ఏపీపీఎస్సీ కార్యాలయం ఎదుట నిరుద్యోగులతో కలిసి నినాదాలు చేస్తున్న ఆర్.కృష్ణయ్య
నాంపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ వందలాది మంది నిరుద్యోగులు మంగళవారం నాంపల్లిలోని ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. నిరుద్యోగుల జేఏసీ చైర్మన్ నీలం వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ నిరుద్యోగులతో ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉద్యోగ సంఘాల నేతల ఒత్తిడికి లొంగి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటా పోస్టులను తాత్కాలిక ప్రమోషన్ల పేరుతో ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. అంతేగాకుండా గ్రూపు–1, 2, 3 పోస్టుల కోటాకు అన్యాయం చేస్తూ 50 శాతం నుంచి 30 శాతానికి తగ్గించారని చెప్పారు. అనేక కేటగిరి పోస్టులను గ్రూప్–2 నుంచి తొలగించడం అశాస్త్రీయం అన్నారు. జిల్లా క్యాడర్ గ్రూపు–4 పోస్టులను 30 ఏళ్లుగా భర్తీ చేయడం లేదని ఆరోపించారు. నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే రాజ్యాంగబద్ధమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో ప్రేక్షక పాత్ర వహించిందని గుర్తుచేశారు.
కనీసం ఇప్పుడైనా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటా కింద రావాల్సిన మొత్తం పోస్టులను రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మొత్తం పోస్టులను నోటిఫై చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్లచర్ల శ్రీనివాస్, ఏపీ విద్యార్థి సంఘం నేత గజేంద్ర పాల్గొన్నారు. అనంతరం ఏపీపీఎస్సీ చైర్మన్‌ను కలిసిన ఆర్.కృష్ణయ్య వినతి పత్రాన్ని అందజేశారు.