నిలదొక్కుకుంటున్న నికీషా
నటి నికీషా దక్షిణాదిలో కథా నాయికిగా నిలదొక్కుకుంటున్నారు. నటనకు భాషాభేదాలు లేవన్న విషయాన్ని ఈ బ్యూటీ మరోసారి నిరూపించారు. ఎక్కడో యు.కె (యునెటెడ్ కింగ్‌డమ్)లో పుట్టిన ఈ ముద్దుగుమ్మ అక్కడ బీబీసీతో సహా ఇతర ఛానళ్లలో మోడల్‌గా పని చేశారు. ఆ తరువాత నటిగా బాలీవుడ్ రంగప్రవేశం చేసిన ఈమెను ప్రస్తుతం ఆదరిస్తోంది మాత్రం దక్షిణాది సినీ పరిశ్రమనే. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం అంటూ నాలుగు భాషల్లోనూ కథానాయికిగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నారు.
ఈ అమ్మడు దక్షిణాదిలో తొలుత తెలుగులో పవన్‌కల్యాణ్ సరసన పులి చిత్రంలో నటించినా ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. అలాగే తమిళంలోను మంచి విజయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కన్నడం, మలయాళం భాషల్లో నికీషా పటేల్ విజయాల ఖాతాను తెరిచారు. కన్నడంలో తొలి చిత్రం నరసింహాతోనే విజయం రుచి చూశారు. ఈ చిత్రం సిమ్మా అవార్డును కూడా అందించింది. మలయాళంలో ప్రముఖ నటుడు మమ్ముట్టి వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ప్రస్తుతం తమిళంలో అమిలి తుమిలి, ఎన్నమో ఏదో వంటి చిత్రాలు నిరాశ పరచినా ప్రస్తుతం నటిస్తున్న నారదన్ చిత్రంపై ఆశలు పెట్టుకున్నారు.
షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. దీంతోపాటు కొత్తగా మరో మూడు అవకాశాలు నికీషా తలుపు తట్టాయట. ఈ చిత్రాల వివరాలను త్వరలోనే వెల్లడిస్తానంటున్నారు. కన్నడంలో ఈ ముద్దుగుమ్మ నటించిన నమస్తే మేడమ్ ఈ నెల 24న తెరపైకి రానుంది. ఇది తెలుగు చిత్రం మిస్సమ్మకు రీమేక్. ప్రస్తుతం ఆలోన్ అనే మరో కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. మొత్తం మీద నాలుగు భాషల్లో నటిస్తూ నికీషా బిజీ కథానాయకిగా వెలుగొందుతున్నారన్నమాట.