missamma
-
తెలుగు క్లాసిక్స్: విజయా వారి వేసవి
పిల్లలకు సెలవులు. ఈసారి ‘విజయా’ వారి వేసవి చూపించండి. అంటే? విజయ సంస్థ తీసిన సినిమాలు చూపించడమే. ఉపాయంతో మాంత్రికుణ్ణి హతమార్చే తోటరాముణ్ణి ‘పాతాళ భైరవి’లో, రాజ్యం లేకపోయినా శౌర్యానికి ఢోకా ఉండకూడదని చెప్పే అభిమన్యుడిని ‘మాయాబజార్’లో, లౌక్యం ఉంటే పనులు సాధ్యమవుతాయని చూపే ఎంటి.రావు, మేరీలను ‘మిస్సమ్మ’లో, గట్టిగా సంకల్పిస్తే ఏ కోరికైనా నెరవేర్చుకోవచ్చనే రాకుమారుడు ప్రతాప్‌ను ‘జగదేక వీరుని కథ’లో పరిచయం చేయడమే. పిల్లలకు ఈ సినిమాలు వినోదం మాత్రమే ఇవ్వవు... జీవన సూత్రాలను చెబుతాయి. తెలుగు మాట, పలుకు నేర్పుతాయి. ఇంకేటి... టివి ముందు కూచోబెట్టండి. ‘సాహసం సేయరా ఢింబకా’ అంటాడు నేపాళ మాంత్రికుడు ‘పాతాళ భైరవి’లో. సాహసం చేయకుండా ఉట్టినే కూచోడానికి కాదు పుట్టింది. చదువులోనో, ఉద్యోగంలోనో, బతుకులోనో ఏదో ఒక సందర్భంలో సాహసం చేయాలి. అప్పుడే విజయం వరిస్తుంది. రాకుమారి కూడా. కాని సాహసం చేసే దారిలో ఎన్నో అడ్డంకులుంటాయి. మనల్ని కాటేసే పాములుంటాయి. వాటి తల అణచాలి. ‘దేవికి సాష్టాంగ దండ ప్రమాణం సేయరా’ అంటాడు మాంత్రికుడు రాకుమారుడితో. సాష్టాంగపడితే తల నరకాలని అతడి దుష్టపన్నాగం. కాని దేవి సలహా వల్ల రాకుమారుడు ఆ మాంత్రికుణ్ణే సాష్టాంగపడటం ఎలాగో చూపమని చెప్పి అదే అదనుగా ఆ దుర్మార్గుడి తల నరుకుతాడు. ఇదంతా పిల్లలకు పాఠమే. ‘పాతాళ భైరవి’ చూస్తే వారికి సమయస్ఫూర్తి వస్తుంది. ప్రమాదం నుంచి బయటపడటం తెలుస్తుంది. మొదట కష్టాలు ఎదురైనా గట్టిగా కష్టపడితే విజయం వరిస్తుందని కూడా తెలుస్తుంది. తెలుగులో మాత్రమే కనిపించే ముచ్చటైన జానపద చిత్రం ఇది. ‘జగదేక వీరుని కథ’లో అర్ధరాత్రి అడవిలో నిదురిస్తుంటాడు రాకుమారుడు ఎన్.టి.ఆర్. తోడు రేలంగి. రెండు దెయ్యాలు వీరిని ఆటపట్టించడానికి బయలుదేరుతాయి. ఆ అరుపులు ఈ అరుపులు అరిచి రేలంగిని భయభ్రాంతం చేస్తాయి. కాని రాకుమారుడు భయపడతాడా? వాటి పిలకపట్టి సీసాలో బంధిస్తాడు. మూడు కోర్కెలు నెరవేరిస్తేనే వదులుతానంటాడు. వాటినే వాహనంగా చేసుకుని తాను వెళ్లాల్సిన చోటుకు వెళతాడు. దెయ్యాలు భూతాలు మనం భయపడే వరకే. మనం ధైర్యంగా ఉంటే వాటి పని అంతే. ఇదే సినిమాలో మూర్ఖపురాజు రాజనాల ఉంటాడు. అతడు రాకుమారుణ్ణి మంటల్లో తోద్దామనుకుంటే రాకుమారుడే తెలివిగా అతణ్ణి మంటల పాలు చేస్తాడు. పిల్లలకు ‘జగదేక వీరుని కథ’ మంచి కాలక్షేపం. క్లయిమాక్స్‌లో ఒకే రామారావు ఐదుగురిలా మారి పాడే ‘శివశంకరి’ పాట వాళ్లు ఇప్పుడూ ఎంజాయ్ చేస్తారు. మిస్సమ్మలో డిటెక్టివ్ ఏఎన్ఆర్ చాలా చురుగ్గా ఉంటాడు. చిన్నప్పుడు తప్పిపోయిన సావిత్రిని వెతికే పని అతనిదే. అతను వెతుకున్నది సావిత్రినే అన్నది మొదటి రీలులోనే తెలిసిపోతుంది. పిల్లలు కూడా నాగేశ్వరరావుతో పాటు సావిత్రిని ఆమె తల్లిదండ్రులకు అప్పజెప్పాలని చూస్తుంటారు. బతుకు బాదరబందీ కోసం ఎన్.టి.ఆర్, సావిత్రిలు ఆడే దొంగ నాటకాల వంటివి అవసరమే అన్నది తెలుసుకుంటారు. స్త్రీలతో ఎంత చక్కగా వ్యవహరించాలో కూడా. ఈ సినిమాలో ఎన్టిఆర్ సావిత్రితో ఎంతో మర్యాదగా వ్యవహరిస్తాడు. బతకనేర్చిన రేలంగి కూడా వాళ్లు తెలుసుకోదగ్గ మోడలే. ఇక ‘జస్టిస్... జస్టిస్... ఐ వాంట్ జస్టిస్’ అంటూ తిరిగే అసలు సిసలు కేటుగాడు రమణారెడ్డిని కూడా వాళ్లు గమనిస్తారు. కొందరికి ముక్కు మీద కోపం వున్నా వారి మనసు మంచిది అని సావిత్రిని చూసి అర్థం చేసుకుంటారు. వెన్నెలను చూసి ‘రావోయి చందమామ’ అని పాడటం కూడా. ఇక ‘మాయాబజార్’లో పిల్లలకు నచ్చనిది ఏది? కృష్ణుడు, ఘటోత్కచుడు, అభిమన్యుడు, లక్ష్మణ కుమారుడు, శకుని... అందరూ వారి అభిమాన పాత్రలే. బాణం కొట్టి మెట్లు కట్టడం, ప్రియదర్శినిలో నచ్చిన మనుషులతో వీడియో కాల్, మనుషులు డబ్బుంటే ఒక లాగా డబ్బు లేనప్పుడు ఒకలాగ వ్యవహరిస్తారని చెప్పే రేవతి (ఛాయాదేవి) పాత్ర, అన్నింటినీ చక్రం తిప్పే శ్రీకృష్ణుడు, అమాయకంగా ఉండి అసాధ్యుడిగా మారే ఘటోత్కచుడు... అతని మాయలు... పొగడ్తలతో బతికిపోయే శర్మ, శాస్త్రులు, నోరు తిరగని రాక్షస శిష్యులు, తమాషా గురువు చిన్నమయ్య... ఈ వేసవిలో పిల్లలు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడాల్సిన సినిమాలు. ఈ సినిమాలలో మూడిటికి కె.వి.రెడ్డి, ఒకదానికి ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించారు. అన్నింటిని నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించారు. పింగళి నాగేంద్రరావు కొత్త కొత్త మాటలు కనిపెట్టడం నేర్పుతారు. ఆహ్లాదం ఇచ్చే వినోదం ఎలా ఉంటుందో ఈ సినిమాలు చూపుతాయి. పిల్లలకు తప్పక చూపించండి. -
హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో ‘మిస్సమ్మ’
సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీ, డేరింగ్ అండ్ డ్యాషింగ్ నేచర్, లైవ్లీ అండ్ లవ్లీ బిహేవియర్ తో అలనాటి మిస్సమ్మ ఆల్ టైం క్లాసిక్‌గా చరిత్రలో నిలిచిపోయింది. అలాంటి క్యారెక్టరైజేషన్ తీసుకుని సరికొత్త కథ, కథనాలతో తెరకెక్కుతున్న చిత్రం మిస్సమ్మ. శ్రీ వేంకటేశ్వర సాయి క్రియేషన్స్ హరి ఐనీడి, రమ్య కొమ్మాలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిరాజ్ రుపాల, సతీష్ వీ.ఎమ్ అనే ఇద్దరు కొత్త డైరెక్టర్స్ మిస్సమ్మ అనే చిత్రంతో పరిచయం అవుతున్నారు. మిస్సమ్మ చిత్ర ప్రారంభోత్సవానికి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా వచ్చి హీరో హీరోయిన్ల ఫై క్లాప్ కొట్టి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని టీం అందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు తలసాని. ఇంత మంచి కాన్సెప్ట్ తో వస్తున్న మిస్సమ్మ హిట్ కావాలని ఆయన కోరుకున్నారు. తన సన్నిహితుడు హరి అయినీడి సినిమా పరిశ్రమలో చాలా కష్టపడ్డాడు, పెద్ద పెద్ద సినిమాలకు వర్క్ చేశారు, ఫ్యాషన్ ఉన్న నిర్మాత, మంచి వ్యక్తి. అలాంటి హరి అయినీడి కి ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని తలసాని అభిలషించారు. సైంటిఫిక్, హిస్టారిక్ అంశాలతో థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా మిసమ్మ తెరకెక్కబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో పాటు ఎంటర్టైనింగ్ లవ్ స్టోరీ అండ్ యూనిక్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందట . బ్రిటీషర్స్ రాక ముందు ఇండియన్ హిస్టరీ నుంచీ, బ్రిటిషర్స్ రిజైమ్ నుంచీ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తీసుకుని, ఆ విషయాలను ఆసక్తికరంగా, ఎంటర్టైనింగ్గా, థ్రిల్లింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశామని దర్శకులు తెలిపారు. మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌కు నచ్చే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. బిగ్ బాస్ లహరి మాట్లాడుతూ .. మిస్సమ్మ సినిమాలో నేను కూడా చెయ్యటం చాలా ఆనందం గా వుంది అన్నారు. హీరోయిన్ శోభిత రానా మారట్లాడుతూ.. ఇంత మంచి ప్రాజెక్టు లో నేను చెయ్యటం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాలో నా పాత్ర చాలా కీలకమైనది. నాకు మరియు చిత్ర యూనిట్ కు మంచి పేరు తెచ్చే సినిమా ఇది అన్నారు. హీరో అర్జున్ కృష్ణ మాట్లాడుతూ .. నాకు నటుడిగా మంచి గుర్తింపు ఇచ్చే సినిమా మిస్సమ్మ అవుతుంది. ఈ సినిమా తరువాత హీరోగా మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నేను రుణపడి వుంటాను అని అన్నారు. -
అమ్మ..ది గ్రేట్
మా అమ్మ కడుపులో తొమ్మిది నెలలు అపురూపంగా పెరిగిన నేను ఓ రోజు ఉదయాన్నే ఈ లోకంలోకి వచ్చాను. పనిలో పనిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేసేశారు మాయమ్మకు. వీడు నా బిడ్డ కాదు మరోసారి గట్టిగా ఏడుస్తూనే చెప్పింది మాయమ్మ.ఉహూ మా అవ్వ విన్లే. క్యాగే దివానీ..తెరాబేటా నహీతో కిస్కావునే? మూ మూచ్లేకో దూద్ పిలా..బచ్చా రోతాహై (నీ కేమైనా పిచ్చా ..నీ కొడుక్కాకుంటే ఎవరి కొడుకు..నోర్మూసుకుని పాలు తాపు)పిల్లాడు పాల కోసం ఏడుస్తున్నాడు. అమ్మ మాత్రం పాలు ఇవ్వడంలేదు. పిల్లాడి ఏడుపు తల్లి మనసును పిండేస్తోంది. కానీ పాలు తాపించావు గదా ఎక్కడ నీకు పుట్టిన పిల్లోడే అంటారని భయంతో పాలివ్వనని మొండికేసింది. ఈ దృశ్యం...1963లో జమ్మలమడుగు మిషన్ ఆస్పత్రిలోనిది. ఆ రోజు మాతృత్వానికి అగ్ని పరీక్ష!ఉపోద్ఘాతం అర్థం కావాలంటే అంతకు ముందు ఏం జరిగిందనేది చెప్పాలి...మా అమ్మ కడుపులో తొమ్మిది నెలలు అపురూపంగా పెరిగిన నేను ఓ రోజు ఉదయాన్నే ఈ లోకంలోకి వచ్చాను. పనిలో పనిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేసేశారు మాయమ్మకు. మత్తు మందు కారణంగా స్పృహలో లేదు. మధ్యాహ్నం తర్వాత అమ్మ కళ్లు తెరిచింది. ఈలోగా బాబు పాల కోసం ఏడుస్తుంటే మాయవ్వ ఊయల్లో ఉన్న బాబును మా అమ్మ పక్కన పడుకోబెట్టి పాలు ఇవ్వమంది. బాబును చూసి మా అమ్మ షాకైంది. బిడ్డ పుట్టంగానే చూసిన పిల్లోడికి, ఈ పిల్లోడికి రూపురేఖల్లో పోలికేలేదు. దాంతో ఏ మేరా బేటా నై (వీడు నా బిడ్డ కానేకాదు) అని ఏడ్వడం మొదలుపెట్టింది.వార్డులో ఉన్న బాలింతలు, వారికి తోడుగా వచ్చిన మహిళలు మా అమ్మ వైపు ఈమెకేమైనా పిచ్చా కడుపున పుట్టిన బిడ్డను కాదంటోంది అని ..అదోరకంగా చూస్తున్నారు.కాన్పయ్యాక చూసింది కొద్ది క్షణాలే అయినా నా రూపం అమ్మ మదిలో ముద్రపడిపోయింది. ఆపరేçషన్ తర్వాత ఆమె మగతలోకి జారి పోయింది. స్పృహలో లేదు కానీ బిడ్డ ముఖం బాగా గుర్తుండిపోయింది. అందుకే ఇప్పుడు తన ఒడిలో ఉన్న బిడ్డ తన బిడ్డ కాదని గట్టిగా వాదించడమే కాదు పిల్లాడికి పాలు కూడా ఇవ్వనని మొండికేసింది. ఎవరు ఎన్ని చెప్పినా వినడంలేదు. ఈ తతంగం ఇలా నడుస్తున్నప్పుడే మాయమ్మ దృష్టి తన బెడ్ పక్కన ఉన్న బాలింతపైనా..ఆమె ఒడిలోని బిడ్డపైనా పడింది. అంతే... మేరబచ్చా ఉదర్ హై (నా పిల్లోడు అక్కడుండాడు) అంటూ మళ్లీ ఏడ్వటం మొదలుపెట్టింది. ఈమెకు కచ్చితంగా మెంటలే అని నిర్ధారణకు వచ్చేశారంతా.హిస్టీరియా వచ్చినట్లు మిస్సమ్మకు బులావ్ (పిలవండి)..అని గట్టిగా అరవసాగింది మాయమ్మ. మిస్సమ్మపై అమ్మకు చాలా నమ్మకం. మొదటి కాన్పు తప్ప మిగతా మూడు కాన్పులు మిషన్ ఆస్పత్రిలోనే అయ్యాయి.పక్కనున్న బాలింత కూడా ముస్లిమే. ఆమె ఒడిలో ఉంది నా బిడ్డే అని మాయమ్మ చెపుతుంటే ఆమె.. మేరే బేటేకు తేరా బేటా కర్కో బోల్తీ క్యా (నాబిడ్డను నీ బిడ్డనిఅంటున్నావు) అని తిట్టడం మొదలుపెట్టింది. గొడవ ఎక్కువయ్యేసరికి ఈ సమస్యకు మిస్సమ్మే పరిష్కారం చూపిస్తుందని నర్సు ఆమెను తోడ్కొని వచ్చింది.మిస్సమ్మ ఆస్పత్రి ఇన్చార్జి. ఆమె అంటే ఆస్పత్రిలో అందరికీ గౌరవం. మిస్సమ్మ దగ్గరికి వచ్చాక ..మా అమ్మ బిడ్డను చూపిస్తూ ఈ బిడ్డ నాబిడ్డ కాదంటే వినడంలేదు అని ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పింది. బూమ్మా...బాగా చూడు నీ బిడ్డ కాదని ఎలా అంటావు? మిస్సమ్మ అనునయించే ప్రయత్నం చేసింది. నాకు బాగా గుర్తు ఆ పక్క బెడ్‌పై ఉన్న బాలింత ఒడిలో ఉన్న బిడ్డే నా బిడ్డ అని ఏడుస్తోంది.అమ్మ కన్నీటి ధారల్లో నిజాయితీ మిస్సమ్మ గుండెను తాకిందేమో!పసిపిల్లలిద్దర్నీ చెరో చంకలోకి తీసుకుని ...నిజం చెప్పు ఈ పిల్లాడు నిజంగా నీ పిల్లాడేనా? పోలీసులను పిలవమంటావా? పక్క బెడ్ బాలింతను గద్దించింది మిస్సమ్మ.దేవుడి సాక్షిగా నాబిడ్డే మిస్సమ్మా..నమ్మించేందుకు ప్రయత్నిస్తోంది.మధ్యమధ్యలో ఏడుస్తోంది. ఆమే ఒక తల్లే!ఆ కన్నీటిలో పుత్రవాత్సల్యం ఉంది. కానీ అమ్మతనం కనిపించినట్లు లేదు మిస్సమ్మకు.అప్పటికే మా నాయన, పక్క బెడ్ బాలింత భర్త అక్కడికి చేరారు. వారిద్దరి ముఖాలను, పిల్లల ముఖాలను మార్చిమార్చి చూసింది మిస్సమ్మ. ఆఖరిసారి చెపుతున్నా నీ బిడ్డ నీకు కావాలంటే నిజం చెప్పుఅనేసరికి భయపడిపోయిన బాలింత ..పిల్లోడు బాగుండాడనినా బిడ్డను పక్కనున్న ఊయల్లో పడుకోబెట్టి అక్కడ ఉన్న బిడ్డను తీసుకున్నానని ఒప్పుకుంది.అప్పటిదాకా అమ్మను దోషిలాగా చూసినవారు ముక్కున వేలేసుకున్నారు. బాలింతకుచీవాట్లు పెట్టారు. లౌక్యం ప్రదర్శించిన మిస్సమ్మను పొగడ్తలతో ముంచెత్తారు. మా అమ్మా,నాయనయితే సంతోషం పట్టలేకపోయారు.ఆస్పత్రిలో శుభం కార్డు పడ్డాక అమ్మ ఒడిలో నేను..వాళ్లమ్మ ఒడిలో వాడు వెచ్చగా బజ్జున్నాం. కానీ..నన్ను చూసింది ఒకట్రెండు నిమిషాలే ..అయినా అమ్మ నాతో కనెక్టు అవడమే ఓ అద్భుతం. హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అంటే ఇదేనేమో? అమ్మకు అమ్మేసాటి అనేది అందుకేనేమో? డీఎన్ఏ పరీక్షలు, సీసీ కెమెరాల్లేని రోజులు.. పోలీసు కేసులు, కోర్టు తీర్పుల్లేకుండా..ఓ క్లిష్టమైన సమస్య కేవలం ఓ తల్లి ‘నమ్మకం’ పునాదిపై పరిష్కారం అయిందంటేనమ్మశక్యం కాని విషయం. ఇది నూటికి నూరుపాళ్లు వాస్తవం. ఓ తల్లి హృదయ స్పందనే సాక్షిగా అప్పటి మిస్సమ్మ ప్రదర్శించిన సమయస్ఫూర్తి ఈ తరం వైద్యరంగానికి గొప్పపాఠం.(నాకు ఊహ తెలిశాక అమ్మ చెపుతుంటే కలిగిన ఉద్వేగాన్ని ఇప్పుడు మాటల్లో చెప్పలేను.కానీ..అమ్మ మాటలు అలా నా జ్ఞాపకాల దొంతరలో భద్రంగా నిలిచిపోయాయి. నన్ను అపహరించిన ఆవిడ భర్త అప్పట్లో వీధుల్లోతిరిగి గాజులమ్మేవారని..నేను అక్కడే పెరిగి పెద్దయి ఉంటే గాజులోయ్..అంటూ వీధులు పట్టుకుని తిరిగేవాడినని నన్ను ఇంట్లో ఆటపట్టించేవారు) – నజీర్ రైల్వే కొండాపురం, వైఎస్ఆర్ కడప జిల్లా -
మిస్సమ్మ స్ఫూర్తితో...
రచయితలు దర్శకులుగా మారడం ఇటీవల టాలీవుడ్లో ఎక్కువగా నడుస్తోన్న ట్రెండ్. ఈ కోవలోకి ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి కథ అందించిన హుస్సేన్ షా కిరణ్ చేరారు. ఆయన దర్శకత్వంలో ‘మీకు మీరే..మాకు మేమే’ అనే చిత్రం రూపొందింది. తరుణ్ శెట్టి, అవంతిక, కిరీటీ దామరాజు, జెన్నీ, భరణ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘అలనాటి క్లాసిక్ ‘మిస్సమ్మ’లో ఓ సీన్‌ని చూసి, స్ఫూర్తి పొంది ఈ చిత్రం చేశాం. ఆ చిత్రానికి గౌరవం ఇస్తూ అందులోని బిట్ సాంగ్ లిరిక్‌ని ‘మీకు మీరే.. మాకు మేమే’ అని పేరు పెట్టాం. అల్లు అరవింద్‌గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఆయన సపోర్ట్‌తోనే సుకుమార్‌గారిని కలిసి ‘నాన్నకు ప్రేమతో’ కథ ఇచ్చాను’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కార్తీక్ వంశీ తాడేపల్లి. -
‘మిస్సమ్మ’ నిర్మాత సత్యనారాయణ కన్నుమూత
ప్రముఖ నిర్మాత బి. సత్యనారాయణ (61) ఇక లేరు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం తిరుపతిలో తుది శ్వాస విడిచారు. సత్యం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘బాలీవుడ్ కాలింగ్’ ఆనే ఆంగ్ల చిత్రం ద్వారా ఆయన నిర్మాతగా ఎంటరయ్యారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ చిత్రం ప్రదర్శితం కావడం విశేషం. ఆ తర్వాత ఆయన ‘ధనలక్ష్మీ ఐ లవ్ యు’, ‘మిస్సమ్మ’, ఇంద్రగంటి మోహనకృష్ణతో ‘మాయాబజార్’ చిత్రాలు నిర్మించారు. శివాజీ, భూమిక కాంబినేషన్లో నీలకంఠ దర్శకత్వంలో రూపొందిన ‘మిస్సమ్మ’ ఆయనకు మంచి పేరు తెచ్చింది. సత్యనారాయణకు భార్య (అన్నపూర్ణ), ఇద్దరు కుమార్తెలు (హరిత, తేజస్వి) ఉన్నారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం తిరుపతిలో జరుగుతాయి. సత్యనారాయణ మరణానికి నిర్మాతల మండలి సంతాపం వ్యక్తం చేసింది. -
నిలదొక్కుకుంటున్న నికీషా
నటి నికీషా దక్షిణాదిలో కథా నాయికిగా నిలదొక్కుకుంటున్నారు. నటనకు భాషాభేదాలు లేవన్న విషయాన్ని ఈ బ్యూటీ మరోసారి నిరూపించారు. ఎక్కడో యు.కె (యునెటెడ్ కింగ్డమ్)లో పుట్టిన ఈ ముద్దుగుమ్మ అక్కడ బీబీసీతో సహా ఇతర ఛానళ్లలో మోడల్‌గా పని చేశారు. ఆ తరువాత నటిగా బాలీవుడ్ రంగప్రవేశం చేసిన ఈమెను ప్రస్తుతం ఆదరిస్తోంది మాత్రం దక్షిణాది సినీ పరిశ్రమనే. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం అంటూ నాలుగు భాషల్లోనూ కథానాయికిగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ అమ్మడు దక్షిణాదిలో తొలుత తెలుగులో పవన్‌కల్యాణ్ సరసన పులి చిత్రంలో నటించినా ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. అలాగే తమిళంలోను మంచి విజయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కన్నడం, మలయాళం భాషల్లో నికీషా పటేల్ విజయాల ఖాతాను తెరిచారు. కన్నడంలో తొలి చిత్రం నరసింహాతోనే విజయం రుచి చూశారు. ఈ చిత్రం సిమ్మా అవార్డును కూడా అందించింది. మలయాళంలో ప్రముఖ నటుడు మమ్ముట్టి వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ప్రస్తుతం తమిళంలో అమిలి తుమిలి, ఎన్నమో ఏదో వంటి చిత్రాలు నిరాశ పరచినా ప్రస్తుతం నటిస్తున్న నారదన్ చిత్రంపై ఆశలు పెట్టుకున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. దీంతోపాటు కొత్తగా మరో మూడు అవకాశాలు నికీషా తలుపు తట్టాయట. ఈ చిత్రాల వివరాలను త్వరలోనే వెల్లడిస్తానంటున్నారు. కన్నడంలో ఈ ముద్దుగుమ్మ నటించిన నమస్తే మేడమ్ ఈ నెల 24న తెరపైకి రానుంది. ఇది తెలుగు చిత్రం మిస్సమ్మకు రీమేక్. ప్రస్తుతం ఆలోన్ అనే మరో కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. మొత్తం మీద నాలుగు భాషల్లో నటిస్తూ నికీషా బిజీ కథానాయకిగా వెలుగొందుతున్నారన్నమాట. -
'మిస్సమ్మ'ను కోల్పోయిన ప్రియమణి
తాను చేసిన సినిమాల్లో కొన్ని బాక్సాఫిస్ దగ్గర విజయం సాధించేసి, కాస్తంత పాపులారిటీ వచ్చేస్తే చాలు నిర్మాతల దగ్గర చాంతాడంత గొంతెమ్మ కోరికల చిట్టా విప్పే నటీనటులకు ప్రస్తుత కాలంలో కొదవేలేదు. ఇలాంటివారి జాబితాలో నటి ప్రియమణి మినహాయింపేమీ కాదండోయ్. అయితే నిర్మాత బడ్జెట్‌ను తెలుసుకోకుండా ఖరీదూన తన కోరికల చిట్టాను డిమాండ్ చేసినందుకు ప్రియమణి ఓ సినిమానే వదులుకోవాల్సి వచ్చింది. ఇందుకు సబంధించిన వివరాలపూ ఓ లుక్ వేస్తే...శివాజీ, లయ, భూమిక ప్రధాన పాత్రధారులుగా నీలకంఠ దర్శకత్వంలో తెలుగులో తెరకెక్కిన 'మిస్సమ్మ' చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు 'నమస్తే మేడమ్' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో శివాజీ పాత్రలో శ్రీనగర కిట్టి, లయ పాత్రలో నిఖీషా పటేల్ (పులి ఫేమ్), భూమిక పాత్రలో ప్రియమణిలను మొదటగా ఎంపిక చేశారు. అయితే తన సినిమాలో ధరించబోయే యాక్ససరీస్‌తో పాటు నగలను కూడా తాను చెప్పిన డిజైనర్ దగ్గరే డిజైన్ చేయించాలని, తాను వాడబోయే ప్రతి వస్తువు తనకు నచ్చినట్లుగానే ఉండాలని ప్రియమణి షరతులు విధించడం మొదలుపెట్టిందట. ఇందుకు సదరు ఆ సినిమా నిర్మాత దుస్తుల వరకు అయితే ఓకేగానీ నగల కోసం కూడా ప్రత్యేకంగా డిజైనర్లను ఆశ్రయించాలంటే బడ్జెట్ ఎక్కువైపోతుందని ప్రియమణికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారట. కానీ ప్రియమణి వింటేనా, దీంతో ఆ సినిమా నుండే ప్రియమణిని నిర్మాత తప్పించినట్లు శాండల్ వుడ్ వర్గాల సమాచారం. ఇక ప్రియమణి స్థానంలో శాండల్‌వుడ్‌లో ప్రముఖ నటి రాగిణి ద్వివేదిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై ప్రియమణిని ప్రశ్నిస్తే మాత్రం...'నిర్మాత నన్ను సినిమా నుంచి తప్పించడం ఏంటి, కథ, కథలోని కొన్ని అంశాలు నచ్చక నేనే సినిమాను వదులుకున్నాను' అని చెప్పుకోవటం విశేషం. -
గీత స్మరణం
పల్లవి : బాలనురా మదనా... బాలనురా మదనా విరితూపులు వేయకురా మదనా బాలనురా మదనా... చరణం : 1 నిలచిన చోటనె నిలువగ నీయక... (2) వలపులు కురియునురా తీయని తలపులు విరియునురా మదనా ॥ చరణం : 2 చిలుకలవలె గోర్వంకల వలెనూ... (2) కులుకగ తోచునురా తనువున పులకలు కలుగునురా మదనా ॥ చరణం : 3 చిలిపికోయిలలు... చిలిపికోయిలలు చిత్తములోనె కలకల కూయునురా మనసును కలవరపరచునురా మదనా ॥ గానం : పి.సుశీల పల్లవి : ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో... ఓ... ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో... చిత్రములన్నీ నావేలే కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే (2) చరణం : 1 తళుకుతళుకుమని తారలు మెరిసే నీలాకాశము నాదేలే ఎల్లరి మనముల కవలరపరిచే... జిలిబిలి జాబిలి నాదేలే కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే (2) చరణం : 2 ప్రశాంత జగమును హుషారుచేసే వసంత ఋతువు నాదేలే పూవులు ఘుమఘుమ చల్లగ విసిరే మలయమారుతము నాదేలే కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే (2) గానం : ఎ.ఎం.రాజా చిత్రం : మిస్సమ్మ (1955) రచన : పింగళి నాగేంద్రరావు సంగీతం : సాలూరి రాజేశ్వరరావు