారిక: వాళ్లకు కూడా భయమే కదా! అందుకే అలా చేస్తున్నారు. కొన్ని సినిమాలు చూస్తామంటే వాళ్లు కూడా వద్దనరు కదా!
లలిత: అవునవును. గుండమ్మ కథ. ఎంకీ నాయుడు బావ. అవేనా? నిహారిక: ఏం! సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టును ఉదాహరణగా ఎందుకు చెప్పడం లేదు. ఇలాంటి సినిమాలే రావాలని పేరెంట్స్ కోరుకుంటున్నారు.
లలిత: ఒకటి మాత్రం మనం మిస్ అవుతున్నాం. నా చిన్నప్పుడైతే అమ్మా, నాన్న, చెల్లి, తమ్ముడు అంతా కలసి సినిమాకు వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు అందరం కలసి ఒక సినిమాకి వెళ్లలేం. ఒక్కొక్కళ్లకి ఒక్కో సినిమా నచ్చుతోంది.
ప్రబంధ: సాంగ్స్ విషయంలోనూ అంతే. చిన్నప్పుడు నాన్నకు నచ్చిన సాంగ్ వింటుంటే నాకూ వినాలనిపించేది. కానీ ఇప్పుడు అందరికీ నచ్చే సాంగ్స్ కొన్ని మాత్రమే ఉంటున్నాయి.
కల్యాణి: క్రైమ్, పాలిటిక్స్‌కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. న్యూస్ పేపర్ల నిండా అవే. మళ్లీ మూవీల్లోనూ అవసరమంటావా?
అంబిక: పొలిటీషియన్‌ని యాజిటీజ్‌గా చూపించాలి. కానీ సినిమా వాళ్లు అతడ్నో హీరోగా చూపిస్తున్నారు. దీన్ని చూసి ఏం నేర్చుకోమన్నట్టు!
నిహారిక: ఇంతకీ ఏ టైప్ సినిమా కావాలని మీ ఉద్దేశం.
లలిత: సకుటుంబ సపరివార సమేతంగా చూడగలిగే
ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన మూవీకే నా ఓటు.
ప్రబంధ, కల్యాణి, ఐశ్వర్య: సెంట్‌పర్సంట్ ఇది నిజం.
మా ఓటు కూడా నీకే.
ప్రస్తుతం వస్తున్న సినిమాలు కుటుంబ సమేతంగా చూడలేకపోతున్నాం. రెండు గంటల సినిమాలో వినోదంతో పాటు ఏదైనా మంచి సందేశం ఉంటే బావుంటుంది. యూత్‌కు ఉపయోగపడే సినిమాలు రావాలి.
- డాక్టర్ బి.వాణి, ప్రిన్సిపాల్
ఫ్యామిలీ పిక్చర్ ఏదీ!
Published Wed, Jul 16 2014 11:58 PM | Last Updated on Fri, Nov 9 2018 4:12 PM
Advertisement