పిల్లలకు సెలవులు. ఈసారి ‘విజయా’ వారి వేసవి చూపించండి. అంటే? విజయ సంస్థ తీసిన సినిమాలు చూపించడమే. ఉపాయంతో మాంత్రికుణ్ణి హతమార్చే తోటరాముణ్ణి ‘పాతాళ భైరవి’లో, రాజ్యం లేకపోయినా శౌర్యానికి ఢోకా ఉండకూడదని చెప్పే అభిమన్యుడిని ‘మాయాబజార్’లో, లౌక్యం ఉంటే పనులు సాధ్యమవుతాయని చూపే ఎంటి.రావు, మేరీలను ‘మిస్సమ్మ’లో, గట్టిగా సంకల్పిస్తే ఏ కోరికైనా నెరవేర్చుకోవచ్చనే రాకుమారుడు ప్రతాప్‌ను ‘జగదేక వీరుని కథ’లో పరిచయం చేయడమే. పిల్లలకు ఈ సినిమాలు వినోదం మాత్రమే ఇవ్వవు... జీవన సూత్రాలను చెబుతాయి. తెలుగు మాట, పలుకు నేర్పుతాయి. ఇంకేటి... టివి ముందు కూచోబెట్టండి.
‘సాహసం సేయరా ఢింబకా’ అంటాడు నేపాళ మాంత్రికుడు ‘పాతాళ భైరవి’లో. సాహసం చేయకుండా ఉట్టినే కూచోడానికి కాదు పుట్టింది. చదువులోనో, ఉద్యోగంలోనో, బతుకులోనో ఏదో ఒక సందర్భంలో సాహసం చేయాలి. అప్పుడే విజయం వరిస్తుంది. రాకుమారి కూడా. కాని సాహసం చేసే దారిలో ఎన్నో అడ్డంకులుంటాయి. మనల్ని కాటేసే పాములుంటాయి. వాటి తల అణచాలి. ‘దేవికి సాష్టాంగ దండ ప్రమాణం సేయరా’ అంటాడు మాంత్రికుడు రాకుమారుడితో. సాష్టాంగపడితే తల నరకాలని అతడి దుష్టపన్నాగం. కాని దేవి సలహా వల్ల రాకుమారుడు ఆ మాంత్రికుణ్ణే సాష్టాంగపడటం ఎలాగో చూపమని చెప్పి అదే అదనుగా ఆ దుర్మార్గుడి తల నరుకుతాడు.
ఇదంతా పిల్లలకు పాఠమే. ‘పాతాళ భైరవి’ చూస్తే వారికి సమయస్ఫూర్తి వస్తుంది. ప్రమాదం నుంచి బయటపడటం తెలుస్తుంది. మొదట కష్టాలు ఎదురైనా గట్టిగా కష్టపడితే విజయం వరిస్తుందని కూడా తెలుస్తుంది. తెలుగులో మాత్రమే కనిపించే ముచ్చటైన జానపద చిత్రం ఇది.
‘జగదేక వీరుని కథ’లో అర్ధరాత్రి అడవిలో నిదురిస్తుంటాడు రాకుమారుడు ఎన్.టి.ఆర్. తోడు రేలంగి. రెండు దెయ్యాలు వీరిని ఆటపట్టించడానికి బయలుదేరుతాయి. ఆ అరుపులు ఈ అరుపులు అరిచి రేలంగిని భయభ్రాంతం చేస్తాయి. కాని రాకుమారుడు భయపడతాడా? వాటి పిలకపట్టి సీసాలో బంధిస్తాడు. మూడు కోర్కెలు నెరవేరిస్తేనే వదులుతానంటాడు. వాటినే వాహనంగా చేసుకుని తాను వెళ్లాల్సిన చోటుకు వెళతాడు. దెయ్యాలు భూతాలు మనం భయపడే వరకే. మనం ధైర్యంగా ఉంటే వాటి పని అంతే. ఇదే సినిమాలో మూర్ఖపురాజు రాజనాల ఉంటాడు. అతడు రాకుమారుణ్ణి మంటల్లో తోద్దామనుకుంటే రాకుమారుడే తెలివిగా అతణ్ణి మంటల పాలు చేస్తాడు. పిల్లలకు ‘జగదేక వీరుని కథ’ మంచి కాలక్షేపం. క్లయిమాక్స్‌లో ఒకే రామారావు ఐదుగురిలా మారి పాడే ‘శివశంకరి’ పాట వాళ్లు ఇప్పుడూ ఎంజాయ్ చేస్తారు.
మిస్సమ్మలో డిటెక్టివ్ ఏఎన్‌ఆర్ చాలా చురుగ్గా ఉంటాడు. చిన్నప్పుడు తప్పిపోయిన సావిత్రిని వెతికే పని అతనిదే. అతను వెతుకున్నది సావిత్రినే అన్నది మొదటి రీలులోనే తెలిసిపోతుంది. పిల్లలు కూడా నాగేశ్వరరావుతో పాటు సావిత్రిని ఆమె తల్లిదండ్రులకు అప్పజెప్పాలని చూస్తుంటారు. బతుకు బాదరబందీ కోసం ఎన్.టి.ఆర్, సావిత్రిలు ఆడే దొంగ నాటకాల వంటివి అవసరమే అన్నది తెలుసుకుంటారు. స్త్రీలతో ఎంత చక్కగా వ్యవహరించాలో కూడా. ఈ సినిమాలో ఎన్‌టిఆర్ సావిత్రితో ఎంతో మర్యాదగా వ్యవహరిస్తాడు. బతకనేర్చిన రేలంగి కూడా వాళ్లు తెలుసుకోదగ్గ మోడలే. ఇక ‘జస్టిస్... జస్టిస్... ఐ వాంట్ జస్టిస్’ అంటూ తిరిగే అసలు సిసలు కేటుగాడు రమణారెడ్డిని కూడా వాళ్లు గమనిస్తారు. కొందరికి ముక్కు మీద కోపం వున్నా వారి మనసు మంచిది అని సావిత్రిని చూసి అర్థం చేసుకుంటారు. వెన్నెలను చూసి ‘రావోయి చందమామ’ అని పాడటం కూడా.
ఇక ‘మాయాబజార్’లో పిల్లలకు నచ్చనిది ఏది? కృష్ణుడు, ఘటోత్కచుడు, అభిమన్యుడు, లక్ష్మణ కుమారుడు, శకుని... అందరూ వారి అభిమాన పాత్రలే. బాణం కొట్టి మెట్లు కట్టడం, ప్రియదర్శినిలో నచ్చిన మనుషులతో వీడియో కాల్, మనుషులు డబ్బుంటే ఒక లాగా డబ్బు లేనప్పుడు ఒకలాగ వ్యవహరిస్తారని చెప్పే రేవతి (ఛాయాదేవి) పాత్ర, అన్నింటినీ చక్రం తిప్పే శ్రీకృష్ణుడు, అమాయకంగా ఉండి అసాధ్యుడిగా మారే ఘటోత్కచుడు... అతని మాయలు... పొగడ్తలతో బతికిపోయే శర్మ, శాస్త్రులు, నోరు తిరగని రాక్షస శిష్యులు, తమాషా గురువు చిన్నమయ్య... ఈ వేసవిలో పిల్లలు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడాల్సిన సినిమాలు.
ఈ సినిమాలలో మూడిటికి కె.వి.రెడ్డి, ఒకదానికి ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించారు. అన్నింటిని నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించారు. పింగళి నాగేంద్రరావు కొత్త కొత్త మాటలు కనిపెట్టడం నేర్పుతారు. ఆహ్లాదం ఇచ్చే వినోదం ఎలా ఉంటుందో ఈ సినిమాలు చూపుతాయి.
పిల్లలకు తప్పక చూపించండి.
Comments
Please login to add a commentAdd a comment